Monday, October 27, 2008

మా ఊరు ధర్మపురి

మా ఊరు ధర్మపురి – మా దైవం నరహరి
గలగల పారే గోదావరి మాకు సిరి
జగతిలోన లేనెలేదు దీనికేదీ సరి
కళలకు కాణాచి వేదాలకు పుట్టిల్లు
విద్వత్ విద్వత్ శిఖామణులకాలవాలమైనది

సత్యవతి పతి శాపం తొలగింది ఈచోటనె
పాతివ్రత్య మహిమచేత ఇసుకస్తంభమైంది ఇటనె
కుజదోషం తొలగించే నిజమైన స్థలమిదే
కోరుకున్న భక్తులకిల కొంగుబంగారమిదే


శతకాలు పలికిన శేషప్ప వాసమిదె
పౌరాణిక బ్రహ్మ గుండిరాజన్నస్థలమిదే
సంగీత సరస్వతి చాచంవారి ఊరుయిదే
కీర్తిగొన్నఘనపాఠీలెందరికోపుట్టిల్లిదె


బ్రహ్మకూ,యమరాజుకు విగ్రహాలు గల విక్కడ
డోలోత్సవాలు జరిగె ఘనకోనేరుందిక్కడ
ఉగ్రయోగ రూపాలతొ వెలిసాడిట నరసింహుడు
సరితోడుగ నిలిచాడు శ్రీరామలింగేశుడు

నటులు ,నాయకులు ,జ్యోతిష్య పండితులు
కవులు ,గాయకులు, ఘన శాస్త్రవేత్తలు
ఐదునూర్ల బ్రాహ్మణ్యం అలరారె మాఊరున
ప్రతి రోజు ఉత్సవమే నిత్యకళ్యాణమే
ఇక్కడ జన్మించడం పూర్వ జన్మ పుణ్యమే –
మా పూర్వ జన్మ పుణ్యమే!

No comments: