Sunday, May 31, 2009

నాలుకా! నా నాలుకా
నీకెందుకే వాచాలత-నీకేలనే చాపల్యత
అంటే అనునీవు హరి నామము-లేకుంటె పాటించవే మౌనము
పెట్టింది తినకుంటె నీదే లోపము
రుచి మరచిపోకుంటె పస్తే తథ్యము
1. దంతాలు నిన్నెంత బంధించినా-చింతన్నదే లేక చిందులు వేస్తావు
అధరాలు నిన్నెంత వారించినా-బెదురన్నదే లేక వదురుతూ ఉంటావు
భాషణల ముత్యాలు నువు దాచుకుంటావు
మాటల తూటాలు పేల్చుతూ ఉంటావు ||అంటే||

2. షడ్రుచులు తీవ్రమై బాధించినా-వెర్రిగా వాటికై అర్రులు చాస్తావు
పంచభక్ష్యాలు...రోగాల పెంచినా-లక్ష్యపెట్టక నీవు విందులారగిస్తావు
ప్రాణాలు హరియించె ధూమపానమే ప్రియమా
నీకు జీవశ్చవమొనరించు మధువే ఇష్టమా ||అంటే||


శ్రీ సత్యనారాయణస్వామి మంగళ హారతి

శ్రీ సత్యనారాయణస్వామి మంగళ హారతి- రచన : రాఖీ

Mobole:9849693324

సత్యమేవ జయతే - గొనుమా సత్యదేవ హారతినే

సకల దేవతా స్వరూపఈయవె శరణాగతినే

|| సత్యమేవ జయతే||

1. షోడషోపచారములతొ-శోభిల్లగ పూజిస్తాము

వ్రతమహిమ తెలిపే కథలను-మనసారా ఆలకిస్తాము

చివరి వరకు వేచియుండి-తీర్థప్రసాదం సేవిస్తాము

నీ భక్తి భావనలోనే- బ్రతుకంతా తరియిస్తాము || సత్యమేవ జయతే||

2. ఏడాదికో మారైనా-నోచేము నీ నోము

శుభకార్యమేదైనా- వ్రతమాచరించేము

కర్తలమే మేమెపుడు-కర్తవ్యము నీ వంతు

ఆచరణయె మా వంతుఆదరణయె నీ వంతు || సత్యమేవ జయతే||

3. సత్యమునే పలికెను నాడు-సత్య హరిశ్చంద్రుడు

సర్వము కోల్పోయినా-సత్య వ్రతము వీడలేదు

మహనీయుల మార్గములో-స్వామీ మము నడిపించు

శ్రీ సత్యనారాయణఅభయ హస్తమందించు || సత్యమేవ జయతే||

Thursday, May 28, 2009

నా మార్గము నువు సవరించరా

వివరించరా కృష్ణా ఎరిగించరా- నా మార్గము నువు సవరించరా

అవతరించరా- ననువరించరా-

నా కౌగిలిలో నువుతరించరా

నాకై మరిమరి కలవరించరా- అనుభూతులనే పలవరించరా

1. నా పెదవి పిల్లన గ్రోవి-వద్దననెపుడూ వాయించరా

నా కనులు విరియని కలువలు- సిద్ధమే సదా పూయించరా

నా కౌగిలిలో నువుతరించరా

నాకై మరిమరి కలవరించరా- అనుభూతులనే పలవరించరా

2. నామెడ వంపు- ఎంతో ఇంపు-నీ ఊపిరితో అలరించరా

నాజూకు నడుము పిడికిట ఇముడు-అరచేతితో యత్నించరా

నా కౌగిలిలో నువుతరించరా

నాకై మరిమరి కలవరించరా- అనుభూతులనే పలవరించరా

3. నాభికి తోడైతె నీ నాసిక-ఆనందముతో జలదరించురా

నువుసేదదీరగ నామేను పరుపుగ-పవళించగా పరవశించురా

నా కౌగిలిలో నువుతరించరా

నాకై మరిమరి కలవరించరా- అనుభూతులనే పలవరించరా

దాహాలను తీర్చేటి మందాకిని

నీ పాదాల జన్మించిన సురగంగనూ
హరీ పంపరా తీర్చగ మా బెంగనూ
తలపైన కొలువైన శివగంగనూ
అందించరా శివా మా కరువు దీరనూ ||నీ ||

1. పాపాలను బాపేటి లోకపావని
దాహాలను తీర్చేటి మందాకిని
భువికే దిగి వచ్చిన భాగీరథి
తరగని విధి తరలించర విష్ణుపది
అడగము మిము వరములు ఈనాటితో
కడిగేము మీ పదములు కన్నీటితో

2. నీరంటే నీకెంత ఇష్టమో కదా
తేలియాడేవు నీవు కడలిపైనే సదా
మామగారంటె మరిమరి ప్రేమేమో మరి
ఇల్లరికంతోనే నీవు పొందావు సిరిగురి
నీ చుట్టూ నీరుంచుకుంటె సరిపోతుందా
కాసిన్ని మాకిస్తే మామసొమ్ము తరుగుతుందా

3. అభిషేకం అత్యంత నీకిష్టమనే కదా
నీ శిరసున గంగమ్మకు స్థలమిచ్చావు
గిరిజమ్మ కినుక నీవు తీర్చడానికే కదా
మామ గారింటిలోనె మకాంవేసినావు
నీ చుట్టూ నీరుంచుకుంటె సరిపోతుందా
కాసిన్ని మాకిస్తే మామసొమ్ము తరుగుతుందా
మా యమ్మ సొమ్ము తరుగుతుందాFriday, May 1, 2009

సాగిపో యేటి సంగీతమై

సాగిపో యేటి సంగీతమై
సాగిపో ఎదుగు సూర్య బింబమై
సాగిపో ఆశయాల అంబరాలు గమ్యమై
సాగిపో సాగిపో సాగిపో || సాగిపో||
1. అదురులేక బెదురులేక వడివడిగా సాగిపో
ఒడుదుడుకులు ఎదురైనా అధిగమించి సాగిపో
పంజరాలు బంధనాలు శృంఖలాలు త్రెంచుకొని
సాచిన రెక్కల స్వేఛ్ఛా విహంగ భంగి ఎగిరిపో || సాగిపో||

2. నిరాశా చీకట్లను ఛెండాడుతు సాగిపో
నిరోధాల మబ్బులనిక ఛేదించుక సాగిపో
గ్రహణాలు మరణాలు కారణాలు ఎదిరించి
అపరాహ్ణ గ్రీష్మకారు భానుడిలా రగిలిపో || సాగిపో||

3. భగీరథుడి మనోరథపు చెదరని సంకల్పమై
ఏకలవ్య హృదయాంతర నిశ్చల ఏకాగ్రతై
శ్రమఏవ జయమన్నది సదా నీ నినాదమై
గెలుపు గెలుపు గెలుపు గెలుపు-గెలుపె నీ ప్రధానమై || సాగిపో||