Tuesday, June 30, 2009

కన్నీళ్లు కాల్వలై పారుతున్నా
గుండెలో మంటలే రగులుతున్నా
కరుగదా ఓ చెలీ నీ యెద
తీరదా ఎప్పటికీ నా వ్యధ
1. దర్పణానికైనా దర్శనమిస్తావు
చందమామకైనా దరహాసమిస్తావు
కలలోకి కూడ రమ్మంటే రావాయే
కలహానికైనా నాతో మాటాడవాయె
పలుకవా ఓ చెలీ కోపమా
మనుగడే నా కిక శూన్యమా
2. వసంతాలెన్నెన్నో వెళ్ళిపోతున్నాయి
ప్రభాతాలింకెన్నో కనుమరుగౌతున్నాయి
ఒక్క మలయ పవనమే కరువైపోయే
ఒక్క వెలుగు కిరణమైన కనబడదాయే
కరుణయే మరచిన ప్రాణమా
మరణమే నాకిక శరణమా
ఒక గీతం నాలో పొరలింది
ఒక రాగం నీలో పలికింది
నా గీతం నీరాగం అనురాగ సంగమం
సాహిత్యం సంగీతం అపురూపమేళనం
1. అనుభవాలకిది నవగీతమాల
అనుభూతి జగతిన రసరాగ హేల
మురళీరవళుల ఎదప్రేమ డోల
రాధాకృష్ణుల మధురాసలీల
2. ఒక పికమూ పలికేందుకు మధుమాసం
ఒక చకోరి మురిసేందుకు చంద్ర హాసం
ఒక మయూరి ఆడేందుకు చిరు వర్షం
నా మనుగడ సాగేందుకు నీ స్నేహం-ప్రియా నీ స్నేహం
శరణమ్మని శరణమ్మని చరణమ్ములె శరణమ్మని నమ్మితినయ్యా
హరిహర సుత నానందచిత్తనయ్యనయ్యప్పస్వామీ నిను వేడితినయ్యా
1. దిక్కు దెస తెలియనీ దీనుడనయ్యా
మొక్కు ముడుపెరుగనీ మూఢుడనయ్యా
వ్యసనాల చెఱసాలలొ బంధీనయ్యా
కన్నులుండి చూడలేని అంధుడనయ్యా
కనికరముతొ కని కరమును నా శిరముననుంచీ వరమీయవయ్యా
హరిహర సుత నానందచిత్తనయ్యనయ్యప్పస్వామీ నిను వేడితినయ్యా
2. పూర్వజన్మ పుణ్యముతో దొరికె నాకు గురుస్వామీ
ప్రేమమీర వేసెనయ్య నా మెడలో తులసిమాల
నియమాలను తెలిపి నాకు ఇచ్చెనయ్య మండలదీక్ష
మంత్రోపదేశమొసగె అదియె స్వామి శరణమయ్యప్పా
ఇరుముడినా తలనిడి నే వడివడి పదునెట్టాంబడి నెక్కితినయ్యా
హరిహర సుత నానందచిత్తనయ్యనయ్యప్పస్వామీ నిను వేడితినయ్యా
3. నయనా నందకరమె నీదివ్య రూపము
పరమానంద భరితమె నెయ్యాభిషేకము
ప్రశాంతి నిలయమే స్వామి సన్నిధానము
జన్మచరితార్థమే మకరజ్యోతి వీక్షణం
ఆశ్రితజన రక్షిత బిరుదాంకిత ననువేగమె నీచెంతజేర్చుకోవయ్యా
హరిహర సుత నానందచిత్తనయ్యనయ్యప్పస్వామీ నిను వేడితినయ్యా
బాబా నువు ఆదుకుంటె భయమేముంది
బాబా నిను నమ్ముకుంటె కొదవేముంది
బాబానువు దీనుల ఎడ కల్పవృక్షము
బాబా నువు ఆర్తులకిల అభయ హస్తము

1. మితిమీరెడి నా కోపము నీ చలవే కాదా
ప్రతిదానిపై వ్యామోహము నీ లీలయె కాదా
నా మేధలొ కొలువున్న అజ్ఞానము నీప్రసాదమే కాదా
అడుగడుగున నే చేసెడి తప్పిదాలు నీ ప్రతాపమే కాద

2. బాబా నువు పరీక్షిస్తె తాళజాల లేనయ్యా
బాబా కన్నెర్రజేస్తె తట్టుకోగ లేనయ్యా
బాబా నువు మూఢులకొక జ్ఞాన దీపము
బాబా నువు గురువులకే దత్త రూపము

3. అక్షరాల పరమార్థము నీ పదమేకాదా
పదముల కొక చరితార్థము నీ పదమే కాదా
పల్లవులే పల్లవించు నిజ తరుణము నీ పదమే కాదా
చరణములే శరణుకోరు శుభ చరణము నీ పదమే కాదా

4. బాబా నువు కరుణిస్తే అంతకన్న ఏముంది
బాబా నువు దయజూస్తే చింతయన్న దేమొంది
బాబా నువు తలచుకుంటె బ్రతుకు స్వర్గ ధామము
బాబా నిను గెలుచుకుంటె ఎద షిర్డీ సంస్థానము
ఏ పాట పాడినా విఘేశునిదేరా
ఏ పూజచేసినా గణపతికేరా
పాటపాడని పూజసేయని మనిషే ఎందుకురా
ఆ మనసే దండగరా-ఆ బ్రతుకే దండగరా

1. అజ్ఞానపు చీకటి వదలాలీ-జ్ఞాన మార్గమే నడవాలీ
మనిషీ మనసూ కలవాలీ-ఏకాగ్రతనే పొందాలీ
యోగమే నిత్యమై-దైవమే గమ్యమై
భగవన్నామస్మరణలో-లీనమై నిలిచిపో-ఐక్యమై వెలిగిపో

2. ఇహమూ దేహము మరవాలీ-మదిలో గణేశున్నిలపాలి
గానము ధ్యానము కావాలీ-భక్తితత్వమూ పుట్టాలీ
ముక్తినే కోరుతూ-భక్తిలో మునుగుతూ
భక్తి ముక్తి కలయికలో-దైవాన్నే తెల్సుకో-దైవం నీవని తెలుసుకో

Monday, June 29, 2009

ఎదలోపల మర్మం దాచేయలేను
పెదవిదాటి భావం రానీయలేను
కక్కలేను మ్రింగలేను హాలాహలం
ఆరదు చెలరేగదు ఈ దావానలం
1. వయసేమో ఉప్పెనగా ఎగసిఎగసి పడుతోంది
మనసు మేల్కొని చెలియలి కట్టను కడుతోంది
పిల్లులచెలగాటం ఎలుక ప్రాణసంకటం
అడకత్తెరలో చిక్కిన పోకచెక్క జీవితం
2. మమతల పాశం గొంతు నులిమేస్తోంది
ప్రబలిన స్వార్థం గుండె కబళిస్తోంది
త్యాగంభోగం మధ్యన ఊగుతోంది లోలకం
బ్రతుకే విధి సయ్యాటల వింతనాటకం
ఒక రాధిక మానస చోరా
ఒక మీరా హృదయ విహారా
రావేరా ప్రణయ కిషోరా
నన్నేలా ధీరసమీరా
1. ఇసుక తిన్నెలేలా పరచితి నాఎద
పిల్లగాలులేలా వీచితి పయ్యెద
యమునాతటియేల నే మందాకినే కాద
ఆరాధ నీకేల అనురాగ సుధగ్రోల
2. వేణువు నీకేల గొను అధరామృతాల
నర్తన నీకేల కను నానయనహేల
కీర్తన నీకేల విను నా ప్రార్థన గోల
ఆ మీర నీకేల నీ చరణాల నేవ్రాల
మాధుర్యమెక్కడ తేనయ్యనేనూ
తేనా(అర్ధ 'య'కార ఉచ్ఛారణతో)భిషేకాల మునిగేటి స్వామి
రాగాల నెట్టుల నేర్చేను నేను
క్షీరాభిషేకాల మునిగేటి స్వామీ
స్వామీస్వామీ శరణం స్వామీ-ఓంకార రూపా శరణం స్వామీ

1. శృతినే రీతిగ నిలిపేను నేను
శర్కరా స్నానాలు చేసేటిస్వామీ
లయనే విధముగ కలిపేను స్వామీ
పెరుగుతో స్నానాలు చేసేటి స్వామీ
స్వామీస్వామీ శరణం స్వామీ-జ్యోతి స్వరూపా శరణం స్వామీ

2. గమకాలనేభంగి పలికేను నేను
నెయ్యాభిషేకాల కులికేటి స్వామీ
ఎలుగెత్తి నేనెట్లు పాడేను తండ్రీ
పంచామృతస్నాన మాడేటి స్వామీ
స్వామీస్వామీ శరణం స్వామీ-చిన్ముద్ర ధారీ శరణం స్వామీ

3. మార్దవంబేలయ్య ఆర్తియే చాలదా
మదగజంబేరీతి పాడిందనీ
సంగీత మెందుకూ భక్తియే సరిపోద
పన్నగమ్మేభంగి నుడివిందనీ
స్వామీస్వామీ శరణం స్వామీ-పరమేశ తనయా శరణం స్వామీ


అట్టాంటిట్టాంటోడివి కాదు బాబయ్యా-షిర్డి బాబయ్యా
నను ఎట్టాగైనా గట్టెక్కించే దిట్టవు నీవయ్యా-జగజ్జెట్టివి నీవయ్యా

1. ఎల్లలు తెలియని దప్పిక ఆరని నీళ్ళే ఉన్నాయి-కన్నీళ్ళే ఉన్నాయి
కల్లలై మిగిలిన అల్లరై పోయిన ఆశలు ఉన్నాయి-అడియాసలు ఉన్నాయి
శరణని వేడగ కరుణతొ బ్రోవగ చరణాలున్నాయి-నీదివ్య చరణాలున్నాయి
దీనులపాలిటి దిక్కుగ నిలిచే దృక్కులు ఉన్నాయి-చల్లనీ దృక్కులు ఉన్నాయి

2. కష్టము తీర్చే చుట్టము నీవని నిన్నే నమ్మితిని-బాబా నిన్నే నమ్మితిని
తోడుగనిలిచే జోడువు నీవని నిన్నే వేడితిని-సాయీ నిన్నే వేడితిని
అక్కునజేర్చే తండ్రివి నీవని నీకే మ్రోక్కితిని-బాబా నీకే మ్రొక్కితిని
పిలిచిన పలికే పెన్నిధి నీవని నిన్నే మొరలిడితి-సాయీ నీకై మొరలిడితి

3. విఘ్నము బాపే గణపతినీవని తొలుతగ కొలిచితిని-బాబా నిన్నే కొలిచితిని
విజయము కూర్చే మారుతి నీవని జపమే చేసితిని-శ్రీరామ జపమే చేసితిని
విద్యలనొసగే గురువే నీవని పూజలు చేసితిని-బాబా హారతి పాడితిని
వ్యధలను బాపే అయ్యప్ప నీవని శరణము కోరితిని-సాయీ శరణము కోరితిని
లంబోదరా జగదంబాసుతా
దయగన రావేరా ఓ ఏకదంతా

1. నేరక నేరాలు ఎన్నెన్నొ చేసేము
ఎరుగక ఏవేవొ పెడదారుల నడిచేము
చేసిన తప్పులు మన్నించవయ్యా
మా త్రోవ మళ్ళించి మము కావుమయ్యా

2. తెలిసీ తప్పేటి మూర్ఖులమయ్యా
తెలియక చేసేటి మూఢులమయ్యా
కోరికలెన్నెన్నొ కోరుతూ ఉన్నాము
నువు కల్పతరువని నమ్ముతూ ఉన్నాము

3. విద్యల నొసగే వినాయకా
సంపద నొసగే గణనాయకా
అంజలి ఘటించి నీకు మ్రొక్కేము
అంతకు మించి ఏ సేవ చేసేము

Sunday, June 28, 2009

నిన్ను ఊరంతా చూడ తగునేమో
నేను చూస్తేనే దోషమగునేమో
ఇది ఎంతటి విడ్డూరం-ఇది ఎక్కడిదో న్యాయం
1. గాలేమో నీ తనువును తాకవచ్చును
నీళ్ళేమో అణువణువును తడమ వచ్చును
కోకేమో కౌగిలిలో బంధించ వచ్చును
నన్ను చూస్తేనే సిగ్గు నీకు ముంచుకొచ్చును
2. తాంబూలం నిన్నెంగిలి చేయవచ్చును
దర్పణమూ నీ అందం కొలువవచ్చును
సింధూరం నీ నుదుటిని చుంబించ వచ్చును
నువ్వు సయ్యాటలాడి నన్నుడికించవచ్చును
3. తొంగితొంగి నీవేమో చూడవచ్చును
నంగనాచిలాగా నటియించవచ్చును
పదేపదే పరువాలతొ ఊరించవచ్చును
కడలి నడుమ నా నావ ముంచవచ్చును
నీ మౌనము తొలగించనా
ఈ తీగలు సవరించనా
నీ వీణను పలికించనా
నీలోన రాగాలు రవళించనా
అనురాగాలు నే పంచనా
1. నీ తోటకు ఆమని నేనై
నీ కొమ్మన కోయిల నేనై
నీ మోడుకు జీవమునేనై
నీ లోన ఆనందమై మురియనా
మందార మకరందమై కురియనా
2. నీవొంటికి చీరను నేనై
నీ కంటికి కాటుక నేనై
నీ నుదుటికి తిలకము నేనై
నీ లోని అణువణువు చుంబించనా
నీ అందాల విందారగించేయనా
3. నీ రేయికి వేకువనేనై
నీ వలపుల వాకిలి నేనై
నీ ముంగిటి ముగ్గును నేనై
నీ లోని తిమిరాలు పరిమార్చనా
ప్రణయ కిరణాలనే నేను ప్రభవించనా

అయ్యప్పనిన్నూ కోరేది నేను ఒక్కటే
నాగొంతు పాడాలీ ఎప్పుడూ నీ పాటే
కొండలు కరగాలీ-కోనలు మ్రోగాలీ
గుండెలు పరవశమై ఊయలలే ఊగాలీ
స్వామి అయ్యప్పా-శరణమయ్యప్పా
స్వామి శరణం-శరణం శరణం- శరణమయ్యప్పా ||అయ్యప్ప||

1. ఆకలన్నదే లేదు నీ పాటే కడుపు నిండె
దాహమన్నదే కాదు గానగంగలొ మునిగి ఉంటే
నిద్ర దూరమాయే నీభజనలు సేయగా
అలుపు పారిపోయె నీ కీర్తన ఆలపించగా
స్వామి అయ్యప్పా-శరణమయ్యప్పా
స్వామి శరణం-శరణం శరణం- శరణమయ్యప్పా

2. తనువు మఱచిపోతి నీ పాటకు తాళంవేయగా
తన్మయమే చెందితి నీ గీతికి వంత పాడగా
గొంతు చిరిగినా గుండె పగిలినా
ఎలుగెత్తిపాడితీ విశ్వము నినదించగా
స్వామి అయ్యప్పా-శరణమయ్యప్పా
స్వామి శరణం-శరణం శరణం- శరణమయ్యప్పా

3. నిన్నే నమ్మినానయ్యా స్వామీ ఈ జన్మకు
అన్నీ ఇచ్చినావయ్యా అయ్యప్పా నాకు
ఎన్నో ఇచ్చిన అయ్యాప్పా ఎందుకయా స్వామి
కమ్మనైన గొంతునీయ మఱచిపోతివా ఏమి
స్వామి అయ్యప్పా-శరణమయ్యప్పా
స్వామి శరణం-శరణం శరణం- శరణమయ్యప్పా
రావయ్యా షిర్డీ బాబయ్యా
నా మొరవిని పరుగిడి రావయ్యా షిర్డీ బాబయ్యా
ప్రార్థన వినవయ్య ఆర్తిని కనవయ్య
సద్గురుమూర్తీ నా సంకటముల నెడబాపవయా
1. కంటనీరే ఆగకున్నది-గొంతులో తడి ఆరుతున్నది
ఎద తన లయ వీడి సాయీ అంటోంది
చిత్తము నినుగని చిత్తరువైనది
బాబా బాబా హే సాయి బాబా
2. వంచన నేర్చిన కొంచపు వాడనని-ఎంచకుసాయీ ఈ పూట
పుణ్యము ఎరుగని అన్యుడనేనని కోపించకు బాబా పిమ్మట
దీనుడనూ నేననాథుడను-నిను వినా ఎరుగని వాడను
అంధుడనూ మనో వికలాంగుడను చేయూతనందించ ఇతరుల వేడను
సాయీసాయీ షిర్డీ సాయీ
3. దారులన్నీ మూసుకున్నవి-షిర్డీ ఒకటే దగ్గరైనది
నీవేదప్ప నాకెవరు దిక్కు- నువు కాదంటే మరణమె దక్కు
ద్వారకమాయి సాయీ సాయీ
గజవదనా గౌరీ నందన
అనుదినమూ నిను పూజింతుమురా
1. సృష్టి స్థితిలయ కారకుడవు
విద్యలకెల్లను ఆదిదేవుడవు
చేసిన తప్పులకు గుంజీలు తీసేము
కుడుములుండ్రాళ్ళు నైవేద్యమిచ్చేము
2. నూటొక్క టెంకాయ మేకొట్టలేము
నూటొక్క పూజల మేచేయలేము
కన్నీట నీ పాదాలు కడిగేము
చేతులు జోడించి ధ్యానింతుము
3. ఏ పనికైనా ముందుగ నిన్నే తలచేము
మోరయా కావుమని నోరార పిలిచేము
దేవతలు కొలిచేటి దేవుడవు నీవు
భక్తులపాలిటి కల్పతరువువు

Saturday, June 27, 2009

లోకంలో ఎంతటి శోకం ఉంది
నా శోకం అది ఎంతటిదీ
లోకుల వేదన చూసిన కొలది
అవేదననే మరచితిని
1. కోటికి ఎవరో సుఖపడతారు-ఎవరైనా సరె దుఃఖిస్తారు
తింటే అరగని దొక శోకం-తిండే దొరకని దొక శోకం
ఇంటింటికీ ఒక ఖేదం ఉంది-నా శోకం అది ఎంతటిది
2. ఇంద్రధనువులే అగుపిస్తాయి-ఎండమావులే ఎదురొస్తాయి
పెదవులవిరియును చిర్నవ్వులు-కన్నుల కురియును అశ్రువులు
సుఖదుఃఖాలకు నిలయం బ్రతుకు-తెలిసీ వగచుట ఎందులకు
3. మండే కొలిమి ప్రతి గుండె-ఎండని కొలను ప్రతి కన్ను
ఎదఎదకూ ఒక వ్యధ ఉంది-ప్రతి వ్యధకూ ఒక కథ ఉంది
ఈ జగమే విషాదమయం-జనజీవనమే దయనీయం
బుగ్గగిల్లితే పాలుగారును
గుండె తాకితే ప్రేమకారును
తోడు దొరకనీ కుర్రకారును
తాళలేను నా వయసు పోరును
1. కలలు పండించు కామధేనువును
వన్నెలొలికెడి ఇంద్ర ధనువును
వయసు పలికెడి వలపు వేణువును
అలిగి పలిగెడి పరమాణువును
2. కన్నె నెమలికి వానకారును
కన్నె మనసుకి పూలతేరును
పరుగు ఆపని పిల్ల ఏరును
అదుపు తప్పని కడలి హోరును
నేను తప్పుచేసానంటే ఆ తప్పు నీదే
అయ్యప్పా! నే దాన్ని ఒప్పుకోలేకపోతె ఆ తప్పూ నీదే
నీవూ నేనూ ఒకటె అన్నది తప్పుకాకపోతే
తప్పు నాదన్నా నీదన్నా అది తప్పు కాదే!
1. పూర్వజన్మ కృతమన్నది స్వీకృతమే ఐతే
జన్మదాటి వెంటాడిన దోషానిదె దోషము
గతజన్మలోనేను పాపాత్ముడనే ఐతే
పాపికి మరుజన్మనిచ్చిన నీదేకద లోపము
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరట స్వామీ
నా తప్పులనెంచ బూనితె నీదీ ఒక తప్పేకద
2. పొరపాటులె నాకలవాటుగ అయినాయంటే
ఆ దురలవాటు మాన్పించని నీదే కద పొరబాటు
పుట్టుకతో నేనెరుగని నేరములన్నీ
నాతో చేయించే నీదే కద ఆ నేరము
నాటకాలు ఆడించీ నవ్వుకునే సూత్రధారీ
ఆటగెలిచినా ఓడినా నీవే కద జవాబుదారీ
గంపెడంత ఆశతొ షిర్డీకి వచ్చాను
గడపలెన్నొ ఎక్కిదిగి విసిగి వేసరి నే దిక్కు తోచకున్నాను
ఆదరించె మారాజు నీవని నమ్మి నీ పంచన జేరాను
వట్టిచేతులతొ బాబా నే వాపసు పోనయ్యా
వరములిస్తెనే గానీ నీ పదాలనొదలనయా
1. గణపతివి నీవె మారుతివి నీవె
శరణంటె కరుణించె అయ్యప్పవూ నీవె
హరిహర బ్రహ్మలు ముగ్గురొక్కటైన
సాక్షాత్తు పరబ్రహ్మ దత్తాత్రివీ నీవే
అభయమీయగా ఎవ్వరూ నీ సరి రారయ్యా
వెన్న కంటెనూ మెత్తనిదీ నీ మనసేనయ్యా ||వట్టి చేతులతొ||
2. నిరీక్షించలేనయ్య పరీక్షించ బోకయ్యా
నీ రక్ష కోరి వచ్చాను బాబయ్య
భిక్ష పెట్టవయ్య నన్ను-లక్ష్యపెట్టవయ్య
నీ శరణు వేడి వచ్చాను బాబయ్యా
కడలి కంటెనూ గొప్పదయా-నీదయ బాబయ్యా
వెన్నెల కంటెనూ చల్లనయా-నీ చూపు బాబయ్యా ||వట్టి చేతులతొ||
3. తిట్టినా నువ్వే కొట్టినా నువ్వే
మెడ బట్టి నన్ను వెళ్ళగొట్టినా నువ్వే
పెట్టినా నువ్వె చే పట్టినా నువ్వే-
కడుపార నాకు బువ్వ పెట్టినా నువ్వే
నను గన్న తండ్రివి నీవే ఓ షిర్డి బాబయ్యా
చావైన బ్రతుకైన నీ తోనే ఓ సాయి బాబయ్యా ||వట్టి చేతులతొ||
ఓ బొజ్జ గణపయ్యా కరుణించవేమయ్యా
ఎన్నాళ్ళు నీ పూజలూ-ఎన్నాళ్ళు నీ భజనలు
నిరతమూ వేడినా-నిను మదిలొ నిలిపినా
దయరాదా నాపైనా-సిద్ధివినాయకా బుద్ది ప్రదాయక
1. నీ పాద దాసుడనై-నీ మీది ధ్యాసుడనై
నీ దివ్య సన్నిధిలో-
నేను నీలొ కలిసి పోయి-నీవె నాలొ నిలిచి పోయి
తనువూ-జగమూ శూన్యమై
నా మనసే నీలో లీనమై
పరవశించె ఆ భాగ్యం-కలిగించవయ్యా-కరుణించవయ్యా
2. క్షణికమైన సుఖములను ఆశించ లేదయ్యా
తుఛ్ఛమైన కోరికలు అర్థించలేదయ్యా
ఈ అంధకార మార్గంలో
వెలుగు దారి చూపించు
జ్ఞాన దృష్టి కలిగించు
బాధా భరితము ఈ జీవితము
సారరహితమీ సంసారం.........
ఈదలేను విఘ్నేశా
దాటించవయ్యా నీ దరి జేర్చవయ్యా

Monday, June 22, 2009

చేజారెను గతమంతా వృధా వృధా
గడిచిపోయె బ్రతుకంతా నిస్సరముగా
దిక్కునీవె సాయి నాకు వేరెవరూ లేరుగా
మ్రొక్కగ నీవొక్కడివే కరుణింతువుగా –సాయి కరుణింతువుగా
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
1. విననీయి చెవులారా నీ నామగానం
కననీయి కనులారా నీ దివ్య రూపం
అననీయి నోరారా నీ నామ భజనం
కొలవనీయి మనసారా సదానిన్నే సాయిరాం
2. ఎత్తుకుంటా సాయి పుత్రునివై జన్మిస్తే
హత్తుకుంటా ఎదకు నేస్తమై నువు వస్తే
చేసుకుంటా సేవ గురుడివై కరుణిస్తే
చేరుకుంటా నిన్ను సద్గతిని నడిపిస్తే
3. భోగభాగ్యాలను ప్రసాదించ మనలేదు
ఐహిక సౌఖ్యాలను నే వాంఛించలేదు
జీవితమే సాయి నీకు కైంకర్య మందును
కైవల్య పదమె నాకు దయచేయమందును
జయ గణపతీ నీకిదె హారతీ
మంగళమ్మిదె మంగళ మూర్తీ
కరుణ జూపి వరములిచ్చి
మమ్ముల బ్రోచే దయానిధి
1. అణువుఅణువున నీవె నిండిన అమృతమూర్తీ హారతీ
నా కవితలోని భావమైనా ధ్యానమూర్తీ హారతీ
ఆదిమధ్యాంతరహిత వేదాంత మూర్తీ హారతీ
ఆర్తత్రాణపరాయణా కరుణాంతరంగా హారతీ
2. చవితి పండగ మా కనుల పండగ
మాకు నీవే అండయుండగ
కుడుములుండ్రాల్ బొజ్జనిండగ
భుజియించు తండ్రీ తనివిదీరగ
3. పిలిచినంతనె ఎదుటనిలిచే ఏకదంతా హారతీ
అడిగినంతనె వరములిచ్చే విఘ్ననాయక హారతీ
జ్యోతులమహర్జ్యోతివీవే పార్వతీసుత హారతీ
జ్ఞానముల విజ్ఞానమీవే జ్ఞానమూర్తీ హారతీ
సిద్ధి వినాయక స్వామీ స్వామీ
నా మీద నీకింక దయరాదేమి
1. పాడితి నీ గీతి ప్రతి నిమిషమ్మున
వేడితి గణపతి నిను వేవిధముల
కొలిచితి నిన్ను శతకోటి రీతుల
తలచితి నీనామ మనంత మారుల
2. లయనేనెరుగను కరతాళములే
రాగములెరుగను భవరాగములే
తపముల నెరుగను తాపత్రయములె
వేదములెరుగను నీ పాదములే

Sunday, June 21, 2009

నిన్నే నే మది నమ్మితిని షిరిడీ సాయి
దిక్కిక నీవేనని నే చేరితిని ద్వారకమాయి
1) పంచేంద్రియములు మరి శత్రువులార్గురు
వంచనతో మది చంచల పరతురు
సంచితమాయె ప్రాపంచిక చింతన
చింతదీర్చి నన్నించుక బ్రోవర
2) కులమిది నాది మతమది నీదని
ఇతరులతో నే వాదములాడితి
జగతికి మూలం జనులకు దైవం
ఒకడవె నీవని ఎరుగనైతిని
3) జీవరాశులలొ జీవమునీవే
పంచభూతముల భావము నీవే
అణువణువున చైతన్యము నీవే
అంతరాత్మలో స్పందన నీవే

Saturday, June 20, 2009

రాలిపోయె ఒక వసంతము
మూగవోయె సంగీతము
వాడిపోయె పారిజాతము
విషాదమే నా జీవితాంతము
1. పికము పాట పాడితే వస్తుందా మధుమాసం
నెమలి నాట్యమాడితే-వర్షిస్తుందా మేఘం
కలువ భామ వికసిస్తే వెలిగేనా శశి కిరణం
గొంతుచించి అరిస్తే అవుతుందా రసరాగం
శివరంజని రాగం
2. అనురాగం ఆలపిస్తె కరిగేనా కఠిన హృదయం
ఆనందం ధారపోస్తె నిజమౌనా మధురస్వప్నం
నయనం వర్షిస్తే అధరం హర్షిస్తే అవుతుందా స్వార్థం
అనర్థాల అద్భుతాల విధిలీలలు ఎవరికి అర్థం
అది-(ఏ)యే-పరమార్థం
మురిపించవేర నను మురళీ కృష్ణా
తీర్చగ రావేర నా జీవన తృష్ణా
1. గోదావరినే యమునగ భావించి
నా హృదయమునే బృందావనిజేసి
వేచితి నీకై యుగయుగాలుగా
కొలిచితి నిన్నే నా ప్రణయ స్వామిగ
2. పికము పాటనే పిల్లనగ్రోవని
నే పరవశించితి వాసంతమై
నీలిమేఘమే నీవని భ్రమిసి
మైమరచి ఆడితి మయూరమై
3. కోకలు దోచే తుంటరి నీవని
జలకములాడితి వలువలు విడిచి
రసికత నేర్చిన సరసుడవీవని
వలపులు దాచితి విరహము సైచి
ఈ పూవు పూచింది నీ పూజకే 
ఈ జన్మఎత్తింది నీ సేవకే 
కలనైన ఒకసారి కనిపించరా 
అయ్యప్ప కాసింత కరుణించరా 

1. కలుషాల వశమాయె నా దేహము 
దోషాల మయమాయె నా జీవితం 
మన్నించి నన్నింక చేపట్టరా 
ఇక్కట్లు చీకట్లు తొలగించరా
 ఓంకార రూపా జ్యోతిస్వరూపా 
శబరీశ నిన్నే శరణంటిరా 

2. నిమిషానికోమారు చెడుగుడే ఆడేవు 
అప్పచ్చులే చూపి ఆశలు రేపేవు 
ఊహలమేడలూ ఉత్తినే కూల్చేవు 
తోలుబొమ్మలాడించి-నువ్వేమురిసేవు 
చాలించవయ్యా సయ్యాటలు 
తెరదించి ఆపాలి ఈ నాటకాలు 

3. మాయావినోదాలు నా మీదనా 
నేను లీలావిలాసాల నీ కేళినా 
బ్రహ్మాస్త్రమేలయ్య పిచ్చుక పైనా
 నే తాళలేనయ్య నీ ఈ పరీక్ష 
పంపానివాసా పందళాధీశా
 శబరీశ నిన్నే శరణంటిరా
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయని
మైమరచి పాడితె మదికెంతొ హాయి
సచ్చిదానంద శ్రీ సద్గురు సాయని
మనసార వేడితె బ్రతుకంత హాయి

1. మాలలో నియమాలలో-పాలలో-లోపాలలో
తప్పులెన్ననీ సాయీ-పాదసేవయే హాయి
మరువబోకు ఓ భాయీ-లోటనేది ఉండదోయి

2. చెరగని చిరునవ్వు-వే దనలకు దవ్వు
దయకురియు కనుదోయి-పాపహారకమోయి
జన్మంతా సేవ చేయి-జన్మరాహిత్యమోయి
అందుకోరా ఏకదంతా-
అందుకోరా ఫాలచంద్రా 
నీకొరకే హారతులు-చేసేము ప్రార్థనలు 
నా నామమే శుభదాయకం-నీగానమే అఘనాశకం 
రారా వేగమే విఘ్నేశా-నీదే గొనుమిదె తొలిపూజ 

1. పార్వతితనయా పాపము పోగొట్టవా 
విఘ్నవినాశకా-విఘ్నము రానీకుమా 
సిద్ధిబుద్ది ఉన్నవయ్యా నీకు అండగా 
అవి మాకు ఈయవయ్య కాస్త దండిగా 
నా మనసులో నీ మూర్తినే 
నిలిపియుంతు స్వామి-దయజూడవేమి 
జాగుసేతువేమి జాలిమాని 

2. వేదనలేలా నీ కరుణ ప్రసరిస్తే 
వేకువ లేలా నీ జ్ఞానముదయిస్తే 
ఆశ నాకు పాశమల్లె చుట్టుకున్నది 
కోరికేమొ నాలొ ఇంక చావకున్నది 
నా జీవితం నీకంకితం 
రాగబంధమేల-మోక్షమీయవేల 
ప్రాణదీపమిదె హారతిస్తా
ఏమీ చేయగలేను-చూస్తూ ఊర్కోలేను
కనలేను నిను నే పరదానిగా
మనలేను నేనూ ఒకమోడుగా
తీరని ఆశే ఉరిత్రాడుగా
1. ఆకాశానికి నిచ్చెనవేసి-దివి చేరాలని కలగన్నాను
అందాల జాబిలి పొందాలనుకొని-అందనిదానికి అర్రులు సాచాను
మేను మరచిన నేనూ-నిప్పై రగిలాను
నిజము నెరిగిన వేళా-నివురై మిగిలాను
2. ఏడేడు జన్మల బంధానికై-ఎన్నాళ్ళుగానో ఎదిరి చూసాను
మూడుముళ్ళ అనుబంధానికి-యవ్వన మంతా ధారపోసాను
శిల్పాలు శిథిలాలుగామారితే-చిత్తరువైనాను
క్షీరాలు రుధిరాలుగా పారితే-విస్తుపోయాను
వేయకే చెలీ నీ చూపుల గాలము 
తీయకే చెలీ ఈ బాలుని ప్రాణము 
ఒక్క చూపుకే చిక్కిపోతానేమో 
చిన్ననవ్వుకే చిత్తవుతానేమో 

1. తపోధనులు నీ ముందు తలవంచరా 
ప్రవరాఖ్యుడు నీకే దాసోహమనడా 
బ్రహ్మకైన మతిచలించు నీ చూపుల తోటి 
మామూలు మానవుణ్ని నేనేపాటి 

2. కోహినూరు వజ్రమైన సరితూగదు నీ నవ్వుతో 
తాజ్ మహలు అందమైన దిగదుడుపే నీ రూపుతో 
మయబ్రహ్మ విశ్వకర్మ మలచిన సౌందర్యమా
మడిగట్టుక మనడమ్మిక నాకు సాధ్యమా
దారి తప్పినవారిని-దరిజేర్చుకున్నావే 
అక్కరకే రానివారిని -అక్కున జేర్చుకున్నావే 
దయగల మారాజువే-సాయిమహారాజా 
మముగన్న తండ్రివే - యోగిమహారాజా 

1. పడవ నడిపే గుహుడికి –పరసౌఖ్యమిచ్చావే 
ఎంగిలైన పళ్ళనీయ –శబరిని కరుణించావే 
ఉనికిలేని ఉడతకైన-ఉన్నతినే ఇచ్చావే 
శత్రువుకూ తమ్ముడైన శరణన ఆదరించావే 
దయగల మారాజువే-సాయిమహారాజా 
మముగన్న తండ్రివే - యోగిమహారాజా 

2. కుచేలుణ్ని నాడు అపర-కుబేరునిగ మార్చావే
 కురూపి ఆ కుబ్జకైన- ప్రేమతొ వరమిచ్చావే 
భక్తిమీర భజన సేయ -మీరాబాయిని బ్రోచావే 
కురుక్షేత్ర సమరంలో-గీతను బోధించావే 
దయగల మారాజువే-సాయిమహారాజా 
మముగన్న తండ్రివే - యోగిమహారాజా 

3. మూగయైన గురుసుతునికి-మాట ప్రసాదించావే దుష్టుడైన వావరుని-దురితము లెడబాపావే కుటిలుడైన మంత్రికీ-గుణపాఠంనేర్పగా అమ్మకొరకు అడవికేగి- పులిపాలు తెచ్చావే పులినేఎక్కి వచ్చావే దయగల మారాజువే-స్వామి శరణమయ్యప్పా మముగన్న తండ్రివే - స్వామి శరణమయ్యప్పా
వేడితి వేడితి కలలో ఇలలో షిరిడీ సాయీ
మధురంమధురం నీ నామ గానం మది హాయి హాయి

1. ఏజన్మలోని నాపుణ్యఫలమో
నీకృప గాంచితి నే తరియించితి
ద్వారకమాయి విలసిల్లు సాయి
నీదివ్య రూపం నే వీక్షించితి

2. ఆశల జోలెతొ నీ దరిజేరితి
ఆర్తిని బాపి దయగను సాయి
భంగపడలేదు భక్తజనులెవ్వరూ
నిన్ను అర్థించి షిరిడీ సాయి
నీరాజనం జగదాంబ తనయ గొనుమా
నీరాజనం హేరంబ కరుణ గనుమా
ఈ నవరాత్రాల సంబరాల వేళలో
1. నీరాజనం ఓ ఏకదంత గొనుమా
నీరాజనం ఆనంద నిలయ గొనుమా
గుండెలను గుడిచేసి ఉంచామయ్యా
నీ రూపునే ప్రతిష్ఠించామయ్యా
నీదు నామమే మధురాతి మధురమయ్యా
నీదు గానమే కైవల్యమార్గమయ్యా
పాహిరా మాం పాహిరా నీదు దివ్య చరణం
2. నీరాజనం ఓ ఫాలచంద్ర గొనుమా
నీరాజనం ఓ వక్రతుండ గొనుమా
విఘ్నాలు నీవుంటె రాలేవుగా
పాపాలు నే చెంత సమసేనుగా
నీరాజనం ఓ ఆర్తత్రాణ పాలా
నీరాజనం ఓ నాట్యకేళి లోల
కానరా వేవేగమే నీవే మాకు శరణం

Friday, June 19, 2009

కోకిలకేమెరుకా-వేచెనని తనకై రాచిలుకా
ఒంటరి తానని కంట తడేల నిజము నెరుగదు బేలా
1. కోరిన కొలదీ దూరము పెరిగే
పెరిగిన దూరము ప్రేమను పెంచే
తీరని దాహము ఆరని మోహము
హృదయము దహియించే
2. చిలకా కోకిల జత కుదరనిదని
లోకము ప్రేమని గేలిచేసే-వింతగ చూసే
నవ్వుకొందురు నాకేటి సిగ్గని
చిలుక ఎదిరించే
3. పెదవి విప్పదు ప్రేమని తెలుపదు
మౌనగీతం పాడక మానదు
ఎన్నినాళ్ళో చిలుక నిరీక్షణ
విధికి దయలేదా.... ఓ..
చిటుకు చిటుకు చిటుకు చిటుకు వానా
నువు చిందేయవే చిన్నాదానా
వణుకు వణుకు వణుకు వణుకు లోనా
నను పెనవేయవే కుర్రదానా

1. పరచిన ఈ పచ్చనైన ప్రకృతి నీవు
మెరసిన ఆ మెరుపులకే ఆకృతి నీవు
నింగిని ముద్దాడుతున్న నీలగిరి కొండలు
జాలువారుతున్న ఆ జలపాతపు హోరులు
నీ తళుకు బెళుకు మేని మెరుపు చూసీ
నేను వెర్రెత్తీ పోనా

2. పద్మినీజాతి స్త్రీలు ప్రస్తుతించె అందం
రతీదేవి తలవంచే తీరైన నీపరువం
పొరపాటున భువికి దిగిన శృంగార దేవతవు
పెద్దన కవి సృష్టించిన వరూధినీ ప్రతీకవు
నీ వలపు పిలుపు మేలుకొలిపె నన్నూ
నీకు దాసోహమననా
చిత్తగించు స్వామీ నా చిత్తము నీకిచ్చితి
అవధరించు స్వామీ నావ్యధను విన్నవించితి
ఆదరించు స్వామీ అన్యధా శరణం నాస్తి
అయ్యప్పస్వామీ నీవే నాకిక శరణాగతి
స్వామి శరణమయ్యప్పా-శరణం శరణమయ్యప్పా

1. రెప్పలిస్తివి కన్నులకు-స్వామి శరణమయ్యప్పా
చప్పున అవి మూసుకోవు- స్వామి శరణమయ్యప్పా
కూడని దృశ్యాలనే చూపించే నయ్యప్పా
జ్ఞాననేత్రమిస్తె చాలు-కన్నులేల అయ్యప్పా

2. పెదవులిస్తివి నోటికి- స్వామి శరణమయ్యప్పా
గమ్మున అవి ఊరుకోవు- స్వామి శరణమయ్యప్పా
వ్యర్థవాదులాటలకే-వెంపర్లాడునయ్యప్పా
మూగయైనమేలే-నీ నామమనకపోతె అయ్యప్ప

3. చెవులెందుకు పోగులకా- స్వామి శరణమయ్యప్పా
చేతులెందుకు మింగుటకా- స్వామి శరణమయ్యప్పా
నీ గానంవినని చెవులు చేటలే అయ్యప్పా
నీభజన చేయని చేతులు-చెక్కలే అయ్యప్పా

4. కాళ్ళిస్తివి దేహానికి- స్వామి శరణమయ్యప్పా
నీ సన్నిధికే నడిపించు- స్వామి శరణమయ్యప్పా
తోలిస్తివిఅస్తిపంజరానికి- స్వామి శరణమయ్యప్పా
నీ భావనకే పులకరించగ-అనుగ్రహించు అయ్యప్ప
శరణం శరణం బాబానే-ముక్తికి మార్గం బాబానే
శాంతికి నిలయం బాబానే-ప్రేమస్వరూపం బాబానే
సాయి రామయ్యా-బాబా-సాయి కృష్ణయ్యా
1. మెలకువలోను బాబానే-నిద్దురలోను బాబానే
గుడిలో గుండెలొ బాబానే-పనిలోపాటలొ బాబానే
గణపతి బాబానే బాల మురుగను బాబానే
2. వేదనలోను బాబానే-మోదములోను బాబానే
తల్లీదండ్రీ బాబానే-గురువూ దైవము బాబానే
మారుతి బాబానే-స్వామి అయ్యప్ప బాబానే
నమోనమో సిద్ధి వినాయక-నమోస్తుతే శ్రీ గణనాయక
గొనుమిదె మంగళ హారతి-వినుమిదె దీనుల వినతి
1. మూషికారూఢ దేవా-ఓ బొజ్జ గణపయ్యా
మహాకాయ మాంపాహి-ఓ వికట వెంకయ్యా
దాసజనపాల వేగ-దర్శనమ్మీవయ్యా
కామిత మోక్షవరద-దరిజేర్చుకోవయ్యా
నీదు మంగళానామం-మాకు మంగళదాయం
నీ కొరకే అంకితమై-సర్వాన్నీ త్యజిస్తుంటే
వలదిక వేరే సుఖము-లేదిక మరియే స్వర్గము
2. ఆడుతూ పాడుతూ మా- బాల్యమే మాయమాయే
క్షణిక దాహాలలోనా-యవ్వనం జారిపోయే
ఇహసౌఖ్య చింతనల్లో-దేహమే మోడువారే
ఇన్నాళ్ళ జీవితంలో- నిన్ను స్మరియించనాయే
నీదు దివ్య సన్నిధిలో-ఈ తొమ్మిది రాత్రులలో
ఈ క్షణమే శాశ్వతమై-నీ నామం జపిస్తుంటే
వలదిక వేరే వరము-లేదిక మరియే పరము

Thursday, June 18, 2009

నయనాలలో ఈ జలధారలు
హృదయాలలో ఈ చితిజ్వాలలు
ఉప్పొంగిఉప్పొంగి నను ముంచెను
చెలరేగి చెలరేగి నను కాల్చెను
1. కనురెప్పపాటులో కరుగు ఈ స్నేహము
మెరుపులా మెరిసి మరి మటుమాయము
కలగన్న క్షణములో మిగులు ఆనందము
కల్పనై తలపున రగులు గాయము
వసివాడు పూలదీ ఉద్యానము
శృతిలయలు లేనిదీ ఈ గానము
2. ఆషాఢమేఘాలు అశ్రువులు కురిసే
గ్రీష్మతాపము గుండె మండించగా
శిశిరాన వృక్షాలు మోడులై నిలిచే
శీతకాలము మంచు కురిపించగా
కళ్ళాలు లేనిదీ ఈ కాల హయము
బ్రతుకు సుఖదుఃఖాల నిలయము
నయనాలలో నీ చిరునవ్వులు 
అధరాలలో కొంటె కవ్వింపులు 
ఊరించిఊరించి వలవేసెను 
ఉడికించిఉడికించి నను దోచెను 

1. హరివిల్లువిరిసె నీ కెమ్మోవిలో 
నా పెదవి రవికళ్ళు అలరించగా 
చిరుజల్లు కురిసె నా ఎదదీవిలో 
నా బ్రతుకులో బీళ్లు పులకించగా 
అనురాగమయమే మనలోకము 
కలనైన దరిరాదు ఏ శోకము 

2. కార్తీక వెన్నెలలు అమృతము కురిసే 
తొలిరేయికై హాయి కానుకగ నీయ 
వాసంత కోయిలలు స్వాగతము పలికే 
శుభలగ్న సమయాన సన్నాయిలై కూయ 
తేనె విందులె మనకు ప్రతి నిత్యము 
పూలపానుపె బ్రతుకు ఇది సత్యము

ఈజన్మకొక్కెసారైనా-శబరిమలకు వెళ్ళాలి
మనిషిగా పుట్టినందుకు-మాలవేసుకోవాలి
మోక్షమింకకోరుకుంటే-దీక్షతీసుకోవాలి
స్వామి శరణమయ్యప్పా- స్వామి శరణమయ్యప్పా
1. కన్నెస్వామికున్నవిలువ-ఎన్నలేనిదేనయ్యా
గురుస్వామి పాదసేవయే-పరసౌఖ్యదాయమయ్యా
స్వామిశరణం శరణుఘోషయే-ముక్తిదాయకంబయ్యా
2. నీలివస్త్ర ధారణలో-సచ్చిదానందమయ్యా
ఇరుముడినీ తలదాల్చిన-అనుభవమే వేరయ్యా
ఎరుమేలిలో ఆడే-పేటైతుళ్ళే భాగ్యమయ్యా
3. కరిమలను ఎక్కగలిగితే-కైవల్యం తప్పదయ్యా
పంబాలోమేను ముంచితే-జన్మధన్యమేనయ్యా
వనయాత్ర అనుభూతులు-వర్ణించలేమయ్యా
4. శరంగుత్తిలో బాణం గ్రుచ్చితె సంతోషమయ్యా
శబరిపీఠంపై పాదం-మోపితేపునీతులమయ్యా
పద్దెనిమిది మెట్లనెక్కితే-బ్రతుకు సార్థకంబయ్యా
5. సన్నిధానం వైభోగం-చూడకళ్ళు చాలవయ్యా
స్వామి దర్శనానందం-చెప్పనలవి కాదయ్యా
మకరజ్యోతి సందర్శనం-మహిమ చెప్పరాదయ్యా
సాయిబాబా సన్నిధానం
సకల జనులకు ముక్తిధామం
షిరిడీనాథుని దివ్య చరితం
భవబంధమోచక సాధనం
1. సాయిరూపం-విశ్వదీపం
సాయినామం- మోక్షమార్గం
సాయిగానం-స్వర్గయానం
సాయితత్వం-మహిమాన్వితం
2. సాయినయనం-మలయపవనం
సాయిహృదయం-ప్రేమమయము
సాయి భజనం-భవపాప హరణం
సాయినిలయం-ప్రశాంతి నిలయం
భజనసేయ భయమేల బ్రతుకు పండురా
నిజముగ ఆ గజముఖుడే మనకు అండరా
నమోనమో గణాధిపా అనిన చాలురా
సదాతనే మనశ్రేయం మరువకుండురా

1. గుండె గొంతునొకటిచేసి- కరతాళం జతగ జేసి
వీథివీథి వాడవాడ –పురమెల్లా మారుమ్రోగ

2. బిడియాలను వదిలివేసి-హృదయాలను తెరిచివేసి
కదంతొక్కి కాలువేసి-తనువే మైమరచి పోగ

3. పిల్లాపెద్దా కలిసిమెలిసి-ఆడామగా అందరు కలిసి
జనశ్రేయమె ధ్యేయంగా- జగమంతా ఊగిపోగ

శరణుశరణు వినాయకా-శరణు కరిముఖా
శరణు ఏకదంత పాహి-పార్వతీ సుతా
పాహిపాహి విఘ్నేశా పాహి గణపతి
పాపములను తొలగింపగ నీవె మాగతి

Wednesday, June 17, 2009

ఎరుగని ఓ నగ్న సత్యం ప్రేమా- ఎరిగిన గూఢ రహస్యం ప్రేమా
తెలిసితెలిసీ జనులు ఎందుకో ప్రేమిస్తారు
సాఫీగ సాగే నావను సుడిలోన ముంచేస్తారు
1. ప్రేమ పుట్టుకనే ఎరుగం-ప్రేమ గిట్టుటనే ఎరుగం
నట్టనడిమి సంద్రంలో కొట్టుమిట్టాడుతునే ఉంటాం
ప్రేమ ఒక గమ్మత్తు-అనురాగమే మత్తు
మనచిత్తమన్నది చేయిజారితే భవిష్యత్తే చిత్తు
బయటపడలేని ఉబి ప్రేమైనా-త్రెంచుకోలేని వల ప్రేమైనా
తెలిసి తెలిసీ జనులు ఎందుకో దిగబడతారు
ప్రేమకొరకై మూర్ఖులు వెర్రిగా ఎగబడతారు
2. అందాల హంగులు ఉంటాయి
పరువాల పొంగులు ఉంటాయి
మనసు వయసూ ఎపుడూ దొంగాటలాడుతు ఉంటాయి
విధి వేచి చూస్తుంది-గారడీలు చేస్తుంది
పొరపాటుచేసి ప్రేమిస్తే మన పనిపడుతుంది
ప్రేమ సాలెగూడైనా-ప్రేమే ఉరిత్రాడైనా
తెలిసితెలిసీ జనులు ఎందుకో చిక్కడతారు
భగ్నమైన హృదయంతో బేలగా తలపెడతారు
3. మజ్నూల గాథలు వింటారు
దేవదాసు కథనే వింటారు
అనార్కలిని సమాధిచేయడం-అందరూ ఎరిగే ఉంటారు
కావ్యాలు చదివేస్తారు-కన్నీరు కార్చేస్తారు
తమదాక వస్తేనే కథ మళ్ళీ మొదలెడతారు
ప్రేమ గరళమే ఐనా- ప్రేమ నరకమే ఐనా
తెలిసి తెలిసీ జనులు ఎందుకో తాగేస్తారు
ప్రేమకొరకై అందరు ఎందుకో పడిఛస్తారు
ఆనందమనుకొని తామే వేదనను కొనితెస్తారు................................!!!??
ఊగవే ఊయల-పాడవే కోయిల
మామిడీ కొమ్మాపై-హాయిగా తీయగా
1. నాదాలు నీ గొంతులో-అపురూపమై విరజిల్లగా
రాగాలు నీ పాటలో-రసరమ్యమై రవళించగా
2. అరుదెంచెలే ఆమని- నీ గానమే విందామని
కురిపించెలే ప్రేమని-నీ తోడుగా ఉందామని
3. దాచిందిలే నీ కోసమే-చిగురాకులా అందాలని
వేచిందిలే పలుకారులు- అందాలు నీకే అందాలని

శబరీ భావన మెదలగనే-ఎదలో మొదలగు పులకరము
స్వామిని చూడగ తలవగనే-కన్నులయందున కల వరము

1. కొండలైదెక్కి కూర్చొని-దాల్చెనభయ ముద్రని
నవ్వుతు మొరలను విని-నెరవేరుస్తాడు మనవిని

2. తల్లిదండ్రి తానే శబరీశుడు-సద్గురువు తానే దేవదేవుడు
తోడు నీడ తానే మణికంఠుడు-వీడని స్నేహితుడు భూతనాథుడు

3. ఇరుముడి ప్రియుడే అయ్యప్ప-అభిషేక ప్రియుడే అయ్యప్ప
ఓంకార రూపుడు అయ్యప్ప-జ్యోతి స్వరూపుడు అయ్యప్ప
నీ మహిమ పొగడతరమా-షిరిడీశ సాయిరామా
నీ మాయలెరుగ వశమా-జగమేలు సార్వభౌమా
మూఢమతిని-మోక్షార్థిని-జోలె తెఱచి నీ వాకిట
నిశ్చయముగ సుస్థిరముగ విశ్వాసముగ నిలిచితి

1. మనిషి మనిషిలో నిన్నే ఎంచి చూడమంటావు
జీవరాశులన్నీ నీ ప్రతిరూపాలంటావు
సహజీవన సమభావన నువు చాటిన బోధన
మది నిండానువు నిండితె మనిషికేది వేదన

2. దీర్ఘకాల వ్యాధులన్ని చిటికలోన మాన్పేవు
సారమున్న చదువులన్ని క్షణములోన నేర్పేవు
నిత్యబిచ్చగాడినైన కుబేరునిగ చేస్తావు
గుండెలోని భారమంత చిరునవ్వుతొ తీస్తావు

3. అద్భుతాలనెన్నొ జేసి అబ్బురాన ముంచేవు
గారడీలనెన్నొ జూపి వశీకరణ జేస్తావు
మాయా జగమిదియని మా భ్రమలను తొలగిస్తావు
విభూతినీ మాకొసగీ మర్మము నెరిగిస్తావు
జయహో విఘ్నరాజా జయహో మహాతేజ
 జయ గిరిజాతనయ జయ మూషిక విజయ 

1. మును మాతృమూర్తి కోరిక మీరగ 
నిను పిండి బొమ్మలో మలచగ 
బ్రహ్మదేవుడే ఆయువు పోయగ 
వెలసిన దేవా మహానుభావ 

2. తండ్రినెదుర్కొన తనయుడవీవె 
భక్తగజాసుర శిరమందితివే 
దేవ గణములకు నేతవు నీవై
 వెలిగే దేవా గణాధిపా

 3. నిండుసభలోన నిన్నుజూడగా
 కొంటె చంద్రుడు పకపక మనెగా 
చవితి జాబిలిని జూచిన వారికి 
నీలినిందలను ఒసగుదువా 

4. అఖిలజగమునకు యధిపతి నీవే
 శుభముల మాకు కలుగజేయుమా
 నీదు పాదముల నెప్పుడు కొలుతుము
 విజయము నీయర వినాయకా
అనుక్షణం నా మదిలో- మెదులునులే నీతలపు
అదిపిలుపై మేలుకొలుపై- తెలుపునులే నావలపు
1. ఎదలోని ఊసులన్ని గాలితోటి కబురంపాను
నా ప్రణయ సందేశాలు మేఘాలకు అందించాను
అవి నిన్ను చేరులోగా -విరహాలు మదిలోరేగా
తాళలేక మానలేక మరిగిపోయాను-నేను
కన్నీరై కరిగిపోయాను
2. ఆకసాన నీవున్నావని -నింగికినే నిచ్చెన వేసా
నిన్ను చేరు ఆరాటంలో-విరిగిన నా రెక్కలు సాచా
స్వప్నాలు దూరమాయే-సత్యాలు భారమాయే
చావలేక బ్రతకలేక సతమతమై పోయా
నే జీవశ్చవమైనా
3. నీటిలోని ప్రతిబింబాలే -నిజమనినే భ్రమపడినాను
అందరాని సౌందర్యాలకు-అనవసరపు శ్రమపడినాను
కనుగీటితె మోసపోయా చిరునవ్వుకు బానిసనైన
ఇదే నేస్తం ప్రేమతత్వం బ్రతుకు సత్యం తెలుసుకున్నా
పొరపాటులు దిద్దుకున్నా
నా మది పాడిన ఈగీతం 
వేసవిలోనా హిమపాతం 
ఆశల శిఖరాల దూకిన జలపాతం 
అమితానందపు శుభ సంకేతం 

1. ఆకులు రాలే శిశిరములోనా 
ఆమని పాడే ఋతుగీతం 
విరహిణి చకోరి తృష్ణను తీర్చే 
జాబిలి పాడే అమృతగీతం 

2. మోడులనైనా చిగురింపజేసే 
తొలకరి పాడే జీవన గీతం 
యమునాతటిలో యెడబాటునోపక 
రాధిక పాడే మోహన గీతం 

3. ఏతోడులేని ఏకాకి కొరకే 
కోకిల పాడే స్నేహ సంగీతం 
ఎస్పందన ఎరుగని కఠినపు శిలకే 
ప్రణయము నేర్పిన పరవశ గీతం
మణికంఠ నీ దివ్య గీతార్చనం
స్వామీ మా మదిలోన దర్శింతుము
శబరీశ నీ భవ్య సంకీర్తనం
మైమరచి నోరార భజియింతుము
1. విఘ్నేశుడే నిన్ను రమ్మని ధ్యానించె
హిమవంతుడే హృదయాసనమందించె
అష్టదిక్పాలురే అర్ఘ్యపాద్యాలనిచ్చిరి
గంగమ్మ నిన్నింక జలకమ్ములాడించె
2. శ్రీలక్ష్మి వస్త్రాలు ధరియింపజేసే
గాయిత్రి యజ్ఞోపవీతమ్మునిచ్చె
గోవిందుడే నీకు చందనమ్ము పూసే
పరమేశుడే నీకు భస్మాన్ని రాసే
3. వాగ్దేవి కుసుమాల మాలలే వేసే
బ్రహ్మ-అగ్నిలు ధూపదీపాలు వెలిగించె
పార్వతీమాతయే నైవేద్య మందించె
నాగరాజు తాంబూలమిచ్చే-షణ్ముఖుడు హారతులు పట్టే
4. సప్తఋషులే వేద మంత్రాలు చదివిరి
నవగ్రహములు పాదసేవలు జేసిరి
నారదుడు తుంబురుడు గానాల తేల్చిరి
నందియూ భృంగియూ నాట్యాలు చేసిరి
ప్రేమ స్వరూప షిర్డీ బాబా
శాంతి ప్రదాతా హే సాయిబాబా
నీపదసేవ నిరతము జేసెద
కలలో ఇలలో నిను మది నమ్మెద
1. క్షణికానందము ఈ భవ బంధము
నీవే సత్యము నిత్యానందము
నీవే పావన గంగాతీర్థము
నీవే సాయి బ్రహ్మపదార్థము
2. పొరపాటుగను పొరబడనీయకు
అరిషడ్వర్గపు చెఱ బడవేయకు
పంచేంద్రియముల చంచల పఱచకు
మోహకూపమున నను ముంచేయకు
నిను నమ్మిచెడలేదు ఏనాడు
నిను అర్థించి నే భంగపడలేదు
వరదాభయ హస్త సిద్ధివినాయక
వేరెవరు నిను వినా దిక్కునాకిక

1. నీ మాయలే ఈ ఇహలోక సౌఖ్యాలు
నీ లీలలే కడు ఇడుములు బాధలు
చాలించవయ్యా ఈ వింత నాటకం
తెరిపించవయ్యా ప్రభో నా కనులు తక్షణం

2. నీ నామ గానాలు ముక్తి సోపానాలు
నీ అర్చనతొ సడలు భవబంధనాలు
అందుకోవయ్య నా హృదయాంజలి
ఆదుకోవయ్య నన్ను పరమ దయాంబుధి

Sunday, June 14, 2009

బాబా సాయి సాయి-సాయినామమే హాయి
ఎంతగ్రోలినా గానీ తనివిదీరదోయి
సాయిసాయి రామం-సాయిసాయి కృష్ణం
సాయిసాయితిరుపతి-శ్రీ వేంకటేశం
1. అంధులనిల నడిపించే శక్తిసాయి
మూఢులకును జ్ఞానమొసగు భక్తి సాయి
ఇహలోక చింతనమ్మౌ అనురక్తి సాయి
పరసౌఖ్య పరమార్థమ్మగు ముక్తి సాయి
సాయి సత్యము-సాయి శివము
సాయి దివ్యరూపమ్మే సర్వసుందరం
2. సత్కాలము నాకు సమీపించె గాబోలు
సాయినామమందులకే రుచియించెనోయి
గతజన్మలొ నేజేసిన పుణ్యకర్మ ఫలమేమో
సాయిప్రేమ నామీద కురిపించెనోయి
సాయి రాగము-సాయితాళము
సాయి కీర్తనమ్ములే సర్వజన రంజకం
ఓంకార నాదమూలం హంసధ్వని రాగం
శ్రీకార బీజారావం హంసానంది రాగం
అయ్యప్ప ఆరాధనం షణ్ముఖ ప్రియమే కాగా
మణికంఠ గీతార్చనం శివరంజనియేకాదా
1. స్వామి సుప్రభాతం పాడుతుంది భూపాలం
ధర్మశాస్త నభిషేకించు భీంపలాస్ రాగము
షోడషోపచారములు ఒనరించును హిందోళం
మంగళనీరాజనానికి తిలక్కామోద్ రాగం
2. వేదనా నివేదనం అర్పించును కానడ రాగం
వేదోక్త మంత్రపుష్పం అంజలించు రేవతిరాగం
సంగీత సేవ కోసం సాధన కళ్యాణి రాగం
ఆనంద నాట్యమునే అలరించును మోహన రాగం
3. స్వామి శరణం వేడాలంటే సింధు భైరవి
స్వామిభజన సేయాలంటే నఠబైరవి
స్వామి కటాక్షించుటకై హిందుస్తాన్ భైరవి
శయనగీతి నాలపించు ఆనందభైరవి

ఎలమావి తోటల్లొ ఎందెందు కోయిలా
దోబూచులాడేవు ఎందుకో-యిలా
అనురాగ రాగాల మురిపించనా
వాసంత గీతాల మైమరపించనా

1. వేచాను నీకై పలుకారులు
వేశాను నీకై విరిదారులు
వేసారెవేసారె నా జీవితం
ఓసారి కాదేల నీ దర్శనం

2. రాకాసి కాలం కసిబూనెను
కనరాని దైవం దయ మానెను
విరహాలు నాలోన విషమించెను
జవరాల జాగేల కరుణించను

3. చందురుని కోరే చకోరే నేను
స్వాతిచినుకునాశించే అల్చిప్పనేను
కానీకు నీ ప్రేమే ఎండమావి గాను
నిరీక్షణే నాపాల్టి ఆజన్మ శిక్షయ్యేను
మందారమే నీ అందము
మకరందమే నీ అధరము
నువు సయ్యంటెనే చెలి
నా జన్మ ధన్యము

1. నీ మేని మెరుపుకీ తగలేదు మేనక
నీ నాట్యహేలకీ దిగదుడుపే రంభ
నీ కాలిగోటికి సరిరాదు ఊర్వశి
జగదేక సుందరీ నీవేగ ప్రేయసి

2. గొంతులొ ఏవో ఇంద్రజాలాలు
కంటితొ వేస్తావు ప్రేమ గాలాలు
చిరునవ్వుతూనే గుండెగాయాలు
విరహంతొ తీస్తావు నా పంచప్రాణాలు
నమో నమో హే ప్రభో గౌరీ నందన
అని నువు భజించు మోక్షం తథాస్తు
విఘ్నాలే హరించు విఘ్నేశుని స్మరించు
కోరికలే ఈడేర్చు గణనాథుని స్మరించు
నీ కార్యం సిద్ధించు నిను విజయం వరించు

1. గడచిన ఏ క్షణము నీకు మరలిరాదుగా
దిరికిన ఈ నిమిషమైన వృధా సేయకా
కళ్ళు తెరవరా తొందరించరా
ఏకదంత పాహియని వేడుకొనుమురా

2. ఈ జగమే బంధాల సాలెగూడురా
అందులోన చిక్కెను నీ బ్రతుకు ఈగరా
అహము మరవరా పరమాత్మనెరుగరా
వినాయకా శరణు వినా వేరులేదురా

3. కరివదనుని మదితలచిన కరుణజూచురా
అంజలించి వరమడిగిన ప్రసాదించురా
కీర్తించరా మది ప్రార్థించరా
నోరారా భజన జేసి మోక్షమందరా

Friday, June 12, 2009

కలలన్ని కల్లలై కన్నీటి వరదలై
సాగింది గోదావరి- అది చేరేది మరియే దరి
1. కనలేదు ఏనాడు కన్నయ్య రూపు
వినలేదు ఏనాడు ఆ మురళి పిలుపు
లేవు భామాకలాపాలు
లేవు లీలావినోదాలు
తోడు కరువై బ్రతుకు బరువై ||సాగింది||
2. యమునకు దొరికిన అనుభూతి లేదు
రాధకు దక్కిన అనురాగమూ లేదు
ఓ కాకిలాగా ఏకాకిలాగా
శోకాలవానా ముంచెత్తిపోగా
ఆశ దోషమై బాస మోసమై ||సాగింది||
3. జీవితమే ఒక సాగరమాయే
అమృత జలమే విషతుల్యమాయే
గలగలరావాలు మూగవోయే
కమనీయ భావాలు శిథిలమాయే
మానలేని గాయమై తిరిగిరాని కాలమై ||సాగింది||
కలలన్ని కల్లలై కన్నీటి వరదలై
ఆగింది గోదావరి అది గతిలేని కడలిగ మారి

Thursday, June 11, 2009

నా మొర నాలించవయ్యా- నన్ను పరిపాలించవయ్యా
ఓ బొజ్జ గణపయ్యా-ఓ వికట వెంకయ్యా
1. ఆశల పాలిటి దాసులజేయకు
భవ బంధాలకు బానిసజేయకు
కలలో ఇలలో కైవల్యములో
నీ నామ స్మరణ మరువనీయకు
2. వేదము నీవే నాదము నీవే
నే నమ్మిన శ్రీ పాదము నీదే
ఆవేదనలో ఆనందములో
సదా నే చేయు ఆరాధన నీదే
3. పిలిచిన పలికే గిరిజానందన
కోర్కెల దీర్చే మూషిక వాహన
కరుణాంతరంగా ఓ వక్రతుండా
నీవే నాకిల కొండంత అండ
చిత్తము నీమీద స్థిరమగు రీతి
నన్నాయత్త పరచుము ఓ గణపతి
చెలగెటి నా మది చంచలమైనది
సంకెలవేయుము సరగున గణపతి

1. మాయాజగమిది క్షణభంగురమిది
ఎరిగీ చిక్కెడి రంగుల వలయిది
తాపత్రయముల బానిస మనసిది
శరణం శరణం నీవే నాగతి

2. మోహావేశము తీరని పాశము
నిలుపుము నా మది నీపై నిమిషము
జీవన సారము భవసాగరము
కడతేర్చుము నను కరుణతొ గణపతి

Wednesday, June 10, 2009


ఓ ప్రేయసీ!
భువికి దిగిన ఊర్వశీ
నిన్ను చూసి సౌందర్యానికి ఎంతటి జెలసీ
నీవేలే నా ప్రణయ గీతం
నీవేలేనా ఉషస్సరాగం
1. అందమైన సాయంత్రాలు
ఆర్ద్రమైన నీ నేత్రాలు
నేర్పు ప్రేమ తొలి పాఠాలు
తీర్చును మొహమాటాలు
నీవేలే నా ప్రణయ గీతం
నీవేలేనా ఉషస్సరాగం
2. నీ నవ్వుల గలగలలే
సెలయేరులు ఆశించు
నీ పలుకుల కులుకులకే
రాచిలుకలు తలవంచు
నీవేలే నా ప్రణయ గీతం
నీవేలేనా ఉషస్సరాగం
మనసైన చెలియలేక
నయనాల ఏరువాక
సాగింది శిథిలనౌక
తీరాన్ని చేరలేక
1. ఎనలేనిదీ ఈ మోహము
మనలేనిదీ విరహం
విధి వ్యూహం తీరదు దాహం
తీర్చదు ఏ ప్రవాహం
2. ఏ మ్మూఢమో ఆషాఢమో
దృఢమైన ఎద సడలే
అనురాగం అతి గాఢం
బంధించగా జాలం
3. ఈ గీతమే సందేశము
అందించవే మేఘం
కలిగించు రసయోగం
రసరాగ సంయోగం
రాగాలు చిలుక సరస హృదయ రమ్య వీణనూ
మ్రోయించువారు లేక నేడు మూగవోయెను
1. మధుమాసవేళ పాడుటకై కోయిలమ్మకూ
లేమావి చివురులేక నేడు అలమటించెను
2. బృందావనాన రాధకాలి అందె సవ్వడి
కనలేక మురళి కంటిలోన నిండెనే తడి
3. జాబిల్లి జాడ కననిబేల జీవజీవము(చకోరి)
గోదారివరద భంగి పొంగె గుండె శోకము

Tuesday, June 9, 2009

ఊహలలోనే నన్ను జీవించనీ
స్వప్నాలందే నన్ను విహరించనీ
రాలేనురాలేను రాజీల దారిని
భరియించలేను నేను నగ్నసత్యాలని
1. కళ్ళుతెరిస్తె ఏముంది-కనరానిచీకటి
మెలకువొస్తె ఏముంది-మెలితిప్పే ఆకలి
ఈ లోకపు కుళ్ళు రూపు-నేచూడలేను
ఈ వాడిముళ్ళదారి –నే నడవలేను
2. నా గుప్పిటి విప్పనీకు-గుట్టురట్టౌతుంది
ఈ ముసుగు జారనీకు-ముప్పువాటిల్లుతుంది
అతికించికోనీయి-పెదవుల చిరునవ్వులని
మైమరచి బ్రతకనీయి-వేదనాశ్రుధారలని
నీరాకతోనే నాఎద ఎడారే
మారింది పారే ఒక సెలయేరే
నీ ప్రేమతోనే నా బ్రతుకు మోడే
చిగురించె నేడే వేదనను వీడే
1. గాజుపూసలను చూసి-రత్నరాశులనుకొని భ్రమిసా
గార్ధభస్వరాలనే-అమరగానమనుకొని మురిసా
తెలిసింది నేడే మాణిక్యమంటే
ఎరిగించినావే మాధుర్యమంటే
2. కాగితం పూలెపుడూ-పరిమళాలు కూర్చవనీ
ఎండమావులెన్నటికీ-దాహాన్ని తీర్చవనీ
ఎరిగించినీవే గుండె మీటినావే
ఎదబీడులోనా ప్రేమనాటినావే
గుండెనిండ నీవేనయ్యా కొండగట్టు అంజయ్యా
మా అండ దండ నీవేనయ్యా రామభక్త హనుమయ్యా
వందనమిదె గొనుమయ్యా వాయుపుత్ర హనుమయ్యా
సుందరమూర్తీ స్వామీ అంజనిసుత అంజయ్యా
1. ఇలవేల్పువు నీవే మా కులదైవమూ నీవే
బుద్దెరిగిన నాటి నుండి ఇష్టదైవమూ నీవే
కష్టములే కలుగనీయవు-నష్టములే జరుగనీయవు
గ్రహపీడల హరియించి అనుగ్రహించేవు స్వామి
2. రామనామ స్మరణయన్న ప్రేమమీరజేసేవు
రామనామ గానమున్న మేనుమరచి ఆడేవు
రామపాదసేవకే అంకితమైనావు
శ్రీరాముని ప్రియసఖునిగ వన్నెకెక్కినావు
3. దంపతులకు ఎడబాటును తొలగించిన వాడవు
పునర్జీవితులజేయు సంజీవరాయుడవు
యుగయుగాల వెలుగులీయు చిరంజీవివైనావు
స్వామిభకిపరాయణకు తార్కాణమైనావు

Sunday, June 7, 2009

హనుమాన్ చాలీసా పారాయణము
అది సుందరకాండతో సరిసమానము
పావనినిల సేవించగ బ్రతుకు పావనం
మారుతియే కరుణించగ జన్మసార్థకం
1. ఉదయించే సూర్యుని కని కమ్మని ఫలమని
భావించిన మారుతి మ్రింగె బాల భానుని
గురువుకన్న ఘనుడగునని శిశ్యునిగా గైకొని
నేర్పెను రవి పావనికి వేద వేదాంగములని
2. కిష్కింద కాండలో స్నేహానికి సారథి
సుందరకాండలో విరహానికి వారధి
యుద్ధకాండలో కలహానికి ప్రతినిధి
జీవనకాండలో భక్తి దాహానికి తియ్యని జలధి
3. సింధూర ధారణతో శ్రీరాముడు వశమగునని
తలపోసిన కపివరుడది ఒళ్ళంతా పులుముకొని
తెలిపె మనకు భక్తిలోని పరాకాష్ఠ వైనముని
ఎరిగిమసలుకొన్నవారు పొందగలరు ముక్తిని
హనుమంతుని ప్రతిమ లేని ఊరుఊరేకాదు
రామనామ భజన అనని నోరునోరేకాదు
కపివరునికి ప్రియమైనది ఒకటే అది రామకథా
అష్టాక్షరి పంచాక్షరి సంకలనమె రామ కదా

1. కలియుగాన ప్రత్యక్ష దైవమే హనుమంతుడు
కలికల్మష నాశకుడే వీరాంజనేయుడు
భక్తిమార్గ భోదకుడే భక్తాంజనేయుడు
భక్తసులభుడేకాదా ప్రసన్నాంజనేయుడు

2. భూతాలనుప్రేతాలను దునుమాడును మారుతి
రోగబాధ సత్వరమే తొలగించును పావని
దారిద్ర్యము బాపేటి కేసరీ నందనుడు
వేదనలో ఓదార్చే శ్రీ రాముని ప్రియ సఖుడు
ఇంకేమి కోరను స్వామీ
నినువినా నా మనమునా
ఇంకేమి కోరను స్వామీ
1. ఇచ్చితివి నాకిల సుందర దేహము
అంతోఇంతో విజ్ఞానము
కడుపు నిండుటకు సరిపడు అన్నము
తలదాచుకొనుటకు చక్కని గృహము
2. పలికే ప్రతి మాట నీనామ మవనీ
తలిచే ప్రతి తలపు నీ భావమవనీ
వేసే ప్రతి అడుగు నీవైపె సాగనీ
చూసే ప్రతిచూపు నీరూపు నిలపనీ

త్రిపురసుందరీ మాత దండకం

ఏ పాద మంజీర నాదాలలో
జగతి పులకించి మైమరచునో
ఏ దివ్యతేజః పుంజాలలో
జనులు జ్ఞాన చక్షులు తెరచి తిలకింతురో
ఏ తల్లి కరుణార్ద్ర దృక్కాంతి ప్రసరించగా
జన్మ చరితార్థమగునో
ఏ అమ్మ చనుబాలు మృతసంజీవినీలై
మనిషి మనుగడను కాపాడునో
ఏ వదన వీక్షణామాత్రంబు
సర్వజన దుఃఖ పరిహారమగునో
ఏ దేవి నర్చింప
సకల సౌభాగ్య భోగములు లభియించునో
అట్టి వనశంకరీ దేవి
సింహవాహిని
డోలాసుర భయంకరి
పద్మాసని
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి
వాగ్దేవి
నన్ను నిన్ను సకల మానవాళిని
సదా సర్వదా రక్షించుగాక!
అమ్మా సరస్వతి నువ్వే నాగతి
నిన్నే నమ్మితి నిన్నే వేడితి
1. పుత్రుడైనందుకా నారదుణ్ని బ్రోచింది
ఆప్తుడైనందుకా తుంబురుణ్ని కరుణించింది
త్యాగరాజు నీకెలా బంధువో చెప్పవమ్మ
అన్నమయ్య నీకెలా అస్మదీయుడోనమ్మ
అందరూ నీకన్న బిడ్డలే కదమ్మా
నన్నింక చేరదీసి ఆదరించవేమమ్మ
2. వ్యాసుడే పూలతో పూజించె నిన్ను
వాల్మీకి నోచిన నోములేమిటందు
శంకరాచార్యుడెట్లు సేవించెనోగదమ్మ
పోతన్న పూర్వజన్మ పుణ్యమేమిటమ్మ
ఏరీతిగానిన్ను మెప్పించగలనమ్మ
చేజోతలర్పించి ధ్యానింతునమ్మా
3. కోరలేదు నిన్నునే కొండంత సిరులు
అడగలేదు నిన్నునే మేడలు మిద్దెలూ
అర్థించలేదులే పదవులు రాజ్యాలు
వాంఛించలేదమ్మ భోగభాగ్యాదులు
మేధలో గొంతులో నీవు కొలువుంటెచాలు
నీ పాద పద్మాల నందిస్తె కొదవే లేదు
ఇంతలోనే ఈ చింతలేల-వింతగా నీ కవ్వింతలేల
పులకింత-గిలిగింత దొరికాయని నీ చెంత
అనుకుంటే వెనువెంటే నా కంట నీరంట
ఇంతలోనే ఈ చింతలేల-ఇంతగా నీ పంతమేల
అలిసేంత ఆటంతా ఆడేది నావంతా
ఎపుడైనా ఎటులైనా-గెలిచేది నీవంటా
స్వామీ నీవె ఇక శరణం నాస్తి- స్వామీ నిన్నే మనసా స్మరిస్తి
1. ఎత్తుకోమని నిన్ను వేడుతుంటే-ఊబిలో దించేసి వెడుతుంటావు
ఎత్తునుంచి దించవయ్యా భయమని నేనంగలార్చినా
ఆనందం పొందే నీ మనసు మార్చునా
ఇంతలోనే ఈ బింకమేలా-అందుకేమైనా సుంకమియాలా
స్వామీ నీవె ఇక శరణం నాస్తి- స్వామీ నిన్నే మనసా స్మరిస్తి
2. గగనంలో జాబిల్లిని చూపిస్తావు-అద్దంలో చందమామనందిస్తావు
తాగేందుకు తగినన్ని నీళ్ళంటావు-
నడి సంద్రంలోన నన్ను వదిలేస్తావు
ఇంతగానీ పంతమేల-ఎంతకీదీనికంతు లేదా
స్వామీ నీవె ఇక శరణం నాస్తి- స్వామీ నిన్నే మనసా స్మరిస్తి
అంతలోనే వసంతమేలా-నీసొంతమైతే ఏ చింతలేల నాకు సాంత్వనేల
స్వామీ నీవె ఇక శరణం నాస్తి- స్వామీ నిన్నే మనసా స్మరిస్తి
వాయుపుత్రా నీకు వేయి దండాలు
లక్ష్మణప్రాణదాత నీకు లక్ష దండాలు
కొండగట్టు హనుమయ్యా కోటికోటి దండాలు
అంజనాదేవితనయ అనంతకోటి దండాలు
1. సంజీవరాయా నీకు సాష్టాంగ దండాలు
సీతాశోకనాశక చేతులెత్తి దండాలు
రామదూతా నీకు రాంగపోంగ దండాలు
కేసరీనందన నీకు పొర్లుడుదండాలు
2. పవనాత్మజానీకు పగడాల దండాలు
సుగ్రీవమిత్రా నీకు ముత్యాలదండాలు
చిరంజీవి హరీశుడా రత్నాల దండాలు
వాగధీశానీకివె వజ్రాల దండాలు
3. దినకరుని మ్రింగిన నీకు దినందినం దండాలు
ఘన సంద్రం దాటిన నీకు క్షణం క్షణం దండాలు
లంకగాల్చిన స్వామినీకు అడుగడుగు దండాలు
వనము కూల్చిన స్వామినీకు వంగి వంగి దండాలు
4. మనసెరిగిన మారుతీ మనసారా దండాలు
కరుణించే పావనీ తనివిదీర దండాలు
జితేంద్రియా నీకివే గొంతెత్తి దండాలు
పంచముఖీ ఆంజనేయ తలవంచి దండాలు

జయ కళ్యాణ గోపాల జయహారతి
జయ బృందా మనోహర శుభ హారతి
జయహే ముకుందా మంగళహారతి
జయ మురళికృష్ణయ్య కర్పూరహారతి
1. అష్టభార్యలను ఇష్టపడి
పరిణయ మాడిన వైనమునేగని
పదహారువేల గోప భామలను
ప్రాణప్రదముగ ప్రేమించావని
ఇచ్చితిమయ్యా మాఆడపడచుని
కళ్యాణమాడగ మాతులసిని
2. ఏటేట జరిపేము మీ కళ్యాణోత్సవం
కమనీయమిది బహు శుభదాయకం
కనులార దర్శించ మది పావనం
మనసార ప్రార్థించ అఘనాశకం
జయహే ముకుందా మంగళహారతి
జయ మురళికృష్ణయ్య కర్పూరహారతి

(గతంలో రాసినది-ప్రస్తుతానికి అప్రస్తుతమైనది)

(గతంలో రాసినది-ప్రస్తుతానికి అప్రస్తుతమైనది)
మరువకో మల్లన్న-ఒక మంచిమాట చెబుతున్నా
ఇనుకోయే రాజన్న-ఇవరమైన ముచట చెబుత
రాకరాక వచ్చెనట-సక్కనైన పథకమట
దక్కన్ గ్రామీణబ్యాంకుల-రైతన్నల కోసమట
నడిచిసూడు ఈ బాట-బతుకంతా పూదోట
ఈనెలతో ఆఖరంట-ఏగిర పడమంట
1. అప్పుడెప్పుడోనీవు అప్పులెన్నొదెచ్చావు
గ్రామీణబ్యాంకుకేమొ-బాకీ పడిపోయావు
వడ్డీమీద వడ్డీపడే-నడ్డిరిగీ మూలబడే
బాకీకట్టబ్యాంకుబోతె-కళ్లుదిరిగి కూలబడే
2. మనకోసమె వచ్చింది మామంచి పథకము
ఏడికో ఓకాడికి-తెగతెంపుల పథకము
వడ్డీలను మాఫిజేసి-ఖర్చులన్నిరద్దుజేసి
రెండుమూడుకిస్తుల్లైన-కట్టగలిగె పథకము
3. సన్నకారు చిన్నకారు రైతులకే ఈపథకము
స్వల్పకాలదీర్ఘకాల అప్పులకే ఈ పథకము
ఎగసాయఋణాలకే చెందినదీ ఈ పథకము
రైతన్నలనాదుకొనే-రంజైన పథకము
ఋణవిముక్తి పథకము
4. రెండువేలఒకటినాటి మొండిఅప్పుల వడ్డీ మాఫి
అటెనుక పెండింగైతె-వడ్డీలోన సగం మాఫి
ఎన్కబడ్డ బకాయిలకు-ఇతర ఖర్చులన్ని రద్దు
కడితె తీరు ఋణమిదే-మించి పోని తరుణమిదే
5. కోర్టుకెక్కిన బాకైనా-ఫరవాలేదంట
తాతల నాటి అప్పైనా-పథకానికి తగునంట
కన్వర్షన్ క్రాపులోను-కైనా వర్తించునట
పాతబాకి చెల్లిస్తే కొత్తబాకి దొరుకునంట

(ఒక సందర్భానికి మిత్రుల బలవంతం మీద కమర్శియల్ గా కూడ రాయగలననే పందెం మీద రాసిన పాట)

రాకరాక వచ్చెనేడు పండుగు- చిన్ననాటి దోస్తు కలిసినందుకు
ఆర్డరియ్యి వెంటనే మందుకు- గ్లాసులన్ని పెట్టవోయి ముందుకు
అందరం హాయిగా తాగెటందుకు-కమ్మనైన నేటి విందుకు
1. బాధలన్ని మరచిపోయె సమయమే ఇది
భాయిభాయి కలిసిపోయె తరుణమే ఇది
చిత్తుగా తాగవోయి చిందులేయగా మది
వూగిపోవాలిగా నా హృది-ఈ గది
2. ఎన్నడూ మరవలేని గురుతుగా మారనీ రాతిరి
ఎవ్వరూ జరుపుకోని రీతిగా సాగనీ పార్టీ
మందేమో గొంతులోకి వెళ్ళాలి- పాటలెన్నొ గొంతెత్తి పాడాలి
ఖుషీగా నషాగా వొళ్ళుతేలిపోవాలి –
మత్తుకే మత్తువచ్చి సొమ్మసిల్లిపోవాలి
3. సిగ్గులన్ని పక్కనెట్టి పెగ్గుమీద పెగ్గుకొట్టు
మధ్యమధ్య నాటుకోడి లెగ్గు కాస్త నోటబెట్టు
తుళ్ళితుళ్ళినవ్వుకొనే పచ్చిజోకులెన్నొజెప్పు
మళ్ళిమళ్ళినీ దోస్తుగ పుట్టకుంటె ఒట్టుపెట్టు


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:హిందోళం

సర్వము తానైనవాడు శ్రీగురుడు- సృష్టి స్థితి లయ కారకుడు
ఘటనా ఘటన సమర్థుడు- అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు
దీనుల పాలిటి కల్పతరువుగ ఖ్యాతిని పొందినవాడు
అతడే అతడే సచ్చిదానంద సద్గురు దత్తుడు

1. మాయామయమౌ జగత్తులో సత్యము తానైనవాడు
అజ్ఞాన గాఢ తమస్సులో జ్యోతిగ వెలుగొందువాడు
అజరామరమైన ఆత్మకు తానే అమృతమైనవాడు
ఆదిమధ్యాంతరహిత ప్రణవ స్వరూపుడు

2. కంటికి దొరకక అంతట నిండిన సర్వాంతర్యామి
తోలుబొమ్మల ఆటలాడే జగన్నాటక సూత్రధారి
త్రిగుణాలు గలిగిన త్రిమూర్తి తానే దత్తాత్రేయుడు
ఆడించి ఓడించి లాలించిగెలిపించె పితృదేవుడు

3. గొడ్రాలికి బిడ్డలనిచ్చినవాడు
మృతుడికి ప్రాణము పోసినవాడు
రజకుని సైతం రాజుగ మార్చిన మహిమాన్వితుడే గురుడు
పతితపావనుడు బుధ వంద్యుడు శ్రీపాద వల్లభుడు

4. మోడును చిగురింప జేసినవాడు
మేడికి మహిమలు కూర్చినవాడు
వొట్టిపోయిన గేదెకు దండిగ పాడిని ఒసగినవాడు
గురువులగురుడు తానే జగత్పతి నృసింహ సరస్వతి
సంగీత సాధనయే సాయుజ్య సాధనము
గానామృతపానముతో
నరులజీవనము-పరమ పావనము

1. పాడుకున్నా పాటవిన్నా-పరవశించేను మనసు
రాగమన్నా అనురాగమన్నా-పులకరించేను తనువు
లయతో లయమై మది తన్మయమై ఊగిపోయేను శిరసు
పదమే పథమై పరమ పదమై నాట్యమాడేను పదము

2. శిశువులైనా పశువులైనా-వశులుకారా పాటకు
నాగులైనా వాగులైనా -ఆగిపోవా పాటకు
కవితాఝరికి నాట్యపురికి-వారధి కాదా గీతము
స్వరమేవరమై సాగేవారికి-సారథికాదా సంగీతము

3. నారద మహతి తుంబురకళావతి పలికిన వైనం
గీర్వాణి కఛ్ఛపి నటరాజ ఢమరు మ్రోగిన యోగం
మోహనబాలుని పిల్లనగ్రోవిన వినబడిన శ్రావ్యం
అనుభవించి భవముమించి తరియించగ జన్మధన్యం
ఆనందమైతే వేణుగానము
ఆవేదనైతే వాయులీనము
కళ్యాణమైతే మాణిక్యవీణ
కలచెదిరిపోతే సన్నాయి పాట
1. రోదనతో మొదలయ్యేను జీవన సంగీతము
అమ్మలాలి పాటయే అద్భుత సంగీతము
ఆలుమగల కలహాలే సంసారపు సరిగమలు
పసిపాప రువ్వేనవ్వులె ప్రతి ఇంట్లో పదనిసలు
2. కొండవాగు పాడుతుంది గలగలల సరాగము
కోకిలమ్మ పాడుతుంది కుహూకుహూ గీతము
గుండె గుండె నినదిస్తుంది తనకుతానె స్పందిస్తుంది
అలసిసొలసి అంతలోనే మౌనగీతి వినిపిస్తుంది
స్వాగతమయ్యా మహాశయా! సుస్వాగతమయ్యా మహోదయా
ఘనతవహించిన ఘనులే మీరు-గణుతికెక్కిన మహనీయులు

1. మీరాకతోనే ఈ సభనేడు -పరిపూర్ణత సంతరించికొనెను
మిము దర్శించగ మామనసీనాడు-ఆనందముతో డోలలూగెను

2. మా ఆహ్వానము మన్నించిమీరు-పెద్దమనసుతో ఇట కేతెంచినారు
క్షణమైన తీరిక చిక్కనివారు-దయతో సమయము కెటాయించినారు

3. అరుణ తివాచీలు పరువగ లేము -పన్నీటిజల్లులు చల్లించలేము
పుష్పవర్షమును కురిపించలేము-కనకాభిషేకము చేయించలేము

4. ఏరీతిగ మిము సమ్మానింపగలము-ఏపదముల మిము కీర్తించతరము
ఉడుతాభక్తిగ వందన మిడుదుము-మీ కీర్తి గురుతుగ జేజేలు కొడుదుము
మా బాబు బంగారు కొండ
మా తండ్రి వజ్రాల కొండ
మముగన్న పగడాల దండ
నీకు పరమాత్ముడే అండదండ

1. నవ్వుతేనే ముత్యాల వాన
ముద్దుమురిపాలె రతనాలకోన
ఆటపాటల్లె వరహాల మూట
నోటి మాటలే తేనేల ఊట

2. నడయాడు నీవేర మానోము పంట
సిరిలొలుకు నువ్వేర మాకలల పంట
నీరాకతోనిండె వెన్నెలే మాఇంట
వెయ్యేళ్ళు వర్ధిల్ల దీవింతునంట

3. ఎక్కెకి నీవెందు కేడ్చేవు నాన్నా
ఊరుకోఊరుకో చిన్నారి కన్నా
వేదనలు బాధలు నీకేలనయ్యా
ఆదమరచి హాయిగ నిదురపోవయ్యా

చేజేతులారా చేసుకోకు నేస్తం
పండంటి సంసారం ప్రత్యక్షమైన నరకం
ఏమరుపాటుగా చేజారనీకు నేస్తం
పగిలితే అతకదు అద్దం-పదిలంసుమా జీవితం
1. మలుచుకుంటె ప్రతి బ్రతుకు-మణిదీపమై వెలుగు
మనసుంటె ప్రతి మార్గం-చేర్చేనుగా స్వర్గం
పట్టుదలే ఉలిగా చేసి భావి శిలను దిద్దుకో
ఓరిమితో గాలంవేసి ఎద చేపను పట్టుకో

2. నీడ చూసి బెదిరావంటే- వెలుగైనా భయపెడుతుంది
అనుమానం ముదిరిందంటే- అనుబంధం చెడగొడుతుంది
అనురాగపు రాగం పాడితె- నీ గీతం రసగీతం
ఆనందపు గుళికలు వాడితె-నీ రోగం మటుమాయం

మల్లెలు పూసే నా మదిలో
 అది ఏమాసమైనా మధుమాసమే 
వెన్నెలకాసే నా తలపులలో 
అమవసనిసిలోను ఆహ్లాదమే 

 1. లేనివెక్కడ లేమి వేదన 
కార్చనిదెవరిల కన్నీరు 
బాధే సుఖమను భావన కలిగిన 
జీవనమే కదా బృందావనము 

 2. చిరునవ్వుమాటున బడబాగ్ని దాగద 
హృదయాంతరాళాన ప్రళయ హేల 
విశ్వజనీనము అనురాగమైన 
రాగము ద్వేషము హాస్యాస్పదము 

 3. శాంతి సుఖము తృప్తియన్నవి 
అనుభూతికే కదా అందునవి
అందగ రాని చందమామను 
పొందగరాదా అద్దమునందున

వెళ్ళిరానేస్తం! వెళ్ళిరా వెళ్ళిరా(వీడ్కోలిదె వెళ్ళిరా)
నీ భవితన విరియాలి మురిపాలవెల్లిరా
మాయదారి ఈలోకం ఓ ఊసరవెల్లిరా
మనస్నేహం ఏనాటికీ వాడని సిరిమల్లిరా

1. బీరకాడ బీడీలు మావితోపు కబాడీలు
ఒకరిమీద ఒక్కరము చెప్పుకున్న చాడీలు
ఏటిలోన ఈతలు-కోతికొమ్మ ఆటలు
చిన్ననాటి మన చేతలు మధురమైన గాధలు

2. కోకిలమ్మ కూకూ అంటే నాపాటగ భావించుకో
పిల్లగాలి నిమిరిందంటే ఆలింగనమే అనుకో
వానచినుకు తాకిందంటే కరచాలనమని అనుకో
మేఘమాల మెరిసిందంటే నా కుశలం తెలుసుకో

3. ఏడాదికోమారైనా ఉగాదిలా కదిలిరా
జన్మకోశివరాత్రిగ మనమైత్రిని చేయకురా
ఏదేశమేగినగాని ఎందరెందరో నీకున్నగాని
మనచెలిమిని ఎన్నటికీ మరువనే మరువకురా

4. ఉత్తరాలు మోయలేవు గుండెలోని భావమంతా
ఉత్తమాటలెందుకులే మదినిండా నీవేనంటా
ప్రతికలయిక గమ్యము విడిపోవడమేనంటా
అనుభవానికొచ్చేవరకు చేదునిజమిది ఎరుగనంటా
మరణమా నీవింత దారుణమా
కారుణ్యమే ఎరుగని కాఠిన్యమా
కనురెప్పపాటులోనే కబళించు రక్కసివా
పండంటి బ్రతుకులనే బలిగొనే ఘోరకలివా
1. ఉప్పెనలూ భూకంపాలు నీసృష్టి కార్యాలు
రోగాలు ప్రమాదాలు నీ క్రౌర్య రూపాలు
క్షామాలు సంక్షోభాలు నీ కృపా కటాక్షాలు?
అనాధలూ అన్నార్తులూ నీదయావిశేషాలు
2. కన్నతల్లి గుండెకోత నీకద్భుత వినోదము
చిన్నిపాప కఠంశోషనీకమితమైన మోదము
పారాణి ఆరకముందే పతిని విడదీయుటనీనైజం
ముసలితల్లిదండ్రులదిక్కగు సుతుని ఎడబాపుట నీవైనం
3. కనులు విప్పిచూడని పాపను గొయ్యితీసి పూడుస్తావు
ఇపుడిపుడే ఎదిగే మొక్కను మొదలంటా పెరికేస్తావు
పడుచుజంట ఆశలనన్ని- చితిలోన కాలుస్తావు
అంతులేని వేదన మినహా నీవేమి మిగులుస్తావు
4. ఇపుడే మాటాడిన మిత్రుని-ఇట్టే నువు మాయంచేస్తావ్
చిరునవ్వుల మాలోగిలిని ఇంతలోనె నరకం చేస్తావ్
నూరేళ్ళ బంధాన్నిసైతం-నిమిషంలో నువు తెంచేస్తావ్
కన్నీటి వరదల్లోనా నిర్దయగా మము ముంచేస్తావ్
గమ్యమెరుగని ఓ బాటసారి
నువు పయనించే దారి ఎడారి
1. కనుచూపుమేరలొ కనిపించదేది
నీరు లేని సంద్రమురా అది
ఓపిక తగ్గి ఆశే ఉడిగి
ఏడ్వకముందే ఆలోచించర
2. ఎండమావులను నీటితావులని
భ్రమపడుతూ త్వరపడతావు
దప్పికగొన్ననీగొంతుకను
కన్నీటితోనే సరిపెడతావు
3. ఒంటెకాదురా నీ ఒంటరి బ్రతుకు
సాగలేదురా అది కడవరకు
ఎందుకురా ఈ రోదన నీకు
సరియగు దారి దొరుకును వెదకు
సంసార సంద్రాన మునిగేటి ఓ మానవా! దేవుడే శరణము
మనసేమొ అతి చంచలం-చేయర దేవుడికి మది అంకితం
నిన్ను నీవు తెలుసుకొనుటె నిజమైన తత్వము
1. సాటిమనిషికి సాయమునందించు
హరిసేవ అదియే సత్యము
మనిషిలొ దేవుని చూసినంతనె
కలుగును లేరా పరసౌఖ్యము
ఎందులకీ స్వార్థము-ఎరగర పరమార్థము
సర్వజనుల సౌఖ్యచింతనతొ సాఫల్యమొందేను నీ జన్మము
2. పరమాత్మ సన్నిదియె మానవుని పెన్నిధి అన్నది అద్వైతము
మట్టిమనిషిలో పిచ్చిప్రాణములొ-పరమాత్మ రూపము లభ్యము
మానవుని సేవలో- మహనీయుల త్రోవలో
చేరిపోర జీవన తీరము- చివర నీకు దేవుడె శరణము
జీవితమే పెద్ద హోరు
వయసే పారే సెలయేరు
ఎందులకీ బ్రతుపోరు
ఎపుడూ ఉంటుంది కన్నీరు
1. బాల్యమేమో బడిలోన మరిచేను
యవ్వనాన్ని చెలి ఒడిలోన విడిచేను
సంసార జీవనము చెరసాల సమము
వృద్ధాప్యమంతా వ్యధతోనె గడచును
2. ఏదో అందుకోవాలని ఆరాటం
తీరని కోర్కెల ఉబలాటం
దినదినము ఆకలి పోరాటం
అనుక్షణము మృత్యువు చెలగాటం
3. మంచిని త్రుంచి వంచన పెరిగెను
మనిషి మనసులో ఘర్షణ జరిగెను
నూరేళ్ళబ్రతుకున ఏమి ఒరిగెను
తత్వచింతనయె తరియింపజేయును
నీ ప్రేమ కోరిన జీవినేను
నీముందు నేను అల్పుడను
నీ దాసానుదాసుడను

1. శిలయైన మనసును శిల్పంగ మార్చేవు
శిల్పాన్నె చివరకు శిథిలాన్ని చేస్తావు
మనసుతోనే సయ్యాటలా ప్రభూ!
మనిషితోనే దొంగాటలా
2. అందనిఅందాలనెన్నో సృష్టిస్తావు
అందరికీ ఆశలు కలిగిస్తావు
భ్రమలనెన్నో కలిపిస్తావు ప్రభూ!
మాలోనిన్నే మరిపిస్తావు
గోదావరంటేనె నాకెంతొ ఇష్టం
మా వూరి(ధర్మపురి) గోదారి మరి ఎంతొ ఇష్టం
1. వాన చినుకే శైశవత్వంగా
పిల్లకాలువయే పసితనంగా
యవ్వనంతొ గోదారి ఎగురుతూ ఉరుకుతూ
కలిసిపోతుంది కదలిలో-రుచిని గతిని విడిచి
2. నిండుకుండవోలె గాంభీర్యముతో
అంతుతెలియని అంతరంగంతో
పదిమందికీ సాయపడుతుంది
ఫలితాన్నివారికే వదిలి వేస్తుంది
3. తనునర్పించి తానణిగి ఉంటుంది
ఆవేశమొచ్చెనా ఉప్పొంగి పోతుంది
మనిషి బ్రతుకునకు మచ్చుతునకలాగ
మహిలోనవెలుగును మణిపూసగా
4. గోదావరే నా జీవితానికి దారి
దానిహోరే నాకు జయభేరి
గోదావరే నాకు ఆదర్శనీయముర
వేదాలకన్నా పూజనీయమురా
నేనునేనని అంతా నాదని-ఎగురుటెందుకే మనసా
మూడునాళ్ళముచ్చట బ్రతుకని ఎరిగి మరతువే మనసా
1. శాంతి సుఖము తృప్తి యన్నవి ఎచటనొ లేవే మనసా
బ్రతుకుతోటి రాజీ పడుతూ-నందమొందవే మనసా
2. వెలుగువెలుగని వెతికేవు కాని-వెలుతురెందుకే మనసా
చీకటి వెలుగుల చిందులాటనే జీవితమన్నది మనసా
3. ప్రేమప్రేమనే పెనుగులాటలో రామునె మరతువె మనసా
చేసేది చేయక కూడనిది చేసి-చెడుదువెందుకే మనసా
4. గీతాబోధలు బ్రతుకు బాటలు-ఎరిగి ఎందుకే మనసా
ఆలోచనలతొ సతమత మయ్యి-హతమయ్యేవే మనసా
5. ఫలమును కోరక కృషిచేసిచూడు-విజయమునొందేవు మనసా
శ్రీవీరహనుమాన్ దయనీపైన-ఎప్పుడుయుండునె మనసా

ఈ లోకంలో నీ వొంటరివి

ఈ లోకంలో నీవొంటరివి
ఏనాడైనా ఏకాకివి
విశ్వమనంతం కాలమనంతం
అంతానేననే ఎందులకీ పిచ్చిపంతం
1. ఎవరెవరు నీవాళ్ళు ఎందాక స్నేహితాలు
ఎవరు హితులు- ఎవరు మిత్రులు
బెల్లముంటె సరి ఈగలు
నిజం మరచి నిదురోయేవు -ఏటిలోన మునిగేవు
లేనెలేదు స్నేహితత్వం-అసలులేదు మానవత్వం
సృష్టిలోని భ్రమలన్నిటికీ-ప్రతి మనిషీ బానిసత్వం

2. నేలవిడిచి సాములు- ఉత్త గాలిమేడలు
నూనెరాని గానుగలు-బ్రతికిన ఈ పీనుగలు
ఎవరురారు నీదారికి-నీకు నీవె మరి ఆఖరికి
భయపడకు ధైర్యం విడకు-ప్రతి క్షణము తొందర పడకు
ఎక్కరాని శిఖరాలైనా- చేరగలవు నీవే తుదకు