Sunday, June 7, 2009

సంగీత సాధనయే సాయుజ్య సాధనము
గానామృతపానముతో
నరులజీవనము-పరమ పావనము

1. పాడుకున్నా పాటవిన్నా-పరవశించేను మనసు
రాగమన్నా అనురాగమన్నా-పులకరించేను తనువు
లయతో లయమై మది తన్మయమై ఊగిపోయేను శిరసు
పదమే పథమై పరమ పదమై నాట్యమాడేను పదము

2. శిశువులైనా పశువులైనా-వశులుకారా పాటకు
నాగులైనా వాగులైనా -ఆగిపోవా పాటకు
కవితాఝరికి నాట్యపురికి-వారధి కాదా గీతము
స్వరమేవరమై సాగేవారికి-సారథికాదా సంగీతము

3. నారద మహతి తుంబురకళావతి పలికిన వైనం
గీర్వాణి కఛ్ఛపి నటరాజ ఢమరు మ్రోగిన యోగం
మోహనబాలుని పిల్లనగ్రోవిన వినబడిన శ్రావ్యం
అనుభవించి భవముమించి తరియించగ జన్మధన్యం

2 comments:

చిలమకూరు విజయమోహన్ said...

పామరులకైనా,బ్లాగరులకైనా అద్భుతం కాదా మి కవిత

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

కృతజ్ఞతలు ఇలాగే నా అన్ని పాటలు రచనలు మిమ్మల్ని స్పందింపజేస్తాయనే విశ్వాసంతో భవిష్యత్తులో కూడ మీ ప్రతిస్పందనయే నాకు స్ఫూర్తి అని తెలుపుతూ
మీ స్నేహాబిలాషి
రాఖీ