Sunday, June 7, 2009

అమ్మా సరస్వతి నువ్వే నాగతి
నిన్నే నమ్మితి నిన్నే వేడితి
1. పుత్రుడైనందుకా నారదుణ్ని బ్రోచింది
ఆప్తుడైనందుకా తుంబురుణ్ని కరుణించింది
త్యాగరాజు నీకెలా బంధువో చెప్పవమ్మ
అన్నమయ్య నీకెలా అస్మదీయుడోనమ్మ
అందరూ నీకన్న బిడ్డలే కదమ్మా
నన్నింక చేరదీసి ఆదరించవేమమ్మ
2. వ్యాసుడే పూలతో పూజించె నిన్ను
వాల్మీకి నోచిన నోములేమిటందు
శంకరాచార్యుడెట్లు సేవించెనోగదమ్మ
పోతన్న పూర్వజన్మ పుణ్యమేమిటమ్మ
ఏరీతిగానిన్ను మెప్పించగలనమ్మ
చేజోతలర్పించి ధ్యానింతునమ్మా
3. కోరలేదు నిన్నునే కొండంత సిరులు
అడగలేదు నిన్నునే మేడలు మిద్దెలూ
అర్థించలేదులే పదవులు రాజ్యాలు
వాంఛించలేదమ్మ భోగభాగ్యాదులు
మేధలో గొంతులో నీవు కొలువుంటెచాలు
నీ పాద పద్మాల నందిస్తె కొదవే లేదు

No comments: