Sunday, July 26, 2009

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:సిందుభైరవి

తులసి దళం వేస్తేనో-శంఖులోన పోస్తేనో
అవుతుంది ఏ జలమైనా తీర్థము-ఈ మాయ లోకంలో
మర్మమెరిగితేనే పరమార్థము

1. కాషాయం కట్టి చూడు కాళ్ళకు మొక్కేస్తారు
విభూతినే పెట్టిచూడు విప్రవర్యుడంటారు
వేషాలకున్న విలువ వాస్తవాని కెక్కడిది
అషాఢభూతులకే అందలం దక్కెడిది

2. వెనక నుండి వెయ్యి పోయినా లెక్కచేయరు
కళ్ళముందు కాసు పోయినా కలవర పడతారు
కుళ్ళి కంపు కొడుతున్నా అత్తరు చల్లేస్తె చాలు
అంతరంగ మేదైనా నవ్వులు చిందిస్తె మేలు

3. మౌనాన్ని ఆశ్రయించి మునిలా ముసుగేయవచ్చు
మాటకారి తనముంటే ప్రవక్తలా బోధించవచ్చు
ఏ ఎండకా గొడుగు పట్టగలుగుడేనా లౌక్యం
మోసమో విశ్వాసమో తేల్చుకో ఏదో ముఖ్యం

No comments: