Saturday, July 25, 2009

గంగమ్మదేకులమురా శంకరా
సిగన యుంచుకొంటివా
గిరిజమ్మ దేజాతి రా
సగభాగము నిస్తివా
1. శీలమే లేదన్న శశాంకుడినీ నీవు
శిరము నెక్కించు కొంటివా
తీరికే లేనట్టు కోరికే లేనట్టు
నీ జుట్టు జడలు కట్టేనేమిరా
2. జగములను కాల్చేటి బడబాగ్నినీ నీవు
కంటి యందుననుంచు కొంటివా
ప్రాణాలు తీసేటి కాలకూటమును నీవు
కంఠమందున నుంచు కొంటివా
3. చూపులోనా భయము గొలిపెడి
పాములా నీకు కంఠహారాలు
తలపులోనా వొళ్ళు జలదరించేటి
శార్దూలచర్మమా నీదు వస్త్రమ్ము
4. చోటెచట లేనట్టు అది తోటయైనట్టు
శవవాటిలో తిరిగేవురా-కాటితో పనియేమిరా
వేడినసలోపలేనట్టు-అది వేడుకైనట్టు
మంచుకొండన ఉందువేరా-చలి ఇంచుకైనా వేయదారా
5. నంది నీ వాహనమ్మా
భృంగి నీ సేవకుండా
రక్కసులె నీ భక్తులా
భూతగణములె నీకు సేనలా
6. గజముఖుడే సుతుడు
షణ్ముఖుడె ఆత్మజుడు
ఆంజనేయుడు నీ అవతారమా
ఈ రాఖీని బ్రోవగా భారమా
7. లక్ష్యమే లేని భిక్షగాడివి నీవు
మోక్షమ్ము నిచ్చేటి జంగమ దేవరవు
ఆది అంతము లేని అంతరంగము నీది
ఉండిలేనీ స్ఫటిక లింగరూపము నీది
8. రూపు చూస్తే భోలా శంకరుడవు
పిలువగనె పలికేటి దేవుడవు నీవు
కోపమొస్తే ప్రళయ కాల హరుడవు
లయ తాండవము జేయు రుద్రుండవు

No comments: