Friday, July 24, 2009

మరచితివే మము మహదేవీ
మహిషాసుర మర్ధినీ
మహిమ జూపవే మరియొక సారి
నీదునామము జపియించు దేశమును
నీ ఆలయాలు గల ప్రదేశమును
నీ మహోత్సవ శుభ సమయాన
నీ దివ్య ధామమును ఈ దీనజనులను

1. మహిషులెందరో కైటభులెందరొ
శుంభనిశుంభుల వారసులెందరొ
మదము మీరి విర్రవీగి దీనజనుల నణగద్రొక్కి
పైశాచిక నృత్యము చేయువేళ||మరచితివే||

2. అజ్ఞానమున అల్లాడుజనులు
వివేచన లేని నిరక్షరాస్యులు
నీ కృప గనని విద్యాసక్తులు
ఆదరణలేని కళాకారులు
ఎందరెందరో ఉందురందువే శరదిందు వదనే భారతీ

మరచితివే మము వాగ్దేవి
వీణా పుస్తక ధారిణీ
మహిమజూపవే మరియొకసారి

3. దారిద్ర్యము తాండవమాడే
చోరత్వము శివమెత్తిపాడే
ఋణము’లే దా’రుణములాయె
ౠక’లే కా’రణములాయే
ఎందుకీరీతి జరిగెనో మరి
నీకు తెలియదే రమా సుందరి

మరచితివే మము శ్రీ దేవి
మా నరసింహుని హృదయేశ్వరి
మహిమజూపవే మరియొక సారి

No comments: