Sunday, August 30, 2009

ఆడకు నాతో సయ్యాటలు
ఎందుకు స్వామీ దొంగాటలు
నీ మాటలు నీటిమూటలు
నీ పాటలు గాలిపాటలు
1. అది ఇది ఇమ్మని అడిగానా నిను
వెంటబడి వేధించానా నిను
ప్రలోభాలే నీ ప్రతాపాలు
అడియాసలే కద నీ’వి వరాలు’
2. మెదటే మరి చిత్తచాంచల్యం
అవధులెరుగని వింతనైజం
బరిలోత్రోసి వినోదించకు
నగుబాటుజేసి ఆనందించకు
3. మోహాస్త్రాలను సంధించకు
అనుబంధాలతొ బంధించకు
సమ ఉజ్జీలే లభియించలేదా
నాతో ఎందుకు నీ సరదా

Saturday, August 29, 2009

కోకిల నీ గొంతులో గూడుకట్టుకున్నది
చిలుకలు నీ పలుకులలో కులుకులొలుకుతున్నవి
హంసలే నిను చూసి నడక నేర్చుకున్నవి
మయూరాలు నాట్యానికి నీవే గురువన్నవి
1. జాబిల్లి నిను చూసి మొహం మాడ్చుకున్నది
గులాబీలు నీకన్నా సుకుమారులు కావన్నవి
సన్నజాజికి నిన్ను చూసి కన్నుకుట్టుతున్నది
వెన్నముద్దనీ మనసుకన్న మెత్తనవాలనుకొన్నది
2. చల్లగాలికన్న నీ స్పర్శనే హాయి కదా
పట్టుతేనె కన్న నీ పెదవులే తీయనా
భోగిమంటకన్న నీ కౌగిలే వెచ్చనా
సుగుణాలరాశివె చెలి నిన్ను చూసి మెచ్చనా
3. నీ సాన్నిహిత్యమే నాకు సాహిత్యము
నీ రూపలావణ్యము శిల్పకళాచాతుర్యము
వరముగనే పొందాను నీ సజీవ చిత్రము
నీతో నా జీవితమే అమర సంగీతము

Tuesday, August 25, 2009

ఏడాదంత చూస్తుందీ-జాబిలమ్మ రాకకై
కార్తీక మాసంకోసం- చకోరి తను విరహిణియై
రెప్పవాలి పొనీకుండా-తిప్పలెన్నొ పడుతుంది
కళ్ళుకాయలే కాసిన-పట్టువిడవ కుంటుంది

అనుకున్న క్షణమేదో అంతలోనె వస్తుంది

కలగన్న ఆసమయం ఆసన్న మవుతుంది
మనసు పరవశించేలోగా మబ్బేదొ కమ్మేస్తుంది
వెన్నెల విరజిమ్మేలోగా రాహువైన కబళిస్తుంది
తీరేనా చిరకాలకోరిక-చిన్నారీ ఓ చకోరిక
తోడు నీడ నీ కెవరికా-ఆ సంగతి దేవుడికెరుకా

చుక్కలెన్నొ చూస్తుంటాయి-చంద్రకాంతమా అది ఏకాంతమా
కలువలెన్నొ కవ్విస్తాయి-చక్రవాకమా పిచ్చిమాలోకమా
సందేశం చేరేలోగా-తెల్లారిపోతుంది
సందేహం తీరేలోగా- అమావాస్య వస్తుంది
తీరేదెలా బాలా నీదాహం-సైచే దెలా బేలా ఈ విరహం
శశిరేఖ నీకెపుడూ బహుదూరం-తరగదెపుడు నేస్తమా నీ ఎద భారం

Monday, August 24, 2009

గాలి తెమ్మెరవో
వాన తుంపరవో
విరుల రెక్కలపై మెరిసే-తుషారమే నీవో
1. శీతాకాల వేకువలో –లేత రవి కిరణం నీవో
నీలాల గగనంలో-వశీకర శీకరమీవో
ఇంద్రచాపము నీవో-చంద్రాతపమువో
మండువేసవి ఎండలోనా-ఆపాత జలపాతం నీవొ
2. నా ఎడారి దారిలోనా-ఒయాసిస్సు నీవో
శార్వరమౌ నిశీధిలోనా-తొలి ఉషస్సు నీవో
సెలయేరు నీవో-సుమకారు నీవో
మత్తులోన ముంచెత్తే-క్రొత్త క్రొత్తావివి నీవొ
3. నాలోని ఊహలకు- ప్రతిరూపం నీవో
నా గుండె గుడిలోనా-ప్రియదైవ మీవో
భువిలోన కలవో-నా తీపి కలవో
ఎన్నళ్ళుగానో మదిలో’కల’వరమగు కల కలమీవో

Sunday, August 23, 2009

ఎన్నిజన్మలు ఎత్తినగాని మాయమ్మా
నన్నుకన్నఋణమును తీర్చుకోలేను మాయమ్మా
ఏ జన్మలోని పుణ్యమో ఇది మాయమ్మా
నీ గర్భవాసపు భాగ్యమన్నది నమ్మవమ్మా

1. చిన్ననాట నాకెన్ని ఊడిగాలు చేసావో
కొన్నికొన్ని నాకింకా గుర్తున్నాయమ్మా
నా మలమూత్రాలు ఓకారమనుకోలె ఓయమ్మా
రోగాల్లొ రొష్టుల్లొ వేసటపడలేదు మాయమ్మా
కంటిపాపవోలె కాచుకుంటివీ ఓయమ్మా
యువరాజులాగ పెంచుకుంటివీ మాయమ్మా

2. దాచుకున్న ఆచిల్లర కూడ -కోరగానె నా కిచ్చేదానివి
కలుపుకున్న నీ ముద్ద కూడ- ముద్దుచేసీ పెట్టేదానివి
కొండమీది కోతైనగానీ ఓయమ్మా
అర్దరాతిరి అడిగిన గాని ఇచ్చావమ్మా
నీ ప్రేమను పోల్చే సాహస మెప్పుడు చేయబోనమ్మా
నిన్నుమించి ఏదైవానికైనా మొక్కను మాయమ్మా

3. నీతి కథలే నీనోట నేర్చుకున్నాను
వీరగాధల నొంటబట్టించుకున్నాను
లాలిపాటల మాధుర్యాన్ని గ్రోలాను
నీ ఒడిలో ఊయలలే ఊగాను
నేనింత వాణ్ణి అయినానంటే ఓయమ్మా
చల్లనైన నీ దీవెన వల్లనె మాయమ్మా

4. పైన భావన కనరాదు గాని మాయమ్మా
గుండెనిండా నీవే నిండినావమ్మా
చెప్పడానికి భాష చాలదు ఓయమ్మా
నా ప్రేమ సంగతి నీకు మాత్రం తెలియందా
ముందెన్ని సార్లు పుట్టినగాని మాయమ్మా
కమ్మనైన నీ కడుపులోనె కాస్త చోటివ్వు

5. పరమాత్మకూడ కోరుతాడు పత్రం పుష్పం
వెతికి చూసినా కాసింత దొరకదు నీలొ స్వార్థం
అమ్మ ఉన్నతి సంగతినెరిగి పరబ్రహ్మా
భూమిమీద ఎన్నెన్ని సార్లు ఎత్తాడొ జన్మా
గొప్ప గొప్ప కవులెందరొ ఓయమ్మా
అమ్మ గొప్పను చెప్పజాలరు మాయమ్మా

Saturday, August 22, 2009

ఎడారిలో నేనున్నా-గొంతే తడారిపోతున్నా
పిలిచాను నిన్ను ఎంతో పిపాసతో
నిలిచాను నేను నీపై ఆశతో-నీ మీది ధ్యాసతో
బిగబట్టిన శ్వాసతో
1. ఎంతగానో వెతికాను-ఒయాసిస్సు కోసమని
పరితపించి పోయాను-వాన చినుకు రాకకని
ఎండమండి పోతున్నా-నిలువ నీడలేకపోయె
కనుచూపు మేరలోన-గరికపోచ లేకపోయె
ఏదారీ లేదు గమ్యమెలా చేరను
చుక్క నీరు లేదు దాహమెలా తీరును
2. కరువు తీరి పోవుటకై-మేఘమథనం చేయుదునా
మృగతృష్ణ కొరకైనా సరె-వరుణయాగం చేయుదునా
ఘనఘనములుబోలునీకురులు-దాటేనొకవైపు హిమవన్నగములు
గగన సమములు నీ శిరోజములు-ఢీకొనునటు మేరు జఘనములు
భ్రమయనుకోనా సంభ్రమమనుకోన-శివ ఝటాజూట భగీరథివను కోనా

Friday, August 21, 2009

దక్షిణ వాహిని గోదావరి -అపర పంపానది
గూడెంకొండయే తెలుగునాట- అభినవ శబరిగిరి
కొలువైఉన్నాడు కొండలరాయుడు-అయ్యప్పా
శరణన్న స్వాముల కరుణించేస్వామి-శ్రీ ధర్మశాస్తా
1. దీక్షలు గైకొని మోక్షము నందండి
మాలను ధరియించి ముక్తిని జెందండి
నిష్ఠను పాటించి కైవల్యమొందండి
స్వామిని దర్శించి సాయుజ్యమొందండి
2. ఇరుముడి తలదాల్చి పరుగున రారండి
మాతాపితరుల ఆశీస్సులందండి
గురుస్వామి దీవెనలు మనసార పొందండి
స్వామి శరణుఘోష నోరార చేయండి
3. ఎరుమేలి వేరేల పేటైతుళ్ళికి
ఎనిమిది మైళ్లు వెళ్లరే ధర్మపురికి
విఘ్నాలు తొలగించ కొలువుడట గణపతిని
దీక్షపరిపూర్తి జేయ చేరుడు గూడెం గిరిని
4. కరదీపికలను వెలిగించండి
హృదయ నివేదన అర్పించండి
ప్రాణ జ్యోతుల హారతులివ్వండి
జ్యోతిస్వరూపుని ఆత్మన దర్శించండి
ఓ పరమాత్మా !ఓ పరమ పితా
ఏ పేరని నిను పిలువనురా - నామాలన్నీ నీవే ఐతే
ఏ చోటని వెదకనురా - సర్వాంతర్యామి వైతే
చూసిందేమని ఈ మోహం – తెలిసిందేమని ఈ వింత దాహం

1. నీవున్నావనునది నిత్య సత్యం
నీ అనుభూతులు నిత్య కృత్యం
గాలివి నీవై నా సేద దీర్చేవు
నీరువు నీవై నా తృష్ణ దీర్చేవు
నీ రూపమేదో ఎరుగకున్నను
అపురూపమే ప్రభూ నీ భావనలు

2. మన మధ్యనున్నది ఏ అనుబంధం
ఏ జన్మలోనిది మన సంబంధం
నను నడిపించే ఓ మార్గదర్శీ
నను పాలించే ఓ చక్రవర్తీ
నాకు తెలిసింది నీ ఆరాధనయే
నా ధ్యాన మంతా నీ సాధనయే

3. నాకు వలసింది నీకెరుకలేదా
నన్నుడికించుటయే నీ సరదా
ఇద్దరమూ వేరు వేరైతెనే కద
అత్మ పరమాత్మ అద్వైతమేకద
త్వమేవాహం స్థాయి దాటితే
విశ్వనినాదం సోహం సోహం సోహం

Thursday, August 20, 2009

హరి హరులిద్దరి ముద్దుల తనయా అయ్యప్పా
ఇద్దరి నుండి అద్దరి జేర్చుము అయ్యప్పా
మద్దెన ఉన్నది పెద్దది జలధి సంసారం
ఈత రాదు ఏ ఊతలేదు చేర్చగ తీరం నీదే భారం
1. నీ దీక్షయనే నౌకలొ నాకు చోటివ్వు
మోక్షపు గమ్యం శబరిమలకు నను రానివ్వు
మాల ధారణం నీ నావకు ప్రవేశపత్రం
రుసుమివ్వగ నా వద్ద గలవు నియమాలు మాత్రం
2. ఇంద్రియమ్ములే తిమింగలాలు స్వామీ
అహంకారమే పెద్ద తుఫాను అణిచేయవేమి
చిత్తమనేదే నీ నావకు విరగని చుక్కాని
శరణు ఘోషయే పడవకెప్పుడు చిఱగని తెఱచాప
3. మకరజ్యోతియె ఆ తీరపు దీపస్తంభము
పదునెనిమిది మెట్లే పడవకు గట్టుకు వంతెన
ఇరుముడి దాల్చగ అదియే కాదా స్వామీ లంగరు
నౌకను చక్కగ తీరం చేర్చే స్వామీ నీవే సరంగువు

Wednesday, August 19, 2009

కాంతిమలన కనిపించే మకర దీపం
అయ్యప్ప స్వామి దదే ప్రత్యక్ష రూపం
ఒక్కసారి దర్శిస్తే తొలగు నేడు జన్మల పాపం
పద్దెనిమిది సార్లు చూస్తె దొరుకు బొందితో స్వర్గం
1. సంక్రాంతి పర్వదినము చక్కని ఆ సాయంకాలం
కోట్లమంది స్వాములు కోరుకునే దా దృశ్యం
నయనాల ప్రమిదలలో తన్మయపు నెయ్యి వేసి
భక్తి వత్తితో స్వాములు దృగ్జ్యోతిని వెలిగింతురు
2. తిరువాభరణములే పందళ నుండి కొనితేగా
అయ్యప్పకు సుందరముగ అలంకారమే చేయగ
గరుత్మంతుడాతృతగా విను వీథిలొ తిరుగాడగ
తూరుపునా పొడసూపును ఉత్తరా నక్షత్రం
3. బిగబట్టిన ఊపిరులతొ స్వాములు ఉద్వేగమొంద
అల్లార్పని రెప్పలతో కన్నులు ఆరాటపడగ
గుండెల చప్పుడొక్కటే శరణుఘోష యనిపించగ
అప్పుడు అగుపించును ముమ్మారులు దివ్యజ్యోతి
స్వామి మకరజ్యోతి
స్వామియే శరణం అయ్యప్పా!!!!!!!!!!!!

Tuesday, August 18, 2009

పట్టితి నీ పాదముల స్వామీ-తల పెట్టితి నీ పాదముల
వేడితి నీ చరణముల స్వామీ –పాడితి నీ శరణముల
1. భువనాలు కొలిచిన భవ దివ్య పాదాలు
బలి మదము నదిమిన నీ భవ్య పాదాలు
గుహునికి చిక్కిన అపురూప పాదాలు
ధృవునికి దక్కిన అసమాన్య పాదాలు
2. గంగానది జన్మ దాలిచిన పాదాలు
బ్రహ్మ కడిగిన భాగ్యమౌ పాదాలు
ఇంద్రాది దేవతల కందనీ పాదాలు
మాలధారులు పొందు మహితమౌ పాదాలు
3. అన్నమయ్యకు ఆర్తి దీర్చిన పాదాలు
రామదాసుకు రక్తి కూర్చిన పాదాలు
త్యాగరాజుకు ఎంతొ ప్రియమైన పాదాలు
రాఖీ స్వామికి వరమైన పాదాలు
వేదనలు బాపేస్వామికి వేయి హారతులు
మోక్షమిచ్చె స్వామికివే లక్ష హారతులు
కోరికల దీర్చే స్వామికి కోటి హారతులు
శబరి గిరీ వాసునికివె శతకోటి హారతులు
1. మహిమ గల స్వామికివే మంగళ హారతులు
కరుణ గల స్వామికి కర్పూర హారతులు
వన్ పులి వాహన స్వామికివే నక్షత్ర హారతులు
హరిహర ప్రియ తనయునికివె హృదయ హారతులు
మా ప్రాణ జ్యోతులు
2. దయగలిగిన ధర్మశాస్తకు అక్షర హారతులు
కృపగలిగిన అయ్యప్పకు నృత్య హారతులు
ప్రేమ గల్గిన పందళయ్యకు గీత హారతులు
వీరమణికంఠ స్వామికి వేద హారతులు
మా జ్ఞాన జ్యోతులు

Monday, August 17, 2009



అనురాగం రంగరిస్తా-కరతాళం మేళవిస్తా
రమ్యమైన నీ గీతము ధర్మశాస్తా
తన్మయముగ నేనాలపిస్తా

1. నవనాడుల వీణలు మీటెద
ఎదమృదంగమే వాయించెద
భవ్యమైన నీ భజనయె అయ్యప్పా
పరవశముగ నే చేసెద

2. నా నవ్వులె మువ్వల రవళి
నా గొంతే మోహన మురళి
మధురమైన నీ పాటనె మణికంఠా
నాభినుండి నేనెత్తుకుంటా

3. శ్వాస వాయులీనం చేస్తా
గుండె ఢమరుకం నే మ్రోయిస్తా
పంచప్రాణ గానమే భూతనాథా
స్వామి అంకితమే నే జేసెద

Sunday, August 16, 2009

నువు చేయి సాచితే-ఒక స్నేహగీతం 
మరులెన్నొ రేపితే- ఒక ప్రణయగీతం 
కనిపించకుంటే ప్రతి క్షణమూ-ఓ విరహ గీతం 
కరుణించకుంటే నా బ్రతుకే-ఓ విషాద గీతం 

1. నీ పరిచయమే – నాభాగ్య గీతం 
నీ సహవాసమే-మలయపవన గీతం 
నీ చెలిమితోనే-ఒక చైత్ర గీతం 
నువు పలికితేనే-మకరంద గీతం 

2. నీ స్వరములోనా –ఒక భ్రమర గీతం 
నీగానములో -కలకోకిల గీతం 
నీ నిరీక్షణలో-చక్రవాక గీతం 
మన అనురాగమే –క్రౌంచ మిథున గీతం 

3. నీ భావములో-రాధా కృష్ణ గీతం
 నీ ధ్యానము లో-మీరా కృష్ణ గీతం 
నీ వియోగములొ-సీతారామ గీతం 
మనవిచిత్ర మైత్రియే-శుకశారిక గీతం
షోడషోప చారములివె శోభన మూర్తీ
మూఢభక్తి భావనలివె మంగళమూర్తీ
గీతాల అర్చనలివె స్వామి భూతనాథా
అక్షరముల పూజలివే ధర్మ శాస్తా
1. మోహమునే వదిలింపగ నాదేహము నావహించు
అహంకార మణిచేయగ నా హృదయము నధిష్ఠంచు
నయనమ్ములు చెమరించగ అర్ఘ్యపాద్యాదులందు
ఆగకుంది కన్నీరూ...స్వామీ అభిషేకమందు
2. నేచేసెడి స్తోత్రాలే వస్త్రాలుగ ధరియించు
నా బుద్దిమాంద్యమ్మును జందెముగా మేను దాల్చు
భవబంధం సడలించగ శ్రీ గంధం పూయుదు
అలకనింక తొలగించి తిలకమిదే దిద్దుదు
3. కరకమలములివె స్వామీ పుష్పాలుగ స్వీకరించు
పాపాలను దహియించి-ధూపదీపాలనందు
నాబ్రతుకే నైవేద్యం-నాచిత్తం తాంబూలం
అందుకో ప్రాణజ్యోతి అదియే నీరాజనం
చెమరించె నయనమ్ములు –మణికంఠ కనిపించు నాకోసము
ఆనంద భాష్పాలతో అయ్యప్ప- చేసెదను అభిషేకము
1. లోపాలు మినహా పాలేవి స్వామీ-క్షీరాభిషేకానికి
పెరుగనీ హృది ఉంది పెరుగేది స్వామీ అయ్యప్ప నీ దధి స్నానానికీ
బంధనాలె గానీ గంధాలు లేవయ్య చందనాభిషేకానికీ
అస్మాకమే గాని భస్మాలు లేవయ్య భస్మాభిషేకానికీ
2. కన్నీరె గాని పన్నీరులెదయ్య-చెయలేని పన్నీటి అభిషేకము
వేదనలెగాని వేదాలనెరుగను-చేయుటెట్లు స్వామి మంత్రాభిషేకం
సంసార సంద్రాన మునగంగ నాకెది గంగ నీ శుద్ధోదక స్నానానికి
పంచేంద్రియాలె నను పట్టించుకోవయ్య పంచామృతాభిషేకానికి
3. నా కనుల కలువలతొ చేసేను స్వామి పుష్పాభిషేకమ్మును
మధురమౌ నీదు నామాలు పలికీ చేసేను తేనె అభి షేకమ్మును
శ్రావ్యమౌ నీదు నామాలు పాడీ చేసేను గానామృతమ్మును
మనసు చిలికిన వెన్న నాజ్యంగ మార్చీ చేసేను నేయ్యాభి షేకమ్మును

Saturday, August 15, 2009

అష్టాదశ సోపానములే-భువినవి స్వర్గ సోపానములే
చేయూతనిచ్చుట కొరకై-అయ్యప్ప శబరిలొ ఉన్నాడు కొలువై
1. కారం లవణం మధురం-కామం క్రోధం మోహం
వగరు పులుపు చేదు-లోభం మదము మత్సరం
అరిషడ్వర్గపు అస్త్రాలు-అవియే కాదా షడ్రుచులు
2. కన్నూ ముక్కూ జిహ్వా-అగ్నీ గాలీ నీరూ
దేహ చర్మము చెవులు-పుడమీ ఆకాశములు
ప్అంచేంద్రియముల నిగ్రహము-పంచభూతముల అనుగ్రహము
3. గజముఖ షణ్ముఖులను కొలువు-అహము దర్పములను గెలువు
గుణత్రయమ్మును జయించవలెనా-దత్తాత్రేయుని కొలువు
గాయత్రి సాధనతోనే అవిద్య అన్నది తొలుగు
అయ్యప్ప శరణం కోరు బ్రహ్మ విద్య చేకూరు
ఎదవాకిలి నిర్దయగా –ఎందుకు మూసావు నేస్తం
మొహమ్మీదె కఠినంగా-తలుపులు వేసావు నేస్తం
జోలెతెఱచి నీ గుమ్మంలో- స్నేహార్తితొ నిలుచున్నా
ఏనాడైన కరుణిస్తావని-ఆశగ నే చూస్తున్నా
ఓ ప్రియ నేస్తమా –ఓనా సమస్తమా

1. రాయిలాగ ఉన్న నన్ను-సానబెట్టి రత్నం చేసావు
మోడులాగ బ్రతికే నన్ను-చిగురులు తొడిగింప జేసావు
అడుగులింక తడబడుతున్నా-నీ చేయి విదిలించేసావు
సంబర పడు నంతలోనే-ముఖం నువ్వు చాటేసావు
ఓ ప్రియ నేస్తమా –ఓనా సమస్తమా

2. మూలబడిన వీణను సైతం-ముచ్చటగా పలికించావు
చినుకులేని ఎడారిలోనా- సెలయేరులు పారించావు
కళ్లముందు విందు ఉన్నా- నా నోరు కుట్టేసావు
అంగలార్చి అర్థించినా-బధిరురాలి వై పోయావు
ఓ ప్రియ నేస్తమా –ఓనా సమస్తమా
దేవుడు నాయందుంటే బ్రతుకు పూలపానుపు
ఆతని దయ ఉంటే దేనికింక వెఱపు
జగన్నాటకంలో పాత్రధారి నేను
అడుగడుగున నను నడిపే సూత్రధారి తాను
1. అంతా నేననే అహంకారమెందులకు
అంతా నాదనే మమకారమెందులకు
చింతవీడి శ్రీకాంతుని చిత్తములో నిలిపితే
తానంతట తానుగానె సొంతమై పోతాడు
2. పుట్టినపుడు వెంటతెచ్చిన ఆస్తిపాస్తులేవి
గిట్టినపుడు కొనిపోవ అస్తికలూ మిగలవేవి
నట్టనడి జీవితాన లోభత్వమెందుకు
మూడునాళ్ళ ముచ్చటకే మిడిసిపడుట ఎందుకు
3. నౌకనెక్కి భారమంత తనపైన వేస్తెచాలు
ఆవలిదరి తానే అవలీలగ చేర్చుతాడు
ప్రతిఫలమాశించక నీ పని నువు చేస్తె చాలు
ప్రతి క్షణము కనురెప్పగ మనల కాపాడుతాడు

Friday, August 14, 2009

పదుగురు మెచ్చెటి పదములివే
పరమాత్ముని చేర్చెటి పథములివే
గణనాథునికీ ప్రణతులివే
విఘ్నపతికీ వినతులివే-మాహృదయ హారతులివె
1. నవరంధ్రాల కాయమిది- నవవిధ భక్తుల ధ్యేయమిది
నవరాత్రుల సారమిది-నవరసముల కాసారమిది
నిజములు తెలుపర-గజవదనా
నీ పదములె శరణిక-గౌరీ నందన
2. సరిసరి నటనలు సైచగ లేము- నోములు వ్రతములు నోచగ లేము
చంచల మది నిను కాంచగలేము-నీ మహిమల కీర్తించగ లేము
నౌకను నడిపే నావికుడా-చేర్చర తీరం వినాయకుడా
నన్ను నేనే కోల్పోయాను
ఎక్కడంటూ వెతకను
గతము నంతా చేజార్చాను
నన్ను నేనే ఎరుగను

ఎవరినడిగితె ఏమి లాభం
ఎవరికెరుకని సమాధానం

1. జాబిలమ్మకు దొరికాననుకొని- జాలిగా నే నడిగాను
చకోరి మత్తులొ చిక్కిన జాబిలి –మాటనైనా వినలేదు
మేఘమాలకు చిక్కాననుకొని-బేలగా నే ప్రార్థించాను
చల్లగాలికి మేను మరచి-తిరిగి నన్ను చూడలేదు

ఎవరినడిగితె ఏమి లాభం
ఎవరికెరుకని సమాధానం

2. పుట్టింది ఎక్కడొ నేను-ఎలా తెలిసుకోగలను
పేరు సైతం మరచినాను-ఎలా పట్టుకోగలను
దారితెన్నూ ఏదిలేకా-చిత్తరువై నిలిచాను
ఎవరైనా తీరం చేర్చే-వారికొరకై వేచేను
మనసారా ఓదార్చే-వారికై ఎదురు చూసాను

ఎవరినడిగితె ఏమి లాభం
ఎవరికెరుకని సమాధానం

ఎక్కలేకపోతున్నా స్వామీ- కామమనే మొదటిమెట్టు
ఎలా చేరుకోగలను స్వామీ-నీ చేరువలోనీ ఆ చివరి మెట్టు
నీ మెట్లన్నీ జారుడు మెట్లు-పద్దెనిమిది మెట్లు జారుడు మెట్లు
నీ చేయూతలేక నాకు ఇక్కట్లు

1. అరిషడ్వర్గానికి అవి మూడురెట్లు
మొదటికి మోక్షం లేదు నిను చేరుటెట్లు
పంచేంద్రియాలు మనోరథపు పంచకళాణీలు
పగ్గాలు చేజారునా స్వామీ-నా సారథి నీవే ఐతే

2. వ్యామోహాలే అవరోధాలై
ఇహ దాహాలే ఆటంకాలై
నాబుద్దిని మలిన పరచి –నాచిత్తము చెరసి వేసి
నా మదినే కలచి వేయగా-స్వామీ నిన్నే అవి దూరం చేయుగా

3. కార్తీకమాసాన మాలను దాల్చీ
మండల పర్యంతమూ దీక్షను బూని
మకరజ్యోతి కన్నులార వీక్షింప తపన గలిగి
ఇరుముడినే తలదాల్చితీ-స్వామీ శరణు ఘోషనే జేసితి

Thursday, August 13, 2009

మురళీ లోలా మువ్వగోపాల

మురళీ లోలా మువ్వగోపాల
నువ్వు చిందేయగా చిలిపి కృష్ణా
కనువిందాయెరా బాలకృష్ణా
1. కాళింది మడుగులో-కాళీయుని పడగలపై
నర్తనమాడిన తాండవ కృష్ణా
దర్పము నణచిన వంశీ కృష్ణా
2. చిటికెన గోటిపైన గోవర్ధన గిరిని నిల్పి
లోకుల గాచిన గోపీకృష్ణా
ఘనత వహించిన గిరిధర కృష్ణా
3. పొన్నచెట్టుపైన నిలిచి-కన్నెల కోకలు దాచి
కన్నుల పొరమాన్పిన –గీతా కృష్ణా
కన్నెల ఎదదోచిన-మోహన కృష్ణా
4. యమునా నది తరంగాల-భక్తాంతరంగాల
రాసలీలలాడిన రాధా కృష్ణా
రాగడోల లూగిన మీరా కృష్ణా
వేలాయుధ ధర మురుగా
నే వేరే దైవము నెరుగా
శూలపాణి స్వామినాథా
దిక్కెవరయ్య నా కన్యధా
కైలాస వాస నీకు కైమోడ్చెద
కరుణించవయ్య వేగ ఓ షణ్ముఖ
1. మయూరవాహన కుమారస్వామి
శ్రీవల్లినాథహే సుబ్రహ్మణ్యస్వామి
కృత్తికా సూన హే కార్తికేయ స్వామి
ఎన్నెని పేరుల నిన్నుపిలవాలి
2. శరణని వేడెదు శరవణదేవా
వందనమందును స్కందా స్కందా
పళనిమల వాసా పార్వతి నందన
పరిపరి విధముల నిన్ను ప్రస్తుతించెద
3. తారకాసుర సంహారా
శంకర హృదయ విహారా
గణపతి అనుజా కావరా
అయ్యప్ప అగ్రజా బ్రోవరా
సాకి:గాన సుధా సారమతి శయించగా
శివరంజనియే శివరంజకమవగా
పల్లవి:వచ్చే జన్మకైనా నువు మెచ్చే పాట పాడనీ
అందుకే నిను తేనెతొ అభిషేకం చేయనీ
శంభో శంకరా-వందే భవ హరా
1. ఆకాశ గంగమ్మ సిగనుండి దూకేలా
పాతాళగంగమ్మ భుని ఉప్పొంగేలా
పన్నగమూ హిమనగమూ తలలూచి ఆడేలా
నటరాజా నా పాటకు సాగాలీ నాట్యహేల-నీ ఆనంద నాట్యహేల
2. రేవతిలో పాడనా నమకచమక స్తోత్రమాల
మోహనముగ పూయనా పన్నీరూ చందనముల
బిలహరి
లో చేయనా కోటి బిల్వార్చనముల
శంకరాభరణమే ప్రభూ నీ మెడలో పూలమాల-ఈ నవరాగ మాల

Wednesday, August 12, 2009

స్వైన్ ఫ్లూ మహమ్మారి- వ్యాపిస్తోంది మితి మీరి
ఉంటే మరి ఏమారి –అది మరణానికి రహదారి
పోనీకు ఏ క్షణమూ-నీ చేజారి
1. పుట్టింది ఎక్కడొ గాని-కబళిస్తోంది ప్రపంచాన్ని
తలచు కొంటె గగుర్పాటు-అనుక్షణము తత్తర పాటు
మానవాళి కిదియే- ఒక గ్రహపాటు
మానవ జాతికే –తెస్తోంది చేటు
2. సంఘజీవులైన వారు-ఒంటరై పోతారు
ఇరుగు పొరుగు అంటేనే –భయభ్రాంతులౌతారు
ప్రాణ భీతితో ఎవరైనా –ఎక్కడికని వెళతారు
ప్రాణసములైనా సరే- దూరంగా నెడతారు
3. నిత్యావసర వస్తువులన్నీ-గగన గండ మౌతాయి
ప్రగతి ఎక్కడి కక్కడనే-చతికిల పడి పోతుంది
తినడానికి తిండైనా – ఎలాదొరుకుతుంది మనకు
కరువుతోటి కనీసము- నీరైనా దొరకదు చివరకు
4. విద్యా సంస్థలే మూతబడతాయి-
వైద్యసదుపాయాలే కొఱవడతాయి
పెళ్ళిళ్ళు వినోదాలు-కనుమరుగై పోతాయి
మానవ బంధాలన్నీ-పటాపంచ లౌతాయి
5. దినదిన గండము- నూరేళ్ళ ఆయువు
పీల్చకుంటె బ్రతికేదెట్లా-స్వఛ్ఛమైన వాయువు
చావలేక బ్రతకలేక-సతమతమై పోతారు
ప్రతిక్షణం చావు భయంతో-అట్టుడికి పోతారు
6. వార్తావిశేషాలు-తెలియకుండపోతాయి
ప్రయాణాలు ఎక్కడికక్కడ-ఆగిపోతాయి
మేలుకోవాలి త్వరగా-మేధావులంతా
ఈకాలనేమికి-చరమ గీతి పాడాలంటా

Tuesday, August 11, 2009

స్నేహానికి బెదురేది- ప్రణయానికి ఎదురేది
మూడునాళ్ళ జీవితాన-మునిగేదింకే ముంది
1. గడచి పోవు ప్రతిక్షణం-విలువ ఎరుగ ఎవరికి తరము
తిరిగిరాని కాలమన్నది-కరిగి పోవు నిరంతరం
కాలయాపనే చేస్తూ-ఆటలాడు కోకు నేస్తం
సంశయాల బాటలోనే-సాగ నీకు నీ ప్రయాణం
2. జీవితం మకరందం-గ్రోలి చూడు తనివి దీరా
జీవితం సుమ గంధం-ఆస్వాదించు మనసారా
జీవితం ఒక రస యోగం-అనుభవించు కసిదీరా
జీవితం తీరని దాహం-తీర్చు’నది’ ఒకటే స్నేహం

నన్నుజేర కష్ట మేల నా చెలీ రాచెలీ
నేనంటె ఇష్టమేగ ఓ చెలీ నెచ్చెలి
దొరికింది నాకెపుడొ కోల్పోయిన నీహృదయం
ఉంటుంది నాకడనే ఎప్పటికీ అది పదిలం

1. అందాల చందమామ వచ్చింది మన కొరకే
నక్షత్ర మాల కూడ మెరిసింది మనకొరకే
నీలాల మేఘమాల తోడుంది మనకొరకే
తోటలో విరజాజి విరిసింది మనకొరకే
నన్నుజేర కష్ట మేల నా చెలీ రాచెలీ
నేనంటె ఇష్తమేగ ఓ చెలీ నెచ్చెలి

2. గుండెనే గుడి జేసి నిన్ను ప్రతిష్ఠించాను
ప్రతి రోజూ నిన్నునే దేవతగా కొలిచాను
ఇచ్చాను నాప్రేమను నీకే నీరాజనం
అందుకో నాహృదయం అదినీకే నైవేద్యం
నన్నుజేర కష్ట మేల నా చెలీ రాచెలీ
నేనంటె ఇష్తమేగ ఓ చెలీ నెచ్చెలి

Monday, August 10, 2009

ప్రేమ వ్యవహారం
ఏది పరిహారం
హృదయ కుహరం
భావ సమరం
భవిత అంధకారం
బ్రతుకులోన గాలిదుమారం
1. తొలిచూపులొనే ఒక ఇంద్రజాలం
చిరునవ్వుతోనే వేస్తారు గాలం
కలలోకి వస్తారు-కలకలం సృష్టిస్తారు
దోబూచులాడుతూనే-మనసంత దోచేస్తారు
2. ప్రేమిస్తె తప్పుకాదు- ప్రేమే ఒక తపస్సు
గుర్తిస్తె కోల్పోవు-విలువైన నీ మనస్సు
దాహార్తులందరికీ-ప్రేమ ఒయాసిస్సు
తిమిరాలు కమ్ముకుంటే ప్రేమేలే ఉషస్సు
పంజరాన బంధిస్తే చిలుకను
పంచదార పలుకులెలా పలుకును
తనరెక్కలు విరిచేసి- రెండు కాళ్ళు నరికేసి
ముద్దెంత జేసినా-పొద్దంత దువ్వినా
పెదవైన విప్పనే విప్పదు
గొడవైన చెయ్యనే చెయ్యదు
1. తోచగానె వెంటనే -తోటకెళ్ళ గలుగునా
నచ్చిన పండు కొఱకు- ఎన్నొ రుచి చూడగలద
జామపళ్ళు నచ్చేనొకసారి-మెక్కజొన్న పొత్తులైతె మరీ మరి
విడిసెలలు విసిరినా -వానల్లొ తడిసినా
లెక్కచేయకుండెనూ ఏ గాయం
ఆపనైన ఆపకుండె తనపయనం
బంగారు పంజరాన బంధిస్తే చిలుకను
పంచదార పలుకులెలా పలుకును
2. తన సాటి చిలుకలన్ని-స్వేఛ్ఛగా ఎగురుతుంటే
గోరింక మనసు పడీ-స్నేహహస్తం చాపుతుంటే
పంజరాన్ని దాటలేకా-బందనాలు త్రెంచలేకా
మౌనంగ రోదిస్తూ-విధినెంతొ శపిస్తూ
మిన్నకుండిపోయిందీ శారికా
విరహాన రగిలెను అభిసారిక
అందాల పంజరాన బంధిస్తే చిలుకను
పంచదార పలుకులెలా పలుకును


వెన్నెల్లో ఆడపిల్లా ఎక్కడ దాగేవు
కొమ్మల్లో కోయిలమ్మా ఎక్కడ నక్కేవు
నీ ఆటలే దొంగాటలా- నీ పాట తో సయ్యాటలా

1. మబ్బుల మాటున మాటువేసావేమో
తారల గుంపువెనక చేరిపోయావేమో
రేయి కాలేదనా –పున్నమి రాలేదనా
ఎందుకీ జాగు నీకు జాబిలమ్మా
కార్తీక మాసమిదే ఎరుగవమ్మా

2. దొంగచాటుగ నీవు మావి చివురు తింటున్నావా
దోబూచు లాడుకుంటు నన్ను నంజు కొంటున్నావా
చిరునామా దొరుకకా-ఆచూకి తెలియకా
ఆతృతగా నిన్నునే నర్థిస్తున్నా
ఆమని పోనీకని ప్రార్థిసున్నా

Sunday, August 9, 2009

మోహనాంగ వెన్నదొంగ నీ కేలరా బెంగ
నల్లనయ్యా అల్లరేల బజ్జోర మురిపెంగ
చిన్ని కృష్ణా ముద్దు కృష్ణా బాల కృష్ణా
లాలి లాలి లాలి లాలి గోపాల కృష్ణా
1. పెరుగూ మీగడ మరిగీ ఇల్లూ ఇల్లూ దిరిగీ గొల్లవాడను గోల చేసీ
కొంటెవాడీలాగ వంట ఇల్లూ దోచుకుంటావని పేరుమోసీ
అలకఏలనీకు చిలుక పలుకుల కన్నా నీకేలరా బెంగా
ఆటలాడీ నీవు అలసిపోయినావూ బజ్జోర మురిపెంగా
2. ఉట్టిలొ చిక్కని పాలూ-మట్టిపాలూ-చేస్తే వస్తాయి కోపాలు
చక్కని తండ్రీ చిక్కనీతండ్రికి ఏలనయ్యా శాపనార్థాలు
తప్పునీవెన్నవు నల్లనీవెన్నవు నీకేలరా బెంగా
ఏమీగడసరి నీవు ఎంతమీగడతింటావు బజ్జోర మురిపెంగా
3. అమ్మముద్దు జున్ను నాన్న మనసు వెన్న సరిపోలేదాకన్నా
నీపై ప్రేమపెరుగు ఎదలోని మురిపాలు నీవేరా కన్నా
మాగుండె తాపాలు ఎగుగకుంటివి నీవు నీకేలరాబేంగా
నీ ముద్దూ మురిపాలు పదివేలు అవిచాలు బజ్జోర మురిపెంగా

Saturday, August 8, 2009



పల్లవి: మనసు పారిజాతమే
పలుకు ప్రేమ గీతమే
నవ్వు చంద్రహాసమే
పిలుపిది నీ కోసమే

1. సన్నజాజి పరిమళమే –నీతో సహ చర్యము
మెగిలిరేకు సౌరభమే – నీ ఔదార్యము
గులాబీల సౌకుమార్యం – నీ స్నేహతత్వమే
కలువబాల ఎద వైశాల్యం - నీ సహజత్వమే

2. మల్లె పూల మంచి గంధం-నీ మాటల అందం
చందనవన శ్రీ గంధం – నీ భావ సౌగంధ్యం
రేరాణిసుమ వాసనలే – నీ ఆలోచనలు
మందార మకరందాలే – నీ సమయోచనలు

Friday, August 7, 2009

మరణమూ మధురమే ప్రియతమా
నీ ప్రేమలోన ముంచి నన్ను చంపుమా
నీ చేతిలో నే హతమై-జీవితమే విగతమై
నీ గతమై –నే స్మృతినై
నిత్యమై నిలువనీ నేస్తమా
సత్యమై మిగలనీ మిత్రమా

1. నిరీక్షణే ఓ శిక్షలా సహించగా
ప్రతీక్షయే పరీక్షలా పరిణమించెగా
రెప్పపాటు వేయకుండ నేను వేచితి
క్షణమునే యుగముగా భ్రమించితి
శోధనే గెలువనీయి నేస్తమా
వేదనే మిగలనీకు మిత్రమా

2. ఏ జన్మలోనొ వేయబడిన వింతబంధము
ఏడడుగులు నడువబడని అనుబంధము
తెంచుకుంటె తెగిపోని ఆత్మబంధము
పారిపోతె వెంటబడెడి ప్రేమ బంధము
నీతోడుగ నిమిషమైన చాలు నేస్తమా
నీవాడిగ మిగిలితెపదివేలు మిత్రమా
హృదయమే ఆర్ద్రమై
గుండె మంచు కొండయై
ఉప్పొంగె కళ్ళలోనా గంగా యమునలు
ఉరికాయి గొంతులోన గీతాల జలపాతాలు
1. తీరలేని వేదననంతా హృదయాలు మోయలేవు
పొంగుతున్న జలధారలను కనురెప్పలు మూయలేవు
సృష్టి లోన విషాదమంతా ఏర్చికూర్చి ఉంచినదెందుకు
గాలితాకి మేఘమాల కన్నీరై కురిసేటందుకు
2. చిన్ని స్పర్శలోన ఎంతో ఓదార్పు దాగుంది
స్నేహసీమలోన ఎపుడూ అనునయముకు చోటుంది
సత్యమే జీవితమైతే హాయిగా ఉండేదెందుకు
ఆనంద భాష్పాలై అంబరాన్ని తాకేటందుకు
నరసింహుని లీల పొగడ నాలుక తరమా
పరమాత్ముని మాయనెరుగ నాకిక వశమా

1. ప్రహ్లాదుని రక్షించిన కథను ఎరిగియున్నాను
కరిరాజును కాపాడిన విధము తెలుసుకున్నాను
శేషప్ప కవివర్యుని బ్రోచిన గతి విన్నాను
శ్రీ నరహరి కరుణ కొరకు ఎదిరి చూస్తున్నాను

2. కోరుకున్న వారికిహరి-కొంగుబంగారము
వేడుకున్న తనభక్తుల కిలను కల్పవృక్షము
దీనజనులనోదార్చే అభయ హస్తము
ఆర్తుల పరిపాలించే ప్రత్యక్ష దైవము
ధర్మపురిని దర్శిస్తే యమపురి చేరేదిలేదు 
నరసింహుని అర్చిస్తే మరు జన్మమేలేదు 
మనసారా సేవిద్దాము-
మనమంతా తరియిద్దాము 

1. గోదారి గంగలో తానాలు చేయాలి 
సత్యవతిగుండంలొ సరిగంగలాడాలి 
బ్రహ్మపుష్కరిణి డోలాసంబరాలు చూడాలి 
కర్మబంధాలనొదిలి కైవల్యమందాలి 

2. ముక్కోటి ఏకాదశి వైభవాలు చూడాలి 
ఏకాంత సేవనాటి వేడుకలను గాంచాలి 
కళ్యాణ ఉత్సవాల సందడితిలకించాలి 
నరహరి చరణాల వ్రాలి పరసౌఖ్యమొందాలి 

3. సుందరమందిరాలు నెలకొన్న పుణ్యక్షేత్రం 
వేదమంత్రాలఘోష పరిఢవిల్లు ప్రదేశం 
పురాణాలు హరికథలతొ అలరారు దివ్య ధామం 
సిరి నరహరి కొలువున్నదీ అపరవైకుంఠం
శ్రీచక్ర రూపిణి విశ్వమోహిని
శ్రీపీఠ సంవర్ధిని మత్తమోప హారిణి
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి
అనంత దిగంత యుగాంత కాంతిని
సాక్షాత్కరించవే సాఫల్యమీయవె భగవతీ భారతీ

1. శుంభనిశుంభుల డంబము నణచిన జగదంబా శాంభవి
మధుకైటభుల తుదముట్టించిన చాముండేశ్వరి శాంకరీ
మహిషాసుర మర్ధన జేసిన జయ దుర్గే ఈశ్వరీ
సాక్షాత్కరించవే సాఫల్యమీయవె భగవతీ భారతీ

2. బ్రహ్మ విష్ణు పరమేశ్వరార్చిత శ్రీవాణీ బ్రాహ్మిణీ
సృష్టి స్థితిలయ కేళీవినోదిని పద్మాలయి కామరూపిణి
సత్యతత్వ శివానందలహరి పరదేవీ దాక్షాయిణీ
సాక్షాత్కరించవే సాఫల్యమీయవె భగవతీ భారతీ

3. అరిషడ్వర్గ దుర్గుణ భేదిని నిరుణీ భవాని
ఏకాగ్రచిత్తప్రదాయిని మణిపూరక వాసినీ
భవబంధ మోచని జన్మరాహిత్యదాయిని
సాక్షాత్కరించవే సాఫల్యమీయవె భగవతీ భారతీ
ఎంతవేడుకొన్న గాని నీ దయ రాదేమి 
నే చేసిన దోషమేదొ ఎరిగించర స్వామి 

 1. నీ కృపగను సూత్రాలను నేనెరుగను స్వామీ 
కైవసమగు మార్గాలను తెలియనైతి స్వామి 
మెప్పింపగ నాతరమా నను బ్రోవగ భారమా 
తప్పింపగ నా చెఱను రాత్వరగా ప్రియమారగ 

2. అశ్రువులతొ అభిషేకం నే చేసెద స్వామి
 పదముల నా ఎదకమలం అర్పించెద స్వామి
 చిత్తములో నీధ్యానం నేతప్పను శ్రీహరి 
 ఎలుగెత్తి నీ గానం నే చేసెద నరహరి

Thursday, August 6, 2009

మహాలక్ష్మి మా మీద నీ
చల్లని చూపులు పడనీయవమ్మా
ధనలక్ష్మి మా ఇంట నీ
ఘల్లను అందెల సడి చేయవమ్మా
1. డబ్బులకై మాకింత ఇబ్బందులేల
అప్పుల కుప్పల దుర్గంధ మేల
సంపదతో జీవ సంబంధమేల
నిరర్థకమగు భవ బంధమేల
నిరతము మామీద నీ కరుణ ప్రసరించవమ్మా
కదలక మాయింట సతతము వసియించవమ్మా
2. దోపిడికి గురిచేయు సిరులేల మాకు
ఈర్ష్యకు బలిచేయు నిధులేల మాకు
పరువు నిలిపితె పదివేలు మాకు
దినము గడిపితె అది చాలు మాకు
దాబుల జోలికి పోనీయనని మాకు వరమీయవమ్మా
పొదుపుల దారికి మళ్ళించి మమ్మింక నడిపించవమ్మా
మనసైన ప్రియతమా
గతమైన స్వగతమా
జీవితమైన గీతమా
శాశ్వత స్నేహితమా
నానుండి వేరు కాలేవు
ఎపుడూ జారి పోలేవు

జలధి అవధి చూడనీయి
దిక్చక్రపు బాటవేయి
ప్రకృతి పరిధి దాటనీయి
విశ్వవీణ మీటనీయి

ఇంద్ర ధనువు వంచనీయి
తారకలమాల వేయనీయి
పాలపుంత చేరనీయి
అంతరాళ కాంతినీయి

మృత్యువునెదిరించనీయి
యముడిని ఓడించనీయి
చిరంజీవి నేనైపోయి
సావాసిగ ఉంటానోయి
నీవే చెలీ అనుక్షణం
నీతో సఖీ నా జీవనం

స్నేహమా ఇది దాహమా
మోహమా వ్యామోహమా
సోహమా దాసోహమా
దేహమా సందేహమా

త్యాగమా అనురాగమా
యోగమా భవ భోగమా
రోగమా రసయోగమా
రాగమా విరాగమా

మదినీవె దోచినావే
మనసంతా నిండినావే
హృది గుప్పిట దాచినావే
గుండెను కబళించినావే

గతమంతా నీవే నీవే
భవిష్యత్తు నీవేనీవే
వర్తమాన మంతటనూ
ఆవర్తన మౌతున్నావే

ఎవరు పిలిచినా గాని
ఊ( కొడుతున్నగాని
ఏమిచేసినా గాని
పరధ్యానమాయె నాపని

Wednesday, August 5, 2009

కన్నీటి వీడుకోలు
కడసారి అంపకాలు
మది కలచు జ్ఞాపకాలు
చితిమంట నెట్లుకాలు
1. మాతృత్వ అనుభవాలు
మరపించు అనునయాలు
వాత్సల్యమే కదా మేరు
అనురాగమే జాలువారు
2. ఆనంద సాగరాలు
కావేల జీవితాలు
విధివింత నాటకాలు
వైషాద పూరితాలు
3. తీరలేని ఈ ఋణాలు
తీర్చుకోగల క్షణాలు
వినియోగమైతె చాలు
బ్రతుకులే సార్థకాలు
ఒక కొత్త కోకిల
తన మత్తు వీడక
గమ్మత్తుగా
ఉన్మత్తయై గళమెత్తెగా
1. కువకువ రవళులె జతులూగతులని
కూనిరాగాలె గంధర్వ కృతులని
ఎంచగా మురిపించగా
కలగాంచగా విలపించెగా
2. రెక్కలెరాని చిరుచిరు ప్రాయం
లౌక్యమునెరుగని అయోమయం
తొందరపడితే నింగికెగిరితే
గుండెన గాయం-గొంతున మౌనం
నీలిగగనం నేలకోసం
ఎంత వాలితె ఏమి లాభం
కోనేటి కమలం చందమామను
కోరుకుంటే ఎంత ద్రోహం
1. మేఘమాలకు పికము పాటకు
పొత్తుకుదరదు నేస్తము
కొండవాగుకు రాజహంసకు
జంట కుదరదు తథ్యము
నెమలి ఆడితె పికము పాడదు
రవి జ్యోత్న్సకు రాజీ పొసగదు
2. కంటకారిన నీటి ధారలు
గుండెమంటల నార్పునా
ఎండమావులు ఎన్నడైనా
గొంతుతపనల తీర్చునా
త్రవ్వబోతే బావినైనా స్వేద సంద్రం మిగలదా
నవ్వబోతే కలలోనైనా రత్నరాశులు దొరకవా
తేనె పూసిన కత్తివి నీవు
మనసు కోసిన కసాయి వీవు
సొగసు చూసి మురిసితినేను
తగిన శాస్తి చేసితివీవు
1. అలనాడు ఊర్వశివై ఊరించినావు
అనురాగ ప్రేయసివై ఉదయించినావు
నీ అధరము మృదు మధురము
మన బంధము అందాలకే అందము
2. వలపుల వాన కురిపించినావు
మమతలలోన ముంచెత్తినావు
తలపులన్ని మరపించి నీవు
హృదయాగ్ని రగిలించినావు
నా ప్రణయాన్ని మసిజేసినావు
కలనైనకాదు-నదిలోని అలనైన కాదు
నా బ్రతుకే శిలయైనది
కరుగని,కదలని,కఠిన శిలయైనది
1. వసంత రేయిలొ కోయిల గానం
మనసంత రేపెను గాలి దుమారం
పెనుతుఫానులో-విరిగిన నావతొ
ఎందాక ఎందాక ఈ నా పయనం
2. పూల తోటలో ప్రియుని మాటలు
గతపు వీణపై శ్రుతి లేని పాటలు
ఎడారిలో—ఎండమావికై
ఎందుకు ఎందుకు ఈ నా పరుగు
3. సాటి మనిషి కన్నీటి గాథను ఆలకించలేరా
విధివ్రాతను నుదుటి గీతను మార్చువారు లేరా
మోడువారినా నాబ్రతుకునకు చిగురింపేలేదా
నా చీకటి గుండెన ఆశాజ్యోతిని వెలిగించరా
ఇంతేనా....!ఇంతే ఇంతే నా బ్రతుకింతేన
https://youtu.be/ArzyqD5KVzo

శ్రీనారసింహా చేసెద నీనామ స్మరణం
 ధర్మపురివాసా వదలను నీ దివ్య చరణం 

1. కైవల్యమేదో ఎరుగను-సాయుజ్యమన్నది ఎరుగను 
పరసౌఖ్య పదార్థమునకు-పరమార్థమే ఎరుగను 
సద్గురువు ప్రవచించే పదములనుకొందును 
కాస్త రుచిచూపమని నే-నిను వేడుకొందును 

2. యాగాలు చేయగలేను-దానాల నీయగ లేను 
వేదాల సాధన లేదు-కోవెల నిర్మించగ లేను 
తెలిసింది ఒకటే నరహరి-నీ నామ జపము 
ఈ జన్మ కదియే శ్రీహరి-నే చేయు తపము
అంజలి గొనుమా అంజని పుత్రా
ప్రార్థన వినుమా పరమ పవిత్ర
జ్ఞానప్రదాతా శ్రీరామ దూతా
అభయ ప్రదాతా పవనసుతా
1. బాలభానుడే ఫలమని భావించి-ఆరగించినా వానరోత్తమా
కిష్కింద లోనా రాఘవు జూచి-దాసుడవైనా రామభక్తా
అంతులేని అంభోది లంఘించి-లంకిణి జంపిన పింగాక్షా
2. ముద్రిక నిచ్చి చూడామణిదెచ్చి-సీతారాముల శోకము బాపావు
చూసిరమ్మంటె లంకను గాల్చి-రావణ గర్వము నణచినావు
రాముడు పంపగ సంజీవినీదెచ్చి-లక్ష్మణు ప్రాణము కాచినావు
3. వారధిగట్టి రావణుదునిమిన రామప్రియా ఆంజనేయా
కొండగట్టున మాకండగ వెలసిన ఇలవేల్పునీవే వీరహనుమ
రామజపమునే చేసెడి నీవు-చిరంజీవుడవు-అపర శివుడవు
వీర హనుమా హారతి గొనుమా
మామనమున నిను మరువనీకుమా
1. కొండగట్టుపై వెలిసిన దేవా
మాగుండెలందున నిలిచిపోవా
మా ఇలవేల్పువు నీవయ్యా
నిన్నే ఎప్పుడు కొలిచేమయ్యా
2. రాక్షసంహార వీరంజనేయా
శ్రీరామదూత భక్తాంజనేయా
నీపై గల భక్తితో శ్రీరామ జప శక్తితో
భయమును వీడేము- విజయము నొందేము
52.

బంధాలు ఆత్మీయ అనురాగ బంధనాలు
బాధ్యతలే మరువ కూడదు బ్రతికినన్నాళ్ళు
జరుపుకోండి హాయిగా రక్షా బంధనాలు
అందుకోండి మీకివే రాఖీ అభివందనాలు
అభినందన చందనాలు

1. ఇందిరమ్మ రక్షాబంధం-చందమామతో
గౌరీమాత రక్షాబంధం-విష్ణుమూర్తితో
సంతోషి రక్షాబంధం-శుభలాభులతో
యమునమ్మ రక్షాబంధం-యమరాజుతో

2. మల్లెతీగ రక్షాబంధం-అల్లుకున్న పాదుతో
కోయిలమ్మ రక్షాబంధం-లేమావి చివురుతో
మేఘమాల రక్షాబంధం-చల్లగాలి స్పర్శతో
వానచినుకు రక్షాబంధం-చెట్టు చెల్లి వేరుతో

Tuesday, August 4, 2009

ప్రేమించి చూడు-విరహం చవిచూడు
స్నేహించు నేడు-వీడ్కోలొక నాడు
ఆశిస్తేనే భంగపాటు
స్వీకరిస్తె ఏదైనా
ఖేదానికి ఉండదు చోటు

1. భావం సంకుచితమైతే-స్వార్థం చెలరేగుతుంది
దృష్టే భిన్నమైపోతే-అర్థం మారిపోతుంది
హృదయమెంత వ్యాకోచిస్తే-కాయమంత తేలికలే
శ్వాసయెంత నెమ్మదిస్తే-ఆయువంత అధికములే

2. బావియే బ్రతుకైపోతే-కప్పకంటె గొప్పేముంది
మనసే ఒక పంజరమైతే-స్వేఛ్ఛకు తావెక్కడుంది
ఏదీ నీది కానపుడే- అంతాసొంత మౌతుంది
ఎవరికీ చెందకుంటేనే-అందరితో బంధముంటుంది

3. నీటికి రుచి ఉంటుందా-ఖనిజాలతొ కలవకుంటే
కాంతికి రంగుంటుందా-కిరణాలే నిలువకుంటే
ఎదగాలి అంబరమంత-ఒదగాలి సాగరమంత
అనురాగం విశ్వజనీనం-ఆనందం ఆత్మగతం

Monday, August 3, 2009

ఎందున్నావో నా చెలి నాపై లేదా జాలీ
నీకై చూచి నీకై వేచి కన్నులు కాయలు కాచెనే
1. నాపైన ఏమైన కోపమా
ఇది నా పాలిటి శాపమా
ఏల కనరావు కోమలీ
జాలి లేదా జాబిలీ
2. ఊయలలూపమన్నానా
జోల పాడమన్నానా
నిన్నే వరమైన కోరానా
ఈ నాకోరిక తీరేనా
3. కినుక మాని రావా
కరుణజూపలేవా
మదిలో నిలిచి పోయావే
నిన్నే మరువకున్నానే
కనుమూసినా నా కనుతెరచినా
కలలోను ఇలలోను నీవేలే
నాకవితల్లొ భవితల్లొ నీవేలే
1. క్షణాలే యుగాలై కదలాడెనే
నరాలేతెగేలా మెదడాయెనే
రావేలా జాగేలా వరాలా జవరాల
నాధ్యానం నా గానం నీకోసం నీ కోసం
2. నిన్నటి వ్యధనే మరిచాను
రేపటి చింతను విడిచాను
నీ రూపం అపురూపం రేపేనే ఎద తాపం
మదిలోను గదిలోను నీ నామం నీనామం
మేలుకో నరహరే మేలుకో
ఏలుకో ధర్మపురి హరే ఏలుకో –మమ్మేలుకో

1. నిన్న అందరి కోర్కెలు తీర్చగా
నిశిలొ అదమరచి నిదురించేవా
భానుడుదయించె మేలుకో
బాధలను కడతేర్చ మమ్మేలుకో

2. ఆశలనెన్నో కలిపించేవు
అంతలొ నిన్నే మరపించేవు
వరదాభయ ఇది భావ్యమేనా
నరసింహా నీ కిది న్యాయమౌనా

3. మాయానిలయం ఈ లోకం
విషవలయం ఈ జీవితం
మమకారములే తొలగించుమా
నీ కరుణమాపై కురిపించుమా

4. తూరుపు సింధూరం
వెలికి వచ్చెను నీకోసం
నీవే నిండిన నా హృదయం
నీ పూజకు కోసిన మందారం

5. చదివేము నీకై సుప్రభాతాలు
పాడేము ఓదేవా మేలుకొలుపులు
హాయిగ వింటూ శయనించేవా
ఆదిశేషుని పైన పవళించేవా

6. మాయమ్మ మాలక్ష్మి నీవైన చెప్పవే
మాపురవేల్పుని మేలుకొలుపవే
పొద్దెక్కిపోతోంది లేవమని
సద్దుమణిగాకా తిరిగి బజ్జోమని

7. దూరతీరాలనుండి భక్తులు వచ్చారు
గోదారినీటిలో నిండా మునిగారు
నీరు వడయుచునుండ నీగుడి చేరారు
చలికి పాపము వారు వణుకుతు నిలిచారు

8. పాపులను దునుచుటకు నీవే
జాగేల సంసిద్ధుడవు కావే
నారసింహేశ మేలుకో
దష్టసంహారా మేలుకో

9. భూసురుల వేద మంత్రాలతో
భక్తుల గోవింద నామాలతో
మారు మ్రోగెను నీదు ఆలయం
మెలకువ కాదంటె నమ్మరీజనం

10. దారి చూపర దేవ దేవా
చీకటి నుండి వెలుతురు లోనికి
దరిజేర్చరారా నారసింహా
అజ్ఞానము నుండి జ్ఞానావనికి
మార్గమేది ప్రహ్లాద రక్షకా
వేదననుండి నీపద సన్నిధికి
మేలుకో మమ్మేలుకో
ఏలుకో మమ్మేలుకో
రావేల మేఘమాలవై దాహాలు తీర్చగా
వేచెదనే జాబిలి కొఱకై వేచే చకోరిలా
1. నక్షత్రము నడిగితె నేస్తం-నాబాధలు తెలిపేది
చిరుగాలితొ పలికితె నేస్తం-విరహాలను తెలిపేది
2. దూరాలలొ నిలిచినగాని-ఎద భారము నెరుగవనా
నీ కౌగిట కరిగే క్షణమే-నాపాలిటి వరమగును సుమా
3. మన సంగమ మధురస్మృతులే-మదినే కలిచేను ప్రియా
తలపుల నువు నిలువగనే-ఎదలో గుబులవును ప్రియా
ఒకే ధ్యాస నీపైన చెలియా
ఒకే ఆశ నీపైన చెలియా
ఒకే బాస నీతోటి చెలియా
ప్రేమించా ప్రేమించా నిన్నే నా ప్రియా

1. తొలిసారి మనకలయికే-ఏడేడు జన్మాలకే గురుతులే
కలసిన మనచూపులే-విడరాని బంధాలకే ఋజువులే
కనుమూసినాతెఱచినా-అనుక్షణము నీరూపె కదలాడెనే
ఉఛ్ఛ్వాసనిశ్వాసలో-నీతలపులే మెదిలెనే
నీవులేక జీవనం-దట్టమైన కాననం
నీవులేనిఏక్షణం –బ్రతికున్ననూ మరణం

2. నీలాల నీకురులు-సవరించక నాకురులు
మీనాక్షినీకనులు-చలియించరా మునులు
చక్కనైన నీ నాసిక-బ్రతుకున కది చాలిక
చిరునవ్వు అధరాలు-అమృత తుల్యాలు
ఎంతవర్ణించినా –అదితక్కువేనీకు
ఎంతసేపు చూసినా-తనివితీరదే నాకు
పక్షపాతి ఆబ్రహ్మ-అందమంత నీకే ఇచ్చే
దయామయుడె ఆబ్రహ్మ-అదినాకు అందనిచ్చె
నీ మాయలొ పడితినయ్య అయ్యప్పా
నేను పిచ్చివాడినైనాను అయ్యప్పా
నీ గారడి నాపవయ్య అయ్యప్పా
నేను వెర్రివాడినైనాను అయ్యప్పా
మొదటికే మూఢుణ్ణి జగమెరుగని జడుణ్ణి
కరుణగాంచవయ్య స్వామి అయ్యప్పా
కటాక్షించవయ్య నన్ను అయ్యప్పా
1. నలుదిక్కుల పరికింతును అయ్యప్పా
ఎక్కడ నీవుందువొయని అయ్యప్పా
శరణు ఘోష వల్లింతును అయ్యప్పా
ఎప్పుడు విందువొయని అయ్యప్ప
2. ప్రతి స్వామికి మ్రొక్కెదను అయ్యప్పా
ఎట్టుల ఎదురౌదువొయని అయ్యప్పా
ప్రతిమెట్టుని ఎక్కెదను అయ్యప్పా
పద్దెనిమిది మెట్లేయని అయ్యప్పా
3. మాతకడకు ప్రీతితో వస్తావని అయ్యప్ప
వేంకటెశు కోవెలకు వెళ్ళెదను అయ్యప్పా
పితరునిపై ప్రేమతో అరిగెదవని అయ్యప్పా
విశ్వనాథ ఆలయమును దర్శింతును అయ్యప్పా
అందుకో ఓ మారుతీ అందుకో మా హారతీ
ప్రేమతొ భక్తితొ అందరమిచ్చే హారతీ
మంగళ హారతీ మంగల హారతీ
1. తెలిసీతెలియని జ్ఞానముతో-తప్పులనెన్నో చేసాము
మంచీ చెడులను ఎంచకనే-వంచనలెన్నో చేసాము
మన్నించుమా మము మన్నించుమా
మన్నించుమా ఓ వీర హనుమా
తప్పులన్నిటిని మన్నించి తెలియక చేసామని ఎంచి
మమ్ముకావుమా హనుమా హారతి గొనుమా
2. విద్యలనిమ్ము పవన సుతా –సంపదనిమ్ము అంజని పుత్రా
అభయము నిన్ను ఆంజనేయా-సుభముల నిమ్ము రామభక్త
నే నమ్మినా దైవానివి-పరమేశును రూపానివి
మాఇలవేల్పువు నీవయ్యా-కొండగట్టునా వెలిశావయ్యా
నీవు దప్ప మాకెవరూ దిక్కే లేరయా

శ్రీ ధర్మపురి వాసా శ్రీ లక్ష్మి నరసింహా 
వెలసినావు ధరలో మహాపాపనాశా సదా సుప్రకాశా

 1. ప్రహ్లాదునేనుగాను చిత్తమును నిల్పలేను
 శేషప్పనైనా గాను శతకమును రాయలేను 
ఏదియూ ఎరుగని లోకమే తెలియని 
నేనొట్టి పసివాడను 

2. ఏ జన్మపుణ్య ఫలమో నీ సన్నిధిని పొందేను 
ఏ కర్మలోని బలమో నీ కరుణ లభియించేను 
పాపమో పుణ్యమో తప్పులో ఒప్పులో 
తెలియకనె చేసాను నేను 

3. మాలోని పాపాలన్ని తొలగించు మాదేవా 
మాశోకమోహాలన్నీ పరిమార్చుమో ప్రభువా 
శరణము వేడెద కరుణయే జూపవా 
నీదరికి మముజేర్చవా

Sunday, August 2, 2009

ఇది ఒక వర్షపు ఉదయం
ఈ నాడే పగిలెను నా హృదయం
ఇక ప్రతి ఉదయమ్-ఇదే ఉదయం
బ్రతుకే బాధల మయము
1. ఈ నాడు రగిలిన ఈ జ్వాలా
మదిలోన రేగిన గాలివాన
అలజడిని రేపినది ప్రేమా
బలియైనది అందాల భామ
2. రేయిలో వెన్నల కురిసిన వేళ
రాహువేనిను కమ్మినవేళ
మరపురాని తలపులెన్నో
చెరిగిపోని భావన లాయే
3. ఇక నీకు మిగిలిందేమిటి
దీనితో సాధించినదేమిటి
అవమానపు బంగారు పతకం
అధికారపు శృంగార మథనం
అందుకే అయ్యప్పా నిన్ను వేడుకున్నది
అందుకే అయ్యప్పా తోడు నీవన్నది
అందుకే అందుకే అందుకే అయ్యప్పా
స్వామి నీవె శరణము శరణమయ్యప్పా
1. ఆపద్బంధవుడన్న పేరు నీకున్నది
అశ్రితజన రక్షకుడను బిరుదు నీకున్నది
సర్వాంతర్యామివన్న ఖ్యాతి నీకున్నది
దీనుల మొరవిందువన్న వాసి నీకున్నది
2. పిలువగనే కరి గాచిన హరి తనయుడవీవు
గరళమునే గుటకేసిన హరపుత్రుడవేనీవు
తొలిపూజలు గైకొను గణపతికే సోదరుడవు
దేవసేనాపతికె నీవు ప్రియమైన అనుజుడవు
3. నీ దీక్ష గైకొంటె మోక్షము నిచ్చేవు
ఇరుముడినే తలదాల్చగ వరముల నిచ్చేవు
అయ్యప్పా శరణంటే మమ్మాదరించేవు
శబరిగిరిని దర్శించగ కైవల్యము నిచ్చేవు
నిన్ను చూడ మనసాయే
కంటినిదుర కరువాయె
ఒంటరిగా ఉండలేక
నా బ్రతుకే బరువాయే
కన్నీరే చెఱువాయే
1. ప్రతి ఉదయం రవి సైతం పలకరించ వస్తాడు
ప్రతి పున్నమిరేయిలో జాబిలి నవ్విస్తాడు
తలపులకే పరిమితమాయే
ఎద తలుపులు తెరువవాయే
ఏమిన్యాయం గుండె గాయం
చేయబోకే ఓ ప్రియా నా బ్రతుకే అయోమయం
2. అందాలను రాశిగ పోస్తే ఆభావన నీ రూపం
కోకిల కూజితమాస్వాదిస్తే ఆ మధురిమ నీ గాత్రం
ఊహలేమొ ఆకసమెగసే
వాస్తవమే వెక్కిరించే
వరములీవే ప్రణయ దేవీ
నేనోపలేనే విరహం-అవనీ నీలో సగం
చేసింది నీవే పిచ్చివాడిని 
గేలి చేసింది నీవే పిచ్చివాడని 
చెలీ జీవితం స్నేహితం నీకు బొమ్మలాట 
ప్రణయము హృదయము నీకు నవ్వులాట 

1. క్రీగంటి నీచూపులే మన్మధుడి బాణాలు 
కవ్వించు నీ నవ్వులే తీస్తాయి ప్రాణాలు 
చేసేసి నీవే పిచ్చివాడిని
గేలి చేసేవు నీవే పిచ్చివాడని 

2. నడుము వంపులోనా ఇసుక మైదనాలు 
లావాను ఎగజిమ్మే హిమవన్నగాలు 
చేసేసి నీవే పిచ్చివాడిని 
గేలి చేసేవు నీవే పిచ్చివాడని 

3. నీ హావ భావాలే మలయ మారుతాలు 
నీ చిలుకపలుకులన్ని తేనె జలపాతాలు 
చేసేసి నీవే పిచ్చివాడిని 
గేలి చేసేవు నీవే పిచ్చివాడని 

4. వణికించే చలికాలంలో విరహాగ్ని రగిలిస్తావు ముక్కుమూసుకొన్నమునులను-ముగ్గులోకి దించేస్తావు 
చేసేసి నీవే పిచ్చివాడిని 
గేలి చేసేవు నీవే పిచ్చివాడని
https://youtu.be/MlCpm-8CN7o

శ్రీ హరి నరహరి 
శ్రీ ధర్మపురి హరి శ్రీ చక్రధర హరి
ఎందువెదకి జూచినా అందెగల నృకేసరీ

1. ఒక పరి మత్స్యమువై 
ఒకపరి కూర్మమువై 
ఒకపరి వరాహమువై 
తదుపరి నరహరివై వెలసినట్టి 
నిలిచినట్టి స్తంభసంభవా హరీ 

2. వందన మిదె గొనవేర 
ఉగ్ర మహోగ్ర భయాకార 
ఆశ్రితజన పరిపాలా 
మా కామిత మోక్షప్రదాతా 
నిన్నె నమ్మి నిన్నె వేడు నన్ను బ్రోవవా హరీ 

3. ధర్మపురీ మహాక్షేత్రం-హరిహర సహిత పవిత్రం 
పాప పరీహారార్థం –గౌతమీ పుణ్యతీర్థం 
ముక్తికోరి నిన్ను జేరు (హరి) దాసపోషకా హరీ
ఏడు కొండలా వెంకటేశ్వరా గిరి దిగి రారా
జాలి చూపి నువు జాగు సేయకా పరుగున రారా
ఓ దేవా...రావేరా.....రావేరా....రావేరా
1. మును కరిని గావరాలేదా –ద్రౌపదిని ఆదుకోలేదా
నీ మహిమ మరచి నీ విధిని విడిచి ఈ మౌనమేలనయ్యా
కలిలోనదైవము నీవే-కలనైన దర్శనము నీవే
వేద సంభవా దీన బాంధవా తిరుపతిపురవాసా
వేంకటరమణా ఎన్ని పేరులని నిన్ను పిలవను
ఎన్ని రీతులని కొలువను ఓ దేవా
2. నా ఎదను కోవెలగజేసీ నిను పదిల పఱచుదామంటే
కనులుమూసుకొని కరుణమానుకొని శిలవైనావా
నీ నిదుర వదలజేసీ నిను మేలికొలుపుదామంటే
పాడకూడదని స్వరము నీయకా మూగజేసినావా
సంకట హరణా దిక్కు నీవని శరణు వేడు నా గోడే వినవా
3. నీ దరిని జేరరాలేను-నువు గిరిని వీడి రాలేవు
నీకు దూరమై జగము శూన్యమై జీవించేనా
నా మనసే నీవశమైతే బ్రతుకే అర్పితమైతే
నా కలములోన నాగళములోనా నెలకొనలేవా
శ్రీశ్రీనివాసా పిలిచి పిలిచి నేనలసిపోయినా దయరాదేలా
మైత్రీ దివస శుభాభినందనలు!!
విడరాని బంధం మాకే ఉన్నది
అదే మాకు అందం స్నేహితం అన్నది
1. మా హృదయంలొ అంతా స్నేహమే
ఏనాటికైనా ఒకరికొకరం ప్రాణమే
యుగాలేమారిపొయినా-తుఫానే ఎదురైనా
ఎప్పుడైన గాని చెదిరిపోనిదే స్నేహం
అనురాగ బంధం-అనే పెన్నిధి
అదే మాకు అందం స్నేహితం అన్నది
2. స్నేహానికే జీవితం అంకితం
శాశ్వతం అంటె అర్థం స్నేహితం
పసిపాపకైనా-పరమాత్మకైనా
ధనమే లేకపొయినా-గుణమే లేకపొయినా
ఎప్పుడైన గాని కావాలి స్నేహం
కత్తి కన్న ఎంతో పదునై ఉన్నది
అదే మాకు వరము స్నేహితం అన్నది

3. కులమేదైన మతమేదైనగాని-దేశమూ భాషలూ వేరైనగాని
ఏవాదమున్నా మరే భేదమున్నా-ఏరంగుఉన్నా మరే రూపు ఉన్నా
ఏది ఏమైనగాని కలిసేది స్నేహం-నిలిచేది స్నేహం
సదా మేము మనకై కోరుకుంటున్నది
అదే మేము పంచే స్నేహితం అన్నది