Monday, September 28, 2009

కురియనీ వర్షము- మురియనీ లోకము
తీరనీ తాపము- ఆరనీ దాహము
1. బీడు భూమి ఎదలోన- ఎనలేని హర్షము
మోడులన్ని చిగురించే –అద్భుత దృశ్యము
ప్రకృతి ఆకృతి పచ్చదనము
నదీ నదాలలొ తరగని జలము
2. పంటచేలు కళకళలాడే పర్వదినము
ప్రతి ఇంట గాదెలన్నీ నిండిపోయెసుదినము
ప్రజలంతా ఆనందంతో పరవశించు దినము
అదియేలె అందరికీ సరదాల పండగ దినము
తరలిరా ఉదయమా-బిరబిరా నేస్తమా
రాతిరి కౌగిలి –వదలిరా ప్రియతమా
1. చీకటి వాకిటి హద్దులే నువు దాటి
వేకువ లోకువ కాదని నువు చాటి
కాంతుల తంత్రుల వీణనే నువు మీటి
గెలవాలి తిమిరాలు తొలగించు పోటి
హృదయమే పరచితి
అది నీకు అరుణ తివాచి
2. ఏ మత్తో చల్లింది జాణలే నిశీధి
ఏ మాయో చేసింది జాలమే పన్నింది
వన్నెలే చూపింది వెన్నెల్లో ముంచింది
మైమరపించి బానిసగ చేసింది
మేలుకో మిత్రమా
ఓ సుప్రభాతమా
పూల పానుపు కాదు జీవితము
ఇది అంపశయ్యతో సమము
వడ్డించిన విస్తరను కొంటివా బ్రతుకు
నేస్తం తెలుసుకోలేవేల శునకాలు చింపు వరకు
నీ వేదన పంచుకోనీయి- ఆవేదన నోదార్చనీయి
నేస్తమా అందుకో నాచేయి-కాస్తైనా ఆసరాకానీయి
1. మేక తోళ్ళను కపుకున్న తోడేళ్ళు- నీ వారని తలపోయు వాళ్ళు
గోముఖ వ్యాఘ్రాలు వాళ్ళు-రంగులెన్నో పులుముకున్నోళ్ళు
స్వేఛ్ఛగా వినువీథిలో తిరుగాడు పావురమా
వేటగాళ్ళ ఉచ్చులకు నువు చిక్కుటే విధివిలాసమా
నీ ఎద విలాపమా
నీ వేదన పంచుకోనీయి- ఆవేదన నోదార్చనీయి
నేస్తమా అందుకో నాచేయి-కాస్తైనా ఆసరాకానీయి

2. తెల్లగా అగుపించువన్నీ పాలు కావు
నల్లగా తలపోయు వన్నీ నీళ్ళుకావు
ఎండమావులు చదరంగ పావులు నీ చుట్టీ జీవులు
క్షీరనీరద న్యాయమెరిగే కలహంసలే నీ గురువులు
నీ వేదన పంచుకోనీయి- ఆవేదన నోదార్చనీయి
నేస్తమా అందుకో నాచేయి-కాస్తైనా ఆసరాకానీయి

3. రామునికై వేచి చూచే శబరిలున్నారు
మాధవునికై చేయి సాచే సుధాములున్నారు
గుండెనిండా నింపుకున్న హనుమ లున్నారు
హృదయమే కైంకర్యమిచ్చిన మీరాబాయిలున్నారు
నీ వేదన పంచుకోనీయి- ఆవేదన నోదార్చనీయి
నేస్తమా అందుకో నాచేయి-కాస్తైనా ఆసరాకానీయి

Sunday, September 27, 2009

పండగంటె ఏదో కాదు ఎంచి చూడగా

మిత్రులందరికీ దసరా సరదాల అనందనందనాలు !! అభినందన చందనాలు !!!
పండగంటె ఏదో కాదు ఎంచి చూడగా
ఆనందం పొంగిపొరలి గుండె నాట్యమాడగా
అదే పండగా- బ్రతుకు పండగ
ప్రతి రోజూ పండగ- బ్రతుకంతా పండగ ||పండగంటె||

1. దశకఠులెంతో మంది దర్జాగా ఉండగా-దసరానా పండగా?
నరకులంత నడివీథుల్లోనడయాడుచుండగా దీపావళి పండగా!
నేతిబీరకాయ రీతి జరుపుకుంటె పండగ
పండగెందుకౌతుంది అది శుద్ధ దండగ ||పండగంటె||

2. రైతన్నకు కరువుదీరా పంట పండగ పండగ
నేతన్నకు కడుపారా తిండి ఉండగ పండగ
సగటు మనిషి ఆదమరచి పండగ పండగ
కన్నె పిల్ల కన్న కలలే పండగ పండగ ||పండగంటె||

3. పచ్చనైన ప్రకృతియే కనుల పండగ
కోయిలమ్మ పాట కచ్చేరి వీనుల పండగ
నెచ్చెలిచ్చు ఆనతియే ప్రియుని పండగ
జగతి మెచ్చు దేశప్రగతే జనుల పండగ ||పండగంటె||

4. పది మందితొ సంతోషాన్నీ పంచుకుంటె పండగ
నువు సాయం చేసిన నలుగురు బాగుపడితె పండగ
కలిసిమెలిసి ఉంటేనే కదా పండగ
మనసారా నవ్వితేనే సదా పండగ ||పండగంటె||

Saturday, September 26, 2009

దసరాలు నీవే - సరదాలు నీవే

దుర్గాష్టమి శుభాకాంక్షలు!!
విజయ దశమి శుభాకాంక్షలు!!

దసరాలు నీవే - సరదాలు నీవే
నాకు నీవే నేస్తం- నిత్య వసంతం !

దీపావళినీవే –తారావళి నీవే
నా తిమిర హృదయాన-సత్యజ్యోతి నీవే

సంక్రాంతి నీవే- ఉగాదీ నీవే
నీవుంటె ప్రతి దినమూ- పర్వ దినమేలే

అక్షరం నీవేలే-లక్ష్యమూ నీవేలే
అందుకో ప్రియ నేస్తం-నా శుభాకాంక్షలివియేలే!!

Friday, September 25, 2009

నీవు లేని జీవితం- నిస్సార భరితం నేస్తం

నీవు లేని జీవితం- నిస్సార భరితం
నేస్తం
నీతోటి జీవనం- నిత్య నూతనం
1. నీవు లేకనేను-శిలలా అచేతనం
తెలుసుకో నేస్తం-నీవేలే నా ప్రాణం
2. కన్నులున్న అంధుడ నేను-నీవు లేని నాడు
ఎందుకో తెలుసా నేస్తం-నా దృష్టి వి నీవే ఎపుడు
3. శ్రవణాలు నాకు -అలంకారమే నేస్తమా
నీ పిలుపుకై ఎపుడవి-రిక్కించులే సుమా
4. గొంతు మూగ వోతుంది-నువ్వు పలకరించకుంటే
కలం మూల బడుతుంది-నీ ప్రేరణ లేకుంటే
5. ఉద్వేగ భావాలన్నీ-వ్యక్త పరచలేము కదా
ఉదయించే ఊసులన్నీ-ఉదహరించ సాధ్యమా

Thursday, September 24, 2009

నాప్రణయ దైవమా-జీవిత సర్వస్వమా
ముంజేయి పట్టిచూడు-ఎదన చెవియొగ్గిచూడు
నీ రాకతోనే నాడి ఆగిపోయిందో
పట్టరాని సంతోషంలో గుండె మూగవోయిందో
1. లోకమంత కోడైకూయని-మన స్నేహం అతులితమైందని
జనమంతా మెటికలు విరవని-మన బంధం అజరామరమని
నీవులేక వెయ్యేళ్లెందుకు-మోడులాంటి ఈ బ్రతుకు
నీవుంటె క్షణమే చాలు-నందనవన మయ్యేటందుకు
ఓ ప్రాణ నేస్తమా –ఓ నా సమస్తమా
నా మేను తాకి చూడు-నా శ్వాస జాడ చూడు
నిన్ను చూడగానే ఒళ్లు చల్లబడిపోయిందో
చెప్పరాని ఆనందంలో ఊపిరి గతి ఏమయ్యిందో
2. నా తపస్సు ఎంత తీవ్రమో-నీ మనస్సు కే ఎరుక
నా దీక్ష ఎంత కఠోరమొ-పంచ భూతాలకె ఎరుక
ఎన్ని యుగాలైనా గాని-మానలేను నీ ధ్యానం
నేనిక జీవశ్చవమే-నీలో చేరె నా ప్రాణం
ఓ నా మిత్రమా-నా అంతర్నేత్రమా
నా ఛాతి చీల్చి చూడు-దేహాన్ని కోసి చూడు
అణువణువు లోనూ నీవె నిండి ఉంటావు
జీవకణము లోనూ కనిపిస్తువుంటావు

Friday, September 18, 2009

బి.నర్సయ్య_ పెద్దపల్లి
9491041835 06-07-2009.
ప్రియమైన రాఖీ గారూ.....!
మీ ధర్మపురి నరహరి శతకం సాంతం చదివాను.మరొక్కసారి ధర్మపురి వీథుల్లో ,గోదావరి తీరాన విహరించిన అనుభూతి_’సిరివెన్నెల ’లో – ఈ గాలీ ఈ నేలా - పాటలా.
భక్తిరసానికి ఆధునికతను జోడించి తేలికైన పదాలతో మీ భావాల్ని, అనుభూతుల్ని సూటిగా ఆవిష్కరించారు.
పదప్రయోగంలో మీ విలక్షణత అనితర సాధ్యం, ఈ కావ్యానికి ప్రత్యేక ఆకర్షణ అదే! ఆభరణాల్లో కంసాలి రాళ్ళను పొదిగినట్లు పదాలను కూర్చి పద్యాలను మెరిపించే నైపుణ్యత మీలో ఉంది.
నాకు తోచిన రీతిలో _ఈ సంపుటిలో రెండు విభిన్న వస్తువు(content)లతో కూడిన పద్యాలున్నాయి.ఒకటి –ధర్మపురి నరహరిని స్తుతిస్తూ ,అనుగ్రహాన్ని ఆశిస్తూ ,ధర్మపురి క్షేత్ర ప్రత్యేకతల్ని వర్ణిస్తూ ఉన్న పద్యాలు , ఇవి భక్తిరస ప్రధానమైనవి ,వీటన్నింటికీ ’ధర్మపురి నరహరి ’ అన్న చివరి పాదం ,వాటిని సంపూర్ణం చేస్తుంది.
ఉదా|| 1 నుండి 40 దాకా పద్యాలు.
రెండో రకం- సమాజాన్ని సరిదిద్దాలనే ఆకాంక్షతో దానిపై సంధించిన బాణాలు – మానవతా వాదానికి ప్రతీకలు, ఉదా|| 49 నుంచి దాదాపు మిగతావన్నీ.వీటికి ’దర్మపురి నరహరి ’ అన్నది అదనపు పంక్తియే.మొదటి మూడు పాదాలతో ఇవి నిక్కచ్చిగా నానీలే.మిగితావి ’నా’ ,’నీ’ లు కావచ్చు.
ఈ కాలం కవులు తమ సంపుటాలను ముఖచిత్రాల విషయంలో ,ముద్రణ విషయంలో Novelty కోరుకుంటున్నారు.దాని వల్ల Readers & Saleability పెరుగుతుంది.
నిరంతర పఠనం ద్వారా కవి మరింత ఉత్తమ కవిత్వాన్ని అందించగలడని ఓ పీఠిక లోఉంది. పేజీ 11 చివరి పంక్తి- నేటి కవులకు నాటి కవుల పఠనం అని ఉండాలేమో ....
భావ స్పష్టతతో పాటు భావ గర్భితం కవనాన్ని రసమయం చేస్తోంది. భావగర్భిత కావ్య సృష్టి అశేష ,విశేష కృషి దీక్షలతోనే సాధ్యం. అది ఓ తపఃఫలం .ఈ దిశలో పయనిస్తున్న నీవు మరింత సఫలీకృతుడివి కావాలని కాంక్షించే ఓ సాధారణ పాఠకున్ని నేను.
శబ్దం నిద్ర పుచ్చుతుంది
శబ్దం నిద్రలేపుతుంది
శబ్దం మనసును వెన్న ముద్ద చేస్తుంది
శబ్దం భయపెడుతుంది
ఆ శబ్దం సంగీతం గా రావచ్చు
గీతంగా రావచ్చు
శబ్దానికి భాష అర్థాన్నిస్తే
సరిగమలు ప్రాణం పోస్తాయి
“శబ్ద శిల” “సంగీత – గీత శిల్పం” గా మారిన వైనం
దాని మహత్తు, అది అలరించేతీరును అంశంగా తీసుకొని
మీరు సృజియించిన ఈ రచన నిరుపమానము!
సంగీత –గీత సారాన్ని ఆస్వాదించి జన్మ సుసంపన్నం చేసుకోమని, సరిగమలను శ్వాసిస్తే అవే జీవన వీణను సరి చేస్తాయని ప్రబోధిస్తోంది మీ సంగీత గీత.
కళలు టైంవేస్టు ,అనే పిచ్చోళ్లకు ’యంత్రానికైనా కావాలి ఒరాలింగు-రెస్టు’ – అనే సందేశం నేటి తరానికి లేహ్య సమానం.
“బ్రహ్మ కేటాయించిన శ్వాసల కోటా
ఎప్పుడయిపోతే అప్పుడే టాటా! “
ఎంత సింపుల్ గా జీవిత రహస్యం విప్పారు-అత్యద్భుతం!
“” టీవీ చూస్తే పని పాడే ,బెటర్ ఐపాడే , దానికదే పాడే “”
“పాడే” త్రిపాత్రాభినయం చేసింది
“” చింతకాయలు రాలాయా సంగీతమంటే అంతేమరి “”
కొత్త నడక!
రాళ్ళే కరిగినప్పుడు చింతకాయలు రాలకపోవడమేంటి?
“” ఫ్రీగా వస్తే దేనికైనా ఎగబడతాం
పుస్తకాలైతే మూలన బెడతాం “”
చెప్పును బట్టలో పెట్టి దవడ పై కొట్టినట్లుంది
Single concept పై రాసినా ఎక్కడా repetition పోవడం మీ ప్రతిభకు తార్కాణం!
ఈ రచన లో వ్యంగ్యం ఉంది.వేదాంతం ఉంది. లలిత కళలనాశ్రయించి జీవనకారడవిని నందనవనంగా మార్చుకోమని ఉద్బోధ ఉంది.
సమాజం పట్ల బాధ ఉంది. బాధ్యత ఉంది. ఎంత చెప్పినా బుద్దిరాదేం అని అక్రోశం ఉంది.
సప్తస్వరాల్లా ఏడు పరిచయ వాక్యాలున్నాయి.positive గా వివరణాత్మకంగా బాగున్నాయి. ఒకే school of thought కు సంబంధింనట్లున్నాయి.
రచనలో ఎలాంటి భాగస్వామ్యం లేని జీవిత భాగస్వామిని చివరి అట్టపై వామపక్షాన చేర్చుకోవడం- ఎల్లవేళలా గీతను పలవరించడమనుకోవాలా!
మీరన్నట్లు ఒకేరాత్రి ఇవన్నీ రాయడం నిజమైతే మీ ప్రతిభ అంచనాలకందనిదే!
ఈ ప్రతిభ మరిన్ని కవన రీతుల్లో భాసిల్లి మీరు పరిపూర్ణ కవిగా రాణించాలని నా ఆకాంక్ష _
_బి.నర్సయ్య.

Friday, September 11, 2009

లీలగా
తెలుసుకున్నాను ఈజగమె నీ లీలగా
చేరుమార్గమేది తల్లీ నిన్ను అవలీలగా
రాణిగా
కొలవనా నిన్ను మహరాణిగా
తలవనా శ్రీచక్రనగర సామ్రాజ్ఞిగా
నిలవనా నీ పాదాల పారాణిగా
1. ఇంద్రాది దేవతలూ నిన్నెరుగలేరు
సప్తమహాఋషులు నిను తెలియలేరు
నారదాదులైనా నిన్ను వర్ణించలేరు
మామూలు మానవుణ్ణి గ్రహియించ తరమా నీతీరు
2. నవ్వులతో జీవితాన్ని నందనవని చేస్తావు
అంతలోనె అంతులేని అంబుధిలో తోస్తావు
మునకలేస్తు సతమతమైతే వినోదంగ తిలకిస్తావు
విశ్వరచన యనే కేళితో సతతము పులకిస్తావు
3. నిన్ను తెలియ గోరితే నిమిషంలో కరుణిస్తావు
నీ శరణు పొందితే చేయిపట్టి నడిపిస్తావు
సదా నిన్ను భజియిస్తే అమ్మగా లాలిస్తావు
భువనైక లీలారాణిగ మమ్ముల పరిపాలిస్తావు

Monday, September 7, 2009

డా|| వై.యెస్. రాజశేఖర్ రెడ్డి గారి కి శ్రధ్ధాంజలి ఘటిస్తూ---
మేరు నగధీరుడు
బద్ధ కంకణ ధారుడు
అపర భగీరథుడు
మన రాజశేఖరుడు
నిజ కీర్తిశేషుడు
జన హృదయ నివాసుడు
1. ఉపాధి హామీ దారుడు
యువత మార్గ దర్శకుడు
రైతుజన బాంధవుడు
హరితాంధ్ర సాధకుడు
2. పావ్ల వడ్డీ షావుకారు
స్వశక్తి గ్రూపుల గుత్తెదారు
బీడు నేలల కౌలుదారు
బీద ఎదల జాగీర్దారు
3. ఆకృతి లో నవ్వే జాబిలి
జగతిజనుల ఆశాజ్యోతి
మా స్మృతిలో చిరంజీవి
ఈ కృతియే మా నివాళి

Saturday, September 5, 2009

సాగరం కాదది నా కన్నీటి కాసారం
వర్షం కాదది నా అశ్రుభాష్ప తర్పణం
నయనజలం ఇంకిపోతె కారింది రుధిరం
కఱకు శిలలు కరిగినా ద్రవించలేదు నీ హృదయం
ఓ చెలీ వజ్రమే సృష్టిలోన అతి కఠినం
బ్రహ్మకే ఆశ్చర్యం! నీ ఎద కఠినాతి కఠినం
1. నీ గుండెను చెక్కబోతె ఉలులే విరిగాయి
నీ మదినే మలచబోతె నా చేతులు తెగాయి
నీ ఎడద ఛేదించగా బాంబులే బెదిరాయి
నీ హృదయం గెలుపుకై ఫిరంగులే జడిసాయి
ఓ చెలీ వజ్రమే సృష్టిలోన అతి కఠినం
బ్రహ్మకే ఆశ్చర్యం! నీ ఎద కఠినాతి కఠినం
2. నీ మనసును కరిగించబోతె అగ్నిశిఖలు వెఱిచాయి
నీ యోచన మరలించబోతె నవనాడులు కృంగాయి
నీ దృక్పథమును మార్చబోతె తలనరాలు చిట్లాయి
నీ ప్రేమ చూరగొనబోతే ప్రాణాలేపోతున్నాయి
ఓ చెలీ వజ్రమే సృష్టిలోన అతి కఠినం
బ్రహ్మకే ఆశ్చర్యం! నీ ఎద కఠినాతి కఠినం

Tuesday, September 1, 2009

నిమజ్జనం నిమజ్జనం-ఊరంతా జనం జనం
ఉత్సాహాల భక్త జనం
మనసానంద సృజనం సృజనం-మహదానంద ప్రభంజనం
గణపతిరూపే నిరంజనం-స్వామికిదే నిత్య నీరాజనం
1. స్వామి జననం విస్మయ భరితం
గజ శిర ధారణ అది ఘన చరితం
జననీ జనకుల భక్తి పరాయణత్వం
మాషికవాహనుడే తార్కాణం
చేసి ముమ్మరు తా ప్రదక్షిణం
సాధించెను ప్రమధ గణాధిపత్యం
2. ప్రథమ పూజకే అర్హత పొందెను పార్వతి నందనుడు
విఘ్న వినాశకుడని పేరొందెను శ్రీ గణనాథుడు
భక్తుల పాలిటి కల్పవృక్షమే వక్రతుండుడు
కాణిపాకమున కొలువైనాడు కలియుగ భక్త వరదుడు
3. పూజలు భజనలు నవరాత్రాలు సంబరాలు
ఆటలుపాటలు కేరింతలు తాకెను అంబరాలు
భక్తీ ముక్తీ స్నేహానురక్తీ మదిలో ఆనంద డోలలు
వర్ణించలేము బొజ్జగణపతీ ఈ నిమజ్జన లీలలు
మరచిపోలేని మధురానుభూతి
కరిగిపోయేటి కలకాదు నీ స్మృతి
కలయిక యాదృచ్చికమైనా యుగయుగాల బంధమిది
తెలుసుకో నేస్తమా!మన చెలిమి జన్మాంతరాలది
1. ఎందరో ఎదురౌతారు ఈ జీవన యానంలో
చేరువైపోతారు తప్పనిసరియైన స్థితిలో
మనసులు ముడివడకున్నా మనుగడ సాగిస్తారు
ముసుగులెన్నో వేసుకొంటూ మనల మోసగిస్తారు
2. నీ విలాసమే తెలియదు రూపేంటో అసలే తెలియదు
కలుసుకున్న తరుణం మినహా వివరాలింకేమీ తెలియదు
ఎందుకింత అనురాగం-ఎక్కడిదీ స్నేహ యోగం
సాధ్యపడేదేకాదు-ఎన్నటికీ మనసహ యోగం
3. మన స్నేహితంలో స్వార్థానికి తావుందా
ఈ కాలయాపనకు ఇంచుకైన అర్థముందా
దైవానికే ఎరుక దీనిలో పరమార్థం
ఏమి కూర్చిఉంచాడో ఇందులోన అంతరార్థం