Tuesday, April 21, 2009

సాకి: పంచభూతాలకు లేదు మరణం
వేద శాస్త్రాలకు లేదు మరణం
విశ్వకాలాలకు లేదు మరణం
సుందర శ్రీహరి గారూ! మీకెక్కడిదయ్యా మరణం
జీవించే ఉన్నారు మా మదిలో ప్రతిక్షణం

నడిచే చలివేంద్రం-కదిలే ధర్మసత్రం
మంచితనానికి మీరే మారుపేరు-శ్రీహరి గారూ మీకు జోహారు
సుందర శ్రీహరి గారూ- మీకు జోహారూ! ||నడిచే||
1.)ధీర గుణానికి రామునితో సరి పోతారు
దాతృత్వానికి శిభికే తుల తూగేరు
మానవతకు ఎవరైనా సరె మీ తరువాతే
అనురాగమనేదీ ఎప్పటికీ అది మీసొత్తే || సుందర శ్రీహరి గారూ||
2.)సోదరులంతా భావిస్తారూ ధర్మరాజని
బంధువులంతా తలపోస్తారూ మహరాజని
పిల్లాపాపా అందరికీ మీరే ఆరాధ్యం
ఎవ్వరినైనా ఆదరించడం మీకేలే సాధ్యం ||సుందర శ్రీహరి గారూ||
3.)ఉన్నత శిఖరాలధిరోహించుట మీకలవాటే
ఇంటాబయటా మన్ననలందుటయూ పరిపాటే
తనలోలేని గొప్పతనాన్ని చూసాడేమో దైవం
త్వరపడి నేర్వగ కబురంపాడో మీ కోసం ||సుందర శ్రీహరి గారూ||
శాంతికి అర్థం చెప్పిన బాపూ
హింసను దూరం తోలిన బాపూ
పుట్టాడీరోజు-ఇది బాపూ పుట్టిన రోజు
అక్టోబరు రెండూ బాపూ పుట్టిన రోజు ||శాంతికి||

తుపాకులకు వెరవని బాపూ
చెఱసాలకైన వెళ్లిన బాపూ
సత్యాగ్రహముచే పట్టిన బాపూ
ఆంగ్లేయుల నెదిరించిన బాపూ || పుట్టాడీరోజు||

స్వరాజ్యమే తెచ్చిన బాపూ
సమతాభావం చాటిన బాపూ
అస్పృశ్యతను మాపిన బాపూ
మహాత్మునిగ వెలిగిన బాపూ ||పుట్టాడీరోజు||

చాచా నెహ్రుకు చెలికాడు
నేడు పుట్టిన శాస్త్రికి సరితోడు
ఇందిర గాంధికి గౌరవనీయుడు
మనకందరికీ మార్గ దర్శకుడు ||పుట్టాడీరోజు||
వీడుకోలిదె ప్రాణ మిత్రమ
వీడుకోలిదె నేస్తమా-
వీడిపోయే వేళలో
జోహారు నీకిదె స్నేహమా

ఎక్కడో ఇల పుట్టినారము
భాగ్యవశమున కలిసినాము
వేషభాషలు భిన్నమైనా
భావనలు పలు విధములైనా
చిక్కుబడితిమి మైత్రి వలలో
ఎంత మధురము స్నేహ చెఱలో

కరడు గట్టిన కడలి మనలను
కాలుడై ఇల వేరుచేసే
కన్నుమూసి తెఱచునంతలొ
స్నేహ స్వప్నం కరిగిపోయే
రగిలినవి మా ఎదలొ చితులే
మిగిలినవి నీ స్నేహ స్మృతులే
మేలుకోరా సోదరా-ప్రళయ శంఖం ఊదరా
ఉడుకు రక్తపు యువత శక్తిని ప్రజ్వలింపగ జేయరా

ఉరకలేసే యువతరానికి-పిరిమందు పోయువారిని
అడుకు అడుగుకు అడ్డుపుల్లలు వేసి ఆనందించువారిని
తరిమి తరిమి కొట్టరా-ఊరి బయటకు నెట్టరా

కులము మతమను కుళ్ళుభావము-క్షణము క్షణము చూపువారిని
గుడులపేరిట లింగములనే మ్రింగి వేసే నంగనాచుల
తరిమి తరిమి కొట్టరా-ఊరి బయటకు నెట్టరా

రక్షచేసెడి వారలే ఇల భక్షకులుగా మారినప్పుడు
రాజకీయపు దుష్టశక్తులు రోజురోజు రేగినప్పుడు
వీరభద్రుడె నాట్యమాడిన విధముగా
కాల రుద్రుడె కన్ను తెఱచిన రీతిగా
మేలుకొలుపులు పాడువేళ-జోల పాటలు పాడనేల
యువత జాగృతి చెందువేళ-మరల నిద్దుర పుచ్చనేల || మేలుకొలుపులు||

వెలుగు నిండే కంటిముందు-నలుపు తెరలను దించనేల
జవము చంపే మత్తుమందు-యువతకిపుడందించనేల || మేలుకొలుపులు||

ప్రగతి పూవులు పరచు దారిన –రాజకీయపు కంపలేల
సమత సౌరభ మారుతమున- కులమతమ్ముల కంపులేల || మేలుకొలుపులు||

కొంపనలుదెసలంటుకొనిన-కోతికొమ్మల ఆటలేల
ఉగ్రవాదపు ఊచకోతకు-ఊక దంపుడు మాటలేల || మేలుకొలుపులు||
మాయా లోకం
-రాఖీ
చిరునవ్వుల ముసుగులు - ఎదలోతుల లొసుగులు
ఎవరికొరకు ఈ వింత నాటకాలు - మనుషులంతా ఎందుకు దొంగాటకాలు ||

1.) మొహమాటం మూయునెపుడు -హృదయ కవాటం
బిడియమెపుడు తెరవనీదు-మనసు గవాక్షం
కక్కలేని మ్రింగలేని-తీరే దయనీయం
పారదర్శకత్వమే-సదా హర్షణీయం || చిరునవ్వుల ముసుగులు ||

2.) డాంభీకం డాబుసరితొ – ఉన్నతులని కొలువబడం
భేషజాల ప్రకటనతో – భేషని కొనియాడబడం
పులిఎదురయ్యే వరకె – మేకపోతు గాంభీర్యం
దివాలయ్యి దిగాలయే- దుస్థితే అనివార్యం || చిరునవ్వుల ముసుగులు ||

3.) ఆత్మను వంచించుకుంటె-అవుతుందా అది లౌక్యం
కప్పదాటు మాటలేపుడు-కానేరవు నమ్మశక్యం
జీవితాన అవసరమా-ఇంతటి సంక్లిష్టం
నిన్ను నిన్నుగ చూపేదే-నిజమైన వ్యక్తిత్వం || చిరునవ్వుల ముసుగులు ||
మానవతే లేని ఓ మూగ జీవులారా
నేర్చుకోండి మా నీతులను
నాగరికత ఎరుగనీ జంతువులారా
తెలుసుకోండి మా రీతులను
ఆటవికతె మా న్యాయం- పాశవికతె మాధ్యేయం ||మానవతే||

ఆడదాన్ని అంగడిలో నిలబెట్టడమేలాగునో
మొగవాడికి బజారులో వెలకట్టడ మేలాగునో
వివాహములొ ఎదురయ్యే వివాదముల తీరును
సమాజములొ నిదురోయే నినాదముల హోరును
మానవతే లేని ఓ మూగ జీవులారా
మార్చుకోండి మీచట్టలూ
నాగరికత ఎరుగనీ జంతువులారా
తీసుకోండి వరకట్నాలు
దారుణమే మా సంస్కృతి- బలిగొనుటె మా ధర్మనిరతి

కులాలతో సోదరులను పొడవడమేలాగునో
మతాలతో నేస్తాలను నరకడమేలాగునో
స్వార్థంతో జాతినే పెకలించడమేలాగునో
వంచనతో దేశాన్నే ముంచేయడమేలాగునో
మానవతే లేని ఓ మూగ జీవులారా
మార్చుకోండి మీ శాస్త్రాలు
నాగరికత ఎరుగనీ జంతువులారా
చేర్చుకోండి మా సూత్రాలు
హింసయే మాధర్మం- విధ్వంసమె మా లక్ష్యం
మహిళా ఓ మహిళా-ఇకనైనా మేలుకో
స్వయంసహాయ సంఘంలో-ఇపుడైనా చేరిపో
ఆర్థిక స్వేఛ్ఛను నేడే –అందిపుచ్చుకో
సంఘటిత శక్తి విలువ-తెలుసుకో తెలుసుకో ||మహిళా||

క్షణం వృధా చేయకుండ-పనిచేసుకో
నిరంతరం నీ సొంత –ఆదాయం పెంచుకో
దుబారా ఖర్చులనిక- తగ్గించుకో
పైసాపైసా కూడబెట్టి- పొదుపు చేసుకో ||మహిళా||

అనుకోని ఖర్చులొస్తె- సంఘ ఋణం తీసుకో
చిన్నవడ్డి సులువు కిస్తి-సౌకర్యం అందుకో
గ్రూపుకున్నలాభంలో- భాగస్వామివైపో
అంచలంచలుగానీవే-అంబరాన్ని అందుకో ||మహిళా||

నీఇల్లూ నీగ్రూపూ నీవూరూ-బాగుచెయ్యి
సాటి మనిషి కష్టాన్ని నీదని తలపోయి
ఒకరికొకరు తోడునీడ-కష్టాల్లో బాసట
సంఘ సభ్యులంత కలిసి-సాగాలీ ప్రగతి బాట ||మహిళా||
మనసు పాడే పాటకు ఏదీ రాగం
తనువు మరచే ఆటకు ఏదీ తాళం
గగన కుసుమాలే-కోసుకొద్దాము
ఘన సాగరాల-లోతు చూద్దాము ||మనసు||

ఎదురులేదు మనకెన్నటికీ-ఎదురీదడమే పరిపాటి
బెదురులేదు ఏ పనికీ- ప్రతీకలం సాహసానికీ
ఉత్సాహాలే ఊరంతా-పంచిపెడదామా
ఉద్రేకాలే గుండెల్లో-ప్రవహింపజేద్దామా ||మనసు||

నయాగరా ధారల్తో-పైపైకి పాకేద్దాం
సహారా ఎడారిలో-జీవ గంగ పారిద్దాం
చుక్కలనే మాలగ్రుచ్చి-చెలిమెడలో వేసేద్దాం
జాబిల్లిని నేలకు తెచ్చి-వాకిలికే తగిలిద్దాం ||మనసు||
బాలలం మనం
వీరులం మనం
భావి భరత పౌరులం మనం

జై జవాననీ
జై కిసాననీ
ఎలుగెత్తీ చాటుదాం

జాతి పితా బాపూజీ
జాగృతికీ నేతాజీ
అడుగులలో సాగుదాం

స్వతంత్రులం మనం
వీణాతంత్రులం మనం
దేశ ప్రగతి పాట పాడుదాం
ప్రణయాల ఉయ్యాల నే ఊపనా
స్వప్నాల స్వర్గాల నే చూపనా
(నా)ఇల్లాలి కే లాలి నే పాడనా
కంటికి రెప్పలా కాపాడనా
||లాలిజో లాలిజో హాయిగా నిదురపో
ఆదమరచి నిదురపో-జగము మరచి నిదురపో||

1.) శిశిరపు బ్రతుకున ఆమనివైనావు
మౌన జీ వనమున కోయిలవైనావు
చకోరి కోరే చంద్రికవే నీవు
మయూరి మురిసే శీకరమే నీవు
సంగీత గీతాల నందించనా
సంసార సారాల నినదించనా ||లాలిజో||

2.)అన్నపూర్ణమ్మలా అన్నదాతవైనావు
శిభి చక్రవర్తిలా దేహదాతవైనావు
వంశాంకురాలకే జన్మదాతవైనావు
నను తీర్చిదిద్దెడి విధాతవైనావు
నా పూర్ణాంగి వీవని కీర్తించనా
పూర్ణనారీశ్వరిగ నర్తించనా ||లాలిజో||

3.)నీవున్న గృహమే నందన వనము
నీ సహచర్యమే బృందావనము
నీతోకలయిక పరిపూర్ణ జీవనము
నీవే జీవిత రసరమ్య గీతము
అనుక్షణము నీతో ఆహ్లాదము
నాపాలిటీ వరము నీ దోహదం ||లాలిజో||
ప్రగతి తెచ్చిన నాడే పర్వదినం
జగతి మెచ్చిన నాడే గర్వదినం
ఏనాడో ఆ పర్వదినం- ఆనాడే హర్షించగలం

నరకులెందరు హతమైనా తొలగలేదు ఇక్కట్లు
నిండుపున్నమి నాడైనా అమావాస్య చీకట్లు
ప్రతిమనిషి మనసులోని నరకులందరిని వధియించు
ఎద ఎదలో ఈ క్షణమే చిరుదీపం వెలిగించు
అదే అదే దీపావళి-విరియును ఆనంద సుమాళి
ఆనాడే హర్షించగలం- ఆనాడే దాన్ని పంచగలం

మహామహుల త్యాగబలం-మన స్వాతంత్ర్యఫలం
ప్రజాస్వామ్యవాదపుచిహ్నం- మన గణతంత్ర దినం
ప్రతి పౌరునికీ నాడు అడుగంటెను- స్వతంత్రం
నియంతృత్వ ధోరణిలో మొదలయ్యెను కుతంత్రం
నిజమెరిగి మెలిగిన నాడే-ప్రతి రోజూ ఓ పండగే
ఆనాడే హర్షించగలం-ఆనందం వర్షించగలం

గాంధీజీ విగ్రహాలకు వెయ్యేసి అతుకులు
నెహ్రూసిద్ధాంతాలకు-పేర్చారు చితుకులు
వెలికిరాని వీరుల జీవశ్చవపు బతుకులు
వెలిగిపోయె నేతలందరొ పాసిపోయిన మెతుకులు
యువశక్తి రుచిచూపాలి నవభారతి చిగురించాలి
ఆనాడే నవోదయం- అంతా ఆనంద మయం
పూలేల పూజకు నా కన్నులె కలువలు
పూలేల పూజకు నా నవ్వులె మల్లెలు
నీపదముల నిలిపేందుకు నా హృదయమె మందారం
నీ మెడలో వెలిగేందుకు నా మనసే సుమ హారం || పూలేల పూజకు||

అందమైన నాసికయే అదిఒక సంపెంగ
చక్కనైన చెక్కిళ్ళే రోజాల తీరుగ
మెరిసేటి దంతాలే ముత్యాల పేరుగ
అర్చింపగ వేరేల అవయవాలె చాలుగ || పూలేల పూజకు||


నా కరములె నిను కొలిచే కమలాలే అవగా
అవకరములు లేని తలపు మొగిలి రేకు కాగా
నా కంఠమె జేగంటై నీకు హారతీయగా
అర్పిస్తా నా బ్రతుకే నీకై నైవేద్యంగా || పూలేల పూజకు||
పాడలేనా నేనొక గీతి
రసిక జనులకు రంజకమైనది
పొందలేనా ఘనతర కీర్తి
హిమవన్నగ తుల్యమైనది

హృదయాంతర సీమలు దాటే -మృదు మంజుల కోకిల గీతం
నవనాడుల వీణలు మీటే-ఝంకారమ్ముల తుమ్మెద గీతం
అనురాగ రాగాలే-కళ్యాణయోగాలై
కలత మరచి-కలలు గెలిచి –కరిగించు గీతం-ఒక ప్రణయ గీతం

ఎదరేగిన మంటలనార్పే-జడివానల శ్రావణగీతం
స్మృతిదాగిన వేదన తీర్చే- విరితేనెల ఆమనిగీతం
అనుభూతి స్పందనయే-ఆనందభైరవియై
ఊయలూపి-జోలపాడి-మురిపించు గీతం-ఒక మత్తుగీతం

అరుణోదయ కాంతులు చింది-చీకట్లను చిదిమేగీతం
వేలవేల గొంతులు పలికే-జనజీవన చైతన్యపు గీతం
చెరగని సమైక్యభావం-పూరించగ శంఖారావం
జగతి రథమే-ప్రగతి పథమై-పయనించు గీతం-అభ్యుదయ గీతం
పాడబోతే గొంతురాదు
తిందామంటె కూడులేదు
ఏటికెళితే నీరు లేదు
తోటకెళితే నీడ లేదు

తూరుపసలే ఎరుపు లేదు
తెల్లావారినా వెలుగు రాదు
పల్లె వాడలొ పలుకు లేదు
పట్టణాలలొ-ఉలుకు లేదు

భూమి గమనం ఆగలేదు
అణుబాంబు పేలలేదు
జనమంతాచావలేదు
అదిచెప్తె గాని అర్థంకాదు

అరాచికానికి అదే పునాది
సొంతత్రానికి ఇక సమాధి
ఎమర్జెన్సీ తొ చేసారు సంధి
నియంతృత్వానికి అదే నాంది
పల్లె పల్లెనా వెలిసిందొక- పదిలమైన బ్యాంకు
తెలంగాణకే మణిహారమై- వెలుగుతున్నబ్యాంకు
అదే మన గ్రామీణబ్యాంకు- దక్కన్ గ్రామీణ బ్యాంకు
పేద ప్రజలకోసమే- పల్లెటూళ్లైన సరే
ఐదు జిల్లాలలో-అందరికీ అందుబాటులో
సేవయే ధ్యేయంగా-జన శ్రేయమే లక్ష్యంగా

చెరగని చిరునవ్వుతో- సాదర ఆహ్వానాలు
విసుగెరుగని మోముతో- సేవా సౌకర్యాలు
కస్టమర్లె తనకిష్టమనే-శ్రేష్ఠమైనదీ బ్యాంకు
కష్టాల్లోమనపాలిటి-అదృష్టదేవత ఈ బ్యాంకు ||పల్లె పల్లెనా||

పొదుపంటే ఏమిటో-నేర్పునది ఈబ్యాంకు
చదువురాని వారైనా- నమ్మదగినదీ బ్యాంకు
అవసరాల కనుగుణ-పథకాలు కల్గిన బ్యాంకు
మనసెరిగీ స్పందించే-మహితమైన బ్యాంకు ||పల్లె పల్లెనా||

సన్నకారు చిన్నకారు-రైతులనాదుకొనేబ్యాంకు
దళితజాతికంతటికీ-వెన్నుదన్నైన బ్యాంకు
సబ్సిడీస్కీములెన్నొ-చక్కగ అమలైన బ్యాంకు
ఒక్కమాటలో చెప్పలంటే- మనకు మేలైన బ్యాంకు
మేలిమి బంగారు బ్యాంకు ||పల్లె పల్లెనా||

సింగరేణి కార్మికులూ-సొంతమనుకునే బ్యాంకు
రైతన్నలు తమపాలిటి-వరమని భావించు బ్యాంకు
నిరుద్యోగ యువకులకు-ఊతమైన బ్యాంకు
మహిళాభ్యుదయానికే-అంకితమైన బ్యాంకు ||పల్లె పల్లెనా||
పలురంగులు వేసుకున్న రాజకీయమా
చిరునవ్వులు పులుముకున్న రాక్షసత్వమా
మసలుకో ఇకనైనా మనవతా రీతిలో
కలిసిపో ఇపుడైనా మా’నవతా’జాతిలో ||పలు రంగులు||

అధికారం నీ కోటకు రక్షిత ప్రాకారం
అవినీతే నీ కున్న ఆరవ ప్రాణం
స్వార్థం నీ ప్రధాన సలహాదారు
మకుటంలెకున్నా నువ్వే మహరాజు ||పలు రంగులు||

కంటితుడుపులెన్నడూ-మాగొంతులు తడుపవు
వొట్టిమాటలెప్పుడూ- మా పొట్టలు నింపవు
నీటిమీది రాతలకే- జీవితాలు మారవు
నోటి తుంపరలకే-గుండెమంటలారవు ||పలు రంగులు||

మెడక్రింది మేక చన్లు నీ ప్రగతి పథకాలు
నీ మాటలె నీ పాలిటి అపకీర్తి పతకాలు
ఏల్నాటి శనివీడని-ప్రజల జాతకాలు
నా సోదర పౌరులకివె సుప్రభాత గీతాలు ||పలు రంగులు||
నువు ఏడవకో వెర్రి కన్నా
ఏడిస్తె నీ కళ్ళు నీలాలు కారు
నీలాలు కారితే తిరుగు నా కంటనూ నీరు

అందరాని జాబిలిని కూడ-నింగి కెగసి తీసుకరానా
తళుకు మనెడి చుక్కలనైనా-నీవు కోరితె కోసుక రానా
కాలికి ముల్లు నాటకుండ-పూల దారుల నడిపించనా

కొండమీది కోతైన గాని-నిలిపెద నీముందు నిమిషములోనా
గొంతు పగిలే పాటైన గాని- పాడెద నీవూ పరవశమొంద
బోసినవ్వుల వానల కొరకు- బీడు ఎదలే ఎదిరి చూడగ
నీవూ నేనూ కలిసామంటే మనం
చేయీ చేయీ కలిపామంటే బలం
లేదుకులం లేదు మతం
అందరు ఒకటైతేనె జయం విజయం

గడ్డిపోచలన్ని కలిస్తే గజమునైన బంధిస్తాయి
చీమలన్ని కలిసాయంటే పామునైన చంపేస్తాయి
చినుకులన్ని కలిసాయంటే చెఱువులన్ని నింపేస్తాయి
దారులన్ని కలిసాయంటే గమ్యాన్ని చేరుస్తాయి

దిక్కులన్ని కలిసాయంటే ప్రళయమే వస్తుంది
చుక్కలన్ని కలిసాయంటే విశ్వమే ఛస్తుంది
ఒక్కొక్కరుకలిసారంటే బలం పెరిగిపోతుంది
ఒక్కుమ్మడి కదిలారంటే జగంవణికి పోతుంది
నీ దారి ఎడారిగా మారితే
గ్రీష్మ ఋతువు హేమంత మైతే
కన్నీళ్లతో దప్పికతీర్చుకో
ఆకలి మంటతొ చలి కాచుకో

నీ వెనుకగ నుయ్యెవరో త్రవ్వితే
నీ ముందొక గొయ్యేఎదురైతే
ఈత వచ్చిఉంటే నూతిని ఎంచుకో
చేత కాకుంటే గోతినే ఎన్నుకో

లోకంలో నీవొంటరివైతే
నీ కోసం ఎవరూ లేకుంటే
నీ నీడే నీకు తోడురా
దిగులు వీడి అడుగు వేయరా

నీ వాదం ఒక వేదమైతే
నీ మతమే మానవతే ఐతే
నీవే ఆ కనిపించని దైవం
నీ పథమంతా సమభావం-సమతాభావం
నవ్వు నవ్వు నవ్వె నీకు ఒక అందము
నవ్వుతూనె పంచు మాకు మకరందము
నవ్వులోనె హాయీ దాగి ఉన్నదోయీ
నవ్వులోని గొప్పమర్మమెరిగి సాగు భాయీ

దొంగలెవ్వరైనను దోచుకోన్నిధి
దానమెంత చేసినా తరిగిపోన్నిధి
పరమాత్ముడిచ్చినా ఘన పెన్నిధి
అంతులేని సంపద నవ్వు అన్నది
నవ్వు సౌందర్యం-నవ్వు సౌకుమార్యం
నవ్వె మోముకు ఒక ఆభరణం

నవ్వు విలువ నెరుగవోయి ప్రియ నేస్తము
నవ్వుతూనె సాచవోయి స్నేహ హస్తము
నవ్వు మనవాళి మధ్య ఒక బంధము
నవ్వు స్నేహ గీతికే సంగీతము
పెదవిమీది లాస్యం తెలుపు ప్రేమ భాష్యం
చేయబోకు ఎవ్వరిని అపహాస్యం

మానలేని రోగమైన తగ్గిపోవులే
తీరలేని వేదనైన తీరిపోవులే
బాధలు భయములు ఉండబోవులే
నిరాశా నిస్సత్తువకు తావులేదులే
నవ్వు ఆరోగ్యం- నవ్వు వైభోగం
నవ్వు జీవితానికే మహా భాగ్యం
దేశానికి వెన్నెముక- నీవే రైతన్నా
జనులందరి కన్నదాత-నీవే రైతన్నా
నిత్యకృషీవలుడవయ్య-ఇలలో రైతన్నా
నీరాజనాలు నీకు- రైతన్నా ||దేశానికి||

పొద్దుపొడవకుండగనే-నిద్దుర లేస్తావు
నీరైనా ముట్టకుండ-పొలం గట్టు కెళతావు
పైరుతల్లి కడుపు నింపి- బాగోగులు చూస్తావు
కంటికి రెప్పలాగ-పంట కాచు కుంటావు ||దేశానికి||

తిండీ తిప్పలు మరచి-ఎండలోన మాడేవు
కుండపోత వానలోను-తడిసీ పని చేస్తావు
స్వేదాన్నే ధారపోసి-సేద్యం చేస్తావు
ప్రకృతితో చెలిమిచేసి-పరవశమొందేవు ||దేశానికి||

కరువుకాటకాలతో-పోరాటం చేస్తావు
తుఫానులూ వరదలకూ-ఎదురొడ్డి నిలిచేవు
కష్టాలకు నష్టాలకు-బెదరని ఓ రైతన్నా
మహనీయులకే నీవు-మార్గదర్శివోయన్నా

నీ మనసు కష్టపెట్టుకుంటే
నీవు సమ్మెను ప్రకటిస్తే
మేమంతా ఉపవాసమె
మా కడుపులు ఖాళీయె
తెలుగు జాతి తెలుగు నీతి ఒక్కటిరా
తెలుగు మాట జుంటితేనె వంటిదిరా
ఎఱిగి మెలుగు సోదరా- తెలుగు ఖ్యాతి నిలుపరా

ఆంధ్రావని అన్నపూర్ణ రా
రాయలసీమ రతనాల సీమరా
కోస్తా మన ప్రగతికి రస్తారా
తెలంగాణ ఫిరంగుల కోటరా

కృష్ణానది మన తృష్ణను తీర్చునది
పెన్నానది మన అన్నానికి నిధి
వంశధారయే విద్యుత్ కు పెన్నిధి
గోదావరితోనె పెరుగునురా మన సిరి

రాణి రుద్రమదేవి రణమును సల్పిన భూమి
త్యాగరాజ రాగిణిలో కరిగినది ఈ పుడమి
పోతనాది భక్తులనే కన్నతల్లి మన జనని
ప్రతివారిని వారిలాగె ఎదిగి పొమ్మంటున్నది
జీవితానికి నీవె అర్థం-నీవె జీవన పరమార్థం
లాలించీ పరిపాలించేప్రభు-పరమ దయాళువు నీవే
1.) కలలో ఇలలో ఎప్పుడూనిను-మరువనైనా మరువను
మాయలెన్నో కలిపించి నన్ను-నీకు దూరం చేయకు || జీవితానికి ||

2.) నిన్ను నమ్మినవారి కెపుడు-దేనికైనా కొదవ లేదు
రెండుచేతుల ధారపోసిన-అలసిపోనీ ప్రభువే నీవు || జీవితానికి ||

3.) సాగరానా చేపలకీవే-ఈత నేర్పే నేర్పరి
ఆకసానా హరివిల్లు గీసే విచిత్ర చిత్రకారుడివి || జీవితానికి ||

4.)నా బ్రతుకునావకు చుక్కవివీవే-నావ నడిపే సరంగువీవె
నట్టేటముంచినా ఒడ్డుకు చేర్చినా-భారమంతా నీదే ప్రభు || జీవితానికి ||
జగానికే ఒక ఆదర్శం-శాంతి కాముకి మాదేశం
సస్యశ్యామలా మాదేశం-సమతా దీపిక భారత దేశం

పలు భాషలేన్నో ఉన్నా-ప్రజగొంతునొకటె ఈ గీతం
మరి మతములెన్నొ ఉన్నా- సమతే జనతకు సమ్మతం ||జగానికే||

నింగినంటు హిమ గిరులూ- మా ఘనకీర్తికీ గురుతులూ
తెగపారు జీవ నదులూ-మాపాల్టి అక్షయంబైననిధులు ||జగానికే||

ఎన్నిమార్లు జన్మనెత్తినా
భరతావనే మాజన్మ భూమి
భారతీయులం భారతీయులం భారతీయులం
మేమూ అయితేనె మాకు గర్వం
చంచల మీ మానసము
కాదెపుడది నీ కైవసము
గుప్పిట చిక్కని పాదరసము
అక్కున జేర్చుట ఎవరి తరము ||చంచల||

చిరుగాలికే ఇది చిగురాకులా వణుకు
తొలి స్పర్శకే ఇది పులకింతలను చిలుకు
స్పందన దీనికి సహజాతి సహజము
చిందులు వేయుట దీని నైజము

వానరమై ఇది జీవనమెల్ల చెఱచు
ఊసరవెల్లిగ పలు వన్నెలు మార్చు
మంకుతనమే దీని గుణము
మూర్ఖత్వమే దీని తత్వము
ఘోరమా ఇంత దారుణమా
విశృంఖల పాశవికత కిదేఉదాహరణమా || ఘోరమా||

నగరం నడిబొడ్దులో నర్తించిన మృత్యుహేల
మతపిశాచి కోఱల ప్రభవించే రక్తజ్వాల
ఓ మనవతా ఎక్కడున్నావు
మతమౌఢ్యుల కులమూర్ఖుల స్వార్థంతో సమాధియౌతున్నావు

పగలు భయం రాత్రి భయం-ప్రతి క్షణం మృత్యుభయం
అడుగడుగున ఎదురయ్యే ఆపదలే బ్రతుకు మయం
ఓ మనిషీ నీ మనుగడే అయోమయం
దీనజనుల మానధనుల బడుగు బ్రతుకులే శూన్యం శూన్యం

ఛస్తుంటే ఆదుకునేదే మతమురా-స్నేహితమురా
పస్తుంటే కడుపు నింపేదే కులమురా- మానవతమురా
కులాతీత మతాతీత మానవతా రాజ్యమే
మహిలో మన కందరికీ సదా పూజనీయమే
గురుదేవా గురుదేవా- మహానుభావా
ఇలలోన వెలసినా- నాదైవమా
ఏమిచ్చి తీర్చుకోను-మీ ఋణము
గురుదక్షిణ ఇచ్చేయన- నా ప్రాణము ||గురుదేవా||

రాతిని నాతిని చేసే-ఆనాటి రాముడు
ఈరాతిని జ్ఞానిగ మార్చిన-మీరే నేటి రాముడు
గీతను బోధించెను-ఆనాటి కృష్ణుడు
నా తల రాతను సరిదిద్దిన మీరీనాటి కృష్ణుడు ||ఏమిచ్చి||

చేసాను శిక్షణలో-ఎన్నెన్నో తప్పులు
చెప్పజాలనయ్యా-మీ క్షమాగుణం గొప్పలు
కన్నతండ్రివయ్యీ-మము నడిపించావు
కన్నతల్లిలాగా-ముద్దలు తినిపించావు ||ఏమిచ్చి||

స్తన్యాన్ని అందించిన-అమ్మకు తొలివందనం
దేహాన్ని నిర్మించిన- నాన్నకు మలివందనం
జ్ఞాన మార్గాన నడిపించిన గురువుకు-సాష్టాంగ వందనం
నాతోటి మిత్రులారా-స్నేహాభివందనం
ఏమిచ్చి తీర్చుకోను-మీ ఋణము
చేసేశానెప్పుడో-నాప్రాణం మీ వశము

నాలో జ్ఞానం సృష్టించిన-మీరే బ్రహ్మ
ఆచరింపజేయించిన-మీరే విష్ణు
లోపాలు రూపుమాపిన-మీరే శివుడు
నాకోసమె వెలిసిన-మీరే నాదేవుడు
ఏమిచ్చి తీర్చుకోను-మీ ఋణము
గురుదేవా అందుకో నా పాదాభి వందనం
గగనతలంలో రెపరెపలాడే- గణతంత్ర్యోత్సవ జయసంకేతం
నీలినింగిలో మూడురంగులతొ- జనగణ పాడే భరత కేతనం

త్యాగధనుల ఘనకీర్తి గురుతుగా- కాంతి చిమ్ము కాషాయ వర్ణము
శాంతి కపోతము నెగురవేసినా- ఖ్యాతి గన్నదీ- శ్వేత వర్ణము
పాడిపంటలకు పసిడిరాశులకు- ప్రతీకగా ముదురాకు వర్ణము
సత్యాహింసలు సమైక్య భావన- చాటుతున్నదీ ధర్మ చక్రము ||గగనతలంలో||

అఖిల జగానికి ఒక ఆదర్శము-బాపూ నెరపిన సత్యాగ్రహము
జాతికి జాగృతి జనచైతన్యము-సుభాస్ చూపిన విప్లవ తేజము
విదేశాంగమున వినూత్న గీతము-చాచాతెలిపిన పంచశీలము
దేశదేశముల తలమానికము- చరితార్థము మన భారత దేశం ||గగనతలంలో||
కులం కులం ఏకులం మీదే కులం
కార్మికులం కర్షకులం శ్రామికులం సైనికులం
మతం మతం ఏమతం మీదే మతం
ఐక్యతయే అభిమతం-మానవతే మా మతం

ఉలితో నాగలి తో గన్ తో మిషన్ తో
జాతినేలు నేతలం-శాంతి పంచు దాతలం
యుక్తితో స్వశక్తితో స్వేఛ్ఛగా యధేఛ్ఛగా
భుక్తిపొందు జీవులం పాడుకొనే గాయకులం

శ్వాసకు శ్వాసను పేర్చి భాషను పక్కకు చేర్చి
పనిచేసే పౌరులం ప్రాణమిచ్చె వీరులం
మట్టిలొ బంగారం- మర కర్మాగారం
సృష్టించే బ్రహ్మలం- దైవమనెడి భక్తులం

మబ్బున కోడికూత షిఫ్ట్ న సైరన్ మోత
మాకు సుప్రభాతం- మాప్రార్థన గీతం
సాటి మనిషి సౌభాగ్యం- సమైక్యతా సౌశీల్యం
మాగీతా గోవిందం- మాఖురాన్ గ్రంథం

తరతమ భేదాలు మాని-కులమత వాదాలు వీడి
కలిసి మెలిసి పనిచేస్తాం-ప్రగతి రథం నడిపిస్తాం
వసుధైక కుటుంబం-అన్నదె మా ధ్యేయం
క్రమ శిక్షణయే ముఖ్యం- జన రక్షణయే లక్ష్యం
కనులు తెఱచి చూడర ఓ నేస్తం
మరిగి పోతోందిరా మన దేశం

సకల శోభితం- భరత దేశం
సస్యశ్యామల భాగ్యదేశం
పేరు మార్చుకొంటోందిరా
కొత్త రూపు దిద్దుకొంటోందిరా

కులము మతమనే మారణహోమం
మనిషి మనిషికీ తీరని దాహం
మనమంతా భారతీయులం
మనమధ్యన ఎందుకురా బలంబలం

అధిక ధరల పెనుతుఫానుకూ
మానభంగాల అగ్నిజ్వాలకు
తట్టుకోలేకపోతోందిరా
అట్టుడికిపోతోందిరా

రాజకీయ భూకంపానికీ
రక్తపాత సుడిగుండానికీ
నిలువలేక మూల్గుతోందిరా
చావు మునక లేస్తోందిరా
కదలిరా ఓ నేస్తమూ
కలిపిచూడు నీ హస్తమూ
ఘన విజయాలే మన సొంతమూ
ఇక చిరునవ్వే జీవితాంతమూ

పిరితనం నీ ప్రగతికి గొడ్డలి పెట్టు
గుండెబలం నీ కున్న ఆయువుపట్టు
తరాల అంతరాలు ఆవల నెట్టు
చేరిపో ఎన్నడింక చెదరదు జట్టు

మనదంతా ఒకేఒక వసుధైక కుటుంబం
మనమంతా అందులోన భాగస్తులము
భావాంతరాలే మన కలతల కారణం
మనసువిప్పి మసలుకొంటె సడలదులే సమైక్యము
ఏమిటో ఈ యాతన
తీరనీ ఈ వేదన
గొంతు నులిమినట్లుగా-గుండె పిండినట్లుగా ||ఏమిటో||
1.)పయనం మొదలైనది ఒకే పడవలో
అందరమూ ఎక్కిందీ అదే నావలో
సాఫీగా సాగుతోందీ తోటివారి ప్రయాణమూ
తోయములో తోయబడితే నాదా ఆ నేరము
ఈతరాక ఆగానా-లోతుచూసి బెదిరానా ||ఏమిటో||
మెదడు చితికినట్లుగా-ఒళ్ళుకాలినట్లుగా

2.)పూలమ్మే చోటనే కట్టెలమ్ముతున్నాను
అధికారిగ ఉండేవాణ్ణి అనుచరుడిగ మారాను
సాటివారి ముందే సాగిల పడిపోతున్నా
మేధ సహకరించలేక నిర్వీర్య మౌతున్నా
నాకు అర్హతే లేదా- నాది అత్యాశేనా ||ఏమిటో||
నరాల్ తెగిన రీతిగా-శ్వాసాగిన తీరుగా

3.) అరచేతిలో నుండి ఇసుక జారిపోతోంది
కళ్ళముందెవిలువైన కాలంకరిగి పోతోంది
ఏ అద్భుతమో జరిగి యధాస్థితికి వచ్చేనా
ఏ దైవమొ కరుణించి నాకువరమునిచ్చేనా ||ఏమిటో||
కార్జం కెలికినట్లుగా-మజ్జ పెకిలినట్లుగా
ఏ రాగమో ఎరుగని ఈ కీర్తన
అనురాగమై పొరలిన ఆలాపన
లయ ఏదై సాగేనో నా గానము
తన్మయముగ ఊగేనూ నా దేహము

ఛందస్సులెరుగని హృదయ స్పందన
సాహిత్య మెరుగని సగటు గుండె భావన
ఒక మేఘం వర్శిస్తే మయూరమై ఆడదా
వాసంతం స్పర్శిస్తే- కోకిలయై పాడదా

ఏ రాగమో ఎరుగని ఈ కీర్తన
ఆవేదనై పొరలిన ఆలాపన
లయ ఏదై సాగేనో నా గీతము
నయనాలలో పొంగె జలపాతము

రగిలే ఎద జ్వాలల శివరంజని వెలుగదా
పొరలే కన్నీరే ఇల రేవతియై పారదా
ఏ దిక్కూ లేకుంటే తోడితోడై రాదా
ఓదార్పు లేని గుండె సింధుభైరవేకాదా
ఎదిగిపో ఎదిగిపో పై పైకి ఎదిగిపో
మానవాళి కందరాని మహోన్నతిని అందుకో

అన్యాయాన్నరికట్టు- అవినీతిని అదిమి పెట్టు
మాటలేమి చెప్పక- చేతల చూపెట్టరా

స్వార్థాన్ని సాగనంపు-లంచగొండి రూపు మాపు
మహాశక్తి రూపంగా- విశ్వమంత వెలిగిపో

నడుంవంచి పనిచేస్తూ-నలుగురికి సాయపడు
పదిమందితొ కలిసిమెలిసి-ప్రగతి పథం చేరిపో

మహామహులు ఎందరో-జన్మించిరి పుడమి పైన
వారి మహా చరితలలో-నీ దొకటిగ నిలుపుకో
ఏడవకు ఏడవకు చిట్టి కన్నా
ఏడిస్తే నీకళ్ళ గోదారి వరదన్నా
లోకాన నీకేల చీకూ చీకాకు
శోకాల దారంట పోనేపోమాకు

ఆకలైతే నీకు అమ్మ పాలిస్తుంది
కేకలేయకు నీకు కమ్మని కథ చెబుతుంది
లాలిపాట లెన్నెన్నో హాయిగా పాడుతుంది
ఊయలూపి ముద్దాడి ఊరుకోబెడుతుంది

అమ్మ చంకనెక్కి నీవు చందమామ చూడాలి
నాన్న వీపు కీలుగుఱ్ఱం సవారి చేయాలి
అడగకముందే వుండు అందలమే నీముందు
అలిగిచూడు ఒక్కసారి అమృతమే నీ విందు

బూచిచూచి బెదిరావా భయపడకుర కన్నా
కష్టాల కడలి బ్రతుకు ధైర్యం విడకన్నా
చెరగని నీ నవ్వులే సిరి సంపదలే మాకు
ఈ నాన్న దీవెనలే శ్రీ రామ రక్ష నీకు
ఉగ్రవాదం రగులుతున్నది
రక్తదాహం ప్రబలుతున్నది
రావణ కాష్ఠంలా- జాతికి గ్రహణంలా || ఉగ్రవాదం||

ఒక వర్గము దేశంపై తిరుగబడుతున్నది
దుర్మార్గము వికృతమై విర్రవీగుతున్నది
పెట్రేగిన ఒక బలం కత్తులు ఝళిపిస్తున్నది
శాంతి మరచి శ్వేతసుమం నెత్తురు కురిపిసున్నది

తినేఇంటి పునాదులను-కూల్చాలని చూస్తున్నది
కన్నతల్లి శీలాన్నే అమ్మాలని చూస్తున్నది
తీవ్రవాద కుష్ఠువ్యాధి కుళ్లికంపు కొడుతోంది
వెర్రివేయి తలలతో వికటాట్టం చేస్తోంది

మొన్న ప్రధాని ఇందిరా గాంధీని బలిగొంది
నిన్న నేత లోంగో వాలును చంపింది
ఆ గతమూ శాపమై కలచి వేస్తున్నది
ఈనిజమూ బేలయై విలపిస్తూ ఉన్నది

గులాబీల గుండెల్నీ చీల్చేదే మన ధర్మమా
కపోతాల గొంతుల్ని నులిమేదే మన శాస్త్రమా
యోచన యోచన మంచిచెడుల విచక్షణ
ఆలోచన లేనినాడు లేదు మన విమోచన
భరత జాతి రక్షణ
ఆడబోకు జూదము – ఆడి చెడిపోకు నేస్తమూ
సాలెగూడులాంటి క్రీడ- జీవితానికే చీడ-అది ఒక పీడ ||ఆడబోకు||
1.)పంచపాండవులైనా వంచించ బడ్డారు
పాంచాలిని సైతం జూదాన ఒడ్డారు
మానాభిమానాలు మంటగలిసి వారంతా
అడవుల పాలయ్యీ అవస్థలే పడ్డారు- వ్యవస్థలో చెడ్డారు ||ఆడబోకు||

2.) నలమహారాజు నాడు నవ్వులపాలైనాడు
ఒంటిమీద బట్టకైన కరువై పోయాడు
బలికాని వారేరీ ఇలలో జూదానికి
ఇదికాక ఇంకేదీ లేదా మోదానికి- ఆమోదానికీ ||ఆడబోకు||
3.)ఇల్లూ ఒళ్ళూ గుల్లగా-చేసేదే ఒక ఆటా?
కుటుంబాన్ని వీథిలోకి నెట్టేదే ఒక ఆటా?
ధనమూ సమయంవృధా-చేసేదే ఒక ఆటా?
పరువూ మరియాదా- పోగొట్టేదే ఒకాఆటా?-అకటా!ఎందుకీ కట కట?! ||ఆడబోకు||

4.)ఆరోగ్యం ప్రసాదిస్తె - అది ఒక ఆట
ధారుఢ్యం పెంపొందిస్తె-అది ఒక క్రీడ
మోసానికి మూలమే ఈ పేకాటా
చెప్పేసెయ్ ఇకనైనా దీనికి టాటా-విను నా మాటా ||ఆడబోకు||
ఆటుపోటుల సాగరం -ఈ లోటుపాటుల జీవితం
నాటునావలొ నీ ప్రయాణం-సాహసం నీ సాధనం ||ఆటు పోటుల||

ఆకలేస్తే-కేకలేస్తే-ఆరుతుందా తీరుతుందా
పదం పలుకుతు కదం కదిపితె-పంట చేలే పండిపోదా
శ్రమ జయిస్తే సహన మొస్తే-సకల జగతికి సౌఖ్యము
ప్రగతి తెస్తే ఫలితమొస్తే-బ్రతుకు బ్రతుకున స్వర్గము ||ఆటు పోటుల||

ఆశయాలే వల్లె వేస్తే- ఆచరించే దెన్నడు
ఉద్యమాలే్ లేవదీస్తే-ఊరడించే దెవ్వరు
పెంచిచూడు సంపదలనే- జగము సుందర నందనం
పంచిచూడు స్నేహితమునే-బంధు జనులమె అందరం ||ఆటు పోటుల||
ఆకలి కేకలెగసె మన దేశంలో-ఆవేదన ఆవరించె మన దేశంలో
హింస విధ్వంస కాండ-మింటికెగసె మనదేశంలో
శాంతి సమసమైక్యత-మంటగలిసె మన దేశంలో || ఆకలి కేకలెగసె||

బ్రతుకంతా భయం భయం
భవితలొ అంతా శూన్యం
కనరాదీ కడలేనీ -ఎడారిలో ఒయాసిస్సు
అనంతమగు నిశీధిలో-పొదసూపదు ఏ ఉషస్సు ||ఆకలి కేకలెగసె||

పొంచిఉన్న పొరుగువారు
వంచించే మన ఇంటివారు
అడకత్తెరలో పోకచెక్క –మన దేశం
చావలేక బ్రతుకలేక- సతమత మౌతున్న శవం ||ఆకలి కేకలెగసె||

జీవనదులు తెగపారే- సస్యశ్యామల దేశం
సంపదలతొ తులతూగే-సౌభాగ్య మైనదేశం
కులమతజాతిప్రాంత-భాషాభేదాలతో
జరుగుతోంది నేడు- మారణ హోమం
అవుతుందేనాడో ఇలాగే కొనసాగితే-మన దేశం స్మశానం