Wednesday, April 29, 2009

వినవే ఓ మనసా

వినవే ఓ మనసా
పదవే పోదాం బిరబిరగా
నీ ధ్యేయం-నా గమ్యం ఏమిటో ఎక్కడో ఎరుగం

1. ఆశల తీరం చేరే కోసం-ఈ నీ పయనం
అనితర సాధ్యము అనుభవసారము నా మార్గం
నీ పయనం-నా మార్గం- మంచిదో కాదో ఎరుగం

2. తెఱచాప చిఱిగి చుక్కాని విరిగి శిథిలమైంది నావ
కాకులు దూరని కారడవిలోన కఠినమైంది త్రోవ
నీ నావా నా త్రోవా ఎందుకో ఎందుకో ఎరుగం

3. అమవాస్య రేయిలొ పెనుతుఫానులొ సాగే నీవు
ఊహే అర్హత తలపే సాధనగా నేనూ
ఆ నీవు -ఈ నేను - ఒకటే ఒకటే ఒకటే

నీ నమ్మకమే దైవము

నీ నమ్మకమే దైవము
ఆ శక్తి రూపమే విశ్వము
1. అంతులేని అనంతానికి ఆవలఉన్నది దైవము
అంతుచిక్కనీ అణువులొ ఉన్నదీ....మర్మమూ
ఉన్నది దైవము-లేనిది దైవము
నమ్మితేనే దైవము- నమ్మకుంటే శూన్యము

2. ఆకలి మనిషీ ప్రేగులలోనా-అరిచేది దైవము
ఆశల మనిషీ ఊహలలోనా-నిలిచేదీ దైవము
కాంతి దైవము-భ్రాంతి దైవము
రగిలే క్రాంతీ దైవమూ-మిగిలే శాంతీ దైవము

నవ్వకూ నవ్వంటే చికాకు

నవ్వకూ నవ్వంటే చికాకు
నవ్వించకూ నవ్వొస్తే నాకు విసుగు
దరహాసం పరవాలేదు-పరిహాసం పనికిరాదు
1. ఏ చరిత్ర చూసినా ఏమున్నది వేదనొక్కటే
ఏబ్రతుకు తిరగేసినా బాధామయ సంపుటే

2. తోటివాడు గోతిలొ పడితే- పగల బడి నవ్వకురా
సాటివాడు కన్నీరుపెడితే-గొల్లుమని నవ్వకురా

3. మగవాడుఏడ్చాడంటే –మొదలవుతుందీ ప్రళయం
ఆడది ఏడ్చిందంటే-నమ్మకురా ప్రమాదం

4. పుడుతూనే ఏడుస్తాము-పోతూ ఏడిపిస్తాము
నడమంత్రంగా నవ్వేము-నవ్వులపాలయ్యేము-నట్టేట్లో కలిసేము

అన్నాచెల్లీ అనుబంధం-ఎన్నడువాడని సుమగంధం

అన్నాచెల్లీ అనుబంధం-ఎన్నడువాడని సుమగంధం
అన్నాచెల్లీ అభిమానం-ఆత్మీయతకూ సంకేతం
కలకాలం నిలిచేది రాఖీ బంధం-కలనైన వీడనిదీ స్నేహబంధం

1. స్వార్థమెరుగనిది-స్వఛ్ఛమైనది
పాపమెరుగనిది-పావనమైనది
కపటమెరుగనిది-సత్యమైనది
కాలంవలె ఇది-శాశ్వతమైనది
కలకాలం నిలిచేది రాఖీ బంధం-
కలనైన వీడనిదీ స్నేహబంధం

2. ఆపదలోనా ఆదుకుకునేది
వేదననంతా పంచుకునేది
అనురాగానికి ఆలయమైనది
త్యాగానికి ఇది అంకితమైనది
కలకాలం నిలిచేది రాఖీ బంధం-
కలనైన వీడనిదీ స్నేహబంధం

రంగుల పండుగరా- ఎదలు పొంగే పండుగరా

రంగుల పండుగరా- ఎదలు పొంగే పండుగరా
చిందుల పండుగరా- కనువిందుల పండుగరా
అందాలు చింది అనుభూతి నింపి ఆనందసాగ రాలందు ముంచె ||రంగుల||
1. మరుమల్లెతెలుపు రోజాల ఎరుపు మురిపాలు చిందగా
చామంతి పసుపు కనకాంబరాల వర్ణాలు కురియగా
ఆనింగినుండి ఈనేలవరకు హరివిల్లు విరియగా
దివి భువికి నేడు దిగివచ్చె చూడు సౌందర్య లహరిగా ||రంగుల||

2. చల్లాదనాల మామీడి తోట ఒక వేదికై నిలువగా
పచ్చాదనాల వరిపైరు తాను తలయూచి మురియగా
కమ్మాదనాల కోయీల పాట కచ్చేరి సాగగా
నాల్గూదినాల ఈ బ్రతుకులోన ఈ హాయి చాలుగా

ప్రతి సంఘటనకు ప్రతిస్పందించకురా

ప్రతి సంఘటనకు ప్రతిస్పందించకురా
అడుగడుగున ఈ బ్రతుకే నీకొక ఆశనిపాతంరా

1. కనుమూస్తే నిను కాటేసే విష సర్పాలున్నవిరా
నమ్మించీ నిను వంచించే ఘన తోడేళ్ళున్నవిరా

2. వసంతమన్నది నీతోటకు ఇక రానేరాబోదు
ప్రభాతమెన్నడు నీ వాకిట మరి వెలుగులు తేబోదు

3. దూరపు కొండలు నునుపను సత్యం నమ్ముతు కొనసాగు
భవితవ్యం నీ పాలిటి బంగరు బాతగు నిత్యంనీకు

4. ఆకాశం తను పిడుగుల వర్షం కురిపించనిగాకా
ఆవేశం నిను ఉప్పెనలా మొంచెత్తినను నువు చెదరకిక

ఒహొ గోదారీ నాకిగ దారేది సెప్పవే

ఒహొ గోదారీ నాకిగ దారేది సెప్పవే
ఆవలిదరి నాను సేరేది ఎట్టాగే
1. ఈత రాని నేను నిన్నేతీరుగ దాటనూ
దాటేసె పడవేది లేదీ సోటనూ
గుండెల్లొ నిండినా గుబులూ దీసెయ్యవే
దిక్కుతోచని నన్ను జర సముదాయించవే

2. దాటేసేవోడు నన్నోగ్గేసి పోయాడు
నేనె దాటుదమని సూత్తే నీట మునకలేసేను
దారి తెన్నూలేకా నీ దరికి సేరేను
దరమ తల్లివి నీవే నా నేస్తమంటాను

3. ఎఱ్ఱిబాగుల మేళం ఏటని సూత్తన్నావా
ఏడ సత్తెనాకేటని ఎల్లెల్లి పోతన్నవా
దిక్కుమాలిన నాకు దేముడే దిక్కంటాను
ఆడు దిగివొచ్చేదాక ఈడనే కూకుంటాను
నా నీడనే కూకుంటాను

మాధుర్యమంటె వేరె లేనెలేదోయి ఘంటసాల గాత్రానికి మారుపేరోయి

మాధుర్యమంటె వేరె లేనెలేదోయి
ఘంటసాల గాత్రానికి మారుపేరోయి

1. అమృతము తేనియ పంచదార కలిపి
వండిన పాయసము ఘంటసాల గానము
ఎంతగ్రోలినా గాని తనివి తీరదు
ఎంతసేపువిన్నా మనకొకింత చాలదు

2. గంధర్వులు కోటిమంది పోటీగా పాడిన
తుంబుర నారదులు గొంతుచించుకున్నా
సాటిరారు ఒకేఒక ఘంటసాలకు
దీటురాదు ఎన్నటికీ ఆ మహనీయుని పాటకు

3. భక్తుల పాలిటి ముక్తిదాయకం
రసజ్ఞుల పాలిటి కల్పవృక్షము
రోగాలను బాపేటి దివ్యౌషధం
వేదనలో నేస్తం-మన ఘంటసాల గాత్రం

4. నవ్వించీ ఏడ్పించీ ఏడ్చే మన వెన్నుతట్టి
నవరసాలు తన గొంతులొ సరసంగా పలికించి
ఆస్థాన విద్వాంస పదవినే అలరింప
శ్రీనాథుని పిలుపువిని తరలివెళ్ళె ధన్యజీవి

పిల్లనగ్రోవి మోహనమై మ్రోగే

పిల్లనగ్రోవి మోహనమై మ్రోగే
అల్లన వీణియ కళ్యాణమై సాగే
సంగీతమే జలపాతమై పొంగిపొరలె
సాహిత్యమే మణిహారమై గీతినలరే-గీతి నలరే

నటరాజ పాదాల గతులునేర్చే మువ్వల రవళి
గిరిధారి పెదవుల శృతులు నేర్చే మోహనమురళి
త్యాగయ్య గొంతులో సుడులు తిరిగే పంతువరాళి
పోతన్న కలములో సుధలు చిలికే జీవన సరళి

కోకిల కుహుకుహులో కులుకులు నేర్చే సన్నాయి
జానకి నవ్వులలో ఒలికే పలికే సరిగమలే హాయి
ఘంటసాల గాత్రం గండు తుమ్మెద ఝంకారం
క్రిష్ణశాస్త్రి గీతం మధుర భావామృత కాసారం

“గంధర్వుడు దిగి వస్తాడని-ఘంటసాల ఉదయిస్తాడని”

నా భావాలకు జీవం పోసే-నా గీతాలను గానం చేసే
“గంధర్వుడు దిగి వస్తాడని-ఘంటసాల ఉదయిస్తాడని”
ఎదిరి చూస్తున్నాను-నిదుర కాస్తున్నాను

1. ప్రేమ తెమ్మెరే స్పృశియిస్తుంటే-
ప్రేమ నగరునే స్మృతి తెస్తుంటే
ఒలికిన పలుకులు అనురాగంగా తలపించే
ఎద స్పందనయే నవరాగంగా వినిపించే
“గంధర్వుడు దిగి వస్తాడని-ఘంటసాల ఉదయిస్తాడని”
ఊహలు చేస్తున్నాను-ఊసులు దాస్తున్నాను

2. నా రోదన గొంతుదాటి రాలేకుంటే-
ఆవేదన నా కలమే కక్కేస్తుంటే
జీవన తిమిరాలే సమూలంగ తొలగించే
బాధల కుహరాలే ప్రకాశంగ వెలిగించే
“గంధర్వుడు దిగి వస్తాడని-ఘంటసాల ఉదయిస్తాడని”
కలలు కంటున్నాను-కలవరిస్తున్నాను

3. ఘరానా నాయకులే దేశాన్ని దోచుతుంటె-
దగా పడిన తమ్ములంత దిగాలుపడి పోతుంటే
వెన్నుతట్టి పదలెమ్మని ముందుకు నడిపించే
గళమెత్తీ జనజాగృతి గీతాన్నే ఆలపించె
“గంధర్వుడు దిగి వస్తాడని-ఘంటసాల ఉదయిస్తాడని”
పాటలు రాస్తున్నాను-బాటలు వేస్తున్నాను

4. గుండెలోయలోనుండి భక్తి పొంగి పోతుంటె
వేంకటేశు తలపులతో మేనుమరచి పోతుంటే
అక్షరాల హారతులే స్వామికి అందించే
పదముల సుమమాలికలే ప్రభువుకు అర్పించే
“గంధర్వుడు దిగి వస్తాడని-ఘంటసాల ఉదయిస్తాడని”
కీర్తన రాస్తున్నాను-ఆర్తిగ చూస్తున్నాను

జీవితం అనుక్షణం మనిషికీ ఒక రణం

జీవితం అనుక్షణం మనిషికీ ఒక రణం
గెలవడం ఓడడం చెరిసగం సరిసమం

చీకటికీ వెలుతుటికీ చెదరదులే ఏదినము
వేసవికీ ఏచలికీ వెరవదులే ఈ జగము
ఒకరికి ఒకరం తోడై నిలువగా ఎదురేమున్నది
నేను నీ దేహము-నీవె నా ప్రాణము

నాదు ఊహలో నీవేచెలీ ఊర్వశి
ఏ జన్మకూ నీవెనా ప్రేయసి-నాప్రేయసి
నేను నీ క్రిష్ణుడ-నీవె నా రాధిక

మరుభూమైనా విరిదారైనా ఆగదులే మన పయనం
వేదనలో మోదములో సడలదులే మన ధ్యేయం
ఆశాగీతం మనమే పాడగా భవితే రసమయం
నేను నీ తాళము-నీవె నా రాగము

జగమెరిగిన సత్యానికి సాక్ష్యమెందుకూ

జగమెరిగిన సత్యానికి సాక్ష్యమెందుకూ
ముంజేతి కడియానికి అద్దమెందుకూ
పెదవులపై చిరునవ్వులు పులుముటెందుకూ
హృదయములో వేదనతో కుములుటెందుకూ

కాగలనీ కార్యానికి గంధర్వులెందుకు
రాగలనీ కాలానికి గ్రహఫలాలు ఎందుకూ
తెగువ ఉన్న శౌర్యానికి ఒకరి తోడు ఎందుకు
తెగనున్న ఉరిత్రాడుతొ మరణయత్నమెందుకు

ఆశయాల నీ ఇంటికి తలుపులెందుకు
పిశాచాల శవవాటికి పిలుపులెందుకు
నినులేపే రవికి మేలుకొలుపులెందుకు
మునిమాపే శయనిస్తే వలపులెందుకు

ఆ గంగయేల ఆ యమునయేల

ఆ గంగయేల ఆ యమునయేల
ఆ క్రిష్ణ కావేరి వేయేల ఏల
ఓ గోదావరీ! నీకునీవే సరి
మాకై వెలసిన జీవఝరి
1.త్రయంబకాన ఉదయించినావు
నాసికలోనా నడకలు నేర్చావు
మా దక్షిణాన మధుర క్షణాన
తెలుగునేలలొ అడుగెట్టినావు
బాసరలోనా నువు మెట్టినావు

2.మా(ధర్మ)పురికి వడివడిగ అరుదెంచినావు
నరహరిని మనసార యర్చించినావు
పాపాలనెల్లనూ పరిమార్చగా నీవు
పుణ్యతీర్థమై విలసిల్లినావు

3.చిరుజల్లుకే నీవు పరవళ్ళు తొక్కేవు
వరిధాన్యముల బాగ పండించి పెట్టేవు
తెలుగు కర్షకుల హర్షానివే నీవు
దక్షిణాదికే నీవు తలమానికమువు

పలుకు పలికితే గలగల పారే గోదారి

పలుకు పలికితే గలగల పారే గోదారి

గొంతువిప్పితే పరుగులు తీసే కావేరి

తనువులోని అణువణువు సాగే సారమతి

చేరేది ఏనాడో అనురాగ తరంగాల కడలి

1. హిందోళ రాగమే మందాకినియై హిమగిరి దూక

మోహన రాగమే యమునా నదిలా కదలిరాగ

సరస్వతీ లీనమై త్రివేణీ సంగమమాయె

శంకరాభరణమే విశ్వనాథు నలరించే

2. కాంభోజి రాగమే తుంగభద్రగా అవతరించగా

కళ్యాణి రాగమే క్రిష్ణవేణిలా సాగిరాగా

చారుకేశి రాగమే నాగార్జున సాగరమాయే

అమృతమే వర్షించి కనకదుర్గ కాళ్ళు కడిగే

కాలం కాలం-ఇది ఆది అంతము లేని కాలం

కాలం కాలం-ఇది ఆది అంతము లేని కాలం

ఎవరము ఎరుగము దీనివైనం

1. లేనె లేదులే దీనికి గమ్యం

ఎవరు ఆపినా ఆగదు గమనం

ప్రగతి చచ్చినా ప్రళయమొచ్చినా

మార్చుకోదులే తన మార్గం

2. స్వర్ణయుగాలను జీర్ణించుకుంది

రాజమకుటమై వెలుగొందింది

రాచరిక మేమో ఆగుతోంది

కాలమింకా సాగుతోంది-కొన సాగుతోంది

3. ఓడను బండిగ చేసే కాలం

చరిత్ర కోరే పిపాసి కాలం

మహిమ గలదిలే కాలం

దైవానికి ఇది నిజరూపం