Tuesday, June 9, 2009

ఊహలలోనే నన్ను జీవించనీ
స్వప్నాలందే నన్ను విహరించనీ
రాలేనురాలేను రాజీల దారిని
భరియించలేను నేను నగ్నసత్యాలని
1. కళ్ళుతెరిస్తె ఏముంది-కనరానిచీకటి
మెలకువొస్తె ఏముంది-మెలితిప్పే ఆకలి
ఈ లోకపు కుళ్ళు రూపు-నేచూడలేను
ఈ వాడిముళ్ళదారి –నే నడవలేను
2. నా గుప్పిటి విప్పనీకు-గుట్టురట్టౌతుంది
ఈ ముసుగు జారనీకు-ముప్పువాటిల్లుతుంది
అతికించికోనీయి-పెదవుల చిరునవ్వులని
మైమరచి బ్రతకనీయి-వేదనాశ్రుధారలని
నీరాకతోనే నాఎద ఎడారే
మారింది పారే ఒక సెలయేరే
నీ ప్రేమతోనే నా బ్రతుకు మోడే
చిగురించె నేడే వేదనను వీడే
1. గాజుపూసలను చూసి-రత్నరాశులనుకొని భ్రమిసా
గార్ధభస్వరాలనే-అమరగానమనుకొని మురిసా
తెలిసింది నేడే మాణిక్యమంటే
ఎరిగించినావే మాధుర్యమంటే
2. కాగితం పూలెపుడూ-పరిమళాలు కూర్చవనీ
ఎండమావులెన్నటికీ-దాహాన్ని తీర్చవనీ
ఎరిగించినీవే గుండె మీటినావే
ఎదబీడులోనా ప్రేమనాటినావే
గుండెనిండ నీవేనయ్యా కొండగట్టు అంజయ్యా
మా అండ దండ నీవేనయ్యా రామభక్త హనుమయ్యా
వందనమిదె గొనుమయ్యా వాయుపుత్ర హనుమయ్యా
సుందరమూర్తీ స్వామీ అంజనిసుత అంజయ్యా
1. ఇలవేల్పువు నీవే మా కులదైవమూ నీవే
బుద్దెరిగిన నాటి నుండి ఇష్టదైవమూ నీవే
కష్టములే కలుగనీయవు-నష్టములే జరుగనీయవు
గ్రహపీడల హరియించి అనుగ్రహించేవు స్వామి
2. రామనామ స్మరణయన్న ప్రేమమీరజేసేవు
రామనామ గానమున్న మేనుమరచి ఆడేవు
రామపాదసేవకే అంకితమైనావు
శ్రీరాముని ప్రియసఖునిగ వన్నెకెక్కినావు
3. దంపతులకు ఎడబాటును తొలగించిన వాడవు
పునర్జీవితులజేయు సంజీవరాయుడవు
యుగయుగాల వెలుగులీయు చిరంజీవివైనావు
స్వామిభకిపరాయణకు తార్కాణమైనావు