Sunday, June 14, 2009

బాబా సాయి సాయి-సాయినామమే హాయి
ఎంతగ్రోలినా గానీ తనివిదీరదోయి
సాయిసాయి రామం-సాయిసాయి కృష్ణం
సాయిసాయితిరుపతి-శ్రీ వేంకటేశం
1. అంధులనిల నడిపించే శక్తిసాయి
మూఢులకును జ్ఞానమొసగు భక్తి సాయి
ఇహలోక చింతనమ్మౌ అనురక్తి సాయి
పరసౌఖ్య పరమార్థమ్మగు ముక్తి సాయి
సాయి సత్యము-సాయి శివము
సాయి దివ్యరూపమ్మే సర్వసుందరం
2. సత్కాలము నాకు సమీపించె గాబోలు
సాయినామమందులకే రుచియించెనోయి
గతజన్మలొ నేజేసిన పుణ్యకర్మ ఫలమేమో
సాయిప్రేమ నామీద కురిపించెనోయి
సాయి రాగము-సాయితాళము
సాయి కీర్తనమ్ములే సర్వజన రంజకం
ఓంకార నాదమూలం హంసధ్వని రాగం
శ్రీకార బీజారావం హంసానంది రాగం
అయ్యప్ప ఆరాధనం షణ్ముఖ ప్రియమే కాగా
మణికంఠ గీతార్చనం శివరంజనియేకాదా
1. స్వామి సుప్రభాతం పాడుతుంది భూపాలం
ధర్మశాస్త నభిషేకించు భీంపలాస్ రాగము
షోడషోపచారములు ఒనరించును హిందోళం
మంగళనీరాజనానికి తిలక్కామోద్ రాగం
2. వేదనా నివేదనం అర్పించును కానడ రాగం
వేదోక్త మంత్రపుష్పం అంజలించు రేవతిరాగం
సంగీత సేవ కోసం సాధన కళ్యాణి రాగం
ఆనంద నాట్యమునే అలరించును మోహన రాగం
3. స్వామి శరణం వేడాలంటే సింధు భైరవి
స్వామిభజన సేయాలంటే నఠబైరవి
స్వామి కటాక్షించుటకై హిందుస్తాన్ భైరవి
శయనగీతి నాలపించు ఆనందభైరవి
ఎలమావి తోటల్లొ ఎందెందు కోయిలా
దోబూచులాడేవు ఎందుకో-యిలా
అనురాగ రాగాల మురిపించనా
వాసంత గీతాల మైమరపించనా

1. వేచాను నీకై పలుకారులు
వేశాను నీకై విరిదారులు
వేసారెవేసారె నా జీవితం
ఓసారి కాదేల నీ దర్శనం

2. రాకాసి కాలం కసిబూనెను
కనరాని దైవం దయ మానెను
విరహాలు నాలోన విషమించెను
జవరాల జాగేల కరుణించను

3. చందురుని కోరే చకోరే నేను
స్వాతిచినుకునాశించే అల్చిప్పనేను
కానీకు నీ ప్రేమే ఎండమావి గాను
నిరీక్షణే నాపాల్టి ఆజన్మ శిక్షయ్యేను
మందారమే నీ అందము
మకరందమే నీ అధరము
నువు సయ్యంటెనే చెలి
నా జన్మ ధన్యము
1. నీ మేని మెరుపుకీ తగలేదు మేనక
నీ నాట్యహేలకీ దిగదుడుపే రంభ
నీ కాలిగోటికి సరిరాదు ఊర్వశి
జగదేక సుందరీ నీవేగ ప్రేయసి
2. గొంతులొ ఏవో ఇంద్రజాలాలు
కంటితొ వేస్తావు ప్రేమ గాలాలు
చిరునవ్వుతూనే గుండెగాయాలు
విరహంతొ తీస్తావు నా పంచప్రాణాలు
నమో నమో హే ప్రభో గౌరీ నందన
అని నువు భజించు మోక్షం తథాస్తు
విఘ్నాలే హరించు విఘ్నేశుని స్మరించు
కోరికలే ఈడేర్చు గణనాథుని స్మరించు
నీ కార్యం సిద్ధించు నిను విజయం వరించు
1. గడచిన ఏ క్షణము నీకు మరలిరాదుగా
దిరికిన ఈ నిమిషమైన వృధా సేయకా
కళ్ళు తెరవరా తొందరించరా
ఏకదంత పాహియని వేడుకొనుమురా
2. ఈ జగమే బంధాల సాలెగూడురా
అందులోన చిక్కెను నీ బ్రతుకు ఈగరా
అహము మరవరా పరమాత్మనెరుగరా
వినాయకా శరణు వినా వేరులేదురా
3. కరివదనుని మదితలచిన కరుణజూచురా
అంజలించి వరమడిగిన ప్రసాదించురా
కీర్తించరా మది ప్రార్థించరా
నోరారా భజన జేసి మోక్షమందరా