Thursday, June 18, 2009

నయనాలలో ఈ జలధారలు
హృదయాలలో ఈ చితిజ్వాలలు
ఉప్పొంగిఉప్పొంగి నను ముంచెను
చెలరేగి చెలరేగి నను కాల్చెను
1. కనురెప్పపాటులో కరుగు ఈ స్నేహము
మెరుపులా మెరిసి మరి మటుమాయము
కలగన్న క్షణములో మిగులు ఆనందము
కల్పనై తలపున రగులు గాయము
వసివాడు పూలదీ ఉద్యానము
శృతిలయలు లేనిదీ ఈ గానము
2. ఆషాఢమేఘాలు అశ్రువులు కురిసే
గ్రీష్మతాపము గుండె మండించగా
శిశిరాన వృక్షాలు మోడులై నిలిచే
శీతకాలము మంచు కురిపించగా
కళ్ళాలు లేనిదీ ఈ కాల హయము
బ్రతుకు సుఖదుఃఖాల నిలయము
నయనాలలో నీ చిరునవ్వులు 
అధరాలలో కొంటె కవ్వింపులు 
ఊరించిఊరించి వలవేసెను 
ఉడికించిఉడికించి నను దోచెను 

1. హరివిల్లువిరిసె నీ కెమ్మోవిలో 
నా పెదవి రవికళ్ళు అలరించగా 
చిరుజల్లు కురిసె నా ఎదదీవిలో 
నా బ్రతుకులో బీళ్లు పులకించగా 
అనురాగమయమే మనలోకము 
కలనైన దరిరాదు ఏ శోకము 

2. కార్తీక వెన్నెలలు అమృతము కురిసే 
తొలిరేయికై హాయి కానుకగ నీయ 
వాసంత కోయిలలు స్వాగతము పలికే 
శుభలగ్న సమయాన సన్నాయిలై కూయ 
తేనె విందులె మనకు ప్రతి నిత్యము 
పూలపానుపె బ్రతుకు ఇది సత్యము

ఈజన్మకొక్కెసారైనా-శబరిమలకు వెళ్ళాలి
మనిషిగా పుట్టినందుకు-మాలవేసుకోవాలి
మోక్షమింకకోరుకుంటే-దీక్షతీసుకోవాలి
స్వామి శరణమయ్యప్పా- స్వామి శరణమయ్యప్పా
1. కన్నెస్వామికున్నవిలువ-ఎన్నలేనిదేనయ్యా
గురుస్వామి పాదసేవయే-పరసౌఖ్యదాయమయ్యా
స్వామిశరణం శరణుఘోషయే-ముక్తిదాయకంబయ్యా
2. నీలివస్త్ర ధారణలో-సచ్చిదానందమయ్యా
ఇరుముడినీ తలదాల్చిన-అనుభవమే వేరయ్యా
ఎరుమేలిలో ఆడే-పేటైతుళ్ళే భాగ్యమయ్యా
3. కరిమలను ఎక్కగలిగితే-కైవల్యం తప్పదయ్యా
పంబాలోమేను ముంచితే-జన్మధన్యమేనయ్యా
వనయాత్ర అనుభూతులు-వర్ణించలేమయ్యా
4. శరంగుత్తిలో బాణం గ్రుచ్చితె సంతోషమయ్యా
శబరిపీఠంపై పాదం-మోపితేపునీతులమయ్యా
పద్దెనిమిది మెట్లనెక్కితే-బ్రతుకు సార్థకంబయ్యా
5. సన్నిధానం వైభోగం-చూడకళ్ళు చాలవయ్యా
స్వామి దర్శనానందం-చెప్పనలవి కాదయ్యా
మకరజ్యోతి సందర్శనం-మహిమ చెప్పరాదయ్యా
సాయిబాబా సన్నిధానం
సకల జనులకు ముక్తిధామం
షిరిడీనాథుని దివ్య చరితం
భవబంధమోచక సాధనం
1. సాయిరూపం-విశ్వదీపం
సాయినామం- మోక్షమార్గం
సాయిగానం-స్వర్గయానం
సాయితత్వం-మహిమాన్వితం
2. సాయినయనం-మలయపవనం
సాయిహృదయం-ప్రేమమయము
సాయి భజనం-భవపాప హరణం
సాయినిలయం-ప్రశాంతి నిలయం
భజనసేయ భయమేల బ్రతుకు పండురా
నిజముగ ఆ గజముఖుడే మనకు అండరా
నమోనమో గణాధిపా అనిన చాలురా
సదాతనే మనశ్రేయం మరువకుండురా

1. గుండె గొంతునొకటిచేసి- కరతాళం జతగ జేసి
వీథివీథి వాడవాడ –పురమెల్లా మారుమ్రోగ

2. బిడియాలను వదిలివేసి-హృదయాలను తెరిచివేసి
కదంతొక్కి కాలువేసి-తనువే మైమరచి పోగ

3. పిల్లాపెద్దా కలిసిమెలిసి-ఆడామగా అందరు కలిసి
జనశ్రేయమె ధ్యేయంగా- జగమంతా ఊగిపోగ

శరణుశరణు వినాయకా-శరణు కరిముఖా
శరణు ఏకదంత పాహి-పార్వతీ సుతా
పాహిపాహి విఘ్నేశా పాహి గణపతి
పాపములను తొలగింపగ నీవె మాగతి