Friday, June 19, 2009

కోకిలకేమెరుకా-వేచెనని తనకై రాచిలుకా
ఒంటరి తానని కంట తడేల నిజము నెరుగదు బేలా
1. కోరిన కొలదీ దూరము పెరిగే
పెరిగిన దూరము ప్రేమను పెంచే
తీరని దాహము ఆరని మోహము
హృదయము దహియించే
2. చిలకా కోకిల జత కుదరనిదని
లోకము ప్రేమని గేలిచేసే-వింతగ చూసే
నవ్వుకొందురు నాకేటి సిగ్గని
చిలుక ఎదిరించే
3. పెదవి విప్పదు ప్రేమని తెలుపదు
మౌనగీతం పాడక మానదు
ఎన్నినాళ్ళో చిలుక నిరీక్షణ
విధికి దయలేదా.... ఓ..
చిటుకు చిటుకు చిటుకు చిటుకు వానా
చిందేయవే చిన్నాదానా
వణుకు వణుకు వణుకు వణుకు లోనా
పెనవేయవే కుర్రదానా
1. పరచిన ఈ పచ్చనైన ప్రకృతి నీవు
మెరసిన ఆ మెరుపులకే ఆకృతి నీవు
నింగిని ముద్దాడుతున్న నీలగిరి కొండలు
జాలువారుతున్న ఆ జలపాతపు హోరులు
నీ తళుకు బెళుకు మేని మెరుపు చూసీ
నేను వెర్రెత్తీ పోనా
2. పద్మినీజాతి స్త్రీలు ప్రస్తుతించె అందం
రతీదేవి తలవంచే తీరైన నీపరువం
పొరపాటున భువికి దిగిన శృంగార దేవతవు
పెద్దన కవి సృష్టించిన వరూధినీ ప్రతీకవు
నీ వలపు పిలుపు మేలుకొలిపె నన్నూ
నీకు దాసోహమననా
చిత్తగించు స్వామీ నా చిత్తము నీకిచ్చితి
అవధరించు స్వామీ నావ్యధను విన్నవించితి
ఆదరించు స్వామీ అన్యధా శరణం నాస్తి
అయ్యప్పస్వామీ నీవే నాకిక శరణాగతి
స్వామి శరణమయ్యప్పా-శరణం శరణమయ్యప్పా
1. రెప్పలిస్తివి కన్నులకు-స్వామి శరణమయ్యప్పా
చప్పున అవి మూసుకోవు- స్వామి శరణమయ్యప్పా
కూడని దృశ్యాలనే చూపించే నయ్యప్పా
జ్ఞాననేత్రమిస్తె చాలు-కన్నులేల అయ్యప్పా
2. పెదవులిస్తివి నోటికి- స్వామి శరణమయ్యప్పా
గమ్మున అవి ఊరుకోవు- స్వామి శరణమయ్యప్పా
వ్యర్థవాదులాటలకే-వెంపర్లాడునయ్యప్పా
మూగయైనమేలే-నీ నామమనకపోతె అయ్యప్ప
3. చెవులెందుకు పోగులకా- స్వామి శరణమయ్యప్పా
చేతులెందుకు మింగుటకా- స్వామి శరణమయ్యప్పా
నీ గానంవినని చెవులు చేటలే అయ్యప్పా
నీభజన చేయని చేతులు-చెక్కలే అయ్యప్పా
4. కాళ్ళిస్తివి దేహానికి- స్వామి శరణమయ్యప్పా
నీ సన్నిధికే నడిపించు- స్వామి శరణమయ్యప్పా
తోలిస్తివిఅస్తిపంజరానికి- స్వామి శరణమయ్యప్పా
నీ భావనకే పులకరించగ-అనుగ్రహించు అయ్యప్ప
శరణం శరణం బాబానే-ముక్తికి మార్గం బాబానే
శాంతికి నిలయం బాబానే-ప్రేమస్వరూపం బాబానే
సాయి రామయ్యా-బాబా-సాయి కృష్ణయ్యా
1. మెలకువలోను బాబానే-నిద్దురలోను బాబానే
గుడిలో గుండెలొ బాబానే-పనిలోపాటలొ బాబానే
గణపతి బాబానే బాల మురుగను బాబానే
2. వేదనలోను బాబానే-మోదములోను బాబానే
తల్లీదండ్రీ బాబానే-గురువూ దైవము బాబానే
మారుతి బాబానే-స్వామి అయ్యప్ప బాబానే
నమోనమో సిద్ధి వినాయక-నమోస్తుతే శ్రీ గణనాయక
గొనుమిదె మంగళ హారతి-వినుమిదె దీనుల వినతి
1. మూషికారూఢ దేవా-ఓ బొజ్జ గణపయ్యా
మహాకాయ మాంపాహి-ఓ వికట వెంకయ్యా
దాసజనపాల వేగ-దర్శనమ్మీవయ్యా
కామిత మోక్షవరద-దరిజేర్చుకోవయ్యా
నీదు మంగళానామం-మాకు మంగళదాయం
నీ కొరకే అంకితమై-సర్వాన్నీ త్యజిస్తుంటే
వలదిక వేరే సుఖము-లేదిక మరియే స్వర్గము
2. ఆడుతూ పాడుతూ మా- బాల్యమే మాయమాయే
క్షణిక దాహాలలోనా-యవ్వనం జారిపోయే
ఇహసౌఖ్య చింతనల్లో-దేహమే మోడువారే
ఇన్నాళ్ళ జీవితంలో- నిన్ను స్మరియించనాయే
నీదు దివ్య సన్నిధిలో-ఈ తొమ్మిది రాత్రులలో
ఈ క్షణమే శాశ్వతమై-నీ నామం జపిస్తుంటే
వలదిక వేరే వరము-లేదిక మరియే పరము