Monday, June 22, 2009

చేజారెను గతమంతా వృధా వృధా
గడిచిపోయె బ్రతుకంతా నిస్సరముగా
దిక్కునీవె సాయి నాకు వేరెవరూ లేరుగా
మ్రొక్కగ నీవొక్కడివే కరుణింతువుగా –సాయి కరుణింతువుగా
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
1. విననీయి చెవులారా నీ నామగానం
కననీయి కనులారా నీ దివ్య రూపం
అననీయి నోరారా నీ నామ భజనం
కొలవనీయి మనసారా సదానిన్నే సాయిరాం
2. ఎత్తుకుంటా సాయి పుత్రునివై జన్మిస్తే
హత్తుకుంటా ఎదకు నేస్తమై నువు వస్తే
చేసుకుంటా సేవ గురుడివై కరుణిస్తే
చేరుకుంటా నిన్ను సద్గతిని నడిపిస్తే
3. భోగభాగ్యాలను ప్రసాదించ మనలేదు
ఐహిక సౌఖ్యాలను నే వాంఛించలేదు
జీవితమే సాయి నీకు కైంకర్య మందును
కైవల్య పదమె నాకు దయచేయమందును
జయ గణపతీ నీకిదె హారతీ
మంగళమ్మిదె మంగళ మూర్తీ
కరుణ జూపి వరములిచ్చి
మమ్ముల బ్రోచే దయానిధి
1. అణువుఅణువున నీవె నిండిన అమృతమూర్తీ హారతీ
నా కవితలోని భావమైనా ధ్యానమూర్తీ హారతీ
ఆదిమధ్యాంతరహిత వేదాంత మూర్తీ హారతీ
ఆర్తత్రాణపరాయణా కరుణాంతరంగా హారతీ
2. చవితి పండగ మా కనుల పండగ
మాకు నీవే అండయుండగ
కుడుములుండ్రాల్ బొజ్జనిండగ
భుజియించు తండ్రీ తనివిదీరగ
3. పిలిచినంతనె ఎదుటనిలిచే ఏకదంతా హారతీ
అడిగినంతనె వరములిచ్చే విఘ్ననాయక హారతీ
జ్యోతులమహర్జ్యోతివీవే పార్వతీసుత హారతీ
జ్ఞానముల విజ్ఞానమీవే జ్ఞానమూర్తీ హారతీ
సిద్ధి వినాయక స్వామీ స్వామీ
నా మీద నీకింక దయరాదేమి
1. పాడితి నీ గీతి ప్రతి నిమిషమ్మున
వేడితి గణపతి నిను వేవిధముల
కొలిచితి నిన్ను శతకోటి రీతుల
తలచితి నీనామ మనంత మారుల
2. లయనేనెరుగను కరతాళములే
రాగములెరుగను భవరాగములే
తపముల నెరుగను తాపత్రయములె
వేదములెరుగను నీ పాదములే