Saturday, June 27, 2009

లోకంలో ఎంతటి శోకం ఉంది
నా శోకం అది ఎంతటిదీ
లోకుల వేదన చూసిన కొలది
అవేదననే మరచితిని
1. కోటికి ఎవరో సుఖపడతారు-ఎవరైనా సరె దుఃఖిస్తారు
తింటే అరగని దొక శోకం-తిండే దొరకని దొక శోకం
ఇంటింటికీ ఒక ఖేదం ఉంది-నా శోకం అది ఎంతటిది
2. ఇంద్రధనువులే అగుపిస్తాయి-ఎండమావులే ఎదురొస్తాయి
పెదవులవిరియును చిర్నవ్వులు-కన్నుల కురియును అశ్రువులు
సుఖదుఃఖాలకు నిలయం బ్రతుకు-తెలిసీ వగచుట ఎందులకు
3. మండే కొలిమి ప్రతి గుండె-ఎండని కొలను ప్రతి కన్ను
ఎదఎదకూ ఒక వ్యధ ఉంది-ప్రతి వ్యధకూ ఒక కథ ఉంది
ఈ జగమే విషాదమయం-జనజీవనమే దయనీయం
బుగ్గగిల్లితే పాలుగారును
గుండె తాకితే ప్రేమకారును
తోడు దొరకనీ కుర్రకారును
తాళలేను నా వయసు పోరును
1. కలలు పండించు కామధేనువును
వన్నెలొలికెడి ఇంద్ర ధనువును
వయసు పలికెడి వలపు వేణువును
అలిగి పలిగెడి పరమాణువును
2. కన్నె నెమలికి వానకారును
కన్నె మనసుకి పూలతేరును
పరుగు ఆపని పిల్ల ఏరును
అదుపు తప్పని కడలి హోరును
నేను తప్పుచేసానంటే ఆ తప్పు నీదే
అయ్యప్పా! నే దాన్ని ఒప్పుకోలేకపోతె ఆ తప్పూ నీదే
నీవూ నేనూ ఒకటె అన్నది తప్పుకాకపోతే
తప్పు నాదన్నా నీదన్నా అది తప్పు కాదే!
1. పూర్వజన్మ కృతమన్నది స్వీకృతమే ఐతే
జన్మదాటి వెంటాడిన దోషానిదె దోషము
గతజన్మలోనేను పాపాత్ముడనే ఐతే
పాపికి మరుజన్మనిచ్చిన నీదేకద లోపము
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరట స్వామీ
నా తప్పులనెంచ బూనితె నీదీ ఒక తప్పేకద
2. పొరపాటులె నాకలవాటుగ అయినాయంటే
ఆ దురలవాటు మాన్పించని నీదే కద పొరబాటు
పుట్టుకతో నేనెరుగని నేరములన్నీ
నాతో చేయించే నీదే కద ఆ నేరము
నాటకాలు ఆడించీ నవ్వుకునే సూత్రధారీ
ఆటగెలిచినా ఓడినా నీవే కద జవాబుదారీ
గంపెడంత ఆశతొ షిర్డీకి వచ్చాను
గడపలెన్నొ ఎక్కిదిగి విసిగి వేసరి నే దిక్కు తోచకున్నాను
ఆదరించె మారాజు నీవని నమ్మి నీ పంచన జేరాను
వట్టిచేతులతొ బాబా నే వాపసు పోనయ్యా
వరములిస్తెనే గానీ నీ పదాలనొదలనయా
1. గణపతివి నీవె మారుతివి నీవె
శరణంటె కరుణించె అయ్యప్పవూ నీవె
హరిహర బ్రహ్మలు ముగ్గురొక్కటైన
సాక్షాత్తు పరబ్రహ్మ దత్తాత్రివీ నీవే
అభయమీయగా ఎవ్వరూ నీ సరి రారయ్యా
వెన్న కంటెనూ మెత్తనిదీ నీ మనసేనయ్యా ||వట్టి చేతులతొ||
2. నిరీక్షించలేనయ్య పరీక్షించ బోకయ్యా
నీ రక్ష కోరి వచ్చాను బాబయ్య
భిక్ష పెట్టవయ్య నన్ను-లక్ష్యపెట్టవయ్య
నీ శరణు వేడి వచ్చాను బాబయ్యా
కడలి కంటెనూ గొప్పదయా-నీదయ బాబయ్యా
వెన్నెల కంటెనూ చల్లనయా-నీ చూపు బాబయ్యా ||వట్టి చేతులతొ||
3. తిట్టినా నువ్వే కొట్టినా నువ్వే
మెడ బట్టి నన్ను వెళ్ళగొట్టినా నువ్వే
పెట్టినా నువ్వె చే పట్టినా నువ్వే-
కడుపార నాకు బువ్వ పెట్టినా నువ్వే
నను గన్న తండ్రివి నీవే ఓ షిర్డి బాబయ్యా
చావైన బ్రతుకైన నీ తోనే ఓ సాయి బాబయ్యా ||వట్టి చేతులతొ||
ఓ బొజ్జ గణపయ్యా కరుణించవేమయ్యా
ఎన్నాళ్ళు నీ పూజలూ-ఎన్నాళ్ళు నీ భజనలు
నిరతమూ వేడినా-నిను మదిలొ నిలిపినా
దయరాదా నాపైనా-సిద్ధివినాయకా బుద్ది ప్రదాయక
1. నీ పాద దాసుడనై-నీ మీది ధ్యాసుడనై
నీ దివ్య సన్నిధిలో-
నేను నీలొ కలిసి పోయి-నీవె నాలొ నిలిచి పోయి
తనువూ-జగమూ శూన్యమై
నా మనసే నీలో లీనమై
పరవశించె ఆ భాగ్యం-కలిగించవయ్యా-కరుణించవయ్యా
2. క్షణికమైన సుఖములను ఆశించ లేదయ్యా
తుఛ్ఛమైన కోరికలు అర్థించలేదయ్యా
ఈ అంధకార మార్గంలో
వెలుగు దారి చూపించు
జ్ఞాన దృష్టి కలిగించు
బాధా భరితము ఈ జీవితము
సారరహితమీ సంసారం.........
ఈదలేను విఘ్నేశా
దాటించవయ్యా నీ దరి జేర్చవయ్యా