Monday, June 29, 2009

ఎదలోపల మర్మం దాచేయలేను
పెదవిదాటి భావం రానీయలేను
కక్కలేను మ్రింగలేను హాలాహలం
ఆరదు చెలరేగదు ఈ దావానలం
1. వయసేమో ఉప్పెనగా ఎగసిఎగసి పడుతోంది
మనసు మేల్కొని చెలియలి కట్టను కడుతోంది
పిల్లులచెలగాటం ఎలుక ప్రాణసంకటం
అడకత్తెరలో చిక్కిన పోకచెక్క జీవితం
2. మమతల పాశం గొంతు నులిమేస్తోంది
ప్రబలిన స్వార్థం గుండె కబళిస్తోంది
త్యాగంభోగం మధ్యన ఊగుతోంది లోలకం
బ్రతుకే విధి సయ్యాటల వింతనాటకం
ఒక రాధిక మానస చోరా
ఒక మీరా హృదయ విహారా
రావేరా ప్రణయ కిషోరా
నన్నేలా ధీరసమీరా
1. ఇసుక తిన్నెలేలా పరచితి నాఎద
పిల్లగాలులేలా వీచితి పయ్యెద
యమునాతటియేల నే మందాకినే కాద
ఆరాధ నీకేల అనురాగ సుధగ్రోల
2. వేణువు నీకేల గొను అధరామృతాల
నర్తన నీకేల కను నానయనహేల
కీర్తన నీకేల విను నా ప్రార్థన గోల
ఆ మీర నీకేల నీ చరణాల నేవ్రాల
మాధుర్యమెక్కడ తేనయ్యనేనూ
తేనా(అర్ధ 'య'కార ఉచ్ఛారణతో)భిషేకాల మునిగేటి స్వామి
రాగాల నెట్టుల నేర్చేను నేను
క్షీరాభిషేకాల మునిగేటి స్వామీ
స్వామీస్వామీ శరణం స్వామీ-ఓంకార రూపా శరణం స్వామీ

1. శృతినే రీతిగ నిలిపేను నేను
శర్కరా స్నానాలు చేసేటిస్వామీ
లయనే విధముగ కలిపేను స్వామీ
పెరుగుతో స్నానాలు చేసేటి స్వామీ
స్వామీస్వామీ శరణం స్వామీ-జ్యోతి స్వరూపా శరణం స్వామీ

2. గమకాలనేభంగి పలికేను నేను
నెయ్యాభిషేకాల కులికేటి స్వామీ
ఎలుగెత్తి నేనెట్లు పాడేను తండ్రీ
పంచామృతస్నాన మాడేటి స్వామీ
స్వామీస్వామీ శరణం స్వామీ-చిన్ముద్ర ధారీ శరణం స్వామీ

3. మార్దవంబేలయ్య ఆర్తియే చాలదా
మదగజంబేరీతి పాడిందనీ
సంగీత మెందుకూ భక్తియే సరిపోద
పన్నగమ్మేభంగి నుడివిందనీ
స్వామీస్వామీ శరణం స్వామీ-పరమేశ తనయా శరణం స్వామీ


అట్టాంటిట్టాంటోడివి కాదు బాబయ్యా-షిర్డి బాబయ్యా
నను ఎట్టాగైనా గట్టెక్కించే దిట్టవు నీవయ్యా-జగజ్జెట్టివి నీవయ్యా

1. ఎల్లలు తెలియని దప్పిక ఆరని నీళ్ళే ఉన్నాయి-కన్నీళ్ళే ఉన్నాయి
కల్లలై మిగిలిన అల్లరై పోయిన ఆశలు ఉన్నాయి-అడియాసలు ఉన్నాయి
శరణని వేడగ కరుణతొ బ్రోవగ చరణాలున్నాయి-నీదివ్య చరణాలున్నాయి
దీనులపాలిటి దిక్కుగ నిలిచే దృక్కులు ఉన్నాయి-చల్లనీ దృక్కులు ఉన్నాయి

2. కష్టము తీర్చే చుట్టము నీవని నిన్నే నమ్మితిని-బాబా నిన్నే నమ్మితిని
తోడుగనిలిచే జోడువు నీవని నిన్నే వేడితిని-సాయీ నిన్నే వేడితిని
అక్కునజేర్చే తండ్రివి నీవని నీకే మ్రోక్కితిని-బాబా నీకే మ్రొక్కితిని
పిలిచిన పలికే పెన్నిధి నీవని నిన్నే మొరలిడితి-సాయీ నీకై మొరలిడితి

3. విఘ్నము బాపే గణపతినీవని తొలుతగ కొలిచితిని-బాబా నిన్నే కొలిచితిని
విజయము కూర్చే మారుతి నీవని జపమే చేసితిని-శ్రీరామ జపమే చేసితిని
విద్యలనొసగే గురువే నీవని పూజలు చేసితిని-బాబా హారతి పాడితిని
వ్యధలను బాపే అయ్యప్ప నీవని శరణము కోరితిని-సాయీ శరణము కోరితిని
లంబోదరా జగదంబాసుతా
దయగన రావేరా ఓ ఏకదంతా

1. నేరక నేరాలు ఎన్నెన్నొ చేసేము
ఎరుగక ఏవేవొ పెడదారుల నడిచేము
చేసిన తప్పులు మన్నించవయ్యా
మా త్రోవ మళ్ళించి మము కావుమయ్యా

2. తెలిసీ తప్పేటి మూర్ఖులమయ్యా
తెలియక చేసేటి మూఢులమయ్యా
కోరికలెన్నెన్నొ కోరుతూ ఉన్నాము
నువు కల్పతరువని నమ్ముతూ ఉన్నాము

3. విద్యల నొసగే వినాయకా
సంపద నొసగే గణనాయకా
అంజలి ఘటించి నీకు మ్రొక్కేము
అంతకు మించి ఏ సేవ చేసేము