Wednesday, July 1, 2009

ఈ మూగ గొంతులో –సంగీతం పలుకునా
ఈ మోడు గుండెలో-వాసంతం చిలుకునా
నాలో చెలరేగే దావానలమిక ఆగునా
ఆగని కన్నీరే ఇల గోదారిగ పారునా

1. చేసిన ఆబాసలు-రేపెను పలు ఆశలు
ఆ బాసలు నా బ్రతుకును బలిపశువుగ చేసెనా
ఆ ఆశలు మరునిమిషము అడియాసగ మారెగా
మనసులు ఎడబాసెగా

2. ఇది ఎంగిలి విస్తరాకు-
ఈ ముంగిలి చేరరాకు
చితికే చినదాని బ్రతుకు
చితికే ఇది చేరు తుదకు

కోకిల కూజితం నీగాత్రం
కలువవిరాజితం నీ నేత్రం
ఆరాధన పూరితం ఈ స్తోత్రం
అనురాగ నిగూఢితం ఈ పత్రం

1. నా కవితకు నీవే కాదా చెలి ప్రేరణ
నీ గీతికి నేనే కానా ఆలాపన
ఓపలేను నేనింకా ఈ విరహ వేదన
ఆలకించి వేవేగ దరిజేర ప్రార్థన

2. నీ కనులకు నేనే కానా చెలి కాటుక
నీ కురులలొ నిలిచేందుకు అయిపోనా మల్లిక
మధురమైన ఈ క్షణము మళ్ళీ మరి రాదిక
రావేలా నా మానస బృందావన రాధిక
శరణంటిరా కరుణించరా- శరణం శరణం అయ్యప్పా 
జపియించితీ జాగేలరా- శరణం శరణం అయ్యప్పా 
దర్శించెద దరిజేర్చరా- శరణం శరణం అయ్యప్పా 
ఘోషించితీ మొరాలించరా- శరణం శరణం అయ్యప్పా

 1. నే రాసే ప్రతి పదము- శరణం శరణం అయ్యప్పా
 నే పాడే ప్రతి పదము- శరణం శరణం అయ్యప్పా 
నే పలికే ప్రతి పదము- శరణం శరణం అయ్యప్పా 
నే కోరే పరమ పదము- శరణం శరణం అయ్యప్పా 

2. నే నెరిగిన దొక మంత్రం- శరణం శరణం అయ్యప్పా
 నే నేర్చిన దొక సూత్రం- శరణం శరణం అయ్యప్పా 
నే చేసే దొకే స్తోత్రం- శరణం శరణం అయ్యప్పా
 నా ఎదకొకటే ఆత్రం- శరణం శరణం అయ్యప్పా
నిన్నే నమ్మినాను అన్యమేరుగను
ఎన్నడైనగాని నిన్ను మరువను
సచ్చిదానంద రూపా హే సాయిబాబా
రాజాధిరాజ హే యోగి మహారాజా
1. మోదములో ఖేదములో అశ్రువులే వర్షిస్తాయి
జననంలో మరణంలో రోదనలే వినిపిస్తాయి
అశ్రుధారలేవైనా చేసేను నీ అభిషేకం
నాదరీతులేవైనా అదియె నీ సంకీర్తనం
సచ్చిదానంద రూపా హే సాయిబాబా
రాజాధిరాజ హే యోగి మహారాజా
2. నిద్దురలో మెలకువలో నినదించును నాహృదయం
ఆశలలో అడియాసలలో స్పందించును నాచిత్తం
ఎదకెప్పుడు నీదే ధ్యాస-చిత్తములో నీదే ధ్యానం
కోరికదిక ఒకటే కోరిక- నాలో తను లేకపోవుట
సచ్చిదానంద రూపా హే సాయిబాబా
రాజాధిరాజ హే యోగి మహారాజా
దేవా జయజయ విఘ్నేశా
నీ భక్తుల మొర వినిరావా
హారతి గొనుమా గజవదనా
శుభములనిడుమా

1. విద్యను కోరేము వినాయకా
మంగళహారతి గొను మంగళదాయకా
పాపులము మేము పరితాపులము
పాపలము మేము నీ దాసులము

2. కలిమిని కోరేము ఓ ఏకదంతా
కర్పూర హారతిదే కామరూప ధారీ
ప్రతియేటా ఈపాటా ప్రతిపూటా మానోట
నవరాత్రులూ నిను భజియింతుమూ విను