Thursday, July 9, 2009

మనసే ఎగసే కడలి తరంగం
బ్రతుకే మ్రోగే మరణ మృదంగం
విధి ప్రియమైనది విషాదరాగం
అది చేయునులే విషమ ప్రయోగం
1. జగమే మనిషికి ఒక రణరంగం
ఆశే మనిషికి కదనతురంగం
ప్రయత్నమే తన విక్రమ ఖడ్గం
ఫలితం విజయమె వీరస్వర్గం
2. ప్రేమే మనిషికి ఒక ఆకర్షణ
పెళ్ళే మనిషికి ఒక సంఘర్షణ
కట్టుబాట్లతో నిత్యం ఘర్షణ
జీవితమే ఆవేదన కర్పణ
జీవితం ప్రేమమయ గీతము
పాడుకోవాలి ప్రతి ఒక్కరం
జీవితం వేదనా సాగరం
నవ్వుతూ చేరవలె తీరము
1. జీవితం మధుర స్వప్నము
దాచుకోవాలి ప్రతి హృదయము
జీవితం తీరని దాహము
తీర్చు’నది’ ఒకటె అది స్నేహము
2. జీవితం ఒక చదరంగము
ఆడిగెలవాలి ఆసాంతము
జీవితం అద్భుత పుస్తకం
చదివి తీరాలి ప్రతి అక్షరం
3. జీవితం ముద్ద మందారము
గ్రోలితీరాలి మకరందము
జీవితం సాహస భరితము
పొందితీరాలి ప్రతి అనుభవం
4. జీవితం ఒక సందేహము
దొరకదెపుడూ సమాధానము
జీవితం ఒక విద్యాలయం
నేర్చుకోవాలి ప్రతి పాఠము-గుణపాఠము
చిత్తములో అయ్యప్పా-స్థిరవాసం ఉండిపోతే 
మనసంతా ఓ మణికంఠా-నీవే మరి నిండిపోతే 
తావేది నీచపు యోచనకు-చోటేది వక్రపు భావనకు
శరణం శరణం అయ్యప్పా-స్వామిశరణం అయ్యప్పా

 1. సుందరమైన నీరూపం-మా కన్నుల కెప్పుడు చూపిస్తే మధురంబైన నీ నామం-మా నోటివెంట నువు పలికిస్తే 
తావేది నీచపు దృశ్యాలకు-చోటేది వక్రపు భాష్యాలకు 

2. శ్రావ్యంబైన నీ గానం-మా వీనులకెప్పుడు వినిపిస్తే
 దివ్యమైన నీ మార్గం-మా తోడుండీ నువు నడిపిస్తే 
తావేది నీచపు వాదాలకు-చోటేది వక్రపు దారులకు 

3. నీ పూజలు చేయుటకొరకే-మా కరముల వినియోగిస్తే 
నీ ప్రసాద భక్షణ కొరకై-మా నాలుక నుపయోగిస్తే 
తావేది పాపపు కృత్యాలకు-చోటేది దోషపు వ్యాఖ్యలకు
అమృతంబే సాయి నీ పాదతీర్థం
ఔషదంబే సాయి దివ్య ప్రసాదం
మంత్రముగ్ధమె సాయి నీ భవ్య వీక్షణం
ముగ్ధమోహనమె సాయి నీ మందహాసం
1. షిర్డీ పురమే అపర వైకుంఠం
శ్రీ సాయినాథ నీవే పరమాత్మ రూపం
శిథిల ద్వారక మాయి భూలోక స్వర్గం
నీ పాద సేవయె కైవల్య మార్గం
2. నిను స్మరియిస్తే జన్మ చరితార్థం
నిను దర్శిస్తే జన్మ రాహిత్యం
నిన్ను కీర్తిస్తే సాయి సచ్చిదానందం
ప్రార్థిస్తె చాలు సాయి సాక్షాత్కారం

నా ఎదనే పగిలిన శిల్పం
నే బ్రతికీ ఏమిలాభం
నా మనసే తెగిన పతంగం
ఇక భవితే నాకు శూన్యం

1. చీకటిలో నీ దారి కొరకు
వెలిగించా నాదు హృదయం
నువు గమ్యం చేరు వరకు
అర్పించా నీకు సకలం
నువు లేక వృధా ఈ లోకం
ఇక ఎన్నున్నా ఏమి లాభం

2. అందరాని చందమామా
కనులముందు ఉంటె నరకం
పొందలేని అందమంతా
కెలుకుతోంది గుండె శోకం
చేజారె సదవకాశం
ఇక వగచీ ఏమి లాభం
కలువలు నీ కన్నులలో కాపురం చేయునా
మల్లెలు నీ నవ్వులలో మనుగడ సాగించునా
సంపెంగా మురిపెంగా నాసికగా మారెనా
జగతిలోని ప్రతి అందం నీ రూపున నిలిచెనా
1. నా ఊహకు నీవే ఊపిరివైనావు
నా ఆశకు నీవే ప్రాణం పోశావు
నా హృదయపు కోవెలలో దేవతవైనావు
అనురాగ సామ్రాజ్యపు మహరాణివి నీవు
2. కనులముందు నీవుంటే కవిత పారదా
పెదవివిప్పి పలికితే పికము పాటఅవదా
నీవలపే నూరేళ్ళూ నను బ్రతికించు
నీ తలపే పదిజన్మల కనుభూతిగ మిగులు
నిన్ను మించిన అందమేదీ - లేనె లేదులె సాయిరాం 
నీ సేవ కన్నా సౌఖ్యమన్నది-వేరెలేదులె సాయిరాం 

1. వాడితే వసివాడిపోయే-పూలదా సౌందర్యము 
తాగితే రుచి తరిగిపోయే-తేనెదా మాధుర్యము 
చూపుమరలదు వేళ తెలియదు సాయి నీ సందర్శనం 
నోరునొవ్వదు తనివి తీరదు-సాయి నీ సంకీర్తనం 

2. వరదలైతే వరదలవనీ నదులదా సేవాగుణం 
ఘనములయ్యీ జగమునంతకు గగనమయ్యేవా ఘనం 
దారితప్పిన వారినైనా చేరదీసే అమ్మఒడి షిర్డీపురం 
కోరికొలిచే వారికీ కొంగుబంగారమే సాయి నీ అవతారం
శబరిమలై నిలయా-శివకేశవ తనయా 
శరణమయా-శరణమయా స్వామీ అయ్యప్పా 

1. ఇరుముడి నిడి తలపై-
తరలగ నీ గిరికై 
తరించగమే-అవతరించెదవే 
మకరజ్యోతివి నీవై

 2. నలభయ్యొక్క రోజులు-
కఠినదీక్షను బూనుకొని 
జపించెదము-భజించెదము 
నీ నామ గానామృతాలే

 3. నా మదిని కబళించే-అరిషడ్వర్గాల 
జయించగ మా ఆత్మ-బలమ్మును పెంచగ 
వరంబుల నొసగవయా
మరతునో ఏమో మహేశా
నిను మది తలతునో లేదో
భవసాగరమున మునకలు వేయుచు
భవ బంధమ్ముల పెనుగులాడుచు
1. నా ఆత్మ లింగమై దేహాన నిలిచి
నిత్యాభిషేకాలు చేయించుకో
నాహృదయ నాదమై నూరేళ్ళు పలికి
ఢమరుకా రావాలు మ్రోయించుకో
2. అంతర్మధనలొ ఆవేదనలో
హాలాహలమ్మును దిగమింగుకో
చిరుచిరు హర్షాల సిరిసిరి మువ్వల
ఆనంద నాట్యాల నర్తించుకో
3. పలికే పలుకుల సద్వాగ్రూపమై
వేదాంత సారాల వచియించుకో
తలచే తలపుల నీ స్మృతి చిహ్నమై
విజ్ఞాన దీపాల వెలిగించుకో