Friday, July 10, 2009


తలపండి పోయింది
తలపెండి పోయింది
బ్రతుకంత బాధల్లోనే
అణగారి పోయింది-శిథిలంగ మారింది

1. కలలాగ కరిగింది
కన్నీరు మిగిలింది
రేయంత ఊహల్లోనే
తెల్లారి పోయింది-చల్లారి పోయింది

2. మనసు మసి బారింది
భవిత తెర జారింది
వాసంత మాసంలోనే
చిగురాకు రాలింది-శీతాగ్ని రగిలింది

3. రేవతి నా రాగం కాగా
వేదన నా వేదం కాగా
నీ జీవన వేణువు మీద
విషాదమే ఒలికింది-విరాగమే పలికింది
వేణువునై నీకై వేచేనురా
యమునా నదినై ఎదురు చూసేనురా
రారా కృష్ణా- రారా కృష్ణా రారా రారా రావేర కృష్ణయ్యా
ఈ జాగేలరా కృష్ణయ్యా
1. నెమలి పింఛమునై నీ శిఖలో నిలవాలని
కస్తూరి తిలకమునై నీ నుదుట మెరవాలని
నీలి వర్ణమునై నీ దేహాన్ని నిమరాలని
నేకన్న తీపి కలలు కల్లలు చేయకురా ||రారా కృష్ణా||
2. ఒక రాధ ఎదలో కొలువై యున్నావు
ఒక మీరా మదిలో నెలకొని యున్నావు
ఒక కుబ్జ పాలిటి వరము నీవైనావు
ఈ దీనురాలి మొరనే వినకున్నావు
3. చిరుగాలికెరుకా నావిరహ వేదన
మరుమల్లికే తెలుసు నావయసు తపన
వెన్నెలకే ఎరుకా నా నిట్టూర్పుల వేడిమి
సర్వాంతర్యామి నను నీవెరుగకున్నావా
స్వామిశరణం స్వామిశరణం-శబరిగిరి అయ్యప్ప శరణం స్వామిశరణం స్వామిశరణం-కాంతిమల మణికంఠ శరణం

 1. విఘ్నేశ్వర స్వామి శరణం- స్వామిశరణం స్వామిశరణం పళనిమల శ్రీ సుబ్రహ్మణ్య- స్వామిశరణం స్వామిశరణం 
కొండగట్టు ఆంజనేయ- స్వామిశరణం స్వామిశరణం 
ధర్మపురి శ్రీ నారసింహ- స్వామిశరణం స్వామిశరణం 

2. ఏడుకొండల వేంకటేశ్వర- స్వామిశరణం స్వామిశరణం 
గూడెం సత్యనారాయణ- స్వామిశరణం స్వామిశరణం
 మంత్రాలయ రాఘవేంద్ర- స్వామిశరణం స్వామిశరణం 
శ్రీశైల మల్లిఖార్జున- స్వామిశరణం స్వామిశరణం 

3. వేములవాడ రాజేశ్వర- స్వామిశరణం స్వామిశరణం 
భద్రగిరి శ్రీ రామచంద్ర- స్వామిశరణం స్వామిశరణం 
గురువాయూర్ శ్రీ కృష్ణమూర్తి- స్వామిశరణం స్వామిశరణం ద్వారకామయి సాయిబాబా- స్వామిశరణం స్వామిశరణం
రావేర షిర్డి సాయినాథా-హే దీనబాంధవా
మా ఆర్తిబాపవేరా-ఓ ప్రేమ సింధువా –దేవా
1. తిరుగలితో గోధుమలు విసిరి-మహమ్మారిని మాపితివి
బూడిదతో కోరిన దొసగి-నీ మహిమలు చూపితివి
2. శిథిలమ్మగు మసీదె కాదా- నీ నివాస మందిరము
దయామృతం కురిసే నీ- నయనమ్ములె సుందరము
3. దీనులె కద నీ బంధువులు-ఆర్తులె కద నీకతి ప్రియులు
మనసారా నిను నమ్మితిమి-మముగాచే దైవం నీవని
4. కన్నీళ్ళతొ నీ పాదములే-నే కడిగితి షిర్డీశా
కరుణించగ జాగేలా-ద్వారకామయివాసా
శంభో శంకరా-గంగాధర హర
మొరవిని రావేరా-పరాత్పరా
వరములనీవేరా
1. సాటి మనిషి పైన మనిషికెందుకింత కక్ష
దీనజనులకేనాటికి నీవేకద రక్ష
గెలవలేరు ఎవ్వరు నీ వింత పరీక్ష
కరుణతోడ ప్రసాదించు విజ్ఞాన భిక్ష
2. ఆవేశం మా పాలిటి అతి ఘోర శాపం
కోపం మే చేసుకొన్న గతజన్మ పాపం
విశ్వజనీనమైన ప్రేమ నీ స్వరూపం
దర్శింతుము వెలిగించుము సుజ్ఞాన దీపం