Monday, July 13, 2009

మల్లెలు విరిసే వేళ
వెన్నెల కురిసే వేళ
నాచెలి రాలేదేల
నను మురిపించే బాల
1. గుసగుస లాడ పొద ఉంది
గుబులును దీర్చ ఎద ఉంది
నాచెలి రాలేదేల
నను మురిపించే బాల
2. కన్నులు కాయలు కాచే
క్షణమే యుగమై తోచే
నాచెలి రాలేదేల
నను మురిపించే బాల
3. చెలిలేనీ నిశీధి వృధా
చెలి సన్నిధినే కోరితిసదా
నా చెలి రాదేమీ వేళా
నాలోరేగే హిమజ్వాలా
పెదవి పలవరించెనే
కనులు కలతచెందెనే
తనువులోని అణువణువు నీకై తపియించెనే-పరితపించెనే
1. గున్నమావి చిగురించెనే
సన్నజాజి విరిసెనే
తోటలోని పరిమళాలు
నిన్నుజేర పరువెట్టెనే
2. సంధ్య కాస్తా కనుమరుగాయే
చుక్కలొక టొకటొచ్చి జేరే
నింగిలోనా చందమామా
తొంగి తొంగి చూసెనే
3. కోయిలపాడుతు రమ్మనెనే
కాలము ఆగను పొమ్మనెనే
కొండవాగు నిన్ను వెదక
వడివడిగా సాగెనే

చలికి తట్టుకోలేను ఆకలికి తాళలేను 
చేయగ నా తరమా నీ దీక్ష నిష్ఠగా 
చేయించే భారం నీదే - స్వామి అయ్యప్పా-శరణమయ్యప్పా 

1. సూర్యోదయ పూర్వమే నిద్రలేవ నావశమా 
సుప్రభాత గీతి పాడి నన్ను మేలుకొలుపు సుమా 
చన్నీళ్ళతొ తలస్నానం-జివ్వుమంటుంది ప్రాణం 
హైమవతీ తనయ స్వామీ –అయ్యప్పా నీవే శరణం-అయ్యప్పానీవే శరణం 

2. శ్లోకాలూ స్తోత్రాలూ పలుకలేను స్వామీ 
శరణుఘోష ఒక్కటే నోరారా చేతునయా 
పడిపూజలు నీ భజనలు వీలవడం లేదయ్యా 
మదిలో నీ నామ స్మరణ మరువనులే అయ్యప్పా- మరువనులే అయ్యప్పా 

3. పాపిష్టివి నా కళ్ళు-కోపిష్టిది నానోరు 
భ్రష్టమైన చక్షువులు-నికృష్టపు చిత్తము 
తప్పించర భవ చెఱనిక స్వామీ హే భూతనాథ 
భవతనయా తవ దర్శన అనుభవమే కలిగించు- అనుభవమే కలిగించు 

4. అడుగుతీసి అడుగైనా వేయలేను నేను 
పాదరక్షలే లేక కదపలేను మేను 
పెద్ద పాదమార్గమతి కష్టంబట కద స్వామీ 
చేయి పట్టి నడిపించి శబరి చేర్చరావేమి-నీ చెంత జేర్చుకో స్వామీ
సంధ్యానటా,గంగాఝటా
హే చంద్ర మౌళీ , హే శూలపాణీ
హరహరహర శంభో శివ శంకరా
మొరవిని రావేరా భక్త వ శంకరా
1. దక్షిణోరువు మీద గణపతి స్వామీ
కొలువుండ విఘ్నాలు హరియించవా
వామాంకస్థితమైన గౌరీదేవీ
దరినుండ విజయాలు వర్శించవా
త్రిపురాసు సంహారక పురహర పాహీ
రతిపతినే దహియించిన త్రినేత్ర దేహీ
2. కిరాతుని వేషమున గర్వము నణచి
పార్థుడికిల పాశుపతమ్మీయలేదా
వీరభద్రుడివై రుద్ర నర్తన జేసీ
దక్షయజ్ఞము భగ్నమొందించలేదా
కరుణతోడ వరములిచ్చె భోలా శంకరా దేహీ
క్రమత నడిపి మోక్షమిచ్చె ప్రణవ శంకరా పాహీ
తారక మంత్రం సాయీరాం సాయీరాం
త్వమేవ శరణం సాయీరాం సాయీరాం
సర్వాంతర్యమి సాయీరాం
కరుణాంతరంగా సాయీరాం
1. క్షణమైన నీ మీద మది నిలుపకున్నాను
ఇహలోక చింతన నే వదలకున్నాను
నీ యోగ సాధన సాధింపకున్నాను
నా భారమంతా నీదేనన్నాను
2. కలియుగమిది సాయి తపమెరుగలేను
కల్లా కపటము కడతేర్చలేను
పరోపకారినని బొంకగలేను
నీ నామ జపమొకటె ఎరిగితి నేను
3. ధ్రువుడిని బ్రోవగ శ్రీహరి వైనావు
ప్రహ్లాదునిగావ నరహరి వైనావు
పిలిచిన పలికే హే షిర్డీశా
నను దయగనవేల శ్రీ సాయినాథా