Tuesday, July 14, 2009

చిలికి చిలికి చిరుగాలి వానయ్యింది
ఒలికి ఒలికి కన్నీరు ఏరయ్యింది
కరుగని నీ హృదయం శిలగా మారింది
వీడని నా పట్టుదలే ఉలిగా నిను తొలిచింది
1. మూడునాళ్ళ అందానికి మురిసి పోకులే
వయసుమీరి నీ కది ఒక శాపమగునులే
ఎన్నటికీ చెదరనిదీ మనసొకటేలే
ఏనాటికి నా ఎదనీకై మూయబడదులే
2. అద్దం నిన్నెప్పుడు వెక్కిరించునో
జనమెప్పుడు నీ నీడను తప్పుకొందురో
మరువకు నేనింకా బ్రతికి ఉన్న విషయం
మదిలోపల తలచినంత వాలుదు నీ కోసం-నీ ముందు తక్షణం
3. తోడెవరూ లేక నీవు ఒంటరివైతే
పలికేందుకు నీకంటూ మనిషేలేకుంటే
నిను దేవతగా కొలిచేందుకు నేనున్నాను
4. ఓ చిరునవ్వే వరముగా ప్రసాదించమంటాను
తిలకించే నయనాలకు జగమంతా అందం
అనుభవించె మనసుంటే బ్రతుకంతా ఆనందం
1. ఆరు ఋతువులకు ఆమని అందం
ఆకసాన హరివిల్లు అందం
రోజుకు ఉదయం అందం
మనిషికి హృదయం అందం
2. చీకటిలో చిన్ని దీపం అందం
బాధలలో చిరు ఆశే అందం
జగతికి ప్రకృతి అందం
ఇంటికి ఇల్లాలు అందం

దారి నీవూ తప్పకు-కన్నెస్వామి 
మాయదారి నడవకు 
వేసే పాదం ఆపకు-గురుని నామం మరువకు 
స్వామి-శరణుఘోషను విడువకు 

1. ఎన్ని జన్మల నెత్తావో 
ఎంత పుణ్యం చేసావో 
దొరికింది నీకు మణికంఠ నామం 
శరణంటూ విడవకు అయ్యప్ప పాదం

 2. సంపదల నిమ్మని అడగకు 
ఆపదల్లొ రమ్మని కోరకు 
స్వామిపదములు గట్టిగ పట్టుకో 
పరమ పదమును పట్టుగ పట్టుకో 

3. దీక్ష లక్ష్యం ఒక్కటే 
మోక్ష మార్గం పట్టుటే 
మాలను మెడదాల్చి నియమాల పాటించు 
భవబంధ పంబను అయ్యప్పనె దాటించు
నిను తలచుకుంటే సాయి
బ్రతుకంత హాయి హాయి
నిను కొలుచుకుంటే సాయి
కొదవన్నదే లేదోయి
సాయి రామయ్యా-సౌఖ్యమీవయ్యా
సాయి రామయ్యా-శాంతినీవయ్యా
1. దత్తావతారము నీవేనులే
మాణిక్యప్రభువన్న నీవేనులే
పండరిపురి లోని విఠలుడవీవేలె
పుట్టపర్తిలోని సత్యసాయి నీవేలె
సాయి రామయ్యా-దారి చూపయ్యా
సాయి రామయ్యా-దరికి జేర్చవయా
2. శ్రద్ధ-ఓరిమి నీ సూక్తులు
శాంతి ప్రేమలు నీబోధలు
దీనులు ఆర్తులు నీ భక్తులు
మహిమాన్వితములు నీ గాధలు
సాయి రామయ్యా-జ్ఞాన మీయవయా
సాయి రామయ్యా-ధ్యానము నీయవయా
సుఖమేలరా ఓ నరుడా
ఈ నశ్వర దేహానికి
1. పాలు మీగడల పోసిపెంచేవు
పంచ భక్ష్యాల ఆరగించేవు
జిట్టెడు పొట్టకు పట్టెడు చాలుర
పుట్టేడు నీకేలరా
2. మిద్దెలు మేడలు కట్టించేవు
ఆస్తులు జాస్తిగ కూడబెట్టేవు
ఆరడుగుల అవనియె చాలుర
జగమంతా ఏలరా
3. వేసవిలోనా ఖద్దరు గుడ్డలు
శీతాకాలం ఉన్ని దుస్తులు
రగిలే చితిలో రక్షించదేదీ
దేహచింతేలరా
4. శాశ్వతమంటే హరిపాదసేవే
సౌఖ్యమంటే హరి నామగానమె
క్షణభంగురమీ ఇహలోక చింతన
కైవల్య గతి సాగరా ఓ నరుడా
నీ కష్టాలు కడతేరురా