Thursday, July 16, 2009

అనుమానం నీ బహుమానం
అవమానం నీ అభినందనం
ఇన్నినాళ్ల మన స్నేహం ముక్కలైపోయింది
అనుభూతుల మన సౌధం నేలకూలి పోయింది
1. వేదనా చీకటీ నన్నవరించాయి
ఆనందం వెలుతురు అంతరించి పోయాయి
నూరేళ్ల జీవితం శిథిలమై పోయింది
పండంటి ఈ బ్రతుకు శిశిరమై మిగిలింది
2. కలిసి చేసె రైలు పయనమంతమై పోయింది
మూడునాళ్ళ ముచ్చటగా పరిసమాప్త మయ్యింది
ఈ అనంత పయనానికి గమ్యమనే దెక్కడో
ఈ ఒంటరి బికారికి భవితవ్యం ఏమిటో

నా మదిలో మెదిలే స్మృతిలో కదిలే మధుర ఊహ నీవే
క్షణమే వెలిగే మెరుపుతీగలా గలగలపారే కొండవాగులా
ఉరకలు వేసే భావము నీవే-నా ప్రాణము నీవే
1. అందరాని ఆకసానా చందమామలా నీవూ
ఉట్టికైనా ఎగురలేకా పట్టువదలని నేను
నువు అందానివి ఆనందానివి
నా అంతరంగాన వెలుగులు నింపే జ్యోతివి –ఆశాజ్యోతివి
ప్రేమబంధాన వలపులు కురిసే వర్షానివి-నా హర్షానివి
2. చిలుకలకే పలుకులు నేర్పే రాచిలుకవీ
హంసలకే కులుకులు నేర్పే కలహంసవీ
నీ గొంతున కోకిల గానం-నీ నడకే మయూర నాట్యం
కాచివడబోసి కలిపి నినుజేసి ధన్యుడాయెనా బ్రహ్మా-పరబ్రహ్మా
చూచి నినుజేరి వలచి నినుకోరి తరించెనా జన్మ-తరించె నా జన్మ
3. నా కన్నులలోకి ఒకసారి చూడు –కనిపిస్తుంది నీరూపం
నా హృదయం చేసే సవ్వడినీ విను-తపిస్తున్నది నీ కోసం
నే కన్న కలలే నిజమై-నాలో నీవే సగమై
నీవూనేనే జగమై బ్రతుకే సాగనీ-కొనసాగనీ
ఈ యుగమే క్షణమై కాలం ఆగనీ-ఇక ఆగనీ
అమృతంబే స్వామి నీ పాదతీర్థం 
ఔషదంబే స్వామి దివ్యప్రసాదం 
మంత్రముగ్ధమె స్వామి నీభవ్య వీక్షణం 
ముగ్ధమోహనమె స్వామి నీ మందహాసం

1. శబరీ పీఠం అపర వైకుంఠం 
అయ్యప్పస్వామి నీవే పరమాత్మరూపం
 సన్నిధానమె స్వామి భూలోక స్వర్గం 
నీ శరణుఘోషయే కైవల్యమార్గం 

2. ఇరుముడి తలదాల్చ ఇడుములు తొలగు 
దీక్షనుగైకొంటె మోక్షమె కలుగు
 స్వామినిను సేవిస్తె శుభములు జరుగు 
నీ కరుణ లభియిస్తే జన్మధన్యంబు
సాయిబాబా పల్లకిసేవ పాట 

ఓం ఒహోం ఒహోం -ఓం ఒహోం 
ఓం ఒహోం ఒహోం -ఓం ఒహోం 
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి 
ద్వారకామాయి వాస-సద్గురు సాయి 

అందమైన అందలమిది మోయరండి 
అందరికిది అందనిది వేగరండి 
సాయిరాముడు ఎక్కినదిది సొగసైనదండి 
చేయివేసి సేవచేసి తరియించగ రారండి 

1. గురుపాదం తలదాల్చే అవకాశమండి 
గురువారం మాత్రమే దొరికేటిదండి 
మహిమాన్వితుడే బాబా మరువకండి 
మహిలోన వెలిసింది మనకొరకేనండి 

2. హరిని మోయు అదృష్టం గరుడపక్షిదేనండి 
శేషశాయి సేదదీర్చు శేషుడిదే భాగ్యమండి 
వసుదేవుడు ఒక్కడే పొందినదీ సౌఖ్యమండి 
మరల మరల మనకు రాని మంచితరుణ మిదేనండి 

3. కరతాళం జతజేస్తే మేళతాళ మదేనండి 
గొంతుకలిపీ వంతపాడితె సాయికదే కచ్చేరండి 
తన్మయముతొ తనువూగితె అదేనాట్యమౌనండి 
ఎంత పుణ్యమండి మనది జన్మధన్యమైన దండి
హర హర హర శివ శివ శంభో
పరమేశా మాం పాహి ప్రభో
దక్షుని మదమణిచి వేసిన
గిరిరాజతనయ విభో
1. నయనాలు కల్గినా అంధుల మయ్యా మేము
విద్యలెన్నొ నేర్చినా మూర్ఖులమేనయ్యా మేము
మా జ్ఞాన చక్షులను తెరిపించవేమయ్యా
విజ్ఞాన జ్యోతులను వెలిగించ రావయ్యా
2. నీ జగన్నాటకంలో నటియించు పాత్రలం
తోలుబొమ్మలాటలొనీవు ఆడించే బొమ్మలం
నీ ఆజ్ఞ లేనిదే చీమైనా చావదు
నీ కరుణలేనిదే క్షణమైనా సాగదు
3. ఆశామోహాలతోటి అలమటించు జీవులం
గీయబడిన గిరిలో తిరిగే చదరంగపు పావులం
ఇహలోక చింతనలను తొలగించవేమయ్యా
కైవల్య పథములొ మమ్ము నడిపించవేమయ్యా