Wednesday, July 22, 2009

బ్రతుకు దుర్భరమైపోయే
మనసు మరు భూమిగ మారే
చావలేక బ్రతకలేక
తనువు జీవశ్చవమాయే
1. ఆవేదన ఆకసమాయే
ఆలోచన అనంతమాయే
నిరీక్షణే పరీక్ష కాగా
మనిషి జన్మ శిక్షగా మారే
2. దారిద్ర్యం తను నను వలచే
విధి పగతో నా ఎద తొలిచే
రవి వెలిగే జీవితాన
అంధకారమావరించే
3. అనుమానం చిగురించే
ఆనందం హరియించే
ప్రశాంతి సరోవరాన
అశాంతి అలలై రేగే
నిన్నెంత ప్రేమించానో నేనెరుగలేను గాని
నీవులేక నేను జీవించలేను
1. నిన్నుచూడకుంటే నాకు నిదురైన రాదు
నిన్ను తలచకుంటే నా ఎద ఊరుకోదు
నీవులేక నన్నునేను ఊహించుకేలేను
ఏ క్షణము చూసానో ఎదలోన నిలిచావు
నీవులేక నేను జీవించలేను
2. నీ ప్రేమలోనా ఎంతెంత మధురం
ఇంకెంతకాలం నీకునాకు ఈవిరహం
ఒకసారి పలుకవె చెలియా నీప్రేమ నాకొఱకేయని
నీ పిలుపుకై నేను పరితపిస్తున్నాను
నీవులేక నేను జీవించలేను
3. నీ గురించి చెడుగా అంటే నే సహించలేను
ఎవరు నిన్ను చూసినగాని నే భరించలేను
నా బాధలన్ని నీకు ఎలా తెలుపగలను
ఎన్నాళ్ళనీ ఇలా నేనెదిరి చూడను
నీవు లేక క్షణమైనా జీవించలేను

నోరారా నిను పిలిచేము-
మనసారా నిను తలచేము 
అయ్యప్పా శరణము-మణికంఠా శరణము 
శబరీశా శరణము-శరణం నీ చరణము 

1. మమతలేక మానవతలేక బ్రతికేము స్వామి మేము 
ఏ నియతలేక అనునయత లేక చితికేము స్వామిమేము మాలదాల్చి నియమాల దాల్చి చేసేము శరణఘోష
 దీక్షబూని నీ రక్ష కోరి చేరేము శబరి కొండ 

2. చీకట్లలోన ఇక్కట్లతోటి తిరుగాడు చుంటిమయ్యా 
అచ్చట్లతోటి ముచ్చట్లతోటి గడిపేయు చుంటిమయ్యా 
మమ్మెట్టులైన నీ మెట్టులెక్క చేయూతనీయవయ్యా 
జ్ఞానజ్యోతివీవె పరంజ్యోతివీవె మకరజ్యోతి చూపవయ్యా
ఎంత చమత్కారము నీ సాక్షాత్కారము
ఎంత మనోల్లాసము నీ సుందర దర హాసము
ఎంత సుధామధురము నీ తారకనామం
ఎంతగ్రోలినా గాని తనిదీరదు సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
1. నీ దర్శన భాగ్యమైతె బాధలన్ని తొలగేను
చిరునవ్వుల వరమిస్తే చింతలు ఎడబాసేను
నీ సన్నిధిలో నిలిస్తె మనశ్శాంతి దొరికేను
నీ కరుణే లభియిస్తే బుద్దివిమలమయ్యేను
2. నీ నామం స్మరియిస్తే సంపదలే కలిగేను
నీ ధ్యానం వహియిస్తే ఆపదలే తొలగేను
నీ మహిమలు కీర్తిస్తే సచ్చిదానందమే
బ్రతుకే నీకర్పిస్తే మనిషి జన్మ ధన్యమే
నాజన్మ ధన్యమే
ఎందుకె మనసా ఇహలోక చింతన
చేయవె హరినామ సంకీర్తన

1. నేను నాదను భ్రమలలోనా గడిచేను జీవితమంతా
ఒట్టొట్టిమాటల కట్టుకథలతో కరిగేను కాలమంతా
ఈ మోహాలు ఈస్నేహాలు ఈ వింత దాహాలు ఈ కర్మ బంధాలు
అన్నీ బూటకాలే క్షణకాల నాటకాలే

2. చీమూ నెత్తుటి ఎముకల గూడు ఈ నీ దేహం
రెక్కలు సాచిన స్వేఛ్ఛా విహంగం నీ ప్రాణం
ఈ అందాలు ఈ చందాలు పైపైమెరుగులు పరువపు తొడుగులు
పగిలే నీటి బుడగలే మిగులు కన్నీటి మడుగులే

3. ఆశల వలలో అసలే పడకు-కోర్కెలరక్కసి కోఱల చిక్కకు
కనబడిన ప్రతిమకు సాగిల పడకు-జిత్తులమారి మహిమల నమ్మకు
కైవల్యపదమే నీకు గమ్యం-శ్రీ హరి చరణమే నీకు శరణం