Thursday, July 23, 2009

చకోరి కోరికా-కార్తీక చంద్రిక
సుమాల మాలిక-భ్రమరానికే యిక
ఉషస్సులే మనస్సులో రుచస్సులేయగా
వసంతమే నా సొంతమై ఆసాంతమాయెగా
1. నీలాలనింగి నంటుతున్న నీలగిరి కొండలు
పచ్చికయే పచ్చని చీరగ ప్రకృతి ముస్తాబులు
లేళ్ళను మరిపించి దుముకె చక్కని సెలయేళ్ళు
రవికళ్ళలొ చిరుజల్లుకె మెరిసిన హరివిల్లు
ఆనందమాయెగా-అనంతమాయెగా
అందాల నందనం –గుండెల్లొ విరియగా
2. రాచిలుకలన్ని స్వాగతించి దారి తీయగా
రాయంచలె నా ఎదుటనిలిచి హారతీయగా
మయూరాలు తయారనీ ఆనతీయగా
కోయిలలు మురిసి మేను మరచి పాడె తీయగా
ఆనందమాయెగా-అనంతమాయెగా
అందాల నందనం –గుండెల్లొ విరియగా
నీవులేక నాలో ప్రేమే మొలిచేదా
అది పూవులు పూచేదా
ఆ పూలతేనె చేదా
నా ఊసే నీకు బాధా ,నారాధా
1. అనురాగ ధారా-కురిపించ రాదా
నానేరమేదో ఎరిగించరాదా
ఎంతకాలమనియీ రీతి సాగాలి
ఆకులన్ని రాలి ఆశలన్ని కాలి మోడై నిలవాలి
2. నీ వసంతం నాకు సొంతం
చేయాలంటే ఏల పంతం
నాలో లేనిదేదో ఏదో అదిఏదో
నేనంటే నీకు పగనా నేనసలే నీకు తగనా చెప్పరాదా
3. పాలముంచ నమ్మించేవు
నీటముంచి వంచించేవు
మనసంటేనే నీకో క్రీడనా
బ్రతుకుతోటి ఆడి నట్టేట్లో నను వీడి నవ్వేవా
యమున లేదని అలుకనా
ఎంత పిలిచిన పలుకవా
మాధవా భావ్యమా-నీకిది న్యాయమా
1. నల్లనయ్యా రాకకోసం ఎదురుచూసే కనులు పాపం
కపటమెరుగని కన్నెపిల్లను ఎందుకయ్యా ఇంత కోపం
రాసలీలను మరచినావా- రాధతోనే అలసినావా
అలుక మానర మాధవా-నాదు ప్రార్థన ఆలకించవ
2. మబ్బుచాటుగ చందమామా తొంగితొంగి చూసినప్పుడు
గునమావి కొమ్మమీద కోయిలమ్మ కూసినప్పుడు
మదిలొ రేగే వింత తాపం-ఓపలేనీ మధుర విరహం
నాలొనీవే నిలిచిపోవా-నన్ను నీలో కలుపుకోవా
అడుగు అడుగుకు స్వామి శరణం-స్వామిశరణం స్వామిశరణం
పలుకుపలుకున స్వామి శరణం-స్వామిశరణం స్వామిశరణం
మనిషి మనిషికీ స్వామి శరణం-స్వామిశరణం స్వామిశరణం
మనసులోపల స్వామి శరణం-స్వామిశరణం స్వామిశరణం
1. నిద్రలేవగనె స్వామి శరణం-స్నానమాడినా స్వామి శరణం
పూజచేసినా స్వామి శరణం-హారతిచ్చినా స్వామి శరణం
2. గుడికివెళ్ళినా స్వామి శరణం-వృత్తిజేసినా స్వామి శరణం
భిక్షజేసినా స్వామి శరణం-లక్ష్యమొక్కటే స్వామి శరణం
3. కనులజూసినా స్వామి శరణం-వీనులవిన్నా స్వామి శరణం
గొంతు పాడినా స్వామి శరణం-గుండె ఆడినా స్వామి శరణం
4. కనులు మూసినా స్వామి శరణం-కలలు కన్ననూ స్వామి శరణం
కలతలున్ననూ స్వామి శరణం-కరిమలవాసుడు స్వామి శరణం
సాయీ నువ్వే నాకు కావాలోయి
సాయీ నువ్వే దిగి రావాలోయి
ఏమాయెనో సాయి నీ మాయలో పడితి
చేయూత నందించి చేదుకొనగ సాయమడిగితి
1. కనులు ఉన్నాయిగాని-అహముతో మూసుక పొయినయ్
చెవులు వింటాయి గాని-నీచరితమెరుగము అంటయ్
నాలుకైనా సరే నీ నామమసలె పలుకక ఉంది
కాలుకైనా మరీ నీ గుడిదారే తెలియదు అంది
ఏమాయెనో సాయి నీ మాయలో పడితి
చేయూత నందించి చేదుకొనగ సాయమడిగితి
2. కామమే లేక నీ –నామం జపియించనైతి
ఓపికేలేక నేను కోపగుణము గెలువకపోయితి
నీవిచ్చిన ధనమే ఐనా దానమన్న చేయక పోయితి
కాలమహిమ తెలియకనే గాలిలోన మేడలు కడితి
ఏమాయెనో సాయి నీ మాయలో పడితి
చేయూత నందించి చేదుకొనగ సాయమడిగితి
ఎఱవేయకో వెర్రి నేస్తమా- నే చేపను కాననీ గ్రహించుమా
కన్నెర సేయకో ప్రియ నేస్తమా-నే కొక్కెర కాననీ ఎరుగుమా
1. క్షణానికో రూపు దాల్చి-పలు వన్నెలు మార్చకు
అన్నిటిలో నేనేనని చిన్న తలను దూర్చకు
ఏడురంగులుంచు కొన్న ఇంద్రధనువునే నేను
మూడడుగుల విశ్వవ్యాప్త త్రివిక్రముణ్ణి నేను
అడ్డుపుల్ల లేయకుమా నేస్తమా-విఘ్నేశుడ నేననీ గ్రహించుమా
2. నవ్వించలని బోయి-నవ్వుల పాలుగాకు
నమ్మించి నన్నెపుడూ-వంచన చేయబోకు
నవరసాలు కురిపించే-ముఖ్యపాత్రధారి నేను
ఈ జగన్నాటకంలొ నటన సూత్రధారి నేను
కుప్పి గంతులేయకుమా నేస్తమా
హనుమంతుడనేనని గ్రహించుమా
3. అరచేతిలొ నాకెపుడూ –స్వర్గంచూపించబోకు
చిటికెవేసి నాకెపుడూ –తాళం నేర్పించ బోకు
చతుర్వేద సారమైన-సర్వాంతర్యామి నేను
ప్రణవ నాద రూపమైన-పరమ శివుడనే నేను
అహమింక మానుమో నేస్తమా-త్వమేవాహమనే నిజమెరుగుమా