Saturday, July 25, 2009

ఎవరికి ఎవరం బ్రతుకే సమరం
ఈ రణం లో ప్రతి క్షణం
గుప్పిట్లో ప్రాణం-మన వెనకే మరణం
1. వివాహ మొక పంజరం
సంసారం సాగరం
అనుదినం ఆగదు నీ గమనం
ఐనా నువు చేరే తీరం
ఎండమావిలా బహుదూరం
2. నట్టేట్లో ముంచే ప్రేమ అమరం
నయ వంచించే స్నేహం శాశ్వతం
నీ ముందున్నది నిజం
అనుభవిస్తే సుఖం
స్వర్గమైనా నరకమైనా
ఎంపికతోనే నీ సొంతం
ఓ పికమా ఎవరైనా నీ అందం మెచ్చారా
మయూరమా ఎవరైనా నీ గాత్రం నచ్చారా
రాయంచా కాదుకదా నీ పలుకే రమణీయం
రాచిలుకా కానేరదు నీ నాట్యం కమనీయం
అందమో గాత్రమో నడకో నాట్యమో
ఆటలో పాటలో తెలివి తేటలో
అందరికీ ఉంటుంది ఏదో నైపుణ్యము
ఎరిగిమెలిగితేనె కదా ప్రతి జన్మ సార్థకము
1. టెండుల్కర్ ఎపుడైనా గ్రాండ్ మాస్టరయ్యేనా
విశ్వనాథనానంద్ వింబుల్డన్ గెలిచేనా
కమలహాసన్ ఓలంపిక్ పథకాలు తెచ్చేనా
సానియామీర్జాకు అస్కారవార్డ్ వచ్చేనా
అందరికీ ఉంటుంది ఏదో నైపుణ్యము
ఎరిగిమెలిగితేనె కదా చేరేరు శిఖరాగ్రము
2. అబ్దుల్ కలాం ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కగలడ
బచెంద్రిపాల్ ఇంగ్లీష్ ఛానల్ని ఈదగలద
మెహర్సేన్ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చాడా
గాంధీజీ అణుబాంబును కనిపెట్ట గలిగాడా
ప్రతి వారికి ఉంటుంది ఏదో నైపుణ్యము
తనలోని ప్రతిభ నెరిగి మెరుగుపెడితె ధన్యము
3. ఐశ్వర్యారాయ్ కి సంగీతం ఎంతతెలుసు
ఏఆర్రెహమాన్ బాపులా కుంచెనెలా కదిలించు
ఐన్ స్టైన్ గొంతెత్తి రాగాలు తీయగలడ
జేసుదాసు జనులు మెచ్చు నాట్యాలు చేయగలడ
ఎవరైనా వారివారి రంగాల్లోనె నిష్ణాతులు
సాధనతో సాధించి అయినారు పరిపూర్ణులు
ఎందుకయా ఓ సుందర వదన
నా డెందము నందున చిందరవందర
మందమతిని నేనరవిందానన
వందనమందును హరిహర నందన
1. ఎందులకు స్వామి ఈ ఏడు రంగులు
జ్యోతి స్వరూపా నిను గననీయవు
దేనికి స్వామి ఈ సప్త స్వరములు
ఓంకార రూపా నిను విననీయవు
2. ఇంద్రియ నిగ్రహము ఇలలోన బూటకము
అరిషడ్వర్గమును గెలుచుటయె నాటకము
స్థిరచిత్తమను మాట నిజమగు నీటి మూట
నీ నామ స్మరణయె చక్కనైన దగ్గరి బాట
3. పలుమార్లు నేనతి యత్నమ్ము తోడను
ఈ పాప కూపము నధిరోహణము జేయ
నా పట్టు తప్పించి నిర్దయగ పడద్రోయ
తగనేరదయ్యప్పా నే పసివాడను
4. తెలియదను కొంటివా నీ మోహగాలము
ఎరుగననుకొంటివా నీ మాయ జాలము
నాగతివి నీవే శరణాగతివి నీవే
పతిత పావన సద్గతినీవె పాహిమాం
గంగమ్మదేకులమురా శంకరా
సిగన యుంచుకొంటివా
గిరిజమ్మ దేజాతి రా
సగభాగము నిస్తివా
1. శీలమే లేదన్న శశాంకుడినీ నీవు
శిరము నెక్కించు కొంటివా
తీరికే లేనట్టు కోరికే లేనట్టు
నీ జుట్టు జడలు కట్టేనేమిరా
2. జగములను కాల్చేటి బడబాగ్నినీ నీవు
కంటి యందుననుంచు కొంటివా
ప్రాణాలు తీసేటి కాలకూటమును నీవు
కంఠమందున నుంచు కొంటివా
3. చూపులోనా భయము గొలిపెడి
పాములా నీకు కంఠహారాలు
తలపులోనా వొళ్ళు జలదరించేటి
శార్దూలచర్మమా నీదు వస్త్రమ్ము
4. చోటెచట లేనట్టు అది తోటయైనట్టు
శవవాటిలో తిరిగేవురా-కాటితో పనియేమిరా
వేడినసలోపలేనట్టు-అది వేడుకైనట్టు
మంచుకొండన ఉందువేరా-చలి ఇంచుకైనా వేయదారా
5. నంది నీ వాహనమ్మా
భృంగి నీ సేవకుండా
రక్కసులె నీ భక్తులా
భూతగణములె నీకు సేనలా
6. గజముఖుడే సుతుడు
షణ్ముఖుడె ఆత్మజుడు
ఆంజనేయుడు నీ అవతారమా
ఈ రాఖీని బ్రోవగా భారమా
7. లక్ష్యమే లేని భిక్షగాడివి నీవు
మోక్షమ్ము నిచ్చేటి జంగమ దేవరవు
ఆది అంతము లేని అంతరంగము నీది
ఉండిలేనీ స్ఫటిక లింగరూపము నీది
8. రూపు చూస్తే భోలా శంకరుడవు
పిలువగనె పలికేటి దేవుడవు నీవు
కోపమొస్తే ప్రళయ కాల హరుడవు
లయ తాండవము జేయు రుద్రుండవు
శ్రీ జ్ఞాన సరస్వతి
సర్వ కళా భారతి- పరాత్పరి
1. ఓంకార సంభవి గాయత్రి దేవి
శ్రీకార రూపిణి శారదామణి
జగముల గాచే జగదీశ్వరీ
శుభముల కూర్చే పరమేశ్వరి
2. ఏమని పాడను గానవాహినివీవైతే
ఏమని పలుకను వాగ్దేవివీవైతే
ఏ పాటకైనా ఏ మాటకైనా
నీదయలేనిది విలువేమున్నది
3. బాసర పురమున వెలసిన దేవి
మా మానస మందున నిలువవేమి
నీ గానములో నీ ధ్యానములో
సర్వము మరచితి నిన్నే తలచితి