Wednesday, July 29, 2009

ప్రేమే నాటకం ఈ ప్రేమే బూటకం
అసలు ప్రేమంటేనే ఓడడం
నువు ప్రేమిస్తే ఖాయం చావడం
1. ప్రేమ పొందడమె ఒక వరము
ప్రేమించడమే సహజం
ఆ ప్రేమే ఫలించకుంటే బ్రతుకే ఒక శాపం
ప్రేమే కలరా-ప్రేమే ఓ భ్రమరా
2. ఎన్ని చరితలో ముగిసాయి
ప్రేమ కొఱకు బలియై
ప్రేమించడమే నేరమని-ప్రతిసారీ ఋజువై
ప్రేమే మండు వేసవి-ప్రేమే ఓ ఎండమావి
3. మనసే ప్రేమకు నిలయం
ప్రేమే ఓ విషవలయం
ఎన్నటికైనా చేరే గమ్యం-నరకం నరకం నరకం
ప్రేమే వడగాలి-ప్రేమే హిమజ్వాల
మనసు మల్లె పూవై
పూచింది నీకై
వయసు చక్రవాకమై
వేచింది నీకై
1. జన్మాంతరాలదీ మనప్రేమ బంధం
జగదేక మోహనం మనజంట అందం
సాగిపోని జీవితం-జలపాతమై
2. నా హృదయ మందిరం నీవల్ల సుందరం
కరుణించవేమే నా ప్రణయదేవి
జరిగిపోని సంగమం-రసగీతమై
నువ్వూ నేను ఒక్కటా
ఎంతవింతదైనదయ్య స్వామి ఆ మాట
మాయలోడివయ్య నీవు మణికంఠా
నిన్నె నమ్ముకొంటినయ్య ఎట్టాఎట్టా
1. శబరీ కొండలపైన ఎక్కడో దూరాన
ఎక్కికూర్చొన్నావు అందనంత ఎత్తున
సంసార సాగరమున మునకలు వేస్తూనేను
చిక్కుబడి ఉన్నాను చిత్రమైన మత్తున
బ్రతుకు నావ నడిపేటి ఓదిట్టా
నాచిత్తపు చుక్కానిని నీ చేతిలొ పెట్టా
2. నెయ్యమైతె చెయ్యవు నాతో-నెయ్యేమో కోరుతావు
ఇడుములనెడబాపవుగాని-ఇరుముడిని అడుగుతావు
దీపమేది చూసినా నీ రూపే తోచాలి కదా
నాదమేది చేసినా ఓం కారమవ్వాలి కదా
మనోరథం తోలేటి ఓ సారథి
నా ఇంద్రియ పగ్గాలు నీకే కద ఇచ్చితి
3. బూడిదనువు పూసుకొని-చలికి తట్టుకొంటావు
శ్రీ గంధం రాసుకొని- వేడినధిగమిస్తావు
కింకిణొడ్యానమే ఇంపుగ ధరియించుతావు
అభయ ముద్రనైతె స్వామి-డాబుగ నువు దాల్చుతావు
ఈ సంగతి కేమి గాని అయ్యప్పా-నా సంగతి చూసినపుడె నీ గొప్ప
శ్రీ రామ చంద్ర ప్రభూ మౌనం నీకేలరా
నోరార పిలిచినా పలుకవేమి రఘువరా
1. శివుని విల్లు విఱిచి సీతమ్మను మనువాడిన కళ్యాణరామా
రక్కసులను సంహరించి లోకార్తిని బాపిన కోదండరామా
శతకోటినామా నిన్నేమని పిలిచేదిరా
కారుణ్యధామా నిన్నేవిధి కొలిచేదిరా
2. ఎన్నిపూవులెన్నిమాలలెన్నిపరిమళాలనర్పించేనో
ఎన్నిపూజలెన్ని భజనలెన్ని గీతాలకీర్తించేనో
నోరొక్కటిచ్చావ్ నువు నోరు మూసుకున్నావు
అఱచి మొత్తుకున్నగాని అసలే వినకున్నావు
3. త్యాగరాజు రామదాసు నీభక్తులు అని అందరు అంటారు
ఆంజనేయుడెప్పుడు నీ చరణదాసుడంటారు
పక్షపాతమంటె నీకు పరమ ఇష్టమా రామా
ఈ భక్తుని(రాఖీని)బ్రోవగ నీకింకా సందేహమా

శంకరా శంకరా 
హరహరా శుభకరా 
ఈ దీనుడిపై దయరాదా 
కైలాసమున తీరిక లేదా 

1. నిను పిలిచి పిలిచి అలసినాను 
నిను కొలిచి కొలిచి విసిగినాను 
నా పిలుపు నీకు వినబడలేదా 
నాపూజనీకు సరిపడలేదా 
సర్వము నిండిన మహాదేవా 
దోసెడు కన్నీరు సరిపోలేదా 

2. నీకై గుండెను గుడిగా చేసినాను 
నా ప్రాణదీపము హారతి ఇచ్చాను 
ఈ పిడికెడు గుండే నీకు చాలదా 
నా ప్రాణములో జీవము లేదా 
దశకంఠుఎదలో దాగిన లింగా
నే జీవశ్చవమని అనుకొన్నావా