Wednesday, August 5, 2009

కన్నీటి వీడుకోలు
కడసారి అంపకాలు
మది కలచు జ్ఞాపకాలు
చితిమంట నెట్లుకాలు
1. మాతృత్వ అనుభవాలు
మరపించు అనునయాలు
వాత్సల్యమే కదా మేరు
అనురాగమే జాలువారు
2. ఆనంద సాగరాలు
కావేల జీవితాలు
విధివింత నాటకాలు
వైషాద పూరితాలు
3. తీరలేని ఈ ఋణాలు
తీర్చుకోగల క్షణాలు
వినియోగమైతె చాలు
బ్రతుకులే సార్థకాలు
ఒక కొత్త కోకిల
తన మత్తు వీడక
గమ్మత్తుగా
ఉన్మత్తయై గళమెత్తెగా
1. కువకువ రవళులె జతులూగతులని
కూనిరాగాలె గంధర్వ కృతులని
ఎంచగా మురిపించగా
కలగాంచగా విలపించెగా
2. రెక్కలెరాని చిరుచిరు ప్రాయం
లౌక్యమునెరుగని అయోమయం
తొందరపడితే నింగికెగిరితే
గుండెన గాయం-గొంతున మౌనం
నీలిగగనం నేలకోసం
ఎంత వాలితె ఏమి లాభం
కోనేటి కమలం చందమామను
కోరుకుంటే ఎంత ద్రోహం
1. మేఘమాలకు పికము పాటకు
పొత్తుకుదరదు నేస్తము
కొండవాగుకు రాజహంసకు
జంట కుదరదు తథ్యము
నెమలి ఆడితె పికము పాడదు
రవి జ్యోత్న్సకు రాజీ పొసగదు
2. కంటకారిన నీటి ధారలు
గుండెమంటల నార్పునా
ఎండమావులు ఎన్నడైనా
గొంతుతపనల తీర్చునా
త్రవ్వబోతే బావినైనా స్వేద సంద్రం మిగలదా
నవ్వబోతే కలలోనైనా రత్నరాశులు దొరకవా
తేనె పూసిన కత్తివి నీవు
మనసు కోసిన కసాయి వీవు
సొగసు చూసి మురిసితినేను
తగిన శాస్తి చేసితివీవు
1. అలనాడు ఊర్వశివై ఊరించినావు
అనురాగ ప్రేయసివై ఉదయించినావు
నీ అధరము మృదు మధురము
మన బంధము అందాలకే అందము
2. వలపుల వాన కురిపించినావు
మమతలలోన ముంచెత్తినావు
తలపులన్ని మరపించి నీవు
హృదయాగ్ని రగిలించినావు
నా ప్రణయాన్ని మసిజేసినావు
కలనైనకాదు-నదిలోని అలనైన కాదు
నా బ్రతుకే శిలయైనది
కరుగని,కదలని,కఠిన శిలయైనది
1. వసంత రేయిలొ కోయిల గానం
మనసంత రేపెను గాలి దుమారం
పెనుతుఫానులో-విరిగిన నావతొ
ఎందాక ఎందాక ఈ నా పయనం
2. పూల తోటలో ప్రియుని మాటలు
గతపు వీణపై శ్రుతి లేని పాటలు
ఎడారిలో—ఎండమావికై
ఎందుకు ఎందుకు ఈ నా పరుగు
3. సాటి మనిషి కన్నీటి గాథను ఆలకించలేరా
విధివ్రాతను నుదుటి గీతను మార్చువారు లేరా
మోడువారినా నాబ్రతుకునకు చిగురింపేలేదా
నా చీకటి గుండెన ఆశాజ్యోతిని వెలిగించరా
ఇంతేనా....!ఇంతే ఇంతే నా బ్రతుకింతేన
https://youtu.be/ArzyqD5KVzo

శ్రీనారసింహా చేసెద నీనామ స్మరణం
 ధర్మపురివాసా వదలను నీ దివ్య చరణం 

1. కైవల్యమేదో ఎరుగను-సాయుజ్యమన్నది ఎరుగను 
పరసౌఖ్య పదార్థమునకు-పరమార్థమే ఎరుగను 
సద్గురువు ప్రవచించే పదములనుకొందును 
కాస్త రుచిచూపమని నే-నిను వేడుకొందును 

2. యాగాలు చేయగలేను-దానాల నీయగ లేను 
వేదాల సాధన లేదు-కోవెల నిర్మించగ లేను 
తెలిసింది ఒకటే నరహరి-నీ నామ జపము 
ఈ జన్మ కదియే శ్రీహరి-నే చేయు తపము
అంజలి గొనుమా అంజని పుత్రా
ప్రార్థన వినుమా పరమ పవిత్ర
జ్ఞానప్రదాతా శ్రీరామ దూతా
అభయ ప్రదాతా పవనసుతా
1. బాలభానుడే ఫలమని భావించి-ఆరగించినా వానరోత్తమా
కిష్కింద లోనా రాఘవు జూచి-దాసుడవైనా రామభక్తా
అంతులేని అంభోది లంఘించి-లంకిణి జంపిన పింగాక్షా
2. ముద్రిక నిచ్చి చూడామణిదెచ్చి-సీతారాముల శోకము బాపావు
చూసిరమ్మంటె లంకను గాల్చి-రావణ గర్వము నణచినావు
రాముడు పంపగ సంజీవినీదెచ్చి-లక్ష్మణు ప్రాణము కాచినావు
3. వారధిగట్టి రావణుదునిమిన రామప్రియా ఆంజనేయా
కొండగట్టున మాకండగ వెలసిన ఇలవేల్పునీవే వీరహనుమ
రామజపమునే చేసెడి నీవు-చిరంజీవుడవు-అపర శివుడవు
వీర హనుమా హారతి గొనుమా
మామనమున నిను మరువనీకుమా
1. కొండగట్టుపై వెలిసిన దేవా
మాగుండెలందున నిలిచిపోవా
మా ఇలవేల్పువు నీవయ్యా
నిన్నే ఎప్పుడు కొలిచేమయ్యా
2. రాక్షసంహార వీరంజనేయా
శ్రీరామదూత భక్తాంజనేయా
నీపై గల భక్తితో శ్రీరామ జప శక్తితో
భయమును వీడేము- విజయము నొందేము
52.

బంధాలు ఆత్మీయ అనురాగ బంధనాలు
బాధ్యతలే మరువ కూడదు బ్రతికినన్నాళ్ళు
జరుపుకోండి హాయిగా రక్షా బంధనాలు
అందుకోండి మీకివే రాఖీ అభివందనాలు
అభినందన చందనాలు

1. ఇందిరమ్మ రక్షాబంధం-చందమామతో
గౌరీమాత రక్షాబంధం-విష్ణుమూర్తితో
సంతోషి రక్షాబంధం-శుభలాభులతో
యమునమ్మ రక్షాబంధం-యమరాజుతో

2. మల్లెతీగ రక్షాబంధం-అల్లుకున్న పాదుతో
కోయిలమ్మ రక్షాబంధం-లేమావి చివురుతో
మేఘమాల రక్షాబంధం-చల్లగాలి స్పర్శతో
వానచినుకు రక్షాబంధం-చెట్టు చెల్లి వేరుతో