Friday, August 7, 2009

మరణమూ మధురమే ప్రియతమా
నీ ప్రేమలోన ముంచి నన్ను చంపుమా
నీ చేతిలో నే హతమై-జీవితమే విగతమై
నీ గతమై –నే స్మృతినై
నిత్యమై నిలువనీ నేస్తమా
సత్యమై మిగలనీ మిత్రమా

1. నిరీక్షణే ఓ శిక్షలా సహించగా
ప్రతీక్షయే పరీక్షలా పరిణమించెగా
రెప్పపాటు వేయకుండ నేను వేచితి
క్షణమునే యుగముగా భ్రమించితి
శోధనే గెలువనీయి నేస్తమా
వేదనే మిగలనీకు మిత్రమా

2. ఏ జన్మలోనొ వేయబడిన వింతబంధము
ఏడడుగులు నడువబడని అనుబంధము
తెంచుకుంటె తెగిపోని ఆత్మబంధము
పారిపోతె వెంటబడెడి ప్రేమ బంధము
నీతోడుగ నిమిషమైన చాలు నేస్తమా
నీవాడిగ మిగిలితెపదివేలు మిత్రమా
హృదయమే ఆర్ద్రమై
గుండె మంచు కొండయై
ఉప్పొంగె కళ్ళలోనా గంగా యమునలు
ఉరికాయి గొంతులోన గీతాల జలపాతాలు
1. తీరలేని వేదననంతా హృదయాలు మోయలేవు
పొంగుతున్న జలధారలను కనురెప్పలు మూయలేవు
సృష్టి లోన విషాదమంతా ఏర్చికూర్చి ఉంచినదెందుకు
గాలితాకి మేఘమాల కన్నీరై కురిసేటందుకు
2. చిన్ని స్పర్శలోన ఎంతో ఓదార్పు దాగుంది
స్నేహసీమలోన ఎపుడూ అనునయముకు చోటుంది
సత్యమే జీవితమైతే హాయిగా ఉండేదెందుకు
ఆనంద భాష్పాలై అంబరాన్ని తాకేటందుకు
నరసింహుని లీల పొగడ నాలుక తరమా
పరమాత్ముని మాయనెరుగ నాకిక వశమా

1. ప్రహ్లాదుని రక్షించిన కథను ఎరిగియున్నాను
కరిరాజును కాపాడిన విధము తెలుసుకున్నాను
శేషప్ప కవివర్యుని బ్రోచిన గతి విన్నాను
శ్రీ నరహరి కరుణ కొరకు ఎదిరి చూస్తున్నాను

2. కోరుకున్న వారికిహరి-కొంగుబంగారము
వేడుకున్న తనభక్తుల కిలను కల్పవృక్షము
దీనజనులనోదార్చే అభయ హస్తము
ఆర్తుల పరిపాలించే ప్రత్యక్ష దైవము
ధర్మపురిని దర్శిస్తే యమపురి చేరేదిలేదు 
నరసింహుని అర్చిస్తే మరు జన్మమేలేదు 
మనసారా సేవిద్దాము-
మనమంతా తరియిద్దాము 

1. గోదారి గంగలో తానాలు చేయాలి 
సత్యవతిగుండంలొ సరిగంగలాడాలి 
బ్రహ్మపుష్కరిణి డోలాసంబరాలు చూడాలి 
కర్మబంధాలనొదిలి కైవల్యమందాలి 

2. ముక్కోటి ఏకాదశి వైభవాలు చూడాలి 
ఏకాంత సేవనాటి వేడుకలను గాంచాలి 
కళ్యాణ ఉత్సవాల సందడితిలకించాలి 
నరహరి చరణాల వ్రాలి పరసౌఖ్యమొందాలి 

3. సుందరమందిరాలు నెలకొన్న పుణ్యక్షేత్రం 
వేదమంత్రాలఘోష పరిఢవిల్లు ప్రదేశం 
పురాణాలు హరికథలతొ అలరారు దివ్య ధామం 
సిరి నరహరి కొలువున్నదీ అపరవైకుంఠం
శ్రీచక్ర రూపిణి విశ్వమోహిని
శ్రీపీఠ సంవర్ధిని మత్తమోప హారిణి
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి
అనంత దిగంత యుగాంత కాంతిని
సాక్షాత్కరించవే సాఫల్యమీయవె భగవతీ భారతీ

1. శుంభనిశుంభుల డంబము నణచిన జగదంబా శాంభవి
మధుకైటభుల తుదముట్టించిన చాముండేశ్వరి శాంకరీ
మహిషాసుర మర్ధన జేసిన జయ దుర్గే ఈశ్వరీ
సాక్షాత్కరించవే సాఫల్యమీయవె భగవతీ భారతీ

2. బ్రహ్మ విష్ణు పరమేశ్వరార్చిత శ్రీవాణీ బ్రాహ్మిణీ
సృష్టి స్థితిలయ కేళీవినోదిని పద్మాలయి కామరూపిణి
సత్యతత్వ శివానందలహరి పరదేవీ దాక్షాయిణీ
సాక్షాత్కరించవే సాఫల్యమీయవె భగవతీ భారతీ

3. అరిషడ్వర్గ దుర్గుణ భేదిని నిరుణీ భవాని
ఏకాగ్రచిత్తప్రదాయిని మణిపూరక వాసినీ
భవబంధ మోచని జన్మరాహిత్యదాయిని
సాక్షాత్కరించవే సాఫల్యమీయవె భగవతీ భారతీ
ఎంతవేడుకొన్న గాని నీ దయ రాదేమి 
నే చేసిన దోషమేదొ ఎరిగించర స్వామి 

 1. నీ కృపగను సూత్రాలను నేనెరుగను స్వామీ 
కైవసమగు మార్గాలను తెలియనైతి స్వామి 
మెప్పింపగ నాతరమా నను బ్రోవగ భారమా 
తప్పింపగ నా చెఱను రాత్వరగా ప్రియమారగ 

2. అశ్రువులతొ అభిషేకం నే చేసెద స్వామి
 పదముల నా ఎదకమలం అర్పించెద స్వామి
 చిత్తములో నీధ్యానం నేతప్పను శ్రీహరి 
 ఎలుగెత్తి నీ గానం నే చేసెద నరహరి