Wednesday, August 12, 2009

స్వైన్ ఫ్లూ మహమ్మారి- వ్యాపిస్తోంది మితి మీరి
ఉంటే మరి ఏమారి –అది మరణానికి రహదారి
పోనీకు ఏ క్షణమూ-నీ చేజారి
1. పుట్టింది ఎక్కడొ గాని-కబళిస్తోంది ప్రపంచాన్ని
తలచు కొంటె గగుర్పాటు-అనుక్షణము తత్తర పాటు
మానవాళి కిదియే- ఒక గ్రహపాటు
మానవ జాతికే –తెస్తోంది చేటు
2. సంఘజీవులైన వారు-ఒంటరై పోతారు
ఇరుగు పొరుగు అంటేనే –భయభ్రాంతులౌతారు
ప్రాణ భీతితో ఎవరైనా –ఎక్కడికని వెళతారు
ప్రాణసములైనా సరే- దూరంగా నెడతారు
3. నిత్యావసర వస్తువులన్నీ-గగన గండ మౌతాయి
ప్రగతి ఎక్కడి కక్కడనే-చతికిల పడి పోతుంది
తినడానికి తిండైనా – ఎలాదొరుకుతుంది మనకు
కరువుతోటి కనీసము- నీరైనా దొరకదు చివరకు
4. విద్యా సంస్థలే మూతబడతాయి-
వైద్యసదుపాయాలే కొఱవడతాయి
పెళ్ళిళ్ళు వినోదాలు-కనుమరుగై పోతాయి
మానవ బంధాలన్నీ-పటాపంచ లౌతాయి
5. దినదిన గండము- నూరేళ్ళ ఆయువు
పీల్చకుంటె బ్రతికేదెట్లా-స్వఛ్ఛమైన వాయువు
చావలేక బ్రతకలేక-సతమతమై పోతారు
ప్రతిక్షణం చావు భయంతో-అట్టుడికి పోతారు
6. వార్తావిశేషాలు-తెలియకుండపోతాయి
ప్రయాణాలు ఎక్కడికక్కడ-ఆగిపోతాయి
మేలుకోవాలి త్వరగా-మేధావులంతా
ఈకాలనేమికి-చరమ గీతి పాడాలంటా