Sunday, August 16, 2009

నువు చేయి సాచితే-ఒక స్నేహగీతం 
మరులెన్నొ రేపితే- ఒక ప్రణయగీతం 
కనిపించకుంటే ప్రతి క్షణమూ-ఓ విరహ గీతం 
కరుణించకుంటే నా బ్రతుకే-ఓ విషాద గీతం 

1. నీ పరిచయమే – నాభాగ్య గీతం 
నీ సహవాసమే-మలయపవన గీతం 
నీ చెలిమితోనే-ఒక చైత్ర గీతం 
నువు పలికితేనే-మకరంద గీతం 

2. నీ స్వరములోనా –ఒక భ్రమర గీతం 
నీగానములో -కలకోకిల గీతం 
నీ నిరీక్షణలో-చక్రవాక గీతం 
మన అనురాగమే –క్రౌంచ మిథున గీతం 

3. నీ భావములో-రాధా కృష్ణ గీతం
 నీ ధ్యానము లో-మీరా కృష్ణ గీతం 
నీ వియోగములొ-సీతారామ గీతం 
మనవిచిత్ర మైత్రియే-శుకశారిక గీతం
షోడషోప చారములివె శోభన మూర్తీ
మూఢభక్తి భావనలివె మంగళమూర్తీ
గీతాల అర్చనలివె స్వామి భూతనాథా
అక్షరముల పూజలివే ధర్మ శాస్తా
1. మోహమునే వదిలింపగ నాదేహము నావహించు
అహంకార మణిచేయగ నా హృదయము నధిష్ఠంచు
నయనమ్ములు చెమరించగ అర్ఘ్యపాద్యాదులందు
ఆగకుంది కన్నీరూ...స్వామీ అభిషేకమందు
2. నేచేసెడి స్తోత్రాలే వస్త్రాలుగ ధరియించు
నా బుద్దిమాంద్యమ్మును జందెముగా మేను దాల్చు
భవబంధం సడలించగ శ్రీ గంధం పూయుదు
అలకనింక తొలగించి తిలకమిదే దిద్దుదు
3. కరకమలములివె స్వామీ పుష్పాలుగ స్వీకరించు
పాపాలను దహియించి-ధూపదీపాలనందు
నాబ్రతుకే నైవేద్యం-నాచిత్తం తాంబూలం
అందుకో ప్రాణజ్యోతి అదియే నీరాజనం
చెమరించె నయనమ్ములు –మణికంఠ కనిపించు నాకోసము
ఆనంద భాష్పాలతో అయ్యప్ప- చేసెదను అభిషేకము
1. లోపాలు మినహా పాలేవి స్వామీ-క్షీరాభిషేకానికి
పెరుగనీ హృది ఉంది పెరుగేది స్వామీ అయ్యప్ప నీ దధి స్నానానికీ
బంధనాలె గానీ గంధాలు లేవయ్య చందనాభిషేకానికీ
అస్మాకమే గాని భస్మాలు లేవయ్య భస్మాభిషేకానికీ
2. కన్నీరె గాని పన్నీరులెదయ్య-చెయలేని పన్నీటి అభిషేకము
వేదనలెగాని వేదాలనెరుగను-చేయుటెట్లు స్వామి మంత్రాభిషేకం
సంసార సంద్రాన మునగంగ నాకెది గంగ నీ శుద్ధోదక స్నానానికి
పంచేంద్రియాలె నను పట్టించుకోవయ్య పంచామృతాభిషేకానికి
3. నా కనుల కలువలతొ చేసేను స్వామి పుష్పాభిషేకమ్మును
మధురమౌ నీదు నామాలు పలికీ చేసేను తేనె అభి షేకమ్మును
శ్రావ్యమౌ నీదు నామాలు పాడీ చేసేను గానామృతమ్మును
మనసు చిలికిన వెన్న నాజ్యంగ మార్చీ చేసేను నేయ్యాభి షేకమ్మును