Friday, August 21, 2009

దక్షిణ వాహిని గోదావరి -అపర పంపానది
గూడెంకొండయే తెలుగునాట- అభినవ శబరిగిరి
కొలువైఉన్నాడు కొండలరాయుడు-అయ్యప్పా
శరణన్న స్వాముల కరుణించేస్వామి-శ్రీ ధర్మశాస్తా
1. దీక్షలు గైకొని మోక్షము నందండి
మాలను ధరియించి ముక్తిని జెందండి
నిష్ఠను పాటించి కైవల్యమొందండి
స్వామిని దర్శించి సాయుజ్యమొందండి
2. ఇరుముడి తలదాల్చి పరుగున రారండి
మాతాపితరుల ఆశీస్సులందండి
గురుస్వామి దీవెనలు మనసార పొందండి
స్వామి శరణుఘోష నోరార చేయండి
3. ఎరుమేలి వేరేల పేటైతుళ్ళికి
ఎనిమిది మైళ్లు వెళ్లరే ధర్మపురికి
విఘ్నాలు తొలగించ కొలువుడట గణపతిని
దీక్షపరిపూర్తి జేయ చేరుడు గూడెం గిరిని
4. కరదీపికలను వెలిగించండి
హృదయ నివేదన అర్పించండి
ప్రాణ జ్యోతుల హారతులివ్వండి
జ్యోతిస్వరూపుని ఆత్మన దర్శించండి
ఓ పరమాత్మా !ఓ పరమ పితా
ఏ పేరని నిను పిలువనురా - నామాలన్నీ నీవే ఐతే
ఏ చోటని వెదకనురా - సర్వాంతర్యామి వైతే
చూసిందేమని ఈ మోహం – తెలిసిందేమని ఈ వింత దాహం

1. నీవున్నావనునది నిత్య సత్యం
నీ అనుభూతులు నిత్య కృత్యం
గాలివి నీవై నా సేద దీర్చేవు
నీరువు నీవై నా తృష్ణ దీర్చేవు
నీ రూపమేదో ఎరుగకున్నను
అపురూపమే ప్రభూ నీ భావనలు

2. మన మధ్యనున్నది ఏ అనుబంధం
ఏ జన్మలోనిది మన సంబంధం
నను నడిపించే ఓ మార్గదర్శీ
నను పాలించే ఓ చక్రవర్తీ
నాకు తెలిసింది నీ ఆరాధనయే
నా ధ్యాన మంతా నీ సాధనయే

3. నాకు వలసింది నీకెరుకలేదా
నన్నుడికించుటయే నీ సరదా
ఇద్దరమూ వేరు వేరైతెనే కద
అత్మ పరమాత్మ అద్వైతమేకద
త్వమేవాహం స్థాయి దాటితే
విశ్వనినాదం సోహం సోహం సోహం