Tuesday, September 1, 2009

నిమజ్జనం నిమజ్జనం-ఊరంతా జనం జనం
ఉత్సాహాల భక్త జనం
మనసానంద సృజనం సృజనం-మహదానంద ప్రభంజనం
గణపతిరూపే నిరంజనం-స్వామికిదే నిత్య నీరాజనం

1. స్వామి జననం విస్మయ భరితం
గజ శిర ధారణ అది ఘన చరితం
జననీ జనకుల భక్తి పరాయణత్వం
మాషికవాహనుడే తార్కాణం
చేసి ముమ్మరు తా ప్రదక్షిణం
సాధించెను ప్రమధ గణాధిపత్యం

2. ప్రథమ పూజకే అర్హత పొందెను పార్వతి నందనుడు
విఘ్న వినాశకుడని పేరొందెను శ్రీ గణనాథుడు
భక్తుల పాలిటి కల్పవృక్షమే వక్రతుండుడు
కాణిపాకమున కొలువైనాడు కలియుగ భక్త వరదుడు

3. పూజలు భజనలు నవరాత్రాలు సంబరాలు
ఆటలుపాటలు కేరింతలు తాకెను అంబరాలు
భక్తీ ముక్తీ స్నేహానురక్తీ మదిలో ఆనంద డోలలు
వర్ణించలేము బొజ్జగణపతీ ఈ నిమజ్జన లీలలు
మరచిపోలేని మధురానుభూతి
కరిగిపోయేటి కలకాదు నీ స్మృతి
కలయిక యాదృచ్చికమైనా యుగయుగాల బంధమిది
తెలుసుకో నేస్తమా!మన చెలిమి జన్మాంతరాలది
1. ఎందరో ఎదురౌతారు ఈ జీవన యానంలో
చేరువైపోతారు తప్పనిసరియైన స్థితిలో
మనసులు ముడివడకున్నా మనుగడ సాగిస్తారు
ముసుగులెన్నో వేసుకొంటూ మనల మోసగిస్తారు
2. నీ విలాసమే తెలియదు రూపేంటో అసలే తెలియదు
కలుసుకున్న తరుణం మినహా వివరాలింకేమీ తెలియదు
ఎందుకింత అనురాగం-ఎక్కడిదీ స్నేహ యోగం
సాధ్యపడేదేకాదు-ఎన్నటికీ మనసహ యోగం
3. మన స్నేహితంలో స్వార్థానికి తావుందా
ఈ కాలయాపనకు ఇంచుకైన అర్థముందా
దైవానికే ఎరుక దీనిలో పరమార్థం
ఏమి కూర్చిఉంచాడో ఇందులోన అంతరార్థం