Monday, November 2, 2009

ఓ నా గీతమా! నా జీవితమే నీకంకితము
ఓ భావ సంచయమా! నా సర్వస్వము నీ కర్పితము
1. ఏనాడు ఉదయించావో నా ఎదలోతుల్లో
ఏమూల దాగున్నావో నా అంతరాలలో
నిను వెలికి తీయడానికి ఎంతెంత శోధించానో
నిను బయట పెట్టడానికి ప్రయాసెంత చెందానో
నీకేమెరుకా ఓ నా కవిత-ఊహించనైనా లేవు నా గుండెకోత
2. పదములు పొసగక పాట్లెన్ని పడ్డానో
చరణాలు సాగక సమయమెంత ఒడ్డానో
నిద్రలేమి రాత్రులు ఎన్నెన్ని గడిపానో
నిద్రమధ్య ఎన్నిసార్లు ఉలికిపడి లేచానో
నీకేమెరుకా ఓ నా కవిత-ఊహించనైనా లేవు నా గుండెకోత
3. పురిటినొప్పి సంగతి పురుషుణ్ణయీ అనుభవించా
మరణ యాతనన్నదీ జీవిస్తూనె రుచిచూసా
ఆకలీదప్పికలన్నీ నీ ధ్యాసలొ నేమరిచా
లోకమంత మెచ్చిన నాడే రాఖీ శ్రమ సార్థకత
నన్ను వీడిపోకుమా ఓనా కవితా
నీవు తోడు లేనినాడు నా బ్రతుకేవృధా
దిక్కులు చూడకు-దిక్కే లేదనుకోకు 
దిగులు చెందకు-తోడెవరు లేనందుకు 
అడుగు ముందుకేయవోయి ఓ బాటసారి 
కడదాక నిను వీడిపోదు ఈ రహదారి 

 1. అమ్మలాగ కథలు చెప్పి నిన్నూరడిస్తా 
నాన్నలాగ చేయి పట్టి నిను నడిపిస్తా 
మనసెరిగిన నేస్తమై కబురులెన్నొ చెబుతా
 ఎండావానల్లోనూ నీకు గొడుగలాగ తోడుంటా

 2. రాళ్ళూరప్పలుంటాయి కళ్ళుపెట్టి చూడాలి 
ముళ్లూ గోతులు ఉంటాయి పదిలంగ సాగాలి 
వాగూవంకలన్నీ ఒడుపుగ నువు దాటాలి 
చేరాలనుకున్న దూరం క్షేమంగ చేరాలి 

 3. అనుకోని మలుపులు ఎదురౌతు ఉంటాయి 
పయనంలో మామూలుగ ఒడుదుడుకులు ఉంటాయి సేదదీర్చుకోవడానికి మజిలీలూ ఉంటాయి చలివేంద్రాలుంటాయి అన్న సత్ర్రాలుంటాయి 

 4. ఏమరుపాటైతే ఎదురౌను ప్రమాదాలు 
ఆదమరచి నిదురోతే అర్ధాంతరమే బ్రతుకులు 
నిర్లక్ష్యం తోడైతే ఎవరు కాపాడగలరు 
 గమ్యమొకటె కాదు ఆనందం రాఖీ ! గమనమంత కావాలీ