Saturday, November 7, 2009

తేనె వంటిదీ మన తెలుగు కదా
’మరి చే’దెలా అయ్యింది మాతృభాష-మన మాతృభాష
అమ్మ అంటెనే హాయికదా
’మమ్మీ’ అనుమాటలో ప్రేతమనీ తోచదా
కన్నతల్లి కన్నమిన్న ఇంకేది లోకాన
సొంతఊరు అవ్వనుడుగు సాటిలేనివెపుడైనా
1. క్షరము కానిదే అక్షరము కదా
కొఱవడుతున్నాయెలా క్ష ఱ లు
సమసిపోనిదే వర్ణం కదా
లుప్తమెలా అయ్యాయి ఌ ౡ లు
ఇంద్ర ధనుసు కున్నవి ఏడే వర్ణాలు
తెలుగు భాష వర్ణాలు యాభయ్యారు
2. ఋణములు,ౠకలు నిత్యాగత్యమే కదా
మాయమెలా అయ్యాయి ఋ,ౠలు
మనఃపూర్వకంగా తెనుఁగు అనాలన్నా
అవసరమవుతాయికదా అరసున్నా విసర్గలు
భిన్నమైన యాసలే తెలుగు గర్వకారణం
ముత్యాల దస్తూరే తెలుగులిపికి ఆభరణం
3. అచ్చరువొందే అచ్చరాలే
అచ్చతెనుఁగుకే మెచ్చుతునకలు
దేశ భాషల్లో తెలుగు లెస్సగా
రాయల పలుకులే జిలుగు కణికలు
నిలపాలి మనమెప్పుడు తెలుగు ఆత్మగౌరవము
గుర్తెరిగీ మసలాలి తెలుగు భాష గొప్పదనం
తూర్పులోని ఇటలిభాషగ కీర్తించెను ప్రపంచం

నిష్ఠగ నీవుండకుంటె దీక్షలెందుకు
నియమాలు పాటించక వ్రతములెందుకు
నోరారా పలుకనిదే శరణుఘోష ఎందుకు
మనసారా పాడనిదే స్వామి భజనలెందుకు

1. తొలికోడి కూయకనే –ఉలికిపడిలేవనపుడు
నియమాలమాల నీ మెడలొ ఎందుకు
ఒళ్లుజివ్వుమననప్పుడు-స్వామిశరణమననప్పుడు
గోరువెచ్చనైననీటి స్నానమెందుకు

2. మనసులో వర్ణాలు మాయమే కానప్పుడు
నీలివస్త్రధారణతో తిరుగుటెందుకు
ఒడుదుడుకులతో నడవడి-గడబిడగా తడబడితే
పాదరక్షలే లేని ఫలితమెందుకు

3. అలంకారప్రాయమే-విభూతి చందనాలు
భృకుటిపైన దృష్టి నీవు సారించనపుడు
చిత్తచాంచల్యమై –ఇంద్రియ చాపల్యమై
స్వామిపూజచేసినా సాఫల్యం కాదెపుడు

4. షడ్రుచులతొ భిక్షలు-ఉపహార సమీక్షలు
నాలుక నీ ఏలికైతె ఏకభుక్తమెందుకు
భుక్తాయసమైనపుడు ఏకభుక్తమెందుకు
అర్ధా-పావూ మండలాలు-వాటంకొద్ది వైష్ణవాలు
మోజుకొరకు దీక్షలైతె మోక్షమెందుకు-శబరి లక్ష్యమెందుకు
మండలదీక్ష కానప్పుడు మాలెందుకు-నియమాలెందుకు
5. అమ్మ ఆజ్ఞ లేనప్పుడు-భార్య కుదరదన్నప్పుడు
అయ్యప్ప ఆనతీ దొరకదెప్పుడు
గుండెయె గుడియైనప్పుడు-ఎద సన్నిధానమెపుడు
నీ శరీరమే శబరిధామము
తోడునీడస్వామినీకు సదా శరణము
స్వామి సదా శరణము-స్వామిశరణము
రచన:రాఖీ -9849693324