Wednesday, November 11, 2009

క’సాయి’ లోన సాయిని చూడు
సారాయి లోను సాయి ఉన్నాడు
ఏసానీయింటిలో సాయి దర్శనమిస్తాడు
అంతావసాయి లోను సాయి అవతరిస్తాడు
చూసావాయిలలో అంతా సాయి మయం
మనసాయే ’మనసాయే నా’ మదియే ప్రేమమయం
1. పైసాయే పరమాత్మ తెలుసుకో ఈ సత్యం
గోసాయే అంతరాత్మ గ్రహియించు ఇది నిత్యం
ఊసాయే ఉత్తుత్తి ఈ బ్రతుకే బుద్బుదప్రాయం
బానిసాయే వ్యసనాలకు భవితే కంటకప్రాయం
2. మురిసాయే తలపులన్ని సాయిని తలవగనే
కురిసాయే మమతలన్ని సాయిని కొలువగనే
విరిసాయే ఎద కలువలు సాయి చూపు తగలగనే
జడిసాయే దుష్కర్మలు సాయి వైపు నడవగనే

’మది’ద్వార’కసాయి లోన సాయిని చూడు
మనసా’రాయి” లోను సాయి ఉన్నాడు
ఏ’సానీ’చర్చయినా సాయి దర్శన మిస్తాడు
అంతావసాయి లోను సాయి అవతరిస్తాడు
చూసావాయిలలో అంతా సాయి మయం
మనసాయే ’మనసాయే నా’ మదియే ప్రేమమయం
ఏల నా స్వరములో మాధుర్యమే పలుకదు
ఏల నా గళములో మకరందమే చిలుకదు
ఎందుకు భారతి -నాకీ దుస్థితి
ఎరిగించవే తల్లి -గాన జ్ఞాన సరస్వతి

1. ఒనరించినానేమొ గతజన్మలోనా
నీ ఉపచారాన నేనపచారము
చేసితినెవరినొ సంగీతజ్ఞుల
గర్వాతిశయమున అపహాస్యము
పశ్చాత్తాపమే నా దోష పరిహారం
పరితప్త హృదయమె నా నివేదనం

2. పాడితినేమో ఎరుగక ఎపుడైన
పదపడి అపశ్రుతిలో గీతాలు
నుడివితినేమో ఎంచక ఎపుడైన
పదముల అపరాధ శతాలు
శిక్షణయే నాకు తగిన శిక్ష
సాధనయే నాకిక అగ్నిపరీక్ష

3. వహియించినాను చిననాటి నుండి
నా గొంతు ఎడల నిర్లక్ష్యము
కనబఱచలేదు అలనాటి నుండి
సంగీతమంటే సౌజన్యము
ఇకనైన ప్రసాదించు ప్రాయశ్చిత్తం
పైజన్మకైనా దయచేయి (సు)స్వరవరం