Thursday, December 10, 2009

పాటకు అందాల పల్లవి
మోమున నగవుల మోవి
వర్ణాలేవైన పొసగాలి ఆ’కృతి’
పదములు కదలాలి వయ్యార మొలికి
1. ప్రాసల కుసుమాలు సిగలో తురమాలి
అపురూప అలంకారము చేయాలి
శబ్దావళుల నగలను వేయాలి
ఆహ్లాదముగ తీరిచి దిద్దాలి
2. ప్రతిపాదము పదిలంగ వేయాలి
చరణాలు లక్ష్యాని వైపే సాగాలి
భావము ప్రాణము చైతన్య పఱచాలి
మైమరచు రుచులని అందించాలి
చూడ చక్కని దానివే నాచెలి
చూడ ముచ్చటేస్తుందే కోమలి
చూస్తుండి పోవాలి నిను జన్మంతా
దరిచేరవు నిను చూస్తే చీకూచింతా
1. కన్నులెంత చేసాయో పుణ్యము
రెప్పలిచ్చి తప్పుచేసె దైవము
తల తిప్పలేను రెప్పవాల్చలేను
దృష్టి ని క్షణమైనా మరల్చలేను
2. కళ్ళురెండు చాలనే చాలవు
వొళ్ళంత కళ్ళున్నా తపనలు తీరవు
బ్రహ్మసృజన తలదన్ను-సృష్టించిరెవరు నిన్ను
నభూతో న భవిష్యతి నీ సుందరాకృతి