Monday, March 15, 2010

షడ్రుచుల ఉగాది-కో-యిల గానాల వినోది

బ్లాగ్వీక్షకులకు అభిమానులకు మిత్రులకు నా వి ”కృతి” సహిత ఉగాది శుభాకాంక్షలు!!

షడ్రుచుల ఉగాది-కో-యిల గానాల వినోది

కోయిలా కూయవేల?

రాయిలా మౌనమేల?

ఉగాది రాలేదనా? రాదేలనా!

మామిడమ్మ చివురేయలేదనా, మల్లి చెల్లి పూయలేదనా

చింత కాయకుంటే ఎందుకంత చింత?

మన్మధుడు చెఱకును విల్లుకై ఎత్తుకెళ్లాడనా !

మమకారాలు కరువయ్యాయనా!

నీ పాట జనం మరి’చేద’య్యిందనా!

పర్యావరణముప్పు వల్ల కన్నీటి ఉప్పూ కరువయ్యిందనా!!

ఎందుకు నేస్తం?ఈ బేలతనం

నేనున్నాను నీకోసం

నా షడ్రుచుల జీవితమూ ఉందితలపు(/తలుపు) “తీయని” మనసుంది

కాసింత మా’నవత’పై మమ’కార’ముంది

నచ్చక చిటపట లాడినా తప్పని సరియగు స్నేహిత(౦)ము(ఉ)ప్పుంది

కారణమేదైనా గాని మెచ్చేనేస్తాలను మరి”చేదు”౦ది

నొప్పించినా స’వరించి’ ఉల్లాస తీరాలకు పరుగులు తీసి(తీయించి) వగర్చేదుంది(వగరు+చేదు)

జీవిత మలుపు మలుపులో గెలిపించే వేలు’పులు పు’ష్కలంగా అందించే దీవెన ఉంది.

పాడవే కోయిలా..

పాడుకో యిలా....

ప్రకృతికే నేస్తంలా..పాటే సమస్తంలా...

Sunday, March 14, 2010

బ్లాగ్వీక్షకులకు అభిమానులకు మిత్రులకు నా వి ”కృతి” సహిత ఉగాది శుభాకాంక్షలు!!

గత ఉగాదుల స్వగతాలు“విరోధి” నామ ఉగాది శుభాకాంక్షలు!! జీవిత సత్యం -రాఖీ
ఉగాదీ! నీవే నా విరోధి!! నీకెలా స్వాగతం పలికేది?
నువ్వు ఇప్పుడే కొత్తగా - మా జీవితాల్లోకి వస్తేగా-?
అంతర్లీనంగా-మమేకంగా
మనుషుల మధ్య,మనసుల మధ్య
తిష్టవేసుకోలేదని నీ వంటే అది మిథ్య
నువ్వుంటే ఇంకెక్కడి సయోధ్య-అయోధ్య?

మిగతా నీ మిత్రులంతా అరవయ్యేళ్ళకోసారి దర్శనమిస్తారు
కానీ నీ వల్లనే మాలో ప్రతి ఒక్కరూ రోజూ కొట్టుక ఛస్తారు
ఏదో ఓ సందర్భంలో-ఎపుడో ఆవేశంలో
అవకాశం దొరికితే చాలు
అన్నదమ్ముల మధ్య-అక్కాచెల్లెళ్ళ మధ్య
భార్యా భర్తల మధ్య- ప్రేమికుల మధ్య
స్నేహితుల మధ్య –అపరిచితుల మధ్య
కులాల మధ్య- మతాల మధ్య
ప్రాంతాల మధ్య- దేశాలమధ్య
నువు చొరబడందెక్కడ?
సర్వాంతర్యామివి కదా నువు లేందెక్కడ!


ఐతే మేమేం తక్కువ తినలేదు- మేమేం అల్లాటప్పా కాదు
నిన్ను ఎలాగైనా మంచి చేసుకొంటాం-మాయచేసైనా మావైపు తిప్పు కొంటాం!

వీలైతే టీవీలైతే కొనిపెడతాం –
నువు కష్ట పడకుండా మేమే నమిలి నీనోట్లో పేడతాం!
మాకు రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య
అరాచకాలు మేమే నేర్చుకున్న విద్య
ఐనా నీ తప్పేం లేదులే
నువ్వు సిసిలైన యదార్థవాది
అందుకే నువ్వు లోక ” విరోధి ”
నిన్ను కత్తిలా ఉపయోగించుకొంటాం
దీపపు వత్తిలా వాడుకొంటాం
మాలోని ద్వేషం పైనే నిన్ను ప్రయోగిస్తాం
మా అరిషడ్వర్గాల పైనే నిన్ను సంధిస్తాం
ముల్లుని ముల్లు తోనే తీస్తాం-మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సని మళ్ళీ నిరూపిస్తాం
మా పంథా ఎప్పుడూ ధనాత్మకమే- మా శైలి సదా ప్రయోగాత్మకమే!
మాలోంచి నిన్ను బైటకు తీసి నీకు పెద్ద పీట వేస్తాం
నిన్ను సక్రమంగా సాగనంపేందుకు ఎర్ర తివాచీ పరుస్తాం
ఇది నీకు ఏడాది పాటు చేసే వీడ్కోలు సభ
ఇది నీ పరమ పదానికి సంతాప సభ
వచ్చేసావుగా సంతోషం- వచ్చిన వాళ్ళు వెళ్లక తప్పదనేది నిత్య సత్యం
అదే అక్షర సత్యం-అదే జీవిత సత్యం!!

బ్లాగ్వీక్షకులకు అభిమానులకు మిత్రులకు నా వి ”కృతి” సహిత ఉగాది శుభాకాంక్షలు!!

గత ఉగాదుల స్వగతాలు

మా ఇంటి పేరు భారతదేశం
విభవా! నీకు విజయీభవ!!
ఇదిగో వీరతిలకం-ఇదిగో మంగళ నీరాజనం!!!
ఎందుకైనా మంచిదీ-ముందుగా ఎడంకాలు మోపిరా
ఇదివరలోవచ్చిన నీ తోడి కోడళ్ళు కుడికాలు మోపినందుకే
మమ్మల్ని ముండమోపిరా! మా దుంపతెంచిరా!!
అవును పోయినేడు మీ పెద్దక్క’ప్రభవ’ ను కూడా
ఇలాగే ఇదే వేదిక మీద బొట్టుపెట్టి హారతిచ్చి మరీ ఆహ్వానించాం!
అయినా ఏంలాభం?చేసే భీభత్సమంతా చేసి
చేయకూడని కష్టనష్ట అరిష్టాలు చేసేసి మరీ వెళ్ళిపోయింది
అందుకే ఇప్పుడిలా తూలనాడుతున్నాం
నిన్నూ మర్యాదకేం లోటు రాకుండా మంచి చేసుకుంటాం
తప్పటడుగువేస్తే తప్పుచేస్తే నిన్నూ తప్పకుండా తిట్టుకుంటాం
అందుకేముందుగా గుర్తుచేస్తున్నాం-హెచ్చరిస్తున్నాం
అయినా ఎప్పుడూ ఇది మాకలవాటే!
అదేం చిత్రమో మీ వల్ల మాకెప్పుడూ గ్రహపాటే!!
అంత్యనిష్ఠూరం కంటె ఆది నిష్ఠూరం మేలు అన్నది నా సూత్రం
అందుకే నేనందరితోటి చెడ్డ అన్నది నగ్నసత్యం!!!

మే< మున్సిపాలిటి చెత్తకుండీలో బ్రతుకుతున్నాం
మేమందరం చిందరవందర గందర గోళంలో తిరుగుతున్నాం
మమ్మల్నంతా ఒక్కతాటి క్రిందకు చేర్చాలి
మా కందరికీ సమైక్యతా గొడుగు పట్టాలి
మా ఇంటిని నందన వనం చేయాలి
మా మనసుల్ని నవనీతం చేయాలి
అందుకు నువ్వు ’సంసారం ఒక చదరంగం’సినీమా లో
“ఉమ” పాత్రను ఆదర్శంగా తీసుకోవాలి
అయితే ముందుగానీకు మాగురించి మాఇంటి గురించీ
ఇంకా ఇంకా ఇంకా చెప్పాల్సిఉంది
మేం ఇప్పటికే రెండు డజన్లకు పై చిలుకు మందిగల కుటుంబం
ఇంకా కొత్తగా పుట్టగొడుగుల్లా ,కుక్కమూతి పిందెలు పుట్టుకొస్తూనే ఉన్నాయి
ఎందుకో తెలీదు?
పోనీ ఉన్నవాళ్ళమైనా ఆరోగ్యంగా ,ఉల్లాసంగా ఉన్నామా అంటే అదీ లేదు
మా పంజాబ్ కి కేన్సర్ ముదిరి పోయింది
మా కాశ్మీర్ ఎప్పటికీ రావణ కాష్ఠమే!
మా వైమూల వాళ్లకి కుష్ఠు వ్యాధి
మా బెంగాల్ కి ఎప్పుడూ విరోచనాలే
మా తెలుగు అన్నకి వేపకాయంత వెర్రి-
దానికి తోడు ఆరంభ శూరత్వంలా హై బీపీ
ఈ రోగాయణం గూర్చి చెబితే అదో రామాయణం అవుతుందిలే!
వీటికి తోడు కాందీశీకుల్లా ముష్టినయాళ్ళు
కనుమరుగౌతే చాలు కబళించే ఇరుగుపొరుగు దొంగ నాయాళ్ళు
చాలీ చాలని అదాయం
అందరూ దున్నపోతులు-పనికి మాలిన అడ్డగాడిదలు
రోత బూతులు పేలే వదరుబోతు శునకాలు
పెద్దాడి కడుపు కొట్టి నడిపివాడికి
నాలుగోవాడి కంచంలోంచి అరిచేవాడికిపెట్టి
అణాకాణీపెట్టి ఆఖరివాడికి ఐస్ ఫ్రూట్ తో సరిపెట్టి ఏదోలా నెట్టుకొస్తున్నాం
కరువులో వాంతిలా-వరదలో వానలా
రాబందుల్లాంటి బంధువులు
అతీగతీ అంతూపొంతూ లేని అతిథి దేవుళ్లు
వినోదాలు వేడుకలు-పండగలు పబ్బాలు
వీటికేం కొదవలేదు!!
మొలకు గోచీలేదు కాని తలకు టోపీకావాలన్నట్టు
వీళ్ళకు వీళ్ల పెళ్లాలకు పిల్లలకు అంతా ప్రత్యేకంగా కావాలి
అంతా విడివిడిగా స్వేఛ్ఛగా సాగాలి
అంతా ఇప్పుడే చెప్పడం ఎందుకులే?
బెదిరి గుండాగి ఛస్తావేమో
జడిసి తోకముడుస్తావేమో
ముందుగా లోపలికైతేరా
ముందుందిగా ముసళ్లపండగ!
చెప్పాల్సింది చెప్పాను-చేయాల్సింది నీ ముందుంచాను
నీటముంచినా పన్నీట తేల్చినా నీవే
తుఫాన్లు వరదల్లొ ముంచనా –సుభిక్షంగా గట్టెక్కించనా నీవే
నిజంగా నీవే కాల స్వరూపిణివైతే
నీవే విభవించే యుగాదివైతే
ధర్మ సంస్థాపనార్థాయా సంభవామి యుగే యుగే
అన్న మా గీతా వాక్యం నిజంచెయ్యి
మా చీకటి చేదు బ్రతుకు మీద
చిరు రుచిని కలుగజెయ్యి
విభవా! నీకు విజయీభవ!!