Thursday, May 27, 2010

నా కలా! ఎందుకలా?

నా కలా! ఎందుకలా?
“ ’కల’వని “ తలవనా
కలనైనా కలవని నేస్తమా
కలయిక మనకిక సాధ్యమా
కలవరమే నాకిక ప్రాప్తమా
1. కలకాలం నిలిచే స్నేహము
కలదో లేదో ఎరుగము
కలరవమగు నా జీవితగీతం
కలగాపులగం నా భవితవ్యం
కలయిక మనకిక సాధ్యమా
కలవరమే నాకిక ప్రాప్తమా
2. కలకోకిల వైనం నీ గానం
కలహంసల తుల్యం వయ్యారం
కలమే రాయని నువు మధు కావ్యం
కలత చెందె నా ఎద నీకోసం
కలయిక మనకిక సాధ్యమా
కలవరమే నాకిక ప్రాప్తమా

Thursday, May 20, 2010


https://youtu.be/dcl0mFeVzZY?si=cUv45HwNXmEXULSm


గుండెపిండి చూడు కారుతుంది కన్నీరు
మనసుతట్టి చూడు మ్రోగుతుంది నీ పేరు
నరనరాలలో పారేది నెత్తురు కాదు నీఊసే
రేయీ పగలూ దినమంతా ఎప్పుడు చూడు నీ ధ్యాసే
కాదులే చెలీ(నా) “ప్రేమ” నాటకం
ప్రేమ అంటెనే ఒక నమ్మకం

1. ఏ సాక్ష్యం చూపింది చిలకకు గోరింక
ఏ ఋజువులు తెచ్చింది కలువకు నెలవంక
ఏ మంత్రం వేసిందీ మేఘానికి చిరుగాలి
ఏ హామీ ఇచ్చిందీ భ్రమరానికి సిరిమల్లి
కాదులే చెలీ(నా) “ప్రేమ” నాటకం
ప్రేమ అంటెనే ఒక నమ్మకం

2. కన్నెవాగు ఏ కానుక తో కడలి ఒడిని చేరుతుంది
గున్నమావి ఏ బహుమతి తో కోయిల జత కడుతుంది
ఏ మత్తు జల్లి హరివిల్లు నింగి కొల్లగొడుతుంది
ఏ లంచమిచ్చి జడివానా నేలను ముద్దెడుతుంది
కాదులే చెలీ(నా) “ప్రేమ” నాటకం
ప్రేమ అంటెనే ఒక నమ్మకం

Wednesday, May 19, 2010

నాకేంకావాలో.......!

నేనేం పాపం చేసాను నేస్తమా..
నేనేం ద్రోహం చేసాను..మిత్రమా..
1. కొందరితో నువ్వు గొడవైనా పెట్టుకుంటావ్
కొందరితో నీవూ తిట్లైనా భరించుకుంటావ్
నేనేం మోసం చేసాను ప్రాణమా
నేనేం దోషం చేసాను స్నేహమా
2. పరాకుగా కొందరున్నా మాటాడుతుంటావ్
చిరాకుగా నీవున్నా కులాసగా చాటుతుంటావ్
నేనేం తక్కువ చేసాను..నెచ్చెలీ
నేనేం గొప్పలు పోయాను నా చెలీ
3. కోరకున్న గొంతెత్తీ కోయిలల్లె పాడుతుంటావ్
వేడుతు నే ఉన్నాగానీ రాయిలాగ పడిఉంటావ్
నేనేం సిరులను కోరాను ప్రియతమా
నేనేం వరముల నడిగాను..దైవమా..

కరుణతొ..మొరవిను..

ఎచటని వెతకను నిటలాక్షా నిను
అంతట నిండిన అంతర్యామి-
అట నిట నిటులనే గాలించగనే
కాంచనైతి నిను కరుణతొ మొరవిను
1. చల్లగ వీచే గాలివి నీవై-ఉల్లాసమునే చేకూర్చరా
అల్లనసాగే సెలయేరు నీవై-ఆహ్లాదమునే కలిగించరా
ప్రకృతిలోని ప్రతి అణువు నీవై-నాడెందమునే అలరించరా
2. ఓదార్పు నిచ్చే నేస్తానివీవై-ఎద భారమునే తొలగించరా
కడదాక సాగే ఒక తోడు నీవై-నందన వనముల నడిపించరా
కలలో ఇలలో నా లో లో లో నేనే నీవుగ తలపించరా

Tuesday, May 18, 2010

ప్రేమ గీతం

నెరవేరని కోరిక నేను-ఫలియించని వేడుక నేను
మెప్పించని నమ్మిక నేను.....నేస్తమా!
1. నా మోవే ఓ కలమవగా-నీ మేనే కాగితమవగా
రాస్తాను..ముద్దుముద్దుగా..ప్రేమలేఖ లెన్నెన్నో
చేస్తాను..పద్దుపద్దుగా..వలపులెక్క లెన్నెన్నో

రవి చూడని తిమిరం నేను..దరిచేరని కెరటం నేను
అలుపెరుగని యత్నం నేను..నేస్తమా..!

2. నా కన్నుల కుంచెల తోనే-నఖ శిఖ పర్యంతము నిన్నే
గీసేస్తా బ్రహ్మ ఎరుగని అందలెన్నెన్నో
తగిలిస్తా,,నా ఎదకే నీ చిత్రాలెన్నో

పలికించని గాత్రం నేను-నువు చదవని శాస్త్రం నేను
పులకించని ఆత్రం నేను..నేస్తమా!

ప్రేమ-పిచ్చి-ఒకటే

పిచోడినై పోయా నెచ్చెలి నీ ప్రేమకై
వెర్రోడినపోయా నేస్తమ నీ జాడకై
నా లో ప్రేమ వరదవు(Flood) నీవే
నాకు ప్రేమ వర ద వు(వర=వరము :ద=ఇచ్చునది) నీవే

1. నన్నుచూసి ఎగతాళిగ నవ్వుకుంటావేమో
నన్ను గేలిచేసి సంబరపడుతుంటావో
చంపనైన చంపవూ-కరుణతొ బ్రతికించవూ
ఏమిటి ఈ చిత్ర హింస-చెప్పవె నా రాజ హంస

2. తలవంచుక పోతుంటే కవ్విస్తావు
అలిగినేను కూచుంటే నవ్విస్తావు
మరపురానీయవు నిను- చేరరానీయవు
ఏమిటి ఈ వింత గారడీ-నా బ్రతుకు నీకు పేరడీ

Wednesday, May 5, 2010

నిత్య వసంతాలు

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

ఒక పాట పాడవే ఓ కోయిలా..
నీ కెందుకే బెట్టు గడుగ్గాయిలా
ఉలకవు పలకవు ఒక రాయిలా
నా వేడ్క తెల్లరనీ రేయిలా...

1. ఏ పుణ్య ఫలమో నీ గాత్రము
ఏ జన్మ వరమో సంగీతము
ఎలమావి కొమ్మలు నీ కూయలే
చవులూరు చివురుతినీ కూయలే
వేదనాదానివై..నాద వేదానివై
కూయాలి ఇల హాయికే హాయిలా
తీయాలి రాగాలు సన్నాయిలా

2. వేచింది ఆమని ఏడాది నీకని
తీర్చింది మామిడి నీ ఆకలిని
జుమ్మను తుమ్మెద సవ్వడి మరపించి
జారే జలపాత హోరును మించి
ఓంకార రవమై..జీవన లయవై
వ్యాపించనీయి గానం దిగ్దిగంతాలు
తలపించనీయి సాంతం నిత్య వసంతాలు