Wednesday, September 29, 2010

“దేశమును ప్రేమించుమన్నా-ద్వేషమును ద్వేషించుమన్నా”

“దేశమును ప్రేమించుమన్నా-ద్వేషమును ద్వేషించుమన్నా”

జెండా జాతీయ జెండా- మన భారతీయుల కలలే పండా
జెండా మన జెండా- కోట్లాది గుండెల నిండా

చూసీ చూడగనే-ఒక పవిత్ర భావం
మదిలో తలవగనే-సమైక్యతా రాగం

1. కాషాయం ప్రతిఫలించు –హైందవత్వం
తెలుపు రంగు తలపించు-క్రైస్తవ తత్వం
హరితవర్ణమే గుర్తుకు తెచ్చు-ఇస్లాం మతము
ధర్మచక్రమే ప్రబోధించును-లౌకిక తత్వం

చూసీ చూడగనే-ఒక పవిత్ర భావం
మదిలో తలవగనే-సమైక్యతా రాగం

2. నాగరికతకే ప్రతిరూపాలు-హరప్పామొహెంజదారోలు
శాస్త్రపురోగతినిదర్శనాలు-ఆర్యభటావరహమిహిరులు
ఆధ్యాత్మికతపునాదులే-అలరారే హిమాలయాలు
భిన్నత్వంలో ఏకత్వాలే-మన శైలీ సంస్కృతులు

ప్రపంచ మంతటికీ –ఆదర్శం మనదేశం
భారతీయత అంటేనే-జగానికే ఒక సందేశం

3. మందిర్ మస్జిద్ చర్చిలొ కాదు-దేవుడు కొలువుండేది
అణువుఅణువులో నిండి ఉన్నదే కాదా ఆ దైవం
గీతా ఖురాన్ బైబిల్ సారం-మానవతే కాకమరేది
మనిషి మనిషినీ ప్రేమించమనీ-తెలిపేదే మతము

మతమెప్పుడు కారాదు-మారణాయుధం
గతమెప్పుడు తేరాదు-భవితకు సంకటం-ప్రగతికి సంకటం

Tuesday, September 28, 2010

ప్రణయ ప్రవచనం

ప్రణయ ప్రవచనం

తెలుగులోనె పలికినా తెలియదెలా నీకు
వివరించి చెప్పినా మదికి ఎక్క దెందుకు
అమాయకం అనుకుంటే హాస్యాస్పదమే
నటనని భావించితే అతులితమౌ ప్రతిభయే

1. కలువనేమి కోరుతాడు నింగిలోని చందురుడు
కమలా న్నేం వేడుతాడు జీవదాత సూరీడు
పొంగే అభిమానానికీ ఏవీ అవధులు
గుండె దాటె అత్మీయత కేవీ పరిధులు

2. తుమ్మెదనే వాలకుంటె విరితరువుకు మనుగడేది
ప్రేమ నోచుకోకుంటే మనిషి జన్మకర్థమేది
"ఎక్కడ పుడుతుందో(?)యీ" అనురాగ గంగ
ఉనికి కోల్పోతుందే(!)మది(?) సాగరాన్ని చేరంగ

3. చిలుకా గోరింకలే ప్రణయానికి ప్రతీకలు
రాధామాధవులే కదా పవిత్ర ప్రేమికులు
కొన్ని కొన్ని బంధాలు విధి లీలావిలాసాలు
హేతువుకే అందలేని వింతైన సమాసాలు

Sunday, September 26, 2010

“ కోరిక మరీచిక”

“ కోరిక మరీచిక”

కన్నీటి బొట్టు-గుండియ లోగుట్టు- దాచలేనట్టు

మోడైన చెట్టు-చిగురించినట్టు- కంటే కనికట్టు

అందాలు లోకాన అవి మిథ్యలే- ఆనందతీరాలు మృగతృష్ణలే

1. మెరిసే మేఘం-కరిగే కాలం-కనురెప్పపాటే
కురిసే వర్షం-జీవన గమనం-సుడిగాలి తోటే
అరుణారుణ కిరణాలు అర ఘడియేలే
వర్ణాల హరివిల్లు వేషాలు నిమిషాలె

అందాలు లోకాన అవి మిథ్యలే-
ఆనందతీరాలు మృగతృష్ణలే

2. నింగికి ఎగసే-సాగర కెరటం- ఎంత ఆరాటం
నీటిని తాకే-గగనపు తాపం- వింత పోరాటం
ఆటుపోట్ల అవధి ఎపుడు చెలియలి కట్టేలే
కడలి ఖంబు(ఆకాశం) కలయిక ఇల దిక్చక్రమేలే

అందాలు లోకాన అవి మిథ్యలే-
ఆనందతీరాలు మృగతృష్ణలే

Thursday, September 16, 2010

ప్రణమామ్యహం-ప్రణవ స్వరూపం

ప్రణమామ్యహం-ప్రణవ స్వరూపం

అభీష్టదాయకం-శ్రీ గణనాయకం
విఘ్న వినాశకం-వినాయకం నమామ్యహం

జయ లంబోదరం-మోదకా మోదకం
దూర్వార ప్రియం- దురితదూర భజామ్యహం

జయ నీరాజనం- ప్రియ నీరాజనం
అందుకో నీ భక్త -జనo నీరాజనం

1. భవబంధ మోచకం- భవానీ నందనం
మునిజన వందితం-మూషిక వాహినం
సిద్దిబుద్ది సంయుతం-చిన్ముద్ర ధారిణం
శీఘ్రవర ప్రసాదకం-చిన్మయానందకం

జయ నీరాజనం- ప్రియ నీరాజనం
అందుకో నీ భక్త -జనo నీరాజనం

2. పాశాంకుశ ధరం-జగదేక సుందరం
పాపధ్వంసకం-ఫాలచంద్ర పాహిమాం
గజముఖఏకదంత-వక్రతుండ వందనం
శరణం శర ణం-మాం పాహి తవచరణం

జయ నీరాజనం- ప్రియ నీరాజనం
అందుకో నీ భక్త -జనo నీరాజనం

Saturday, September 11, 2010

లాలి ....గణపతి నన్నేలాలి

లాలి గణపతి నన్నేలాలి

(నన్నేలాలి)ఏలాలి పాడితే జగములనేలే ఏకదంతా నీకు ప్రియం
ఏలీల పొగడితే మహిమలు వేలే గజముఖా ఈయి నాకు అభయం
లాలి పాటకే కైలాసం అటు ఇటూ కదలాలి
గొంతు విప్పితే హిమవన్నగమే ఊయలై ఊగాలి

జోలాలి వినాయకా నా ఎదనీ పాదాల వాలాలి
జోలాలీ శుభదాయకా నీవే-అంతరంగతరంగాల తేలాలి

1. అల్పమైన ఎలుకనెక్కి ఆపసోపాలు పడి
నవరాత్రి సంబరాల మండపాల అడుగిడి
విన్నావు దీనజనుల విన్నపాలు విఘ్నపతి
సేదదీరగా నీవు చేకొనుమా విశ్రాంతి
జోలాలి వినాయకా నా ఎదనీ పాదాల వాలాలి
జోలాలీ శుభదాయకా నీవే-అంతరంగతరంగాల తేలాలి

2. నీ గుజ్జు రూపముతో ముజ్జగాలు తిరిగితిరిగి
భక్తుల కోర్కెలన్ని తీర్చుటలో అలసిసొలసి
బడలికనే గొన్నావు ఓ బొజ్జ గణపతి
శయనించర ఇకనైనా మన్నించి నావినతి
జోలాలి వినాయకా నా ఎదనీ పాదాల వాలాలి
జోలాలీ శుభదాయకా నీవే-అంతరంగతరంగాల తేలాలి

https://www.4shared.com/s/fGi4EhMqngm

Friday, September 10, 2010

ఓం గం గణపతయే నమః మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు!!

సిరులకు శ్రీ పతి-బుద్దికి బృహస్పతి
చదువుల సరస్వతి- నీవె గణపతి

నీవే శరణాగతినీ-పాదాలకు పబ్బతి
ఈయవయ్య సద్గతి- కలిగించు మాకు ప్రగతి

నీకిదె మా హారతి....మంగళ హారతి...మంగళహారతి...మంగళహారతి

1. కదిలిరావయ్య ఓ కైలాస గణపతి
ఎదలొ నిలువవయ్యా కాణిపాక గణపతి

నీ పుట్టిన రోజే ఈ భాద్రపదా శుద్ద చవితి
నవరాత్రుల సంబరమే –వెదజల్లును నవకాంతి

చిత్రమె నీ అకృతి-చిత్రమె నీ ప్రకృతి
అందుకొమా ఈ కృతినీ- పాదాలకు పబ్బతి

నీకిదె మా హారతి....మంగళ హారతి...మంగళహారతి...మంగళహారతి

2. విఘ్నాలను తొలగించే స్వామీ విఘ్నపతి
బంగారు మా భవితకు నీవే నయ్యా... స్థపతి

సన్మార్గము నడిపించే మా జీవన సారథి
చేసుకొన్నామునిన్నె మా బ్రతుకున కధిపతి

కనిపెట్టు మా సంగతి-స్థిర పరచుము మా మతి
చూడవయ్య అతీగతినీ- పాదాలకు పబ్బతి

నీకిదె మా హారతి....మంగళ హారతి...మంగళహారతి...మంగళహారతి