Thursday, October 28, 2010

“సౌందర్యరాశి”

“సౌందర్యరాశి”
చూపు తిప్పుకోలేను-చూసి తట్టుకోలేను
ఎంత ప్రయత్నించినా-దృష్టి ని మరలించలేను
నిన్ను గెలుచుకోలేను-ఓటమి భరియించలేను
రెండింటి మధ్యనలిగి రేవడినై పోలేను
కుమ్మరి పురుగై నా మెదడంతా తొలిచేవు
సాలెపురుగులాగ నీ వలలో బంధించేవు
1. అపరంజి తళుకులు నీ ముంధు వెలవెల
మేఘాల మెరుపులూ తలదించుకోవాల
చందమామ బెంగపడీ చిక్కిశల్యమవ్వాల
నక్షత్రకాంతి కూడ నగుబాటు చెందాల
అందానికి కొలమానం నీ అందమేలే
అపురూప ఉపమానం ఇకనుండి నీవేలే


2. పెద్దన ముద్దుల నాయకి వరూధినే వణకాల
కాళిదాసు కావ్య కన్య శకుంతలే జడవాల
అప్సరసలు నీ ముందు అణిగిమణిగి మెలగాల
మోహినే దిగివచ్చి నీకు మోకరిల్లాల
ఎంతవారలైనా కాంతల దాసులే
సౌందర్యవతులైనా నీ పాదా క్రాంతులే

Tuesday, October 26, 2010

“ప్రణయ దేవేరి ? ”

“ప్రణయ దేవేరి ? ”
నా మనసు (నీ) కో’వెలా-వెల కట్టేవెలా
ఎరుగలేవు ఎదుటి మనిషి విలువ
వేయబోకు ప్రేమనెపుడు శిలువ
ప్రేమంటే ఏమిటో తెలుసా-అనురాగమంటె ఇంత అలుసా
1. పరికించు ఎపుడైనా చిలుకాగోరింకను
గమనించు ఏ రేయో కలువానెలవంకను
పువ్వూతుమ్మెద బంధం-తెలుపుతుంది ఎదబంధం
ప్రేమానుభూతిలో-బ్రతుకంతా మకరందం
ప్రేమంటే ఏమిటో తెలుసా-అనురాగమంటే ఇంత అలుసా
2. మేఘమొస్తె మేనుమరచి-ఆడుతుంది మయూరం
మధుమాసం ఏతెంచితె-ఎలుగెత్తి పాడు పికము
పల్లానికి పారు ఝరి-లయమగును కడలి చేరి
అస్థిత్వం కోల్పోతే-అదే కదా ఆనందం
ప్రేమంటే ఏమిటో తెలుసా-అనురాగమంటే ఇంత అలుసా

Monday, October 25, 2010

“వినవా-వినతి”

“వినవా-వినతి”
నడుము నంగనాచే
నాభి నాతొ దోబూచే
జఘనాలతో పేచే
జడ పామై తోచే
జవరాలా జగడాలా- ఇంతే నా జన్మంతా
జర నాతో జతకలిపీ-మనరాదా బ్రతుకంతా

1. ఎదలు చూపు బంధించె
పెదవి రక్తపోటు పెంచె
నాసిక నను వంచించె
నయనాలు పరిహసించె
జవరాలా జగడాలా- ఇంతే నా జన్మంతా
జర నాతో జతకలిపీ-మనరాదా బ్రతుకంతా

2. గొంతు మైమరపించె
మాట మత్తునెక్కించె
నవ్వుమాయ లోన ముంచె
నడక దాసునిగ మార్చె
జవరాలా జగడాలా- ఇంతే నా జన్మంతా
జర నాతో జతకలిపీ-మనరాదా బ్రతుకంతా

3. విసుగు నీ ప్రేమ ముసుగు
విరుపు నీ మేని మెరుపు
కోపం నీలోని వలపు
ద్వేషం ఇష్టాన్ని తెలుపు
జవరాలా జగడాలా- ఇంతే నా జన్మంతా
జర నాతో జతకలిపీ-మనరాదా బ్రతుకంతా

Saturday, October 23, 2010

“మహామాయ”

“మహామాయ”
నువ్వు ఒక హంతకివి-చూపులతొ ప్రాణం తీస్తావు
నువ్వు ధన్వంతరివి-నవ్వులతొ బ్రతికించేస్తావు
నువ్వు ఒక మాయలాడివి-మనసుతో గారడి చేస్తావు
నువ్వు ఒక మాయలేడివీ-అందీఅందక ఊరిస్తుంటావు
1. యుద్ధాలు జరిగేది –నీ ప్రాప్తి కోసమే
రక్తాలుపారేదీ –నీ ప్రాపకానికే
ఎదురుగా నువ్వుంటే ఎక్కి వస్తుంది దుఃఖం
కంటికే కనబడకుంటే ఎదలొ ఎనలేని ఖేదం
తీయనైన వేదన నీవే-తీరలేని వేడుక నీవే
నువ్వు కరుణించకుంటే ఎన్ని ఉన్నా శూన్యమే
2. కృతయుగాన పుట్టి ఉంటే-మనకపోవు ఏ మునీ
త్రేతాయుగాన పుడితే -వ్రతమే చెడేది రామునీ
ద్వాపరాన పుడితే కృష్ణుడు తలచకుండు మరియే భామని
కలియుగాన పుట్టి నువ్వు తట్టినావు నాలో ప్రేమని
గీయలేని చిత్రం నీవే-రాయలేని కావ్యం నీవే
నిన్ను వర్ణించగా కాళిదాసు కైనా తరమే

Friday, October 22, 2010

వింత బంధం

వింత బంధం
కళ్ళు నీకు ఇస్తా కానుకగా- కబోధి నైనా కలల్లోనె చూస్తా వేడుకగా
మాటనీకు ఇస్తా బహుమతిగా- మూగనైనా స్మరిస్తా నిన్నే దేవతగా
దూరంగానె ఆరాధిస్తా-బ్రతుకు నీకు అంకితమిస్తా
ఏదోఒక జన్మలో -నువ్వు కరుణిస్తానంటే-ఎన్నిసార్లైనా
పదపడినే మరణిస్తా-పదేపదే నే జన్మిస్తా
1. ఎంతగా వద్దనుకున్నా-దృష్టి మరలి పోనేపోదు
ఎన్నిమార్లువారించినా-ధ్యాస చెదరిపోనేపోదు
ఆకర్షణ నీలో ఉంది-అది నన్ను బంధించింది
సమ్మోహనమేదో ఉంది-నన్ను వశపర్చుకుంది
నిస్సహాయిణ్ని నేను-నియంత్రించుకోలేను
నీ మయాజాలంలోపడి దిక్కుతోచకున్నాను

2. అభిమానం చాటడానికి-మాటకెపుడు చేతకాదు
అనుభూతిని తెలపదానికి-ఏ భాషాసరిపోదు
తర్కానికి దొరకని భావం-హేతువే ఎరుగని బంధం
నిఘంటువులొలేని పదము-మేధకే అందని పథము
కోరడానికేదీ లేదు-ప్రత్యేకించిపొందేదిలేదు
కరిగిపోవు జీవితకాలం-అనందం మిగిలిస్తేచాలు

Tuesday, October 19, 2010

నా పేరు విదూషకుడు(మేరా నామ్ జోకర్)

నా పేరు విదూషకుడు(మేరా నామ్ జోకర్)

ఎదను కొల్లగొడతావు-మనసు దోచుకొంటావు
గుండెకెలికి గాయంచేసి-బాధపడితె నవ్వుతావు
ఓనా నేస్తమా- ఓనా ప్రియతమా
నీ మదికానందమైతె-ఏదైనా భరిస్తాను
నువు సంతోషపడితె-ఎంతైనా సహిస్తాను

1. నిద్రకు నన్నెపుడూ దూరంచేస్తావు-మనశ్శాంతి నానుండి మాయం చేస్తావు
ఏ పనీ చేయనీవు-క్షణం నాకు దక్కనీవు
పిచ్చోడిగ మార్చివేసి-కేరింతలు కొడుతావు
ఓనా నేస్తమా- ఓనా ప్రియతమా
నీ మదికానందమైతె-ఏదైనా భరిస్తాను
నువు సంతోషపడితె-ఎంతైనా సహిస్తాను

2. ఎవరైనా సరె నువ్వే అనిపిస్తావు-నా మెదడంతా ఆక్రమించు కుంటావు
నా శ్వాస నీవైనావు – నా ధ్యాస నీవైనావు
చావలేక బతుకుతుంటె-చోద్యం చూస్తుంటావు
ఓనా నేస్తమా- ఓనా ప్రియతమా
నీ మదికానందమైతె-ఏదైనా భరిస్తాను
నువు సంతోషపడితె-ఎంతైనా సహిస్తాను

Friday, October 15, 2010

“గోదావరి మాకు సిరి”

“గోదావరి మాకు సిరి”
ఓ గోదావరి-తెలంగాణ ఊపిరి
ఓ గోదావరి-మా ప్రాంగణ జీవఝరి
మా పున్నెఫలమువల్ల- నీ దరిపై పుట్టితిమి
అన్న పూర్ణ నీవై -ప్రాణ భిక్ష పెట్టితివి
1. చిన్ననాట నీ ఒడ్దున -ఆటలెన్నొ ఆడుకుంటి
నిర్భయంగ నీ ఒడిలో-ఈదాడుట నేర్చుకొంటి
కన్నతల్లిలాగ నీ చనుబాలను ఇచ్చావు
కల్పవల్లి లాగ మా పాపాలను కడిగావు
2. నీ నడకల హొయలుతో -సాహిత్యం ఉబికింది
నీ అలల గలగలలో -సంగీతం అబ్బింది
నీ నీళ్ళు తాగి మేము చురుకుదనం పొందితిమి
నీ చలవ వల్లనే మేధావుల మైతిమి
3. నీ కృపతో మా బీళ్ళు -పంటసిరుల నిస్తున్నవి
నీదయతో కన్నీళ్ళు మాదాపుల రాకున్నవి
గౌత’ముని’కి వరమిచ్చిన తల్లీ ఓ గౌతమి
మనసుతో మాటతో తలలు వంచి మొక్కితిమి

Wednesday, October 13, 2010

“నీ సుఖమే నే కోరుతున్నా”

“నీ సుఖమే నే కోరుతున్నా”

చిరునవ్వు కోసమే-నే పరితపిస్తున్నా
కడగంటి నీ చూపుకె నే కలవరిస్తున్నా
ఎవరెవరికొ నువ్విచ్చినంత-ప్రాధాన్యత కోరానా
ఇష్టపడే వారంటే-ఇంతి కింత న్యూనతనా

1. కడుపునిండ నువు తింటే-నా ఆకలి మటుమాయం
కళ్ళముందు కనబడితే-నా రుగ్మతలన్ని నయం
కాసింత స్పందిస్తేనే- ఉన్నమతి పోతుంది
రవ్వంత దయతలిస్తె-నా గుండె ఆగుతుంది

2. మనసార పలకరిస్తే- మణిమాణిక్యాలెందుకు
క్షణమైన దృష్టి పెడితె-లక్షలు కోట్లెందుకు
నీ వద్దనుండి నేను- లాక్కున్న సొమ్మేంలేదు
నువ్వెంత దోచుకున్నా-కిమ్మని అననైన లేదు

3. నీచర్మం గీరుకపొయినా-నా ప్రాణం విలవిలా
నీకేచిన్న గాయమైనా-నాకు నరక ప్రాయంలా
నీ ప్రసన్నవదనమే- నా కిల బృందావనం
నువు చల్లగ వర్ధిల్లుటె- నా పాలిటి స్వర్గము

ఓం శ్రీ సరస్వత్యై నమః

ఓం శ్రీ సరస్వత్యై నమః

తవ చరణ శరణ్యమే సుఖజీవనము
శ్రీవాణీ నీ కారుణ్యమే కడు పావనము
1. మూలా నక్షత్ర అవతారిణి
వాంఛితార్థప్రద చింతామణి
సంగీతవాహిని అనిల సరస్వతి
విజ్ఞాన దాయిని జ్ఞాన సరస్వతి
2. నటగాయక వందిని ఘట సరస్వతి
వీణాపాణి శర్వాణి హే కిణి సరస్వతి
అంతరంగ నియంత్రిణి అంతరిక్ష సరస్వతి
శుంభ నిశుంభ నిశుంభిని మహా సరస్వతి

Tuesday, October 12, 2010

“మ(హ)త్తు”

“మ(హ)త్తు”
నీకు ఎంతో ఉన్నది లోకం-నాకు మాత్రం నీవే మైకం
ఎక్కడుంటుందో నీ చిత్తం-నా తలపుల నువ్వే మొత్తం
ఎందుకో మరి తెలియదు నాకు-అయిపోయా బానిస నీకు
1. అందగత్తెవి నువ్వనుకోకు-సుందరాంగులెందరొ తెలుసు
అందుబాట్లొ ఉన్నాననకు-మార్గాలెన్నొ ఎరుగును మనసు
ఎందుకో మరి తెలియదు నాకు-అయస్కాంతమున్నది నీకు
2. చూపులతో తూపులు వేసి-కనుసన్నల కట్టేస్తావు
నవ్వులనే ఎఱగా వేసి-నీ బుట్టలొ పడవేస్తావు
ఎందుకో మరి తెలియదు నాకు-ఇంద్రజాలమున్నది నీకు
3. కోపంగా నేనున్నప్పుడు-నిన్ను చూసి మంచై పోతా
వేదనతో వేగేటప్పుడు-కనబడితే సేదతీరుతా
ఎందుకో మరి తెలియదు నాకు-మహిమ ఉన్నదేదో నీకు

Monday, October 11, 2010

ప్రేమైక్యం

ప్రేమైక్యం
ప్రేమ కోసం చావను
ప్రేమనెపుడూ చంపను
ప్రేమమార్గం వీడను
ప్రేమగానే చూసుకుంటా ప్రేమను
ఐ లవ్యూ మై డియర్-లవ్యూ లవ్యూ ఫరెవర్
1. దొంగచాటుగ ఎపుడో సొచ్చి
ఎదనంతా ఆక్రమించి
అదేపనిగ వేధిస్తోందీ ప్రేమ
అధోగతికి చేర్చేసింది ప్రేమ
ఐ లవ్యూ మై డియర్-లవ్యూ లవ్యూ ఫరెవర్

2. ప్రేమ సృజనకు హేతువు లేదు
ప్రేమ కొరకే ఋతువూ లేదు
ప్రేమ పుట్టుటకర్థం లేదు
ప్రేమకే పరమార్థం లేదు
ఐ లవ్యూ మై డియర్-లవ్యూ లవ్యూ ఫరెవర్

3. ప్రేమప్రేమను ప్రేమిస్తుంది
అనుభూతిని ప్రేమిస్తుంది
వ్యక్తపరచ లేనిదె ప్రేమ
అనిర్వచనీయమె ప్రేమ
ఐ లవ్యూ మై డియర్-లవ్యూ లవ్యూ ఫరెవర్

ప్రేమైకం

ప్రేమైకం
చిన్నబుచ్చుకున్నాగాని-ముఖం మాడ్చుకున్నాగాని
నన్ను కసురుకున్నాగాని-లోన తిట్టుకున్నాగాని
నిన్నువీడి పోనేపోను నేస్తమా-నన్ను తప్పుకోవడం నీకు సాధ్యమా
ప్రేమించడమంటేనే ఒక నేరమా-ప్రేమనాశించడమే విడ్డూరమా
1. నీ గుండెస్పందన నవుతా- నీ గొంతు మార్దవమవుతా
ఊపిరిలో ఊపిరినవుతా-కణకణమున నెత్తురు నవుతా
నడకలొ వయ్యరమునవుతా-మేనిలొ సుకుమారమునవుతా
ఉసురునాకు తాకినగాని-ననుగోసగ చూసినగాని
నిన్నువీడి పోనేపోను నేస్తమా-నన్ను తప్పుకోవడం నీకు సాధ్యమా
ప్రేమించడమంటేనే ఒక నేరమా-ప్రేమనాశించడమే విడ్డూరమా
2. పెదాల చెదరని నవ్వునౌతా- బుగ్గన మెరిసే సొట్టనౌతా
జడలో ఒదిగిన పువ్వునౌతా-నుదుటన చెరగని బొట్టునౌతా
కంటికి కాటుక రేఖనౌతా-చెంపల వెంట్రుక పాయనౌతా
పీడగ నను తలచినగాని-నీడగ నిను వదలని వాణ్నీ
నిన్నువీడి పోనేపోను నేస్తమా-నన్ను తప్పుకోవడం నీకు సాధ్యమా
ప్రేమించడమంటేనే ఒక నేరమా-ప్రేమనాశించడమే విడ్డూరమా
3. అద్దంలో బింబమునవుతా-నిద్దురలో స్వప్నమునవుతా
రెప్పమాటు చీకటినవుతా-చూడగలుగు వెలుగే అవుతా
పుట్టుమచ్చ నే నవుతా-పచ్చబొట్టు నేనవుతా
నీ ఎదలో భావమునవుతా-వెంటాడే జ్ఞాపక మవుతా
నిన్నువీడి పోనేపోను నేస్తమా-నన్ను తప్పుకోవడం నీకు సాధ్యమా
ప్రేమించడమంటేనే ఒక నేరమా-ప్రేమనాశించడమే విడ్డూరమా

Sunday, October 10, 2010

శ్రీ దుర్గా నవరాత్ర్యోత్సవ శుభాకాంక్షలు!!

శ్రీ దుర్గా నవరాత్ర్యోత్సవ శుభాకాంక్షలు!!
జై భవాని! జై అష్టైశ్వర్య ప్రదాయిని! జై శర్వాణి!
నవదుర్గే –మానవ జీవన సన్మార్గే
భవబంధ విసర్గే-నమోస్తుతే మానస సంసర్గే
1. శైలపుత్రి కాలరాత్రి సిద్దిదాత్రి గాయత్రి
స్కందమాత చంద్రఘంట కూష్మాండే చాముండి
మహాగౌరి బ్రహ్మచారిణి కాత్యాయిని సింహవాహిని
కామరూపిణి కామ వర్ధిని కామ్యార్థదాయిని హే జననీ
2. కాదంబరి బాలాత్రిపురసుందరి సౌందర్యలహరి
శ్రీలలితేశ్వరి రాజరాజేశ్వరి సర్వేశ్వరీ వాగీశ్వరీ
జయజగదీశ్వరి అన్నపూర్ణేశ్వరి హే భువనేశ్వరి
పాలయమాం మహేశ్వరి అఖిలాండేశ్వరి శ్రీశాంకరీ
3. మణిద్వీప నిలయిని మహాశక్తి నారాయణి
శ్రీచక్ర చారిణి కల్యాణి కారుణ్యరూపిణి
ఓంకార సంభవి శాంభవీ మహాదేవి
అఖిలాండకోటి బ్రహ్మాందనాయకి జగద్రక్షకీ

Friday, October 8, 2010

కమ్మని హాలాహలం

కమ్మని హాలాహలం
కన్నులలో కారం పోసీ-నవ్వులకే దూరం చేసీ
ఆటాడుకున్నావేం నేస్తమా!
ఆషామాషా జీవితమంటే -నా ప్రాణమా
నీవైనా అక్కునజేర్చుకొ-ఓ మరణమా!!
1. అందమైన నాకలలన్నీ-కొల్లగొట్టి పోయావు
మధురమైన ఊహలన్నీ-మాలిన్యం చేసావు
సీతాకోక చిలుకై ఎగిరితె-నిర్దయగా రెక్కలు త్రుంచావ్
సరదాగా గడిపేనన్ను-నరకంలో తోసెసావు
అనురాగరాగమంటే-ఇంతకర్ణ కఠోరమా
ప్రణయానికి పర్యవసానం-ప్రతినిమిషం విషాదమా
ఆషామాషా జీవితమంటే -నా ప్రాణమా
నీవైనా అక్కునజేర్చుకొ-ఓ మరణమా!!
2. కవ్వించీ ఉడికించీ –నాలోన నేనే మురిసా
కాదుపొమ్మంటూనే-మనసారా నిన్నే వలచా
మగువ మనసు మర్మం తెలియక-మాయచేసి ముంచేసావు
పడతి ప్రేమ తత్వం ఎరుగక-వంచనతో నను గెలిచావు
చేజారిన హృదయం ఎపుడు-తిరిగి నన్ను చేరుకోదా
విధి వేసిన ఏ చిక్కుముడీ-ఎన్నటికీ వీడి పోదా

Thursday, October 7, 2010

కాలకూట అమృతం?

కాలకూట అమృతం
చూపులతో నను చంపేసీ-నవ్వులతో ప్రాణం పోసీ
ఆటాడుకుంటావేం నేస్తమా!
ఆషామాషా జీవితమంటే-కుందనాల బొమ్మా
మేడగట్టి కూలగొట్టకు- వందనాలు నీకమ్మా!
1. నువ్వు మాటలాడుతుంటే- ఏరుకుంట ముత్యాలెన్నో
నీ కన్నుల గనులలోన-తవ్వుకుంట రతనాలెన్నో
ఎంత తోడుకున్నాగాని-తరిగిపోని నిధివే నీవు
ఎంతనీరు వాడుకున్నా- ఎండిపోని నదివే నీవు
దాచుకున్నా గాని దాగనివే సౌందర్యాలు
పంచుకున్నా కొద్దీ ఇనుమడించునీ సంపదలు
ఆషామాషా జీవితమంటే-కుందనాల బొమ్మా
మేడగట్టి కూలగొట్టకు- వందనాలు నీకమ్మా!
2. నీ ప్రతి ఒక కదలికలోనా-పల్లవించు మధుమాసాలు
నీ ప్రతి ముఖ కవళికలోనా-శీతల ఋతు పవనాలు
మరణాన్నైన ఆహ్వానిస్తా-క్రీగంటి నీ వీక్షణకై
మళ్ళీ మళ్ళీ నే జన్మిస్తా-నీ మధుర హాసముకై
నన్ను ద్వేషించడమే- నీ కున్న జన్మహక్కు
నిన్నారా ధించడమే -నాకు వరమై దక్కు
ఆషామాషా జీవితమంటే-కుందనాల బొమ్మా
మేడగట్టి కూలగొట్టకు- వందనాలు నీకమ్మా!