Friday, November 26, 2010

“’కమ్మ’-నీ” గీతిక

“’కమ్మ’-నీ” గీతిక

ఎందుకమ్మా ఓ కమ్మా-నీకు అంత సహనం (కమ్మ=కాగితం=paper)
నేలకైనా ఉందా అమ్మా-నీ అంత సత్వగుణం
ఎపుడైనా వస్తే భువికే కోపం-తెస్తుంది తెగటార్చే భూకంపం
దెబ్బతింటె భూ పర్యావరణం-రాస్తుంది జీవ జాతికే మరణ శాసనం

1. స్వఛ్ఛమైన నీ మనసుపై-పిచ్చి రాత రాస్తారు
శ్వేతవర్ణ దేహం పైన -గీతలెన్నొ గీస్తారు
కలాలతో కఠినంగా రాసి గాయం చేస్తారు
ముద్రించే తరుణంలో-యంత్రాల్లో నలిపేస్తారు
చరిత్రనే మోసుక వచ్చిన ఘన చరితే నీదమ్మా
నిన్ను మఱచి ఏమరిస్తే మాకు భవిత లేదమ్మా

2. వ్యాసవాల్మీకాదులు –అక్కున నిను జేర్చారు
కవిత్రయము నిన్నెపుడూ పుత్రికగా చూసారు
అష్ట దిగ్గజాలు నీకు సాష్టాంగ పడ్డారు
జ్ఞానపీఠాధిరోహులు వేలుపుగా కొలిచారు
వెదురు నిన్ను కన్న తల్లి మా కల్పవల్లి
వేణువే నీకు చెల్లి ఓ పాలవెల్లి

3. జ్ఞానమొసగు దేవతగా నిన్నారాధిస్తారు
నేర్చుకున్న అనుభవాలు నీలొ పదిల పరిచేరు
అనుభూతులు పంచుకొని చరితార్థను చేస్తారు
తప్పుగా భావించకమ్మా-తల్లిగ నిను ప్రేమిస్తారు
ఏది చేసినా గాని ఉభయ కుశలోపరే నమ్మా
బాధ కలిగించినా సదుద్దేశమే గదమ్మా

“కుంచాకు పావుశేరు –అయినా సరె నీ తీరు-నా కోరిక తీరు ”

“కుంచాకు పావుశేరు –అయినా సరె నీ తీరు-నా కోరిక తీరు ”

కొల్లగొట్టావు సర్వం-నా మనసుతో సహా
కోరుకున్నదేమి నిన్ను-ఓ చిరునవ్వు మినహా
చిన్న చిన్న తీపి గురుతులె-అనుభూతి మిగులుస్తాయి
చిరు చిరు చిరు సంగతులన్నీ-ఆహ్లాదమనిపిస్తాయి

1. చుక్కలొచ్చి రాతిరినే-సుందరంగ చేస్తాయి
కలలొచ్చి నిద్దురలో కమ్మదనం తెస్తాయి
హరివిల్లు నింగికే అలంకార మవుతుంది
వానజల్లు నేలకే అప్తురాలు అవుతుంది
చిన్న చిన్న తీపి గురుతులె-అనుభూతి మిగులుస్తాయి
చిరు చిరు చిరు సంగతులన్నీ-ఆహ్లాదమనిపిస్తాయి

2. నీ ఎదలో తొంగి చూస్తే-దొరికేను నా ఆచూకి
నీ చిత్తం మొత్తం వెతికితె-ఉంటుంది నా చిరునామా
బింకమెంత ప్రదర్శించినా- ఆంతర్యం తెలియదనా
పైకివ్యతిరేకించినా-అంతరంగ మర్మమెరుగనా
చిన్న చిన్న తీపి గురుతులె-అనుభూతి మిగులుస్తాయి
చిరు చిరు చిరు సంగతులన్నీ-ఆహ్లాదమనిపిస్తాయి

Thursday, November 25, 2010

“రంగుల వల(పు)”

“రంగుల వల(పు)”

శిథిలమైంది గుండె గుడి- ఇంకింది కంట తడి
అలసినాను వెంటపడి- అందుకోలేక చతికిలబడి

1. తీరాన్ని చేరలేవు - కడలికెరటాలు
దాహాన్ని తీర్చలేవు- ఏ మరీచికలు
ఇంద్రధనుసు నెప్పుడూ -సంధించలేము
ఈ మనసునెవ్వరం -బంధించలేము
ఆకాంక్షల అరణ్యరోదన -అడియాసల నిత్య వేదన

2. వలనే అని తెలిసినా -వలపులోన పడ్డాను
దీపకళిక మోహంలో -శలభమే అయినాను
సాలెగూడు సంగతినెరిగీ-కీటకమై వాలాను
వేటగాడి వేణుగానపు-హరిణమై చిక్కాను
ప్రణయమా నీకు జోహారు-నువ్వేఅందాల రక్కసితీరు

Wednesday, November 24, 2010

“(మెటీ) రియల్ లవ్"

“(మెటీ) రియల్ లవ్"
సెల్ ఫోన్ నేనైతే చెంపల చుంబింతలు
నిలువుటద్దం నేనైతే అందాల వింతలు
వేసుకున్న డ్రస్ నేనైతే వెచ్చనికౌగిలింతలు
వేలాడే చున్నీనైతే ఎక్కడో గిలిగింతలు

మనిషిగా మరణించైనా జన్మలేవొ ఎత్తుతుంటా
నిర్జీవ వస్తువునై నిన్నేనే హత్తుకుంటా

1. నీ చేతిలొ పెన్నునైతే పెదాలపై పదనిసలు
మణికట్టున వాచ్ నైతే క్షణక్షణం సరిగమలు
చదువుకునే బుక్కునైతే ఎదపై నిదురింతలు
నిద్దురలో డ్రీమ్ నైతే పదేపదే కలవరింతలు
మనిషిగా మరణించైనా జన్మలేవొ ఎత్తుతుంటా

నిర్జీవ వస్తువునై నిన్నేనే హత్తుకుంటా
2. ఇంటిలోని టీవీ నైతే కళ్ళప్పగింతలు
తాగే టీకప్పునైతే నీ నాలుక చప్పరింతలు
వొంటికి నే సోప్ నైతే చెప్పలేని పులకింతలు
పదాలపసిడి పట్టీనైతె హాప్పీ వెయ్యింతలు

మనిషిగా మరణించైనా జన్మలేవొ ఎత్తుతుంటా
నిర్జీవ వస్తువునై నిన్నేనే హత్తుకుంటా

3. నువ్వుచూసె కార్టూనైతే ఫక్కున నవ్వింతలు
నువ్వుగనని వండర్ నైతే వొళ్ళు జలదరింతలు
ఊహించని గిఫ్ట్ నైతే అహా థ్రిల్లింతలు
నువ్ మెచ్చె సాంగ్ నైతే మనసు తుళ్ళింతలు

మనిషిగా మరణించైనా జన్మలేవొ ఎత్తుతుంటా
నిర్జీవ వస్తువునై నిన్నేనే హత్తుకుంటా

Saturday, November 13, 2010

మనసున మనసై...

మనసున మనసై...

గాలికిపెట్టిన ముద్దు-నీ చెంపను తాకిందే
నన్నే తాకిన నీరు- నీ వొంటిని తడిపిందే
నాపైవాలిన సీతాకోక చిలుక నీ చెక్కిలి నిమిరిందే
నే పట్టిచూసిన కొత్తకోక నీ తనువును చుట్టిందే
తప్పుఅనిఅనగలవా-తప్పుకొని మనగలవా
తప్పనిసరి తోడైనప్పుడు-తప్పించుకొనగలవా

1. కాటుకై మారినేను కంటికే అందమిస్తా
హారమై మెడలోచేరి మేనుకే వన్నె తెస్తా
శిరోజాల రోజాపూవై సొగసులే పెంచేస్తా
చెవులకే జూకాలై సోయగాల నందిస్తా
తప్పుఅనిఅనగలవా-తప్పుకొని మనగలవా
తప్పనిసరి తోడైనప్పుడు-తప్పించుకొనగలవా

2. చేతులకు గాజులుగా సొబగులే కలిగిస్తా
పాదాల మంజీరాలై నాదాలు పలికిస్తా
మనసులోమనసును నేనై నిన్నంత ఆక్రమిస్తా
మోవిపై చిలిపినవ్వునై కడదాక నివసిస్తా
తప్పుఅనిఅనగలవా-తప్పుకొని మనగలవా
తప్పనిసరి తోడైనప్పుడు-తప్పించుకొనగలవా

నిను వీడని నీడను

నిను వీడని నీడను

నువు వద్దని అంటూనే ఉన్నా- నీ వద్దనె నేనుంటున్నా
చీదరించుకొన్నాగాని-ఛీత్కరించు కొన్నగాని
చూరుపట్టుక వ్రేలాడుతున్నా-నీడ లాగ వెంటాడుతున్నా

1. అపోహలోనే బ్రతికేస్తున్నావు- అపార్థాలకే తావిస్తున్నావు
ఊహకు మాత్రమె పరిమితమన్నా
బంధం నమ్మకున్నావు-భయం పెంచుకున్నావు
నీ తప్పేం లేదులే చుట్టూ లోకం అలాంటిది
నీ యోచన అంతేలే-నీ వయసే ఎదిగీఎదగనిది

2. తాడు చూసి తత్తరపడకు-పామనుకొని బిత్తరపోకు
పసుపుతాడు కాబోదు ఉరితాడసలేకాదు
మనసిచ్చేస్తాడు కడదాకా-తోడొచ్చేస్తాడు
కంటికి రెప్పలా వీడు కాపాడుతాడు
ఎందుకో తెలియదులే పూర్వజన్మ బంధమేమో
ఎప్పటికిక తేలునొలే-బదుల్లేని ప్రశ్నేనేమో

Friday, November 12, 2010

మౌన వీణ

మౌన వీణ

ఈ ఉదయ వేళలో-నీ హృదయ సీమలో
నాపై దయ రాదేలనో-ఈ అలక్ష్యమేలనో
శుభోదయం కానేకదమ్మా-నీ బదులే లేకుంటే
అయోమయం అవుతుందోయమ్మా-నువ్వే కనరాకుంటే

1. నా కన్నులకారాటం-నిన్ను చూడాలని
నా మనసుకు ఉబలాటం-ఏదో తెలపాలని
చూపులు మాటాడ లేవు-పెదవులసలు విచ్చుకోవు
గుండె గొంతులోకి వచ్చి-ఊపిరాడకుంటుంది-ఉక్కిరిబిక్కి రవుతుంది
శుభోదయం కానేకదమ్మా-నీ బదులే లేకుంటే
అయోమయం అవుతుందోయమ్మా-నువ్వే కనరాకుంటే


2. ఇంకా తెలియదేమని-ఎక్కడో అనుమానం
తెలిసీ నటిస్తావనీ-నాకు గట్టి నమ్మకం
నేను తప్పుకోలేను-నువ్వు ఒప్పుకోలేవు
అడుగడుగున ఎన్ని మలుపులో-విధి ఆడే నాటకంలో-ఈ వింతనాటకంలో
శుభోదయం కానేకదమ్మా-నీ బదులే లేకుంటే
అయోమయం అవుతుందోయమ్మా-నువ్వే కనరాకుంటే

వీడుకోలు-వేడికోలు

వీడుకోలు-వేడికోలు
నువ్వెళ్లిపోతానంటే –గుండెల్లొ గుబులవుతుంది
నువుకనుమరుగవుతూ ఉంటే-కళ్ళల్లొ వరదవుతుంది
నువ్వులేని ప్రతిక్షణం- వెలితి గానె ఉంటుంది
నీ రాక కోసమే-మది తపించిపోతుంది
ఎలా తెలుపనే చెలిమీ-ఎదలొ అనుభూతిని
ప్రణయమూ పరిణయమేనా- ప్రేమకు పరమావధి

1. మనిషిగా ఎక్కడ ఉన్నా –మనసు నిను గాలిస్తుంది
ఆచూకి పట్టలేక- తల్లడిల్లి పోతుంది
ఏ పని నే చేస్తూ ఉన్నా-ధ్యాసంతా నీదవుతుంది
ఏకాగ్రత కుదరక ఎపుడు- అలజడి చెలరేగుతుంది
ఎలా తెలుపనే చెలిమీ-ఎదలొ అనుభూతిని
ప్రణయమూ పరిణయమేనా- ప్రేమకు పరమావధి

2. అమ్మనైన తలపించే –ఆత్మీయత కురిపిస్తున్నా
ఎనలేని నా అనురాగం -నీకెంత చులకనో
నాన్ననైన మరపించే-ఆప్యాయత పంచుతున్నా
తులలేని నా అభిమానం-నీకెంత పలుచనో
ఎలా తెలుపనే చెలిమీ-ఎదలొ అనుభూతిని
ప్రణయమూ పరిణయమేనా- ప్రేమకు పరమావధి

Monday, November 8, 2010

నీ నవ్వే చాలు...

నీ నవ్వే చాలు...

ఎవరెస్ట్ ఎక్కితేనె విజయమా- చంద్రుడిపై కాలిడితే ఘనకార్యమా
సప్తసాగరాలీదితే సాహసమా- జగజ్జేత కావడమే సంబరమా
నీ చిరునవ్వుకేదీ సరితూగదు-నీ మనసుగెలువ లేనప్పుడు ఏదీ గెలుపవదు

1. అంబానీ ఆస్తినంత నీ పేర రాస్తాడు
ఒబామా అధ్యక్షపదవిని వదిలేస్తాడు
అబ్దుల్ కలాం నిన్ను అర్ధాంగిగ కోరుతాడు
బిన్ లాడెనైన లొంగి నీకు మోకరిల్లుతాడు
రాజ్యాధినేతలంత నీ నవ్వుకు బానిసలు
వీరాధివీరులంత నీ నవ్వుకు దాసులు

2. చిరునవ్వుతొ నువ్వడిగితె తెలంగాణ ఇస్తారు
కాశ్మీరును కోరుకుంటె పాకిస్తానె ఇస్తారు
అందాల పోటీలు నీవల్ల బందవుతాయి
సన్యాసం వైరాగ్యం మటుమాయ మవుతాయి
నీ కనుచూపుకై పదేపదే ఛస్తారు
ఎవరైనా నీ నవ్వుకై చచ్చీ బ్రతికొస్తారు

“నిను గనని బ్రహ్మని”

“నిను గనని బ్రహ్మని”

ఎంతమందిని పంపిస్తావు ఎర్రగడ్డకు
వేలమందిని చేర్చినావు వైజాగుకు
ఎరుగనట్టె ఉంటావు నంగనాచిలా
కొంపలే ముంచుతావు నవ్వుల ’వర’దలా

1. నిన్ను చూసి శిలలైనా చైతన్యమవుతాయి
నీ అందం తట్టుకోక జీవులు స్థాణువులౌతాయి
నాట్యశాస్త్రమంతా నీ నడకల కలబోత
నిను మలచినదెవ్వరని నివ్వెర పడెనే విధాత
ఎరుగనట్టె ఉంటావు నంగనాచిలా
కొంపలే ముంచుతావు నవ్వుల ’వర’దలా

2. ఏ కావ్యము వెతికినా దొరకని నాయికవు
ఏ కుంచె గీయనీ అసమాన చిత్తరువీవు
వ్యక్తీకరించలేని అత్యద్భుత భావన నీవు
అనుభూతి చెందినపుడె అవగతమవుతావు
ఎరుగనట్టె ఉంటావు నంగనాచిలా
కొంపలే ముంచుతావు నవ్వుల ’వర’దలా