Saturday, February 13, 2010

ప్రేమ భాష్యం

ఎక్కడ పుట్టావే ప్రేమా... గుండెలొ ఎప్పుడు అడుగెట్టావే
ఎందుకు వచ్చావే ప్రేమా... నా మదికి ఎలాగ నచ్చావే
నా ప్రమేయమే లేదు- నాప్రయత్నమే లేదు
చాపక్రింది నీరు లాగ - ఆక్రమించుకున్నావే
కన్నుమూసి తెఱిచేలోగా- నన్ను దోచుకున్నావే
1. వాలే పొద్దుకు వాన జల్లుకు-ముడి పెడతావు
నీ అవతారం ఇంద్రధనుసుగా-చూపెడతావు
వాలే తేటికి విరిసిన విరికీ-జత కడతావు
నీ ప్రతిరూపం మాధుర్యంగా-తలపిస్తావు
మాయలాడివే ప్రేమా-గారడీలు చేస్తావు
మాయలేడివే ప్రేమా-విరహాలు సృష్టిస్తావు
2. రాధామాధవ చరితం అంతా-నువ్వే నిండావు
ప్రణయం అంటే సరియగు అర్థం-జగతికి తెలిపావు
రతీ మన్మధుల ఆంతర్యమే-నీ జన్మకి కారణం
పతీ పత్నుల సాహచర్యమే-నీ ఉనికికి తార్కాణం
దైవత్వం నీవే ప్రేమా- లీలలెన్నొ చూపేవు
అద్వైతం నీవే ప్రేమా-శాశ్వతంగ నిలిచేవు

ఎరుగని ఓ నగ్న సత్యం ప్రేమా- ఎరిగిన గూఢ రహస్యం ప్రేమా

ఎరుగని ఓ నగ్న సత్యం ప్రేమా- ఎరిగిన గూఢ రహస్యం ప్రేమా
తెలిసితెలిసీ జనులు ఎందుకో ప్రేమిస్తారు
సాఫీగ సాగే నావను సుడిలోన ముంచేస్తారు
1. ప్రేమ పుట్టుకనే ఎరుగం-ప్రేమ గిట్టుటనే ఎరుగం
నట్టనడిమి సంద్రంలో కొట్టుమిట్టాడుతునే ఉంటాం
ప్రేమ ఒక గమ్మత్తు-అనురాగమే మత్తు
మనచిత్తమన్నది చేయిజారితే భవిష్యత్తే చిత్తు
బయటపడలేని ఉబి ప్రేమైనా-త్రెంచుకోలేని వల ప్రేమైనా
తెలిసి తెలిసీ జనులు ఎందుకో దిగబడతారు
ప్రేమకొరకై మూర్ఖులు వెర్రిగా ఎగబడతారు
2. అందాల హంగులు ఉంటాయి
పరువాల పొంగులు ఉంటాయి
మనసు వయసూ ఎపుడూ దొంగాటలాడుతు ఉంటాయి
విధి వేచి చూస్తుంది-గారడీలు చేస్తుంది
పొరపాటుచేసి ప్రేమిస్తే మన పనిపడుతుంది
ప్రేమ సాలెగూడైనా-ప్రేమే ఉరిత్రాడైనా
తెలిసితెలిసీ జనులు ఎందుకో చిక్కడతారు
భగ్నమైన హృదయంతో బేలగా తలపెడతారు
3. మజ్నూల గాథలు వింటారు
దేవదాసు కథనే వింటారు
అనార్కలిని సమాధిచేయడం-అందరూ ఎరిగే ఉంటారు
కావ్యాలు చదివేస్తారు-కన్నీరు కార్చేస్తారు
తమదాక వస్తేనే కథ మళ్ళీ మొదలెడతారు
ప్రేమ గరళమే ఐనా- ప్రేమ నరకమే ఐనా
తెలిసి తెలిసీ జనులు ఎందుకో తాగేస్తారు
ప్రేమకొరకై అందరు ఎందుకో పడిఛస్తారు
ఆనందమనుకొని తామే వేదనను కొనితెస్తారు................................!!!??