Sunday, February 14, 2010

త్యాగానికి ప్రతిరూపం నాన్న!

నాన్నా నీవేలే త్యాగానికి ప్రతిరూపం
నాన్నా నీవేమా ఈ ఉన్నతి తార్కాణం
ఏమి చేసినా గాని తీరిపోదు నీ ఋణం
ఈయగలము మనసారా మా అశ్రుతర్పణం
1. అనురాగ మూర్తియైన అమ్మను నా కిచ్చేసి
ఆనందలోకమైన అమ్మఒడిలొ నను వేసి
కాలుకంది పోకుండా భుజాన నను మోసి
అందమైన బాల్యాన్ని అందజేసావు వెఱసి
2. దొంగబుక్కలెన్నెన్నో కుడిపించావు
అంగలేయ వేలుపట్టి నడిపించావు
కంటి చూపుతోనే క్రమశిక్షణ నేర్పావు
మౌనదీక్షతోనే నిరసన ప్రకటించావు
3. మా పోషణె ధ్యేయంగా బ్రతుకు ధార పోసావు
రేయిపవలు మాకోసం నీరెక్కలు వంచావు
ఎంతకష్టమైనా సరె నవ్వుతు భరియించావు
నీ బిడ్డలమైనందుకు గర్వపడగ పెంచావు
నాన్న అంటె ఇలాగే ఉండాలనిపించావు