Friday, August 6, 2010

స్నేహ మేఘం

దూదిపింజలా వస్తావు-గాలివాటుకే వెళతావు
చుట్టపు చూపుగ వస్తావు-చప్పున మాయ మవుతావు
ఓ మేఘమా - జీవన రాగమా
నా దాహమే- తీర్చే స్నేహమా

1. మనసైతే మాత్రము-ఓ చినుకై పలకరిస్తావు
అభిమానం వెల్లువైతే-తొలకరినే చిలకరిస్తావు
ఎదనదులకు జీవం నీవు-ప్రేమికులకు ఊతం నీవు
అంతరంగ గగనానా-అందమైన సుందరి నీవు
అనురాగ సీమలోనా-ఆరాధ్య దేవతవీవు

2. కాళిదాసు నిన్ను చూసి-కావ్యమే రాసాడు
తాన్ సేన్ తాళలేక-రాగమే తీసాడు
కవి కవితకు వస్తువు నీవు-గీతకర్త స్పూర్తివి నీవు
చిత్రమైన ఆకృతులెన్నో-సంతరించుకుంటావు
కొత్త కొత్త ఆ కృతులెన్నో-ఆవిష్కరిస్తుంటావు