Wednesday, August 18, 2010

నవ్వుల నజరాన-నువ్వు నా జీవితాన

పాలనురుగు నీ నవ్వు-పసిడి మెరుగు నీ నవ్వు
పరవశాన నీ నవ్వు- పరిమళాలు రువ్వు

1. ముత్యాలు కోరుకొని –అగాధాల శోధనేల
నీ పెదవుల ముంగిలిలో-ఏరుకొంటె పోలా
రతనాల రాశులకై-గనులు త్రవ్వనేల
నీ వదన సీమలో-దొరుకుతాయి చాలా

సరిగమలే పలుకుతుంది- నీ నవ్వుల వీణ
నీ నవ్వులకేది సాటి- నువ్వే ప్రవీణ

పంచదార నీనవ్వు-తేనె ధార నీ నవ్వు
నీ నవ్వుల రుచి మరిగితె- నా నరాలు జివ్వు

2. విషాదాలు మరచుటకై-మత్తు మందు అవసరమా
నీ హర్ష మధువులో-ఓలలాడి పోమా
ఆహ్లాదం పొందుటకు-చందమామ ముఖ్యమా
నీ హాస చంద్రికలే-బ్రతుకంతా పరుచుకోవ

గలగలా పారుతుంది-నీ నవ్వుల గోదారి
నీ నవ్వుల సవ్వడికే-జేగంటలు రావు సరి

వరదాయిని నీ నవ్వు-మన్మోహనమీ నవ్వు
ఎప్పటికీ శరణ్యమే- నా కిక నువ్వు-నీ నవ్వు