Friday, August 20, 2010

గీటురాయి

కోహినూర్ కేమెరుకా-తన వెల యెంతో
తాజ్ మహల్ కేమెరుకా-తన విలువెంతో
కోయిల కేమెరుకా-తన పాట కమ్మదనం
విరుల కేలా తెలిసేను-మకరందపు తీయదనం

ప్రాజ్ఞులు మాత్రమే గుర్తింతురు ప్రతిభ
అభిరుచి గలవారే కీర్తింతురు ఘనత

1. మేఘమెపుడు గమనించునొ-బీడుల దాహార్తిని
వర్ష మెలా గుర్తించునొ-మోడు జీవితేఛ్ఛని
కరిగిపోవు కాలమెపుడు-హారతి కర్పూరం
తిరిగిరాని గతమెప్పుడు-చేజారిన మణిహారం

ప్రాజ్ఞులు మాత్రమే గుర్తింతురు ప్రతిభ
అభిరుచి గలవారే కీర్తింతురు ఘనత

2. ఎడారిలో బాటసారి-ఎండనెలా మెచ్చగలడు
హిమవన్నగ పరిసరాల-శిశిరమెలా ఓర్చగలడు
అనువైనపుడె కదా-ఆనందం సొంతం
అనుభూతుల అస్వాదనె-జీవిత పరమార్థం

ప్రాజ్ఞులు మాత్రమే గుర్తింతురు ప్రతిభ
అభిరుచి గలవారే కీర్తింతురు ఘనత