Monday, November 8, 2010

నీ నవ్వే చాలు...

నీ నవ్వే చాలు...

ఎవరెస్ట్ ఎక్కితేనె విజయమా- చంద్రుడిపై కాలిడితే ఘనకార్యమా
సప్తసాగరాలీదితే సాహసమా- జగజ్జేత కావడమే సంబరమా
నీ చిరునవ్వుకేదీ సరితూగదు-నీ మనసుగెలువ లేనప్పుడు ఏదీ గెలుపవదు

1. అంబానీ ఆస్తినంత నీ పేర రాస్తాడు
ఒబామా అధ్యక్షపదవిని వదిలేస్తాడు
అబ్దుల్ కలాం నిన్ను అర్ధాంగిగ కోరుతాడు
బిన్ లాడెనైన లొంగి నీకు మోకరిల్లుతాడు
రాజ్యాధినేతలంత నీ నవ్వుకు బానిసలు
వీరాధివీరులంత నీ నవ్వుకు దాసులు

2. చిరునవ్వుతొ నువ్వడిగితె తెలంగాణ ఇస్తారు
కాశ్మీరును కోరుకుంటె పాకిస్తానె ఇస్తారు
అందాల పోటీలు నీవల్ల బందవుతాయి
సన్యాసం వైరాగ్యం మటుమాయ మవుతాయి
నీ కనుచూపుకై పదేపదే ఛస్తారు
ఎవరైనా నీ నవ్వుకై చచ్చీ బ్రతికొస్తారు

“నిను గనని బ్రహ్మని”

“నిను గనని బ్రహ్మని”

ఎంతమందిని పంపిస్తావు ఎర్రగడ్డకు
వేలమందిని చేర్చినావు వైజాగుకు
ఎరుగనట్టె ఉంటావు నంగనాచిలా
కొంపలే ముంచుతావు నవ్వుల ’వర’దలా

1. నిన్ను చూసి శిలలైనా చైతన్యమవుతాయి
నీ అందం తట్టుకోక జీవులు స్థాణువులౌతాయి
నాట్యశాస్త్రమంతా నీ నడకల కలబోత
నిను మలచినదెవ్వరని నివ్వెర పడెనే విధాత
ఎరుగనట్టె ఉంటావు నంగనాచిలా
కొంపలే ముంచుతావు నవ్వుల ’వర’దలా

2. ఏ కావ్యము వెతికినా దొరకని నాయికవు
ఏ కుంచె గీయనీ అసమాన చిత్తరువీవు
వ్యక్తీకరించలేని అత్యద్భుత భావన నీవు
అనుభూతి చెందినపుడె అవగతమవుతావు
ఎరుగనట్టె ఉంటావు నంగనాచిలా
కొంపలే ముంచుతావు నవ్వుల ’వర’దలా